Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 23


    "ఆఁ! తిని పడుకొన్నాడు."
    "అయితే నువ్వూ కూర్చో!"
    "ముందు నువ్వు తిను."
    గౌతమ్ బలవంతం మీద అన్నపూర్ణమ్మ కూడా వడ్డించుకుంది. ఆమెకు ముద్దా మింగుడు పడటం లేదు. గౌతమ్ అది గమనిస్తూనే ఉన్నాడు. గౌతమ్ తిన్నంత వరకు తనూ తింటూనే ఉన్నది. కాని పళ్ళెంలో పెట్టుకొన్న అన్నం సగం పైగా అలాగే వుండిపోయింది గౌతమ్ లేవగానే ఆమె కూడా లేచింది.
    "అదేమిటమ్మా తినకుండానే లేచావ్!"
    "తిన బుద్ది కావడం లేదురా!"    
    గౌతమ్ తల్లిని ఓ క్షణం పరిశీలనగా చూశాడు.
    ఆమె ముఖంపాలిపోయి ఉంది.
    అన్నపూర్ణమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనకే గౌతమ్ కూడా వెళ్ళాడు.
    "ఏం బాబూ! ఏమైనా కావాలా?"
    "నీతో మాట్లాడాలి."
    అన్నపూర్ణమ్మ గౌతమ్ ముఖంలోకి బాధగా చూసింది.
    "అమ్మా!"
    "ఊ.ఁ"
    "అలా కూర్చో!"
    అన్నపూర్ణమ్మ మంచంమీద కూర్చుంది.
    గౌతమ్ కుర్చీలో కూర్చున్నాడు. సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు.
    "ఏమిటి? ఏం మాట్లాడతావ్?" అని అడగటానికి కూడా భయపడుతున్నట్లుగా మౌనంగా కూర్చుంది ఆమె.
    "అమ్మా! నేను ఒకటి అడుగుతాను. నిజం చెప్తావా?"
    అన్నపూర్ణమ్మ కొడుకు ముఖంలోకి చూసింది.
    "మాట్లాడమ్మా!"
    "ఏం మాట్లాడమంటావ్?"
    "నీకు నా మీద నమ్మకం ఉందా?"
    ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణమ్మ.
    "చెప్పమ్మా! నా మీద నీకు నమ్మకం ఉందా?"
    "ఉంది."
    "అయితే నేను అడిగేదానికి సరైన సమాధానాలు కావాలి. నువ్వు మనసులో ఏదేదో పెట్టుకొని బాధపడటం నేను చూడలేను. నాకూ మనసులో అనేకం సందేహాలు."
    "ఏమిటి?"
    "నాకు మరో అన్నగానీ తమ్ముడుగానీ ఉన్నాడా?"
    అన్నపూర్ణ కళ్ళప్పగించేసింది.
    "భయపడకమ్మా! నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావ్?"
    "అలా అని ఎవరన్నారు?"
    "ఎవరూ అనలేదు. కాని నాకు మరో సోదరుడు ఉన్నాడని తెలిసింది.
    "బాబూ!" అన్నపూర్ణమ్మ నిలువెల్లా కంపించింది.
    "అమ్మా! ఎందుకమ్మా భయపడ్తావ్? నేను నీ బిడ్డను. నాకు బాధ చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావ్? చెప్పమ్మా!"
    అన్నపూర్ణమ్మ తల వంచుకుంది. మనసులో రేగుతున్న అల్లకల్లోలాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది.
    "చెప్పమ్మా! చెప్పకపోతే చాలా అనర్ధాలు జరగొచ్చును. మేం సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా అమ్మా!"
    "బాబూ!" గొంతుకు ఏదో అడ్డుపడినట్టు అసహాయంగా చూసింది కొడుకును.
    "నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను విను. నేను నీకు నీ వివాహానికి ముందే పుట్టాను. నాతో పాటు మరొకడు కూడా పుట్టాడు. నీకు కవలలు కలిగారు. అందులో ఒకణ్ణి ఎవరికో పెంపు ఇచ్చావ్. అతడు నాకంటే చిన్నవాడో, పెద్దవాడో నాకు తెలియదు."
    "గౌతమ్!" దాదాపు ఆర్తనాదం లాగే వచ్చింది ఆమె కంఠాన్ని బద్దలు చేసుకుంటూ.
    "నిన్ను బాధ పెడితే క్షమించు. కాని నాకు సమాధానం కావాలి. ఆ అభాగ్యుడు ఈమధ్యే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కాని నువ్వు అతన్ని కొడుగ్గా అంగీకరించే స్థితిలో లేవు. ఇంతకాలంగా తల్లి  ప్రేమను నేను రుచి చూశాను. నీ చల్లని నీడలో పెరిగాను. మేమిద్దరం ఒకటిగానే ఉంటాం. ఎవరూ గుర్తించలేరు. నువ్వు అతణ్ణి కొడుకుగా స్వీకరించు. నేను తప్పుకుంటాను."
    "బాబూ!" అంటూ అన్నపూర్ణమ్మ రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
    గౌతమ్ వారించలేదు. జాలిగా చూస్తూ ఉండిపోయాడు.
    "నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?"
    "నిజం చెపితే ఆలోచిస్తాను పరిష్కారమార్గం." అతడి కంఠం ఖండితంగా పలికింది.
    "చెప్తాను బాబూ! మీరిద్దరూ కవలలు కారు. అప్పుడు నాకు పదహారేళ్ళు. తెలిసీ తెలియని వయసు. మంచి తప్ప చెడును ఊహించలేని మనసు. అప్పుడే నా జీవితంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు....." అంటూ అన్నపూర్ణమ్మ తనకు తనే మననం చేసుకుంటున్నట్టుగా చెప్పింది.
    గౌతమ్ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు.
    "మళ్ళీ రంగనాధరావు వచ్చాడా?"
    "లేదు."
    "మరి?"
    "ఆగిపోయావేం? అడుగు." అన్నపూర్ణమ్మ మాటలో జంకులేదు. ముఖంలో విచారం లేదు. కళ్ళలో భయం లేదు. ఆమె ధోరణి గౌతమ్ కు భయం కలిగించింది.
    రంగనాథరావు మళ్ళీ కనిపించలేదు.
    మరి తన తండ్రి ఎవరు?
    ఈమె మళ్ళీ మోసపోయిందా? ఈసారి గౌతమ్ మనసు కొంత చేదు చేదుగా అనిపించింది. ఏదో విరక్తి అతడి మనసును చుట్టేసింది. తల్లిమీద సానుభూతి తగ్గింది.
    చివ్వున తలెత్తి పరిశీలనగా తల్లిని చూశాడు.
    "నా తండ్రి ఎవరు?"
    అన్నపూర్ణమ్మ అర్ధం కానట్టు అతడి ముఖంలోకి చూసింది.
    "చెప్పమ్మా? ఎవరు?"
    "శంకర్రావు గారు."
    "అబద్దం!"
    అన్నపూర్ణమ్మ బిత్తరపోయింది.
    "నిజం చెప్పు!"
    "నిజమే చెప్పాను."
    "నిజం కాదు. నన్ను మరొకడికి....."
    అన్నపూర్ణమ్మ "గౌతమ్!" అంటూ భద్రకాళిలా అరిచింది.
    ఆమె ముఖం కోపంతో తమతమలాడుతోంది. కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి.
    "ఎందుకింత కోపం? నువ్వె చెప్పావుగా?"
    "ఏమని చెప్పాను?" బుస కొట్టింది.
    "శంకర్రావుగారిని పెళ్ళి చేసుకొనే దానికి ముందే నేను పుట్టానని."
    "అవును. అది నిజమే. కాని శంకర్రావు నీ తండ్రి కాదనలేదే? ఆయనకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఆ రోజుల్లో ఆయన విప్లవ కారుల్తో తిరుగుతూ ఉండేవారు. నా విషయం అంతా తెలిసీ నన్ను దగ్గరకు తీశారు. కలిసి ఉండటంలో తప్పులేదన్నారు. జీవితమంతా జీవిత సహచరుడిగానే ఉంటానన్నారు. ఆయన రాజేశ్వరికి అన్నగారు" అని ఆగింది.
    "అయితే మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నారు?"
    "ఆయన ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఊరు వచ్చాం. అప్పటికి నీకు సంవత్సరం. లా ప్రాక్టీసు ప్రారంభించారు. ఆయనకు ఏం తోచిందో రిజిస్టర్ మారేజ్ చేసుకున్నారు. ఈ తంతు మీద తనకు నమ్మకం లేకపోయినా వివాహం అవసరం అన్నారు. నాకూ నా బిడ్డలకూ తన ఆస్తి మీద లీగల్ రైట్ ఉండాలంటే పెళ్ళి తప్పదన్నారు. అప్పటికి నాకు ప్రపంచ జ్ఞానం లేదు. ఆయన చెప్పినట్టే చేశాను."

 Previous Page Next Page