Previous Page Next Page 
షా పేజి 23

 

    "అయినా మాలాంటి మధ్యతరగతి మనుషులకు మీరు ఉచితంగా సేవ చేయటం కంటే మా దగ్గర డబ్బు తీసుకుని అది నిరుపేదల కోసం ఉపయోగిస్తే బావుంటుందని నా అభిప్రాయమండీ!"
    "అభిప్రాయం మంచిదే-----కానీ మాకు భగవంతుడి దయ వల్ల డబ్బుకి కొరతలేదు. కోటీశ్వరులైన శ్రీకాంత్ వర్మగారి ఆధ్వర్యంలోనే ఇది స్థాపించటం జరిగినది --"
    "క్షమించండి! ఇలా ఒక సేవాసమితి అంత్యకియలు జరిపించడంలో మాకు ఆత్మసంతృప్తి వుండదు. మా అన్నయ్యకు ఆ మాత్రం కూడా చేయలేదే అన్న భావం జీవితాంతం మమ్మల్ని బాధిస్తూనే వుంటుంది. ఈ ఊరు, కొత్తదవటం , ఈ ఏర్పాట్లలకు కావలసిన వ్యవధి లేక పోవటం వల్ల పోలీస్ ఇన్ స్పెక్టర్ రహి గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. అయన మిమ్మల్ని పిలిపించాడు. అంచేత మీరు మరోలా భావించకుండా దయ చేసి అయిన ఖర్చులు తీసుకుంటే మా అందరికి మేలు చేసిన వారవుతారు--------" బ్రతిమాలుతున్న ధోరణిలో చెప్పాడు సృజన్.
    అతనింక మాట్లాడలేకపోయాడు.
    "సరే! మీరింతగా అడుగుతున్నారు కాబట్టి తీసుకుంటాము. ఏడు వందల యాభయ్ రూపాయలివండి సరిపోతుంది.'
    సృజన్ అతనికి డబ్బు లెక్కపెట్టి ఇచ్చేశాడు.
    హోటల్ గదికి చేరుకునే సరికి సుభద్ర స్పృహలేకుండా పడుకుని వుంది. పిల్లలు భారతి పక్కనే కుర్చుని ఉన్నారు.
    "పిల్లలిద్దరికి భోజనం తెచ్చిస్తే ------తినిపిస్తాను! పాపం వాళ్ళకూ నిన్నటినుంచీ కడుపులో ఏమీ లేదుట ....." అంది భారతి.
    "నేను ఏర్పాట్లు చేస్తాన్రా!" అంటూ స్వరూప్ వెళ్ళి గంట సేపటి తర్వాత ఓ కారియర్ భోజనం తీసుకొచ్చాడు. పిల్లలకు పెట్టాక తరువాత అందరికీ విస్తళ్ళల్లో తలోకొంత భోజనం వడ్డించింది భారతి......సుభద్ర తినడానికి ఇష్టపడలేదు గానీ అందరూ బ్రతిమాలటం వల్ల నాలుగు మెతుకులు తింది.
    "తరువాతి కార్యక్రమం ఏమిటి?" అడిగింది భారతి.
    "వదినా పిల్లల్ని రాత్రి బస్ కి పంపించివేస్తాను........" అన్నాడు సృజన్ , భారతి ఆశ్చర్యపోయింది.
    "మరి మీరు వెళ్ళరు?"
    "ఊహు! నేను కొద్దిరోజులు ఇక్కడే వుంటాను భారతీ!"
    "ఎందుకు?" విస్మయంతో అడిగిందామె.
    "పోలీస్ స్టేషన్ లో కొంతపని ఉంది."
    "కానీ ఇక్కడ ఎలా వుంటావురా! ఉండటానికి ఇల్లు లేదు - నీ దగ్గిర డబ్బు కూడా లేదు--"
    "ఫరవాలేదు భారతిగారు ఇచ్చిన డబ్బు ఇంకా కొంత నాదగ్గిర వుంది. అది సరిపెట్టుకుంటాను."
    "మరి అక్కడ వదిన పిల్లల సంగతేమిట్రా? వాళ్ళకు జరుగుబాటేలా! వాళ్ళను వారం పదిరోజులు వరకూ అంటే ఎలాగోలా తిప్పలు పడి మేము చూడగలం. ఆ తరువాత ----అంటూ తన సందేహం వెలిబుచ్చాడు రంగా.
    "నేనిక్కడికి వచ్చేటప్పుడు నా ఉంగరం ఒకటి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను కదా! మీరిద్దరూ ఆ సేఠ్ దగ్గిరకెళ్ళి అది అమ్మేసి మిగతా డబ్బు యెంత వస్తే అంత తీసుకుని వాడుతుండండి. అప్పటికి నేను వచ్చేస్తాను- తరువాత వీలయితే ఇల్లు అమ్మటానికి ప్రయత్నం చేద్దాం."
    స్వరూప్ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయ్.
    "అది కూడా సాధ్యం కాదురా! ఇల్లు అప్పటికే తాకట్టు పెట్టి చాలా డబ్బు తీసుకున్నారట మీ అన్నయ్య."
    ఆ మాటతో సృజన్ కొంచెం కంగారుపడ్డాడు. అంతవరకూ తను ఆ ఇంటిమీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఆ ఇల్లు అమ్మి వచ్చే డబ్బుతో వదినా పిల్లలకు కొంత కాలం వరకయినా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూచుకోగలననుకున్నాడు! కానీ ఇప్పుడీ వార్తా అశనిపాతంలా తగిలింది.
    "అలాగా! అయితే సరే! ఇంకేదయినా మార్గం ఆలోచిద్దాం లే" అన్నాడు సుభద్ర కలత చెందుతుందేమో నన్న భయంతో.
    రాత్రి ఎనిమిది గంటలకల్లా బస్ స్టాండ్ కి చేరుకున్నరందరూ.
    "బాబాయ్ నువ్వెప్పుడోస్తున్నావ్ బాబాయ్ మనింటికి?" అడిగాడు శంకూ.
    "ఇప్పుడే కాదురా! ఓ పది రోజులయాక వచ్చేస్తాను."
    "అంత వరకూ ఇక్కడేం చేస్తావ్ బాబాయ్?"
    "కొంచెం పనులున్నాయమ్మా! అన్నీ చూచుకుని వచ్చేస్తాను."
    "బాబాయ్! నేనూ నీ దగ్గిరే వుంటాను బాబాయ్" అంది సీత.
    "ఛీ" బాబాయ్ దగ్గిర అసలే డబ్బు లేదంటుంటే నువ్వు ఉండిపోతే ఎలా?" కోప్పడ్డాడు శంకు. సీతకు కోపం వచ్చి బుంగమూతి పెట్టింది.
    "నాకేం - నువ్ రాకపోతే నేనూ వెళ్ళను" అంది మొండికేస్తూ.
    సృజన్ ఆమెను దగ్గిరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు.
    "అలా అనకూడదమ్మా! మంచి పాపలు అలా ఎక్కడయినా మారాం చేస్తారా?"
    బస్ ప్లాట్ ఫారం దగ్గిరకు వచ్చి ఆగింది...........అందరూ సీట్లలో కూర్చున్నారు.
    "పోనీ నేను కూడా నీకు తోడుగా ఉంటాన్రా" అడిగాడు స్వరూప్.
    "నాకేం ఫర్లేదు రా! వదినకే మీ సహాయం కావాలి! ఎప్పుడూ మీ ఇద్దరిలో ఎవరొకరు ఆమెకు తోడుండాలి. లేకపోతె ఆమె ఈ దుఃఖంలో ఏం అఘాయిత్యం చేసుకున్నా చేసుకోవచ్చు.'
    ఆ మాటతో రంగా, స్వరూప్ ఇద్దరూ కలవరపడ్డారు.

 Previous Page Next Page