Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 23


    
    "అసలు భార్య భర్తల మధ్య గొడవలు దేనికి? ఎవరో ఒకరు రాజీపడితే పోతుంది కదా?"
    
    "రాజీపడటం మాటల్లో చెప్పినంత తేలిక కాదు గనుక."
    
    చిన్మయి ఆలోచిస్తోంది. రాజీవ్ ను చూడకపోతే ఒక్కరోజైనా తనకి గడవదే. అతనెదురుగా వుంటే ఎంతపనిలో వున్నా ఒక్క గంటయినా మాట్లాడకుండా వుండలేదే. మరి కొంతమంది తగాదాలతో, విద్వేషాలతో కాలాన్ని విషపూరితం చేసుకుంటారెందుకని?
    
    "నేనుకూడా నీతో గొడవ పెట్టుకుందామనుకుంటున్నాను."
    
    చిన్మయి వులిక్కిపడింది.
    
    అతనివైపు చూసింది. చీకట్లో అతని హావభావాలు కనబడలేదు.
    
    "అంతేకాదు నీకు దూరంగా కూడా వుందామనుకుంటున్నాను."
    
    ఆమె వంగిపోయినట్లయి స్టీరింగ్ మీద వున్న అతని చెయ్యిమీద తన చేతిని వేసింది.
    
    "అలా అనకండి. హాస్యానికైనా మనిద్దరిమధ్యా ఎప్పుడూ ఎలాంటి గొడవలూ వద్దు" ఆమెగొంతులో కూడా చిన్న వణుకు.
    
    "నిజం ఒక ఏడాదిపాటు నీకు దూరంగా వుందామనుకుంటున్నాను."
    
    "ఏమిటండీ మీరు?"
    
    "ట్రైనింగ్ కోసమని మా ఆఫీసువాళ్ళు నన్ను ఓ ఏడాదిపాటు స్టేట్స్ కి పంపిస్తున్నారు చిన్మయీ! నిన్నట్నుంచీ యీ సంగతి నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను."
    
    ఆమె గుండె గుభేలుమంది ఏడాదా? పురిటికి పుట్టింటికి వెళ్లినప్పుడు మూడు నాలుగు నెలలు ఎడమగా వుండటానికి అతడు పదుహేను రోజులకో సారి వస్తూనే వున్నా మూడురోజులకోసారి ఉత్తరాలు రాసుకుంటూనే వున్నా ఆ ఎడబాటు భరించడం దుస్సహంగా వుండేది.
    
    "తప్పదా?" అంది దుఃఖాన్ని అణుచుకుంటూ.
    
    "ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు చిన్మయీ. ఒక్క ఏడాది అక్కడ వుండి ఎడ్వాన్స్ డ్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని వస్తే నా ఉద్యోగంలో రీజనల్ లెవల్ లో పైకి వెళ్ళిపోతాను. ఈ ఛాన్స్ వదలుకుంటే మన భవిష్యత్తుని మనమే కాలదన్నుకున్నట్లుంటుంది."
    
    చిన్మయి మౌనంగా వుండిపోయింది. స్టీరింగ్ మీదనుంచి చేతిని తీసేసింది.
    
    అతనామె భుజంమీద చెయ్యివేసి సాధ్యమైనంత దగ్గరగా లాక్కొన్నాడు. ఒళ్ళో వున్న కిరణ్మయి కొంచెం కదిలింది.
    
    "చిన్మయీ! కోపమా?"    

    "లేదండి."
    
    "నాకూ ఎంతో బాధగానే వుంది. అందుకనే నిన్నట్నించీ ఎలా చెప్పాలా అని తటపటాయిస్తున్నాను. కాని జీవితంలో.... ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి తప్పవు చిన్మయీ!"
    
    "నేను అర్ధం చేసుకోగలనండీ."
    
    అతని భుజంమీద తలవాల్చి కళ్ళు మూసుకుంది.
    
    "ఎప్పుడు మీరు వెళ్ళేది?"
    
    "బహుశా ఒకటి రెండునెలల్లోనే కావచ్చు."
    
    ఆమె ఏమీ మాట్లాడలేదు. కారు యింటికి చేరేవరకూ అలా భుజంమీద తలవాల్చి పడుకునే వుంది.
    
    రాజీవ్ అమెరికా వెళ్ళేరోజు దగ్గరకు వచ్చేస్తోంది.
    
    చిన్మయికి రోజురోజుకూ గుండెల్లో బరువెక్కువైపోతోంది.
    
    చిన్నారి కిరణ్మయికి కూడా తండ్రి దూరదేశం వెళ్లిపోతున్నాడని అర్ధమయింది. ఇప్పుడప్పుడే తిరిగిరాడని కూడా తెలుసుకుంది. బిక్కమొహం వేసుకొని "డాడీ! డాడీ!" అంటూ వీలు చిక్కినప్పుడల్లా కూడా కూడా తిరుగుతోంది.
    
    "చిన్మయీ! సంవత్సరంపాటు నువ్విక్కడ వంటరిగా వుండటం కష్టమని పిస్తుంది. నువ్వు మీ ఇంట్లోగాని, మా ఇంట్లోగాని వుంటే మంచిదనిపిస్తుంది" అన్నాడు రాజీవ్?
    
    చిన్మయిని ఈ సమస్య వేధిస్తూనే వుంది. అత్తగారింట్లోగాని, పుట్టింట్లోగాని ఎక్కడ వుండటానికైనా తనకు అభ్యంతరం లేదు. అత్తగారంటే ఆమెకు విపరీతమైన గౌరవముంది. తల్లంటే ఎనలేని ప్రేమవుంది. కాని ఈ అయిదేళ్ళలో ఆమె ఓ విశిష్టమైన వ్యక్తిత్వం, ప్రత్యేకామిన మనస్తత్వం అలవాటు చేసుకుంది. తాను సొంత ఇంట్లో తప్ప ఎక్కడా యిమడలేదన్న భావన ఏర్పడిపోయింది. అది గర్వంకాదు. స్వభావం. తల్లిదగ్గరుంటే ఫర్వాలేదు. అత్తగారు తప్పకుండా అసంతృప్తి చెందుతుంది. అంతేగాకుండా కిరణ్మయి చదువు ఓ ముఖ్యమైన సమస్య. ఇప్పుడు చదువుకుంటున్న స్కూల్లో విద్యావిధానం ఆమెకెంతో నచ్చింది. ఇప్పుడు ఇక్కడ్నుంచి మార్పించేసి ఆ వూళ్ళకు తీసుకెళ్ళి వేరే స్కూళ్ళల్లో చేర్పించటం....అందులో ఇప్పుడు ఎకడమిక్ ఇయర్ మధ్యలో వుంది. ఇప్పుడెక్కడా చేర్చుకోరు అనవసరంగా ఓ ఏడాదిపాటు చదువు పాడవుతుంది. చిన్మయి దీర్ఘంగా ఆలోచించి మద్రాసునుంచి కదలడానికి ఇష్టపడలేదు.
    
    రాజీవ్ తల్లి, అత్తగారికీ ఉత్తరాలు రాశాడు. తాను ఏడాదిపాటూ యిక్కడ వుండటం లేదు కాబట్టి వాళ్ళిక్కడకు వచ్చివుంటే సంతోషిస్తానని.
    
    రాజీవ్ తల్లి జవాబు రాసింది. తన ఆరోగ్యం అంతంతమాత్రంగా వున్నదనీ, కోడలు అక్కడకు వచ్చివుంటే సంతోషిస్తానని.
    
    చిన్మయి తల్లి విజయలక్ష్మిగారు కూతురికి రాసింది. తాను అక్కడకు వచ్చివుంటే ఆమెతండ్రికి చేసేవారు లేరనీ రాజీవ్ వచ్చేదాకా చిన్మయినే వచ్చి పుట్టింట్లో వుండమనీ..."
    
    అంతకాలంబాటూ వచ్చి వాళ్ళిక్కడ వుండడం సాధ్యంకాదని రాజీవ్ కు తెలుసు, చిన్మయికి తెలుసు. అయినా మర్యాదకోసం రాశాడు.
    
                                                                 * * *
    
    చిన్మయి మామీ దగ్గరకెళ్ళి ఏడ్చేసింది.
    
    "భార్యా భర్తా అన్నాక ఉద్యోగరీత్యాగాని, యితర పరిస్థితులవల్ల కని సుదీర్ఘమైన జీవితకాలంలో మధ్య మధ్య ఈ ఎడబాటు తప్పదు. వంటరితనం అనుభవించకా తప్పదు. మనిషి వంటరితనంలోని బాధ తెలియక దాన్ని కోరుకుంటూ వుంటాడు. ఈ యాతన వుండకుండా చేయటానికే యిదివరకు జాయింట్ ఫ్యామిలీస్ వుండేవి. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీస్ అప్పుడు రక్షణగా వుండేవి. ఇప్పుడు పెద్దలకాలం ఓ చాదస్తంగా వాళ్ళతో కలిసి జీవించటం ఓ యిరకాటం గా భావించే స్థితికి వచ్చేశారు. ఈ మార్పు చూసి పెద్దవాళ్ళు కూడా వీళ్ళతో కలసి వుండటానికి యిచ్చగించటంలేదు" అంది వీణాంబగారు.

 Previous Page Next Page