Previous Page Next Page 
జనపదం పేజి 23

 

    "యాడికి పోతున్నావ్ ఇంత పొద్గాల?"
    "కాస్త చిరాకు పడ్డాడు వీరభద్రం. అయినా సౌమ్యంగానే "రాముని ఇంటికి" అని జవాబు చెప్పాడు.
    "రామయ్య ఇంటికి పోతావ్ లే"
    "పొతే తప్పా?"
    "నేనంటే తప్పైతదా? ఎట్లయిన మీరు మీరు ఒక్కటి? మునిగేటోల్లం మేమేగద?"
    మస్తాన్ చేసిన వ్యాఖ్యానానికి వీరభద్రం తల తిరిగిపోయింది. చావు బతుకుల్లో తనకు అండగా నిలిచినా మస్తాన్ మాటలేనా ఇవి? మస్తాన్ మతిపోయిందా? మస్తానే ఇలా అంటే ఇతరులేమనాలి? ప్రజల మనిషి నడక కత్తి మీదసాము. అందరినీ కొన్ని కళ్ళు - అతనిని కొన్నే వేల కండ్లు చూస్తుంటాయి. తాను రాముని దగ్గరికి వెళ్లడాన్ని గురించి ఊరు ఎలా వ్యాఖ్యానిస్తుంది? ఆ వ్యాఖ్యలను ఎడురుకోవడం ఎలా? సమాధానం చెప్పడం ఎలా? కష్టమే! మరి వెనక్కు తిరగాలా? మంగమ్మ శోకమూర్తి లా ప్రత్యక్షం అయింది. అతనిలోని మనిషి ఆకాశం అంత అయినాడు. మరే ఆలోచనకూ అవకాశం లేకుండా చేశాడు.
    "మస్తాన్! ఒక మనిషిని రక్షించాలె. అడ మనిషిని. అదీ మంగమ్మను అడ్డుపడకు. నన్ను అర్ధం చేసుకో" అని మస్తాన్ను తప్పుకొని ముందుకు అడుగు వేశాడు.
    మంగమ్మను రక్షించాలి అనే మాటతో కొంత తికమక పడ్డాడు మస్తాను. "నన్ను రమ్మంటారా?" అడిగాడు.
    "ఇప్పుడువద్దు. అక్కరపడితే పిలుస్త."
    మళ్ళీ ఏదో అనుమానం మస్తాను మనసులో చేరింది. అతడు వీరభాద్రాన్ని అనుసరించాడు.
    వీరభద్రం రామయ్య ఇంటి మెట్లేక్కాడు. గడప దగ్గర పండ్ల పుల్లతో రామయ్య ప్రత్యేక్షం అయినాడు. అకస్మాత్తుగా ఒకరి నొకరు ఎడురైనారు. అడుగు ముందుకు వేయాల్సింది వెనక్కు వేశాడు రామయ్య. పిడుగు పడ్డట్లనిపించింది. కాస్త కలవరపడ్డాడు. గుండె దడదడలాడింది. క్షణం నోట మాట రాలేదు. అతనికి తెలియకుండానే చేతులు రెండూ వీరభద్రానికి నమస్కారం చేశాయి. "మీరా! మా యింటికి!" అన్నది నోరు.
    "అవును జర మాట్లాడాలె"
    "మంచిది. రాండి లోపలికి" అని యాంత్రికంగా నడిచాడు రామయ్య. ఇద్దరూ కుర్చీల మీద కూర్చున్నారు.
    ఇద్దరి గుండెలూ గుబగుబ లాడుతున్నాయి. ఇద్దరి ముఖాల్లోనూ రక్తం లేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ తలలు వంచు'కున్నారు. ఆవరించిన నిశ్శబ్ధతబిక్కుబిక్కుమంటుంది. ఎలా ఎలా ప్రారంభించాలో వీరభద్రానికి తెలియడం లేదు. విషయం ఏమిటో రామయ్యకు అర్ధం కావడం లేదు.
    "మంగమ్మ తెలుసా?"
    పిడుగు పడ్డది రామయ్య మీద. చిరు చెమటలు పోశాయి. అందుకు సిద్దంగా లేదు. కళవళ పడ్డాడు.
    "ఏ మంగమ్మ?"
    వీరభద్రం వళ్ళు మండింది. ఆ ప్రశ్నతోనే రానున్న పరిణామాలను అర్ధం చేసుకున్నాడు వీరభద్రం. అయినా నిగ్రహం వహించాడు.
    "జగ్గయ్య భార్య...."
    "ఎరికే... ఏం.....బాగున్నదా?"
    నవ్వాడు వీరభద్రం. అది గునపంలా గుచ్చుకుంది రామయ్య గుండెలో. ముఖంలోని రక్తం యావత్తు దిగిపోయింది.
    "ఆమెకు అన్యాయం చేశావు"
    "నేనా .....నేన ......నేనేం చెయ్యలేదు . పని చేసింది. పైకం ఇచ్చిన. అందరి కిచ్చిందానికంటే ఎక్కువ ఇచ్చిన."
    "పని చేస్తున్నప్పుడు ఏం చేసినవ్. ఆమె నాకు అన్నీ చెప్పింది. నిజం ఒప్పుకో ఆమెను నాశనం చేయకు."
    ప్రేత  ముఖంలా వెలవెల పోయింది రామయ్య ముఖం. అదో విధంగా చూశాడు వీరభద్రాన్ని. అతని నాలుక తడి ఆరిపోయింది. "అపు . నేనామెను బలవంతం చేసిన. అది సత్యం. మీరు వచ్చిన్రు మంచిదైనది. నలుగుర్ల పెట్టకండి. ఏమియ్యమంటే అదిస్త . ఆమెకు ఏ లోటూ రానియ్యను . ఏమంటారు?"
    "ఆమె కడుపుతో ఉంది"
    రామయ్య మీద పిడుగుపడ్డది.
    మాట్లాడలేదు.
    "ఇప్పటికీ మించిపోయిందేమీ....."\
    "ఏం చేయమంటారు. మీరు ఎంతియ్యమంటే అంతీస్త"
    "రామయ్యా! ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనగలవా?"
    కాస్త చిరాకుపడ్డాడు రామయ్య. "డబ్బుతో కాకుంటే రాజ్యాలతో కొంటామా చెప్పండి ఏం చేయమంటారో?"
    "పెండ్లి చేసుకోవాలె"
    ఈ తడవ అతని మీద ఏ పిడుగు పడలేదు. అతి సాధారణంగా అన్నాడు "మొగుడు చచ్చిన ముండనా?"
    "లోకానికైనా నేరవాలి . ముఖం ఎట్లా చూపిస్తావు జనానికి?"
    "ఏమి? కడుపు నేను చేసిన్నని దాఖలా?"
    "మరి ఎవరు చేసిన్రంటావు!"
    "నాకేమెరిక. మంగామ్మ ఇంట్లో ఉంటున్నది నువ్వు? నన్నడుగుతే నేనెట్ల చెప్పను?"
    వీరభద్రం మండిపోయాడు. తన మీద నేరమా? అతని కాళ్ళూ చేతులు వణికాయి. "నన్నే దోషి అంటున్నాడా రాముడూ. కాలం మారింది కాబట్టి సరిపోయింది. కాకుంటే నీ తల ఇప్పటికీ తెగి ఉండేది."
    "కాలం మారింది కాబట్టే అంటున్న మంగమ్మకు కడుపు చేసింది నువ్వు, నువ్వు" అని గట్టిగా అరచాడు. లేచి నుంచొని వీరభద్రం వైపు వేలుతో చూపుతూ. అంతే అక్కడనుంచి చరచర వెళ్ళిపోయాడు.
    వీరభద్రం కుంగిపోయాడు. అతడు కుర్చీలోంచి లేవలేకపోయాడు. అయినా లేచి చరచరా మెట్లు దిగాడు. గుండెలో ఒక అగ్గి కొండతో చెరువు వైపు నడిచాడు.
    తూర్పున భానుడు ఉదయించాడు. వెలుగులు పరుస్తున్నాయి. పశువుల మందలు ఊరు దాటి పోతున్నాయి. ఎండిన కాలువ వెంట సాగిపోతున్నాడు. వీరభద్రం మనసులో చీకటి నిండుకుంది. వెలుగురేఖ కోసం వెతుకుతూ సాగిపోతున్నాడు. చెంబులు పట్టుకొని చెరువు వైపు వెళ్ళే జనం నమస్కరింస్తున్నాడు. పరాకుగానే ప్రతి నమస్కారం చేసి సాగిపోతున్నాడు. చెరువు కట్ట ఎక్కాడు. నిప్పులు కురిసే మోదుగులు కనిపించాయి. మెదుగు పూలంటే వీరభద్రానికి ప్రాణం. ఆ ఎరువుదానం అతనిలో ఏదో ఉత్తేజాన్ని కలిగించేది. వాటిలో ఏదో వెలుగు గోచరించేది. కాని ఈ రోజు? వాటిని చూశాడు. అవి నిర్గంద కుసుమాల్లా కనిపించాయి. "పలాశ కుసుమం వృధా' అనిపించినట్లు వుంది అతనికి. అలాగే సాగిపోతున్నాడు మరి! నాగాజముడు పొదలు కనిపించాయి. అవి దట్టంగా ఉన్నాయి. పాము పడగల్లా ఉన్నాయి. పైగా ముళ్ళు, నగసర్పం మెత్తగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. కాటు సంగతి తరవాత నాగజముడు తనను తాకనివ్వదు . దాన్నిండా సూదుల్లాంటి ముళ్ళు. రామయ్య నాగాసర్పం అనుకున్నాడు. తాను నాగజముడు కాదు కదా అనుకుంటూ ఉండగానే గుండెలో నాగజముళ్ళు మొలిచాయి. నాగజముళ్ళు దాటాడు. చెరువులో నీటి చుక్క లేదు. బీటలు వారింది. చెరువు కట్ట దిగాడు. ఇంకా సాగిపోతూనే ఉన్నాడు. ఎక్కడికో? కాలిబాట వదిలాడు. ఎండిన చేలల్లోంచి పడి నడిచాడు. పెద్ద మర్రి కింద వున్న పరువు బండ మీద కూలబడ్డాడు. తలెత్తి సూర్యుణ్ణి చూశాడు. అతడు ఎదుగుతున్నాడు. ఎగబాకుతున్నాడు. రామయ్య ఎదుగుతున్నట్లనిపించింది. రామయ్య సూర్యునిలా ఎగబాకుతున్నడా? చీకట్లలా ఎదుగుతున్నాడా? అనుకున్నాడు. మనసు తేలిక పరుచుకుందామని సిగరెట్లు కాల్చాడు. పొగ వదులుతుంటే మనసు తెలికయినట్లనిపించింది. ఏం చేయాలి? మంగమ్మను ఎలా కాపాడాలి మంగమ్మ అమాయకురాలా? ఇందులో మంగమ్మ తప్పులేదా? అవును తప్పు చేసింది. అనుభవించనీ శిక్ష! ఆమె చేసిన తప్పేమీ? వాడు బలవంతం చేశాడు. అడ్డుకోలేకపోయింది. ఎదిరించలేకపోయింది. చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలి? ఎంత దుష్టుడైనాడు రాముడు? తనమీడనే నేరం మోపాడే? దొరబానిసగా బతికినావాణ్ణి మనిషిని చేసింది తాను. ఒక్కొక్కసారి తనకోసం ప్రాణాలే బలి ఇవ్వడానికి సిద్ద పడ్డాడు. అలాంటి రాముడు తనమాట వినకపోతాడా? అని వెళ్ళాడు. ఎంత దుర్మార్గుడు. తననే మంగమ్మ కడుపుకు కారణం అంటాడా? అతనిలో కోపం పెల్లుబిక్కింది. ఒకరాయి అందుకొని లాగి రాతికి కొట్టాడు. నిప్పు రవ్వలు వెలిగి మలిగిపోయాయి. రాముడు మంచివాడే . డబ్బు అన్ని దుర్మార్గాలను నేర్పుతుంది. వాడికి సిరి అబ్బింది. అది చేసిన దుర్మర్గాలను కప్పి పుచ్చగలదు. మరికొన్ని చేయించగలదు. రాముడిని రక్షించడం. రక్షించడం, రక్షించడం ఎలా? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు. ఏవో బాకులు, కత్తులు, కటార్లు మెదడును చీల్చాయి. ఏమిటి? ఎలా? ఏం జేయడం? దూరం నుంచి మస్తాన్ వస్తున్నట్లు కనిపించాడు. మనిషిని కొంత దైర్యం . ఆలోచనకు ఉపకరిస్తాడు అని అతడు వస్తున్నా వైపు చూడసాగాడు. అవును తనవైపే వస్తున్నాడు. ఎందుకు అంత వేగంగా వస్తున్నాడు? మంగమ్మ ఏమైనా అఘాయిత్యం చేయలేదు కదా! దాంతో అతని గుండె దడ దడ లాడింది. మనసు కీడు శంకించింది. మెదడు ఏవేవో ఆలోచించింది. అమాంతంగా లేచి విసురుగా పరిగెత్తాడు. "మంగమ్మ బాగేనా?...." అడిగాడు దూరం నుంచే వస్తోన్న మస్తాన్ను.

 Previous Page Next Page