బన్సీలాల్ పడకగదిలోంచి చూస్తే నౌకర్లుండే ఇళ్ళు కనపడతాయి....అర్జంటుగా వాళ్ళని పిలవాలంటే యిక్కడ బెల్ నొక్కితే వాళ్ళ గదిలో బెల్ మోగేలా ఏర్పాటు వుంది. నడచి అక్కడిదాకా వెళ్ళకుండా బెల్ నొక్కితే చాలు వాళ్ళు పరిగెత్తుకు వస్తారు.
బన్సీలాల్ చూపులు నౌకర్లు నివసించే గదులమీద పడ్డాయి....అలా పడిన సమయంలో ఓ దృశ్యం కానవచ్చింది.
ఆ దృశ్యం-
గోపన్న ఉండే గది తలుపు నెమ్మదిగా తెరచుకున్నది. గదిలోంచి గోపన్న బయటికి వచ్చాడు.
బన్సీలాల్ చటుక్కున కిటికీ పక్కకు తప్పుకుని బయటికి తొంగి చూస్తూ వుండిపోయాడు. నౌకరు గోపన్న పాస్ పోసుకోవటానికి బయటికి రావచ్చు. నిద్రపట్టక పచార్లు చేస్తూ బయట చల్లగాలి మేద్దామని రావచ్చు.
కాని-
ఇన్ స్పెక్టర్ కన్నారావు ఓ అనుమాన పిశాచాన్ని బన్సీలాల్ బుర్రలోకి పంపించాడు. కనుక ప్రత్య్ది అనుమానంగా చూడక తప్పదు....అందుకే కిటికీ పక్కకి తప్పు కున్నాడు బన్సీలాల్.
ఇన్ స్పెక్టర్ కన్నారావుని ఆరోజు కొట్టిన నలుగురూ నౌకర్లలో గోపన్న కూడా ఒకడు.
గోపంనకి ముప్పై ఏళ్ళు వుంటాయి. ఎత్తుగా లావుగా కండలు తీరిన దృఢమయిన శరీరంతో వుంటాడు. శరీరం అలా వుంటే ముఖం లేతగా వున్నదానికన్నా అయిదేళ్ళు వయసు తక్కువగా కానవస్తాడు. ఎక్కువ మాట్లాడడు. అందువల్ల గోపన్న ఎలాంటి వాడన్నది ఎవరికీ సరీగా తెలియదు.
బన్సీలాల్ కి తెలిసినంతలో గోపన్న నమ్మకమయిన నౌకరు.
గోపన్న తన గదిలోంచి బయటికి వచ్చాడు. నలువైపులా చూశాడు. తల ఎత్తి బన్సీలాల్ పడక గడివేపు చూశాడు. అనుమానాస్పదంగా ఏదీ కానరాక పోవటంతో తనగదివేపుతిరిగి లోపలవున్న వాళ్ళని బయటికి రమ్మన్నట్లుగా చేయివూపాడు.
"నేను కిటికీ పక్కకి తప్పుకోటం ఎంత మంచిదయింది అనుకున్నాడు కిటికీ చాటున నక్కివున్నా బన్సీలాల్."
గోపన్న చెయ్యి వూపంగానే నిలువెల్లా నల్లటిమొద్దు దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం గదిలోంచి బయటికి వచ్చింది. చేతిలో చిన్న పార్సిల్ లాంటిది వుంది. ఇరువురూ అక్కడే నుంచుని గుసగుస లాడుకున్నారు. ఆ తర్వాత గోపన్న అక్కడే వుండి పోయాడు. చక చకా అడుగులు వేస్తూ ఆ ఆకారం పెరటి తలుపు తీసుకుని అటునుంచి అటే బయటికి చకచక వెళ్ళిపోయింది.
బన్సీలాల్ చాలా క్విక్ గా ఆలోచించాడు.
గోపన్న యింట్లోనే వుంటాడు. వాడి లీలలు యివాళ కాకపోతే రేపైనా బయట పడతాయి పట్టుకోవచ్చు. గుట్టు బయట పడిందని తెలిసిన మరుక్షణం ఎలా మనం చిత్తగించవచ్చు. కనుక గోపన్న విషయం అలావుంచి ఆ ముసుగు వీరుడు ఎవరో వాడిని వెంటాడాలి. ఏ నౌకరు నైనా లేపి విషయం చెప్పి వాడి వెనుకనే వెళ్ళి ఆరాతీసిరారా అని పంపించవచ్చు. కాని....ప్రస్తుత పరిస్థితులలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీని విషమ పరిస్థితి దాపురించినది.
కనుక...
తానే స్వయంగా రంగంలో దిగటం ఉత్తమోత్తమం అనుకున్న బన్సీలాల్ ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా మేడ దిగాడు. గేటు దగ్గర కాపలా వున్నా గూర్ఖాలాంటి నౌకరుకి మాత్రం తెలుసు బన్సీలాల్ బయటికి వెళ్ళినట్లు. బన్సీలాల్ బయటికి వెళ్ళేముందు తెలివిగా తానుకూడా ఎర్రదుప్పటి వకటి కప్పుకున్నాడు ఒంటి చుట్టూతా.
బన్సీలాల్ ఇంటి చుట్టూ తిరిగి పెరటివేపు వెళ్ళాడు అటునుంచి బయటకెళ్ళే వీధి చాలా పొడుగ్గా వుంటుంది.... కనుక ముసుగు వ్యక్తి దూరంగా అయినా వెళుతూ కనపడక పోడు. వాడి వెన్నంటి వెళ్ళి వాడెవడన్నది...ఎక్కడదాకా వెళ్ళి ఆగాడన్నది....తెలుస్తుంది. అదిచాలు ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకోటానికి.
బన్సీలాల్ ఆలోచన తెలివిగానే సాగింది.
బన్సీలాల్ ఆ వీధిలోకి వచ్చేసరికి ముసుగు వ్యక్తి వేగంగా అడుగులు వేస్తూ వీధిచివరిదాకా వెళ్ళటం కనిపించింది ఆ వ్యక్తి ఆ వీధి మలుపు తిరిగితే తరువాత మూడు దారులు వస్తాయి. ఏ దారిన వెళతాడో ఎలా తెలుస్తుంది?
బన్సీలాల్ చాల వేగంగా పరుగులాంటి నడకతో ముందుకు సాగాడు.
ఆ వ్యక్తి వీధి మలుపు తిరిగాడు.
సరిగ్గా రెండు నిమిషాల్ తర్వాత బన్సీలాల్ వీధి చివరికి చేరుకున్నాడు. అప్పటికే ఆలశ్యం అయిపోయింది. ముసుగు వీరుడు ఏ వీధిలోకి వెళ్ళాడో గాని కనపడకుండా పోయాడు.
బన్సీలాల్ పరుగెత్తుకుంటూ ప్రతి వీధి చివరికి వెళ్ళి చూశాడు. మనిషన్న వాడి ఆనవాలు కనపడలేదు. ఏ వీధి లోనూ పిట్ట పురుగులేరు. అర్దరాత్రి కావటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి.