కాసేపు తనలో తాను తర్జన భర్జనపడి, సీతామనోహరి ఓ నిర్ణయానికి వచ్చింది.
అప్పటికప్పుడే కాగితం, కలం తీసుకుంది.
సీతామనోహరి రచయిత్రి కావటమే యింక ఆలస్యం - రచన చేయటానికంటూ కలం పట్టింది కదా!
10
"టే తయారు చేసి, ఫ్లాస్క్ లో పోసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుందేమో!" అనుకుంది సీత.
"భోంచేసి పావుగంట కాలేదు - వేషాలు పోకు" అంది అంతరాత్మ.
టే తయారుచేయటం అనే ప్రక్రియని తాత్కాలికంగా వాయిదా వేసి, దస్తా తెల్లకాగితాలు టేబుల్ మీద పెట్టి, అవి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ వాటిమీద పెట్టి, మధ్యలో పెన్నులో యింకు అయిపోతే చిరాకుగా వుంటుంది కాబట్టి - ముందే పెన్నునిండా ఇంకు పోసుకుని, టేబుల్ ని కిటికీ దగ్గరగ జరుపుకుని కుర్చీలో కూర్చుంది సీత.
రాస్తున్నప్పుడు ఆలోచనలు రాకపోతే కాసేపు బుగ్గన చేయి చేర్చుకుని, కిటికీలోంచి బైట కనపడే ప్రకృతి (క్రోటన్స్ మొక్కలు) ని పచ్చపచ్చగా చూస్తే మనసు ఫ్రెష్ గా మారి, మంచి ఆలోచనలు వస్తాయి కదా! - ఇది సీత ఆలోచన.
పెన్నుకున్న క్యాప్ ని తీసిపెట్టి, పెన్ను పట్టుకున్న చేతిని బుగ్గకి చేర్చి, రాయబోయే రచనకి ఏం పేరు పెట్టాలని శూన్యంలోకి సాలోచనగా చూస్తూ ఆలోచించింది. వెంట వెంటనే చాలా పేర్లు తట్టాయి.
అందమైన ఆడపిల్ల.
ఎగిరెగిరి పడిన బంతి.
ఒక అమ్మా నాన్నా కధ.
చితికీ చితకని బతుకులు.
నల్లకాకి, తెల్లపిచ్చుక.
సీతకి నవ్వు వచ్చింది. దాంతో ఆలోచనకి బ్రేక్ పడింది. నల్లకాకి, తెల్ల పిచ్చుక - ఈ కధని చందమామకి పంపిస్తే సరిపోతుంది. ముందు సాంఘిక నవలలు రాయకుండా, బాల సాహిత్యం రాయటం ఏమిటి? బాల సాహిత్యం రాయటం వల్ల పిల్ల రచయిత్రిగా పేరు వస్తుందేమో గాని, పెద్ద రచయిత్రిగా మటుకు రాదు.
కనుక -
పిల్ల రచనలు ఇప్పుడప్పుడే చేయరాదు.
కనుక -
ఏం రచనలు రాయాలి?
సీతకి ఆ సమయంలో ఓ పెద్ద రచయిత్రి తాను రాసిన నాలుగొందల పేజీల పెద్ద నవలలో ఓచోట రాసిన మాటలు గుర్తుకొచ్చాయి.
"ఏ రచననైనా తేలికగా రాయొచ్చు కాని, క్రైం రచన చేయటం మహా కష్టం. పది నెలలు మోసి పండంటి బిడ్డను కనటం తేలిక. అజ్ఞాతవాసంలో వున్న హంతకుడిని పట్టటము తేలికే - కాని ఒక క్రైం రచన చేయటం మటుకు చాలా కష్టం."
ఇలా రాసుకుంది ఆవిడ. క్రైం రచనల్లో చేయితిరిగిన మహా ఇల్లాలు ఆవిడ. ఖాళీ దొరికినప్పుడల్లా తెగ క్రైం రచనలు వండి పారేసి, పాఠకులకి హాటు హాటుగా వడ్డిం చేస్తుంది.
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.
రాస్తే క్రైం సాహిత్యాన్నే రాయాలి.
అనుకున్న సీతామనోహరి ఎలాంటి క్రైం రాయాలా అని కాస్త ఆలోచించింది. బొత్తిగా ఏ ఆలోచనా రాలేదు. రాసుకుపోతుంటే అదే వస్తుంది- అనుకుని గబగబా రాయటం మొదలుపెట్టింది.
అదేమి వింతో - వంచిన తల ఎత్తకుండా ఏకబిగిన ఓ అరఠావు రాసిపారేసింది. ఒక్కసారి మొదటినుంచీ చదివి, ఆ తర్వాత రాస్తే సరి - అనుకుని, తను రాసింది చదవటం మొదలుపెట్టింది సీత.
అనగా అనగా అభిరామపురంలో అతడు. ఎత్తుగా, లావుగా, కండలుతీరి అందాల సుందరిలా వున్నాడు. అతనో భయంకర హంతకుడు. చాలా హత్యలు చేసి హంతకుడు అయాడు. అతను అన్ని హత్యలు అలా చేసినా, పోలీసులకి దొరకలేదు. అతను హత్యలు చేసేముందు దేముడికి దండం పెడతాడు. దండం పెట్టి హత్యచేస్తే పోలీసులకి పట్టుపడనని ఆ హంతకుడి నమ్మకం. ఆ హంతకుడు నాలుగుసార్లు తిరపతి వెళ్ళి వచ్చాడు. వెళ్లినప్పుడల్లా తలనీలాలు కూడా యిస్తుంటాడు. హంతకుడు అన్ని హత్యలు చేసినా - ఇంతవరకూ పోలీసులు హంతకుడిని పట్టుకోలేదు. ఉరిశిక్ష వేయలేదు. హంతకుడికి ఉరిశిక్ష వేయాలంటే పోలీసులు ఆ హంతకుడిని పట్టాలి. ఈ జన్మకి హంతకుడిని పోలీసులు పట్టలేరు. హంతకుడు ఈ మధ్య యింకా హత్యలు చేస్తూనే వున్నాడు. హంతకుడు చేసిన హత్యలు చూసి ప్రజలు - చలికాలంలో చన్నీళ్ళు పోసుకున్నట్లు గజగజ వణికిపోతున్నారు. హంతకుడు చేసిన హత్యలు చూసి ఆబాల గోపాలం- స్త్రీ పురుషులు, చిన్నా పెద్దా, ముసలీ ముతకా చలిజ్వరం వచ్చినప్పుడు కిలో ఐసు గడ్డలు తిన్నట్లు గజగజ వణికేవారు. సి ఐ డీ లు హంతకుడు చేసిన హత్యలు చూసి - శీతాకాలంలో మంచు పర్వతం మీద దిగంబరంగా దొర్లినట్లు గజగజ వణికారు. హంతకుడు ఏ వణుకు లేకుండా హత్యలు చేసేవాడు. ఈ హంతకుడు చేసే హత్యలు......