"నిజంగా జరిగింది అదే. నా కళ్ళు మూసుకుపోయాయి. నా మెదడు పని చేయటం మానేసింది. వాడు ఫోన్ లో గాభరా ఎత్తేలా చెప్పటమే గాక అనుమాన బీజం నా తలలో నాటేసరికి నా కళ్ళకి ప్రతిది అనుమానంగా తోచింది. ముఖ్యంగా మీ క్రాఫ్ అంత పొట్టిగా వుండదు."
"ఎస్. ఎస్. పొట్టి క్రాఫ్ నేను అసలు ఇష్టపడను...పొరపాటున వకసైడు పైదాకా కత్తిరించాడు. సెలూన్ లో కొత్తగా చేరిన కుర్రాడు దాంతో క్రాఫ్ పొట్టిగా చేయించుకొక తప్పలేదు" ఇన్ స్పెక్టర్ చెప్పాడు.
"క్రాఫ్ మారటం పైగా లెటర్ సంగతి అడిగితే మీరు సరీగా చెప్పక మాట దాటేశారు" బన్సీలాల్ అన్నాడు.
"ఏ లెటరు?"
"నేను లెటర్ మాట ఎత్తగానే సరీగా ఇదేమాట అన్నారుమీరు. ఠాకూర్ కి రాసిన లెటర్ కవరు మీరు పోస్ట్ చేస్తానని చెప్పి తీసుకువెళ్ళారు కదా!"
"అయితే ఆ విషయం మళ్ళీ మీరు ఎందుకు ఎత్తినట్లు?"
"కవరు పోస్ట్ లో వేశారా? లెటర్ వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏమిటి అని అడగాలనుకున్నాను. లెటరు అనంగానే ఏ లెటరు అన్నారు మీరు......"
బన్సీలాల్ చెప్పుకుపోతుంటే ఇన్ స్పెక్టర్ ముఖం రంగులు మారింది...వెంటనే బుర్ర పాదరసంలా పనిచేసింది. "ఇష్" అన్నాడు ఏదో దేవరహస్యం చెప్పబోతున్నట్లు.
బన్సీలాల్ టక్కున నోరు మూసుకున్నాడు.
ఇన్ స్పెక్టర్ ఆ రాత్రి కవరుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు. యింక ఠాకూర్ ఇంటికి చేరదు...గాక చేరదు. తను లెటర్ పోస్ట్ లో వేశానని దాఖలాకి ఓ కథ అల్లాలి. బన్సీలాల్ రోగం కుదర్చటానికి అనుమాన బీజం నాటాలి...నౌకర్ల రోగం కుదర్చాలి. ఎందుకు కుదర్చాలి అంటే బన్సీలాల్ నౌకర్లు అందరికీ ఇన్ స్పెక్టర్ ని కొట్టినట్లు తెలిసిపోయింది కాబట్టి....
"ఇక్కడ మన మాటలు వినేవాళ్ళు ఎవరూ లేరుగా లాల్ జీ!"
"ఊహూ."
"అయితే వినండి....మీరు లెటర్ సంగతి ఎత్తినప్పుడు ఎవరో మన మాటలు వింటున్నట్లు న కనుమానం కలిగింది. ఏమి తెలియనట్లు ఏ లెటరు అన్నాను. ఇంతలో మీరు మరో ప్రశ్న వేయటం"
"నా యింట్లో నాకు తెలియకుండా రహస్యంగా పొంచి మాటలు వినేవాళ్ళా!" ఆశ్చర్యంగా అడిగాడు బన్సీలాల్.
"నేను ఈ మాటలు మామూలుగా చెప్పటం లేదు. పోలీసు బుర్రతో ఆలోచించి చెబుతున్నాను లాల్ జీ. నా కంటూ అనుమానం రాదు, వచ్చిందా ఏదో వున్నట్లే లెక్క."
"వివరంగా చెప్పండి నా కేమీ అర్ధం కావడం లేదు."
"అర్ధమయేలా చెపుతాను లాల్ జీ! బహు జాగ్రత్తగా వినండి. మీ నౌకర్లలో ఒకరు మాత్రం ఠాకూర్ వేపు ఇటు మీ వేపు పనిచేస్తున్నాడు. ఎలా అంటే ఈ యింటి రహస్యాలు చేరవేయడానికి ఒకడిని మీ నౌకరుగా ప్రవేశపెట్టారు..."
"ఠాకూర్ అంత ఘాతకానికి పాల్పడ్డారంటారా?" బన్సీలాల్ అనుమానంగా అడిగాడు.
"మీ మంచితనం మీ అమాయకత్వానికి నిదర్శనం లాల్ జీ! నే చెప్పింది నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నుంచీ నౌకర్లని ఓ కంట కనిపెడుతూ వుండండి. మనకి అలా చేయటం నష్టం కాదుకదా?"
"కాదు."
"కనుక అలా చేయండి...మనం ఇరువురు కలిసి ఆకాశ రామన్న లెటర్ సృస్టించాము అవునా?"
"అవును....ఆ లెటర్ సంగతే కదా నేను ఎత్తింది?"
"అదే చెప్పబోతున్నాను....జాగ్రత్తగా సృస్టించిన ఆకాశరామన్న లెటర్ ని నేను అతి భద్రంగా తీసుకువెళ్ళి స్వయంగా నా చేతులతో ఉదయానే పోస్ట్ చేశాను. ఆ కవరు వాళ్ళు అందుకోటం ఇటు రహస్య గూఢచారిలాంటి మీ నౌకరు వాళ్ళకి వార్త అందించటంతో వాళ్ళు మంచి పథకం పన్నారు."
"ఏమిటా పధకం?"
"మీ నౌకర్లచేత నా ఒళ్ళు తాషామర్పా చేయించారు మ్చూదండి అదన్నమాట" కోపంగా శలవిచ్చాడు ఇన్ స్పెక్టర్.
"అది ఎవరిగొంతు మార్చి ఇన్ స్పెక్టరుని అని చెప్పబట్టి..."
బన్సీలాల్ చెపుతుంటే ఇన్ స్పెక్టర్ అడ్డు తగిలాడు.
"బస్. బస్. విషయం మీ కింకా అర్ధం కాలేదా! మీకు నాకు వున్నా స్నేహాన్ని చెడకొడితే మనం విడిపోతాముకదా! నా స్నేహం మీకు లేనప్పుడు మీకు బలం వుండదు కదా! అప్పుడు మీ పని పట్టడం తేలికకదా. మనం విడిపోయిం తరువాత వాళ్ళు నన్ను దగ్గరకు చేర్చుకుంటారు కదా!"
ఇన్ స్పెక్టర్ చెపుతుంటే అన్నీ నిజమేననిపించాయి. బన్సీలాల్ కీ. "అవును కదా!" అన్నాడు ఏకీభవిస్తూ.
"మీరు మీ నౌకర్లచేత కొట్టించినందుకు నేను మీతో స్నేహం చేయకూడదు....మీ మీద నేను ఏ చర్య అయినా తీసుకోవచ్చు కాని....మీ గుణం తెలిసిన వాడిని కాబట్టి మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను మీ రెక్కడ పొరబడ్డారో తెలియజేశాను....ఇప్పుడు అర్ధం అయిందికదా?"