Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 23


    
    కరిగిపోయింది శారద.
    
    "నాకు ఒంట్లో అదోలా వుండి వూరికే చిరాకు వచ్చేస్తూంది- ఏమనుకోకండి! అన్నం వడ్డించనా? మిరప్పళ్ళ కారం నూరాను" అంది కన్నీళ్ళతో.
    
    "నువ్వు అట్లా కూర్చో, శారదా! నేను వడ్డిస్తాలే" అన్నాడు శంకర్రావు. శారద కాస్త మంచిగా మాట్లాడగానే మళ్ళీ ఉత్సాహం పుంజుకున్నాడు.
    
    "చూశావా! ఆ బాబాగారు చెప్పింది కరెక్టే అవుతూంది!"
    
    అసహ్యంగా మొహం పక్కకి తిప్పుకుంది శారద. అది సిగ్గనుకున్నాడు శంకర్రావు.
    
    "ఏదీ! గుడి కెళ్ళి కొబ్బరికాయ కొట్టి వద్దాం!" అన్నాడు.
    
    "వద్దండీ" అంది భయంగా. తను చనిపోదామని నిశ్చయించుకున్న రోజున దేముడికి ఆఖరిసారిగా నమస్కారం పెట్టి ప్రార్ధన చేసుకుంది. ఆ మరునాటి నుంచీ దేముడి పటం వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలలేదు తనకి. ఈ నెల రోజులనుంచీ దీపారాధనకూడా చేయలేదు. 'తనకా అర్హత పోయిందేమో' అన్న జంకేర్పడింది.
    
    ఇవాళ నేరుగా గుడికే వెళ్లి పోవడమా!
    
    అమ్మో!
    
    శంకర్రావు వినలేదు. బలవంతాన బయలుదేరదీశాడు. ఫలాని గుడి అని పట్టింపు లేదు అతనికి. ఎందుకంటే పిల్లల కోసం అందరు దేముళ్ళకి మొక్కి వున్నాడతను. వాళ్ళింటికి దగ్గర్లో ఉన్నది మహంకాళీ దేవాలయం. సికిందరాబాద్, హైదరాబాద్ లలో అది చాలా ప్రసిద్ది పొందిన దేవాలయం. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది.
    
    ఆ గుడి కెళ్ళారు. అమ్మవారి ముందు చేతులు జోడించి, భక్తితో తల వంచాడు శంకర్రావు.
    
    అపరాధం చేసిన దానిలా చేతులు కట్టుకుని తల వంచింది శారద.
    
    శంకర్రావు గంట మోగించాడు. శారద గుండెలు గుబగుబలాడాయి. ఇంతమంది జనంలో అమ్మవారు తనని గమనించలేదేమో అని ఆశపడింది తను. ఈయన కాలింగ్ బెల్ లా గంట మోగించి మరీ తమ రాకని తెలియజేస్తున్నారు.
    
    భయంగా కళ్ళు ఎత్తి చూసింది శారద.
    
    అమ్మవారు ఉగ్రంగా కనబడుతూంది. నోట్లో నాలుక బయట పెట్టి తీక్షణంగా చూస్తూంది.- 'చెడిపోయిన దానివి ఇంకెన్నాళ్ళు బతకాలనుకుంటున్నావ్?' అని గద్దిస్తున్నట్లు అనిపిస్తుంది.
    
    బెదిరిపోయింది శారద. జ్వరమొచ్చినట్లు ఒళ్ళంతా వెచ్చబడింది.
    
    'అమ్మా! నన్ను క్షమించు, ఇంక కొద్దిగా గడువివ్వు అమాయకుడైన నా భర్తమీద మమకారం తెంపేసుకుని, గుండె రాయి చేసుకుని, చనిపోయే తెగువ, నాకు ప్రసాదించు!' అని మవునంగానే ప్రార్దించింది శారద.
    
    గుళ్ళో నుంచి బయటికొచ్చారు.
    
    ఈయన ఇలా మంచివారు కాకుండా కర్కోటకుడయి వుంటే తన చావు ఎంత సులభమై ఉండేది! నిశ్చింతగా చనిపోయేది తను!
    
    అలా కాకుండా, అమాయకత్వం, మంచితనం, బోళాతనం కలిసిన పసి పాపాయిలాంటి మనిషి తన భర్త కావడం వల్ల బంధాలు తెంచుకోలేక సతమతమై పోతూంది తను.
    
    చావాలా? బతకాలా?
    
    అనుక్షణం తనని చంపేస్తున్న ప్రశ్న ఇది.
    
    "కాస్సేపు క్లాక్ టవర్ పార్కులో కూర్చుని వెళదాం!" అన్నాడు శంకర్రావు. మాట్లాడకుండా వెంట నడిచింది శారద.    

 

    వాతావరణం చల్లగా వుంది. అప్పుడే పార్కులో లైట్లు వెలిగాయి. వెలుగూ, నీడల మధ్య పిల్లలు ఆడుకుంటున్నారు.
    
    ఇద్దరూ గడ్డిలో కూర్చున్నారు.
    
    "హాయిగా వుంది కదూ? అన్నాడు శంకర్రావు.
    
    "వూ!" అంది శారద ముక్త సరిగా.
    
    కాకులూ, పిట్టలూ అరుస్తూ, అక్కడి చెట్లమీద వున్న గూళ్ళకి చేరుతున్నాయి.
    
    "ఎన్ని వందల పక్షులున్నాయో! అన్నీ ఒక్కసారిగా అరుస్తూంటే తమాషాగా వుంది కదూ?" అన్నాడు.
    
    "వూ" అంది శారద, ఎడమ అరచేత్తో కళ్ళు నులుముకుంటూ. రాత్రంతా తనకి నిద్ర లేదు. కళ్ళు మండుతున్నాయి. ఒకటే ఆలోచన -
    
    చావాలా, బ్రతకాలా? బతికి, ఆ సుధీర్ తాలూకు కొడుకునో, కూతుర్నో తను కనాలా? సాకాలా? ఛీ! జుగుప్సతో వళ్ళు జలదరించింది.
    
    "చలిగా వుంది కదూ! వణుకుతున్నావే!" అన్నాడు.
    
    "అహ లేదు!"
    
    అంతలోనే మళ్ళీ అనుమానం! అసలు పుట్టబోయేది సుధీర్ బిడ్డా? ఈయన బిడ్డా? సుధీర్ బిడ్డే అయివుండాలి.
    
    లేకపోతే అయిదేళ్ళ నుంచీ పిల్లల్లేని తమకు హఠాత్తుగా పిల్లలెలా పుడతారు?
    
    "మనకిప్పుడు పిల్లలు పుడతారంటే దేముడు దయతలచడం ఒక కారణం!" అన్నాడు శంకర్రావు, ఆమె మనసులో భావాలు చదివినట్లు. "రెండోది-పిల్లల కోసం మనం పడిన ఆరాటం చూసి శశివదన ఇచ్చిన ట్రీట్ మెంటూ! ఈ రెండింటి ఫలితమే నువ్వు నెల తప్పడం! అవునా?"

 Previous Page Next Page