"బాగా అర్ధమయింది." అన్నాడు బన్సీలాల్.
"మీరు యిహపై నౌకర్లని ఓ కంట కనిపెడుతూ ఉండాలి." ఇన్ స్పెక్టర్ గట్టిగా చెప్పాడు.
"ఓ కంటకాదు వెయ్యి కళ్ళతో అనుక్షణం కనిపెడుతూ వుంటాను. వాడు ఎంతకాలం నాకళ్ళు కప్పగలడో చూస్తాను."
"ప్రస్తుతం వేచి చూడటం తప్ప ఏమి చేయలేము. ప్రతిదానికీ ఓ సమయం అంటూ వస్తుంది అప్పుడు..."
నిజమేనన్నట్లు తలాడించాడు బన్సీలాల్.
ఇన్ స్పెక్టర్ కవరుని పోస్టులో వేయకుండా తగలపెట్టింది కాక దానికో కథ అల్లి నౌకర్లమీద అనుమానం ప్రవేశపెట్టి చల్లగా తప్పుకున్నాడు....పొరపాటునే కావచ్చు నౌకర్లు కొట్టారు బన్సీలాల్ చూస్తూ నుంచున్నాడు....ముందు ముందు కొట్టిన నౌకర్లమీద పగ తీర్చుకోవాలి బన్సీలాల్ ని తెలివిగా దెబ్బకొట్టాలి. ఆ దెబ్బ ఎలాంటి దంటే తిరిగి తీసుకోలేనిది అనుమానంతో ఫీలయేదిగా వుండాలి...
ఇన్ స్పెక్టర్ ఈ ఆలోచనతో అప్పటికప్పుడు కధ సృష్టించి చెప్పాడు.
బన్సీలాల్ మెదడులో అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. అది చాలు.
ఇన్ స్పెక్టర్ మరోగంట తర్వాత యింటికి బయలుదేరాడు.
"అన్నట్లు సిగరెట్ లైటరు మ్యూజిక్ టైమ్ పీసు తొందరగా తెమ్మని వాడికి చెప్పటం మర్చిపోయారు లాల్ జీ!" స్నేహంతో గుర్తుచేసినట్లు చేశాడు.
"అమ్మమ్మమ్మ ఎంతమాట నేను మర్చిపోవటమా! మీకోసం పనిగట్టుకుని గుర్తుంచుకొని మరీ చెప్పిన వాడ్ని" నొచ్చుకున్నట్లు అన్నాడు బన్సీలాల్.
"సరదాగా గుర్తుచేశాను" నవ్వుతూ అని ఇన్ స్పెక్టర్ కన్నారావు వెళ్ళిపోయాడు.
వీడు నావేపు లేకపోతే నా బలం సన్నగిల్లుతుంది...పైగా ఠాకూర్ లు మీకన్నా పై చేయిగా వుండాలని వెధవ ప్రయత్నంలో వున్నారు. అధికారంలో వున్న ఈ పందిగాడ్ని ఇలాగే కాకాపట్టి మేపుతుండాలి తప్పదు...
బన్సీలాల్ చాలాసేపు అలా ఆలోచిస్తూనే వుండిపోయాడు.
17
రెండు వారాలు.
ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా గిర్రున రోజులు తిరిగిపోయాయి.
ఘోరం జరగాలని ఎవరూ కోరుకోరు.... కాని ఏదో ఘోరం జరగకపోతే ఏదోలా అనీజీగా వుంటుంది.
అలా బన్సీలాల్ కి వుంది.
ఇన్ స్పెక్టర్ కన్నారావు అనుమానమనే పురుగుని బన్సీలాల్ మెదడులోకి చల్లగ పంపించి మెల్లగా తప్పుకున్నాడు.
అప్పటినుంచీ__
బన్సీలాల్ వెయ్యి కళ్ళతో నౌకర్ల చర్యలని కనిపెడుతున్నాడు....ఎవరిని అనుమానించటానికి కనపడలేదు. ఇన్ స్పెక్టర్ ఏదో కల్పించి చెప్పాడేమోనని శంక ఓ పక్క....ఏమో ఏ నౌకరు గాడిద కొడుకన్నా రహస్యంగా ఏదయినా ఠాకూర్ లకి చేరేస్తున్నాడేమోనన్న అనుమానం మరోపక్క మెదడులో పురుగులా తొలిచేస్తున్నది.
ఈ రెండువారాలలో ఏమీ జరగలేదు....జరగలేదని ధైర్యంగా వుందామా అంటే యిహపై జరగదని గ్యారంటీ లేదుకదా! ఒకవేళ నిజంగా ఏదీ జరగకపోతే మహాప్రసాదం. జరగవచ్చు జరగకపోవచ్చు ఈ రెంటికి మధ్య కొట్టుమిట్లాడు తున్నాడు.
రాత్రి ఒంటిగంట__
ఇదే ఆలోచనలతో రాత్రింబవళ్ళుకొట్టుమిట్లాడుతున్న బన్సీలాల్ కి ఏదో పీడకల రావటంతో పందిరి పట్టెమంచం దిగి అటూ యిటూ పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు.
పది నిమిషాల తర్వాత కిటికీ దగ్గరకెళ్ళి నుంచుని బయటికి చూడటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. చూపులు మాత్రం బయట చెట్టు చేమలని పరీక్షిస్తున్నాయి.
బయట వెన్నెల పిండారపోసినట్లు వుంది.
బన్సీలాల్ ది పెద్దమేడ బ్రహ్మాండమైన ఆవరణ. ఇంటికి నలువేపులా ఎటు చూసినా పెద్ద ఖాళీ స్థలం ఆ స్థలంలో చెట్లు కోట్రన్స్ పూల పొదలు, బాగానే తీర్చి దిద్దినట్లు వుంటాయి.
దూరంగా ఓ పక్కగ నౌకర్లకోసం కట్టించిన చిన్న గదులుగల ఇళ్ళు వున్నాయి.