Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 25

  

    "వాడ్డూ యూ మీన్" ఆవేశంగా అరిచాడు.
    
    "మీరలా పదేపదే అరిచి ఎనర్జీ వేస్టు చేసుకోవడం బాగోలేదు. ఎందుకు పిలిచారో చెప్పండి."
    
    "నీ తమ్ముడి విషయంలో పత్రికలదాకా వెళుతున్నావని తెలిసింది"
    
    "ఎస్..." నిశ్చలంగా అంది ఆశ్రిత. వెళుతున్నాను ఎందుకంటే పోలీసులు నాకు న్యాయం చేయలేదు కాబట్టి."
    
    "చేసివుంటే నేరస్థుడిగా సూర్నారాయణ రాజీనామా చేయాలిగా."
    
    "ఆఫ్ట్రాల్ ఓ ఆడదానివి... నీ గురించి నువ్వేం అనుకుంటున్నావు?"
    
    "నేను ఆఫ్ట్రాల్ కాదు బెటర్ దేన్ యూ ఆల్ అని నిరూపించగలనను కుంటున్నాను."
    
    "ఇలా మొండికేస్తే జరిగేదేమిటో తెలుసా?"
    
    "మీ డిపార్ట్ మెంటు నీచత్వం గురించి నా నోటితో వినాలనే క్యూరియాసిటీని ప్రదర్శించకండి."
    
    "ప్రమాదకరమైన అపోహ" అన్నాడు సవ్యసాచి రోషంగా చూస్తూ.
    
    "ఇండియాను ఏదోరకంగా చిన్నచూపు చూస్తూ దాని ప్రతిష్టని దిగజార్చే విధానాన్ని చాలాకాలంగా అమెరికా శిబిరాలు కొనసాగిస్తూనే వున్నాయి" ఆమె ఆగింది.
    
    హఠాత్తుగా ఆశ్రిత ఇలాంటి టాపిక్ ఎందుకు మొదలుపెట్టిందో అర్ధంకాలేదు సవ్యసాచికి.
    
    "ఇండియా అరవయ్యో దశకంలో అమెరికా దృష్టిలో భిక్షాపాత్ర చేతపట్టుకుని దేహి అని నిలబడ్డ దేశం... ఇక డెబ్బయ్యవ దశకంలో సోవియట్ అనుకూల సోషలిస్టు విధానాలు అమెరికాను ఇండియాపట్ల చిన్నచూపు చూసే విధానానికి కారణమయినాయి. కానీ ఎనభయ్యవ దశకంలో అపోహలు తొలగించే ప్రయత్నంలో రాజీవ్ గాంధీ అమెరికా పర్యటన జరిపారు... ఆ తరువాత సోవియట్ యూనియన్ పతనంతో సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి దానిని ప్రోత్సహించే అవసరం అమెరికా లేకుండా చేసింది. ఈ పరిణామాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో అద్భుత విజయాలు సాధిస్తున్న ఇండియాపట్ల..."
    
    "స్టాపిట్" గావుకేక పెట్టాడు సవ్యసాచి "ఏమిటి నువ్వు మాట్లాడేది.
    
    ఎగతాళిగా నవ్వింది "మీరిందాక ప్రమాదకరమైన అపోహలు అంటూ ఏదో స్టేట్ మెంటిచ్చారుగా... బహుశా నవంబరు ఆరు ఇండియా టుడే సంచికలోని ప్రమాదకరమైన అపోహలు అనే మకుటంలో వెలువడిన సంపాదకీయం గురించి మాట్లాడుతున్నారేమో అని దాని వివరాలు చెబుతున్నాను."
    
    "నిన్ను ఇక్కడికి పిలిచింది నా సందేహాన్ని తీర్చటానికి కాదు."
    
    "అలా కోపగించుకోకండి సందేహాన్ని నివృత్తి చేసుకునేవాడు ఆ క్షణానికే మూర్ఖుడు నివృత్తిచేసుకాకపోతే జీవితాంతం మూర్ఖుడే అవుతాడు."
    
    "మిస్ ఆశ్రితా!" ఉద్రేకంగా రెండడుగులు ముందుకేశాడు.
    
    "కోపాన్ని జయించలేనివాడు ఇతరుల సామర్ధ్యాన్ని సవ్యంగా తెలుసుకోలేడు సవ్యసాచిగారూ."
    
    ఏదన్నా చేయగలననుకున్న సవ్యసాచి ఆశ్రిత విషయంలో కంగారు పడిందిక్కడే... తన స్థాయి మనిషితో తొణుకూ బెణుకూ లేకుండా మాట్లాడుతున్న ఆశ్రిత తెలివయినదే కాదు మొండిది కూడా.
    
    "పత్రికల దాకా వెళితే నీకు చాలా ప్రమాదం"
    
    "కాని ఆ ప్రమాదం నా వాళ్ళని కోల్పోయినదానికన్నా ఎక్కువ కాదు"
    
    "వయసులో వున్నదానివి..."
    
    "కాబట్టే న్యాయంకోసం ముసలిదాన్నయ్యేదాకా పోరాడగలననుకుంటున్నాను."
    
    "కాని నువ్వంతవరకూ వుంటేగా" చివరి అస్త్రాన్ని సంధించాడు.
    
    నవ్వేసింది- ఏమనుకుంటున్నాడీ పెద్దమనిషి ఏటి ఒడ్డున పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ ఇసుకలో ఆడుకునే పసిపిల్లగా భావిస్తున్నాడా లేక చట్టం పరిధిలో తనేమన్నా చేయగలనన్న అహంకారాన్ని దర్పంగా ప్రదర్శించాలనుకుంటున్నాడా.
    
    తను ఉప్పెన సృష్టించగల సాగరం కాలేకపోయినా గండిపడగల గోదావరిగా నైనా అర్ధంచేసుకోడేం... దావాగ్నిని కాలేకపోయినా ఏక శతఘ్నినైనా కాగలనని నిరూపించటానికి తాను సిద్దంగా వున్నానని ఈ పెద్దమనిషికి ఎలా తెలియచేయాలి?
    
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్" అస్థిమితంగా కాదు అసహనంగా అడిగాడు.
    
    "మీరు చాలా తెలివైన ఆఫీసరనుకున్నాను" అంది అతడ్ని రెచ్చగొడుతున్నట్టుగా.
    
    "ఏం...సందేహంగా వుందా?"
    
    "అవును సవ్యసాచిగారూ....మీ బెదిరింపులు, అదిరింపులు చట్టం గురించి, తెలీనివాళ్ళ దగ్గర చెల్లుతాయి తప్ప మొండిగా దేనికయినా సిద్దపడ్డ వాళ్ళ దగ్గర కుదరదని మీరు గ్రహించలేకపోవడం చూస్తుంటే బాధగా వుంది. అసలు మీరు నన్నేం చేయగలరని...ఏదన్నా చేస్తే మాత్రం ఊరుకోటానికి ఇది ఊరేకాని వల్లకాడు కాదుగా- దీనికి జవాబుగా నా తమ్ముడూ, తండ్రీ ఏం చేయగలిగారన్నది మీ ప్రశ్న అయితే నా సమాధానం వినండి.....మీలాంటివాళ్ళని ఎదుర్కోగల తెలివివున్నా వాళ్ళకి చేవలేదు కాబట్టి ఒకరు ఆత్మహత్యతో, మరొకరు భయముతో కడతేరిపోయారు... అసలు వాళ్ళు కూడా బ్రతికి వుంటే నావాళ్ళ కోసం నేనూ భయపడేదాన్నేమో కాని ఇప్పుడు నా కెవరున్నారని మిమ్మల్ని ఎదిరించి నిలబడటానికి నాకెవరూ లేరన్న ఒక్క ఆలోచన చాలదూ....నిజం సవ్యసాచిగారూ ఈ ప్రపంచంలో పర్యవసానం గురించి ఆలోచించేది తనవాళ్ళంటూ వున్నవాళ్ళు నేను కాదు కాబట్టి నన్ను బెదిరించే ప్రయత్నాన్ని ఆపేయండి... మీరు నిజాయితీపరులుగా నిరూపించుకోవాలీ అంటే రెండు చావులకీ పరోక్షంగా కారణమైన హోం మినిష్టరు దారుణాన్ని నలుగురికీ తెలియచేసి..."
    
    "పిచ్చిపిచ్చిగా మాట్లాడకు" అర్దోక్తిగా ఖండించాడు సవ్యసాచి.
    
    "నాకు హితబోధ చేయడానికి నీ స్థాయి ఏమిటి?"
    
    "మీలాంటి వాళ్ళకి బోధపరచటానికి ప్రవక్తలు దిగిరానవసరం లేదు. అయిదో తరగతిలో వేమన శతకం గురించి చెప్పే ఎలిమెంటరీ స్కూలు మాస్టారు చాలు."
    
    "షటప్" రోషంతో కంపించిపోతున్నాడు "గెట్ లాస్ట్"
    
    "వెళతాను" లేచింది ఆశ్రిత "అయితే వెళ్ళేముందు ఒక్కమాట"
    
    "ఆమె ఇంకా నిలబడి అంత ధైర్యంగా మాట్లాడ్డం అతడు సహించలేకపోతున్నాడు.
    
    "మీరూహించినట్టు శ్వేత మీ కోడలయ్యే అవకాశం లేదు."
    
    "ఏం....అడ్డుపడగలననుకుంటున్నావా?"
    
    "ఎస్... ఖచ్చితంగా శ్వేతకీ, వశిష్టకీ మధ్య నేను అడ్డంగా నిలబడతాను" ఛాలెంజ్ లా అంది "ఏ బంధం కోసం మీరింత శ్రమపడుతున్నారో అది కార్యరూపం దాల్చకుండా నేనేమిటో నిరూపిస్తాను."

 Previous Page Next Page