"అవున్రా, ఈ ఆలోచన మాకు రాలేదు . ఓ.కే. మేము ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకునే ఉంటాంలే?"
బస్ బయల్దేరింది.
"వదినా! నువ్ కొంచెం నిబ్బరం తెచ్చుకోవాలి! లేకపోతే పిల్లలు నలిగిపోతారు. నేను వారం రోజుల్లో వచ్చేస్తానింటికి" సుభద్రతో చెప్పాడతను. ఆమె నిర్లిప్తంగా తలూపింది.
బస్ డిపో బయటకు వెళ్లేంతవరకూ నిలబడి బరువేక్కిన హృదయంతో చూస్తుండిపోయాడతను.
"పదండి! ఇంకా వెళ్దాం" అంటూ భారతి అనేవరకూ స్పృహలోకి రాలేదు. ఇద్దరూ రోడ్ మీద నడవసాగారు.
"మీకు బాగా ఆలస్యమయిపోయింది. మీ బాబాయ్, పిన్నీ మిమ్మల్నేమీ అనరు కదా?" అడిగాడు సృజన్.
"మా పిన్ని కొంచెం గొడవచేస్తుంది. గానీ మా బాబాయ్ ఫర్వాలేదు. అండర్ స్టాండ్ చేసుకోగలరు. నేను మా పిన్నితో వేగుతూ ఆ ఇంట్లో ఉంటున్నానంటే కారణం మా బాబాయే! కొంచెం తాగుబోతన్న పేరు తప్పితే అయన నిజంగా చాలా మంచి వ్యక్తీ-"
ఆమె స్టాండులో నిలబడి వున్న ఆటోని పిలిచింది.
"రండి! మిమ్మల్ని మీ హోటల్ దగ్గిర డ్రాప్ చేసి వెళతాను" అందామె.
"మీరు వెళ్ళండి! నేను వేరే పని మీద వెళ్తున్నాను." అన్నాడు సృజన్.
"ఏమిటా పని?"
"మా అన్నయ్య బస చేసిన హోటల్ కేళ్తున్నాను. అక్కడ అన్నయ్య తీసుకున్న గది ఓసారి చూస్తాను......అన్నయ్య డయిరీ దొరికితే కొంత వివరాలేమయినా లభిస్తుందేమోనని ఆశగా ఉంది."
"కానీ ఆ డయిరీ ఉంటె పోలీసులు స్వాధీనపర్చుకుని ఉండే వారేకదా?"
"అవును! అయితే మరి ఆ డయిరీ ఎమయినట్లు ఒకవేళ దొరికినా పోలీసులు నాకు చెప్పటం అనవసరం అనుకున్నారేమో."
"ఏదేమయినా ఆ మారుమూల హోటల్ కి ఇంత రాత్రిలో వెళ్ళటం మంచిది కాదు. నామాట విని రేపు ఉదయం వెళ్ళండి."
"సరే- మీ మాట కాదని ఎలా అంటాను?" పదండి నేనే మిమ్మల్ని మీ ఇంటిదగ్గర డ్రాప్ చేసి హోటల్ కి వెళతాను. అంటూ ఆమె పక్కనే ఆటోలో కూర్చున్నాడతను.
అటో ఇరవై నిముషాల తర్వాత ఆమె ఇంటిముందాగింది.
ఆమె బాబాయి ఆత్రుతగా ఎదురుచూస్తూన్నాడామే కోసం.
"వీరే మా బాబాయిగారు. పేరు విశ్వేశ్వర్రావ్. ఈయనే బాబాయ్ సృజన్ అని చెప్పాను కదా"
"నమస్కారమండీ" అన్నాడు సృజన్.
"నమస్తే బాబూ! అన్నీ సవ్యంగా జరిగిపోయాయా?"
"అయిందండీ! భారతిగారుండబట్టి మా వదినెను చుసుకోగాలిగారు -- లేకపోతే చాలా ఇబ్బందయ్యేది నాకు."
"దాన్దేముందిలే! ఒకరినొకరు సహాయం చేసుకోకపోతే ఎలా?"
"వస్తానండీ! అంటూ భారతి వేపు చూశాడతను. "రేపు సాయంత్రం మిమ్మల్ని కలుసుకుని మిగతా విషయాలన్నీ చెప్తానండీ మళ్ళీ." అన్నాడు అటో ఎక్కుతూ.
భారతీ చప్పున తన బాగ్ లోనుంచి ఓ కాగితం తీసి దానిమీద తన ఆఫీస్ అడ్రసు, ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది.
"అవసరమయితే నాకు ఫోన్ చేయవచ్చు మీరు-----" అందామె.
"ఓ.కే. థాంక్యూ"
అటో బయలుదేరింది. హోటల్ గదికి చెరుకున్నడతను. కౌంటర్ దగ్గర మరో నలుగురయిదుగురు కూర్చుని బ్రాకెట్ చార్ట్ చూస్తున్నారు.
సృజన్ తాళం చెవి అడిగి తీసుకుని తన గదిలోకి కెళ్ళాడు.
మర్నాడు ఉదయం తను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. ఉదయమే లేచి "హోటల్ సీషోర్" అనే హోటల్ కెళ్తే అన్నయ్య గురించి కొన్ని వివరాలు తెలియవచ్చు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కెళ్ళి రాహితో మాట్లాడాలి. అన్నయ్యను చంపినవారిని పోలీసులు పట్టుకునే వరకూ తనకు మనశ్శాంతి ఉండదు.
ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదతనికి. ఓ పక్క ఆకలి . మరో పక్క నిద్ర ముంచుకొస్తోంది. అయినా నిద్రపట్టడం లేదు. ముందెన్నడూ అనుభవించని విచిత్ర పరిస్థితి. ఆలోచనలు కలగాపులగంగా అలుముకుంటున్నాయ్.
ఇకముందు తన కుటుంబ భవిష్యత్తేమిటి? వదిననూ, పిల్లలనూ తను ఎలా పోషించటం? చదువు కొనసాగించటం ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాని పని. ఏదొక ఉద్యోగం సంపాదించుకుంటే గాని ఇల్లు గడవదు. ఇంటి మీద అప్పు సంగతీ ఇతర అప్పుల సంగతీ చూడాలి ముందు. వీలయినన్నీ బాకీలు తీర్చేయాలి. అన్నయ్య అప్పుల బాధపడలేక చచ్చిపోయాడని గానీ, అప్పులు ఎగ్గోట్టాడు అన్న పేరు గానీ పొందటం తనకిష్టం లేదు.
తెల్లవారుజామున నాలుగ్గంటలవరకూ మంచం మీద అటూ ఇటూ పోర్లుతూనే ఉన్నాడతను. దోమలు, నల్లులు విపరీతంగా ఉన్నాయ్. పక్కగదిలోనుంచి ఉండుండి నవ్వులు వినబడుతున్నాయ్. ఎవరో పెకాడుతున్నారని తెలిసిపోతోంది.
నాలుగ్గంటల తర్వాత నిద్రపట్టిందతనికి. తిరిగి మెలకువ వచ్చే సరికి ఆరయిపోయింది. త్వరత్వరగా ముఖం కడుక్కుని బస్ స్టాప్ కెళ్ళి నిలబడ్డాడు.