Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 24


    
    "మీ పిన్నికి ఈ గొడవంతా తెలిసిపోయింది.  ఆమె నానా రభస చేస్తుంది. నువ్వు కాస్త తేలికపడేవరకూ  నా గదిలోనే వుండాలి" అన్నాడు సిద్దార్ద.
    "ఆటో పిలవండి" ఎవరో అన్నారు.
    "అవసరంలేదు నా కారుంది" చెప్పింది గీత.
    కంటి చివరినుంచి గీతని విస్మయంగా చూశాడు అభినయ్.
    అతన్ని కారులో ఎక్కించారు. అదే కారులో రమాదేవి, సిద్దార్ద, కమల్ ఎక్కారు.
    గీత కారు స్టార్ట్ చేసింది.
    కారు వెనకే పూర్ణ, మోటార్ బైక్ మీద బయలుదేరారు.
    భయంకరమైన తుఫాన్ తర్వాత నెలకొన్న ప్రశాంతత పోలీస్ స్టేషన్ ఆవరణలో యిప్పుడు కనపడసాగింది.
                                      12
    సిద్దార్ద అద్దె గదిముందు కారాగింది.
    అభినయ్ ని దింపిన తర్వాత రమాదేవి పూర్ణకి చెప్పింది -
    " డాక్టర్ని తీసుకొచ్చి చూపించు. తర్వాత ఏదయినా అవసరమయితే నాకొచ్చి చెప్పు" అంది.
    "అలాగే మేడం!" అన్నాడు పూర్ణ.
    రమాదేవి లోపలకి నడిచింది వాళ్లతోపాటు. గీత కారులోనే వుండిపోయింది.
    "అభినయ్ టేక్ రెస్ట్. ఈలోగా మళ్ళీ ఏదన్నా ఎడ్వంచర్ చేశావంటే నేనే నీ వీపు పగలగొడతాను" అంది చిరునవ్వుతో.
    "నిజం మేడం! మీరా పని చేస్తే తప్ప లాభంలేదు" అన్నాడో స్టూడెంట్.
    "మేడం! అభిని సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్ గారు" కమల్ చెప్పాడు. కాదు గుర్తుచేశాడు.
    "ఆ విషయం నేను చూసుకుంటాను. యూ ఫర్ గెట్ ఎజేట్ ఇట్" అంది బయటికి  నడుస్తూ రమాదేవి.
    రమాదేవి గీతతోపాటు కారులో వెళ్ళిపోయింది
    పూర్ణ డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ఇంజక్షన్స్ చేసి మందులు రాసిచ్చి మర్నాడు వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
    కమల్ మెడికల్ షాపుకెళ్లి మందులు కొనుక్కొచ్చాడు.
     అభినయ్ తన స్నేహితులు తన కోసం ఎంత ఆరాటపడుతున్నదీ గమనిస్తూనే చాపమీద నిస్త్రాణగా పడివున్నాడు.
    "ఎలా వుందిరా?" పక్కనే కూర్చుంటూ అడిగాడు పూర్ణ.
    "మీరందరూ వున్నారు. నాకేంభయం!" గర్వంగా అన్నాడు అభినయ్.
    "అసలిదంతా నావల్ల జరిగింది. అందుకే ఈ వేళ మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడూ నేను ఛాలెంజ్ చేయను. పందాలు కాయను."
    "ఒరే పూర్ణా! జరిగింది చెడయినా ఇదీ ఒక మంచికే జరిగింది. లేకపోతే మనలో ఇంత ఐక్యత వుందని నలుగురికీ ఎలా తెలిసేది?" అన్నాడు అభినయ్ అభిమానంతో.
    "కనుక నువ్వు పందాలు కాయడం మానుకోనవసరం లేదు" అన్నాడు కమల్ నవ్వుతూ.
    "ఓ. కే. మీలో ఎవరయినా ఛాలెంజ్. కానీ అభినయ్ మాత్రంకాదు" పూర్ణ బొటన వేలిని పైకి చూపుతూ అన్నాడు.
    "కానీ ...నాకు ఒక్కటి అర్దంకాలేదు. గీత పోలీస్ స్టేషన్ కెందుకు వచ్చింది?
    తనకి అంత పరాభవం నా వల్ల జరిగినా ఎందుకలా ప్రవర్తించింది."
    "మనమంటే భయపడి వుంటుంది" దాసు అన్నాడు.
    "కాదు. కానేకాదు. కారణం ఏదో వుంది? గీత వచ్చి అడ్డుపడకపోతే బహుశా నన్ను విడిచి పెట్టేవాళ్లు కాదు పోలీసులు."
    "అవును కారణం ఏమై వుంటుంది?"
    ఎవరికి వాళ్ళే ఆలోచనల్లో పడిపోయారు. సిద్దార్ద మాత్రం అది పట్టనట్టుగా.....
     "ఈ టాబ్లెట్లు వేసుకుని నీళ్ళు తాగు" అన్నాడు మందు బిళ్ళలని అభినయ్ కి అందిస్తూ.
    అభినయ్ మందు బిళ్ళలు మింగి నీళ్ళుతాగి గ్లాసుని సిద్దార్దకి అందిస్తుండగా గుమ్మంలో చప్పుడయింది.
    అభినయ్ తలెత్తి చూశాడు.
    కైరవి నించుని వుంది.
    ఆమె మొహం కందగడ్డలా ఎరుపెక్కింది.
    కళ్ళల్లో రోషం కనబడుతోంది.
    ఆమెని చూసి పూర్ణ బృందం బయటికి నడిచారు.
    ఆమె అభినయ్ కేసి తీక్షణంగా చూస్తూ ఒక్కో అడుగూ వేస్తుంది.
    అభినయ్ తల దించుకున్నాడు.
    ఆమె అతని దగ్గరగా వచ్చి నించుంది. అడుగుల చప్పుడు ఆగిపోయింది.
    అతను మెల్లగా కళ్ళువిప్పి చూశాడు.
    అందమైన రెండు పాదాలు అతని మొహానికి దగ్గరగా .... కనిపించాయి.
                                       13
    ఆమె పాదాలు పైన చేతి వేళ్లతో మెల్లగా రాయటం మొదలుపెట్టాడు అభినయ్.
    "చేత్తో అలా రాసి ఏడిస్తే ఏమొస్తుంది?  ముద్దుపెట్టుకుని ఏడవచ్చుగా!" అంది కైరవి.
    కైరవి గొంతులో ఉక్రోషం కొట్టచ్చినట్టు ధ్వనిస్తోంది.
    అభినయ్ ఆమె పాదాలని నిమురుతూనే తల అడ్డంగా ఊపాడు.
    చటుక్కున వెనక్కి జరిగింది కైరవి.
    "కాళ్లు పట్టుకుని నన్ను ఐస్ చేయడానికి ప్రయత్నించకు. ఏ ఆ ముండ అంత ముద్దు వచ్చిందా?"
    మోకాళ్ళపైన కూర్చుని అతని జుత్తు పట్టుకుని గుంజుతూ అడిగింది కైరవి.
    "అబ్బ! రాక్షసీ! చంపకు!" అరిచాడు అభినయ్.
    "అవును మరి! నీ కళ్ళకి నేను రాక్షసిలా కనబడబట్టే  ముద్దూ ముచ్చట లేకుండా పోయినాయి.
    దారినపోయే ముండల చంక నాకుతున్నావు. ఛీ...ఛీ.... నాకు ఒళ్ళు మండిపోతోంది. నన్నడిగితే పోలీసులు మంచిపనే చేశారంటాను.
    ఆమాత్రం  ఉతకకపోతే నీకసలు బుద్దిరాదు"ఆమె వసపిట్టలా మాట్లాడేస్తుంది.
    అభినయ్ మెల్లగా నవ్వి, తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు.
    కైరవి రుసరుస లాడిపోతోంది.

 Previous Page Next Page