తమ్ముడి మరణమనే ఒక్క సమ్మెటపోటుతో పగిలిన గుండె ఆమెది.
తండ్రి కూడా కనుమరుగు కాగానే మెదడు కూడా మొద్దుబారిపోయింది. ఎంత మేధతో ఆలోచిస్తున్నా ఆరోగ్యపు వాకిటముందు విరిసిన నందివర్ధనంలాంటి ఆశ్రిత ఒక్కో సమయాన సృష్టి చివరి లయంలోని శూన్యంలా ఇంకా ఇబ్బందిపడుతూనే వుంది. ఇంత కన్నీరూ, రవ్వంత కంగారూ ఆమెను ఆందోళన పరుస్తున్నా అది ప్రపంచానికి తెలియకుండా తనకు మాత్రమే పరిమితం చేసుకుని బహిరంగంగా తన నిబ్బరాన్ని ప్రకటిస్తూంది.
"ఇక నువ్వు వెళ్ళొచ్చు" అంది శ్వేత సగర్వంగా.
"అది కాదు శ్వేతా" శ్వేతని అసహ్యించుకోకూడదని, అసలు అలాంటి స్థితి ఆమె కలిగించకూడదనీ, ఇంకా నచ్చచెప్పబోయింది ఆశ్రిత "కనీసం ఒక్కసారి నీ నోటితో రాజేష్ అమాయకుడని రహస్యంగా చెప్పెయ్ వెళ్ళిపోతాను"
"చచ్చిన వాడి గురించి చెబితే నీకు వొరిగేదేమిటి?"
"ఆత్మ సంతృప్తి"
'అలాగా! అయితే విను... వాడో స్కాండ్రల్."
ఆశ్రిత కళ్ళనుంచి ఓ నీటిబొట్టు రాలిపడడం మాత్రమే కాదు, శ్వేతని అంత సులభంగా క్షమించకూడదని నిర్ణయించుకుంది ఆ క్షణంలోనే.
* * *
"మీరేం కంగారుపడకండి సూర్నారాయణగారూ..." సవ్యసాచి ఫోన్ లో హోంమినిస్టరుకి ధైర్యం చెబుతున్నాడు. "కాకిపిల్ల ఈ ఆశ్రిత మనల్నేం చేస్తుంది?"
"నువ్వలా తేల్చేయకు సవ్యసాచీ! అమ్మడు మామూలు ఆడపిల్లలా లేదు...కాలేజీలో స్టూడెంట్సు దగ్గర రిటెన్ స్టేట్ మెంట్సు తీసుకుంది... ప్రెస్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటూంది."
"నేనుండగా మీ స్థాయి మనిషి ఇలా ఆలోచించడం నాకేం నచ్చటంలేదు" వశిష్టని తను ఎంత సులభంగా నమ్మించగలిగిందీ సూర్నారాయణకి ముందే చెప్పిన సవ్యసాచి ఆశ్రితని ఓ సమస్యగా భావించటం లేదు. "అయినా ప్రెస్ వాళ్ళు ఏం చేయగలరని?"
"నీకు తెలీదు సవ్యసాచి... దామోదరం సంగతి నీకు తెలుసుగా" ఓ ప్రముఖ దినపత్రిక యజమాని దామోదరం రూలింగ్ పార్టీకి చెందిన మంత్రుల విషయంలో ఏ చిన్న ఆధారం దొరికినా ఎంత రాద్దాంతం చేసేదీ ఇంతకుముందే అనుభవపూర్వకంగా తెలిసి వుండటంతో ఆందోళనగా అన్నాడు "వాడు సామాన్యుడు కాడు... అనవసరమైన కంపు చేస్తాడు... దానితో ప్రతిపక్షాలవారు ఛాన్సు దొరికిందని అసెంబ్లీలో హడావుడి మొదలుపెడతారు... అసలే పార్టీ ప్రతిష్ట మంటగలిసి పోతూందని ప్రతిరోజూ తలకొట్టుకునే ముఖ్యమంత్రి ఓ కమీషను వేస్తానంటాడు... దానితో స్టూడెంట్సంతా ఆ రాజేష్ గాడ్ని, ఆశ్రితనీ సపోర్టు చేస్తూ సాక్షాలిస్తారు. ఆనక సి.యం. పార్టీ ప్రతిష్ట కోసం నన్ను రాజీనామా చేయమంటాడు... అదలా వుంచు... వశిష్టకి శ్వేత మీద ఇంప్రెషన్ చెడిపోతుంది. దానితో మనం వియ్యంకులమయ్యే అవకాశం చేజారిపోతుంది."
"ఆపండి సూర్నారాయణగారూ!" అసహనంగా అన్నాడు కమీషనరు.
"నేనిలా వింటూపోతే మెదడుకీ, మోకాలికీ ముడేసినట్టు ఆఖరికి మీ ప్రభుత్వం పడిపోయి ఆనక ఆశ్రిత పెట్టిన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నాకు నచ్చచెప్పేట్టున్నారు. మీరు రిలాక్సవండి. నేనున్నాగా"
"నువ్వంటావయ్యా... నువ్వు గవర్నమెంటు సర్వెంటువి కాబట్టి రిటైర్మెంట్ దాకా పొజీషన్ లో వుంటావు. కానీ మా సంగతి అలా కాదుగా.... మా పరపతి పదవిలో వున్నంత కాలమేగా.... అందుకే కాస్త జాగ్రత్తపడి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టేయమంటున్నాను."
"ఓ.కె! అంతా నేను చూసుకుంటాను" అంటూ ఫోన్ క్రెడిల్ చేసిన సవ్యసాచి రెండు నిమిషాలపాటు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.
సూర్నారాయణ కంగారుకి నవ్వుకోకుండా వుండలేకపోయాడు.
ఎవరూ ప్రశ్నించనంత కాలం ఎదురుగాలికైనా వెనుకాడని మనిషి ఒక్క వ్యక్తి ఎదురు నిలబడి నిలదీస్తే తన పరపతిని మరిచిపోయి పిరికివాడిలా పర్యవసానాల గురించి ఆలోచిస్తాడు. దీనికి సూర్నారాయణ అతీతుడేంకాదు. అయినా ఆఫ్ట్రల్ ఆశ్రిత ఏం చేయగలుగుతుంది... అందులోనూ వయసులో వున్నానన్న స్పృహ ఒక్కటి చాలుగా... ఏకాంత విషయంలో ఇంచుమించు అదే టెక్నిక్ ని ఉపయోగించి తన కోడలు కాకుండా ఆపేయగలిగాడు.... ఆమె కూడా కోర్టులో ఎంత గగ్గోలు పెట్టిందని....చివరికేమైంది....వ్యభిచారిణిగానే కాక హంతకురాలిగా నిరూపించబడి జైలుపాలైంది. వశిష్టకి దూరమైంది.
ఆశ్రితని పర్సనల్ గా హెచ్చరించాలనుకున్నాడు. అంతే...
మరో అరగంటలో ఆశ్రిత అతడిముందు నిలబడింది.
"గుడ్ మాణింగ్ సర్!"
రెప్పలార్చకుండా చూశాడు సింహాసనంపై కూర్చున్న చక్రవర్తిలా నిజమే... నేర ప్రపంచంలోని చాలామంది నొటోరియస్ క్రిమినల్స్ సైతం భయపడే కమీషనరు నగరానికి చక్రవర్తే...
అతడి ఆదేశంతో అవసరం లేనట్టుగా అభిముఖంగా వున్న కుర్చీలో కూర్చుంది ఆశ్రిత.
ఆమె ఈ మధ్యనే ఐ.ఎ.ఎస్. ఇంటర్వ్యూకి వెళ్ళిందని సి.ఐ.ధనుంజయ ద్వారా తెలుసుకున్న సవ్యసాచి ఆమె నిర్లక్ష్యంగా కూర్చోవటాన్ని గమనించాడు. ఏకాగ్రతగా.
పాతికేళ్ళు మించని వయసు....అది గర్వమో, లేక ఆత్మ విశ్వాసమో నిబ్బరంగా కనిపిస్తూంది. వయసుకి సహజమైన లావణ్యంతో అందగత్తెలానే కనిపిస్తూంది. కాని మండే అగ్నిపర్వతంలా కాక అతడి కళ్ళకి మినుకుమనే చిన్న నక్షత్రంలా కనిపించింది.
"నేనెవరో మీకు తెలుసనుకుంటాను"
"బయట బోర్డు చూశాను" అంది టక్కున.
మొదటి జవాబుకే ఉలికిపడినా నిభాయించుకున్నాడు.
"నేను ఎందుకు పిలిచానో నీకు అర్ధమై వుంటుంది."
"అర్ధం లేకుండా పిలిచి ఇంటరాగేట్ చేసేది పోలీసులని అర్ధం చేసుకోవటానికి పెద్ద మేధస్సు అవసరం లేదు."
కుర్చీలో నుంచి అలర్టయినట్టుగా ముందుకు ఒరిగి టేబుల్ మీద చేతులు ఆనించుకుని చూశాడు.
"తెలివైనదానివే"
"చురుకయినదాన్ని కూడా."
"కానీ నేను చాలా అధికారం వున్న వ్యక్తిని."
"అయినా నా గురించి కంగారుపడుతున్నారు."
"షటప్" ఓ కాకిపిల్ల ఇలా రాబందులా రెక్కల చప్పుడు చేయటము నచ్చనట్టుగా అరిచాడు. "నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవటం మంచిది."
"మీరెవరైనా కానీ ఇప్పుడు మీకు నాతో అవసరం పడింది."
సవ్యసాచి ఉద్వేగంగా చూశాడు "నేను పిలిపించింది నీకు భయపడి కాదు"
"ఖచ్చితంగా నాకే భయపడాల్సిన ఆగత్యం లేదు కమీషనరుగారూ ఒక్కోమారు మీ పొజీషన్ కీ మీరు భయపడాలి" అర్ధంకానట్టు చూస్తున్న సవ్యసాచితో అంది "ఇలా మీ పోజీషను గురించి మాట్లాడ్డంలో నా ఉద్దేశము ఒక్కటే. ఒక క్రిమినల్ భయపడాల్సింది పోలీసాఫీసరుకే అయినా మీ స్థాయిలో వున్న పోలీసాఫీసరు మీ చుట్టూ వున్న ప్రజలకి, పత్రికలకి, ప్రభుత్వానికీ భయపడాలి...ఎందుకంటే క్రిమినల్స్ ని కంట్రోల్ చేసే ఓ ఉన్నతాధికారి క్రిమినల్ గా నిలబడడం సిగ్గుపడే విషయం కాబట్టి."