Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 23


    
    జనం సెల్ దగ్గరగా వచ్చి లోపలికి చూస్తున్నారు.
    204 నీళ్ళ గ్లాసు తీసుకొచ్చి అందించబోయాడు ఇన్స్ పెక్టర్ కి
    కోపంగా చూశాడు అవధాని.
    "నీళ్లు నేను తాగడానికి కాదు, ఇతని మొహాన చల్లడానికి చల్లు......"
     కానిస్టేబుల్ 204 గ్లాసులో నీళ్లని అభినయ్ మొహం మీద చిలకరించాడు.
    రమాదేవి సెల్ లోపలకి వచ్చింది.
    అభినయ్ మెల్లగా కళ్ళు విప్పాడు!
    అభినయ్ ప్రాణాలతో వున్నాడు.
    "హమ్మయ్య!" అనుకున్నాడు అవధాని.
    చనిపోయాడనుకున్న మనిషి తిరిగి కళ్లు తెరిచేసరికి అందరి మొహంలో ఆనందం వెలిగిపోయింది.
    అభినయ్ కళ్లకి ముందుగా రమాదేవి కనబడింది.
    అతని కళ్లు మెరిశాయి.
    "నా కోసం మీరొచ్చారా మేడం?" ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లుగా వున్నాయా మాటలు జాలిగా వుంది గొంతు.
    అతను సజీవుడుగా వున్నాడని తెలిసిన మరుక్షణం ఆమె గుండెల మీదనుంచి పెద్ద బరువు దిగిపోయిన అనుభూతి కలిగినా అతనన్న మాటకి ఆమె కళ్ళల్లో నీరు సుడులు తిరిగింది.
    "అభీ!" అతని తలపైన చేతితో నిమిరింది రమాదేవి.
    అప్పటికే సిద్దార్ద అభినయ్ తలని తన ఒడిలో పెట్టుకున్నాడు.
    పూర్ణ టీ తీసుకొచ్చాడు.
    రమాదేవి టీ కప్పుని అందుకని  కప్పులోంచి సాసర్లో పోసి  మెల్లగా తాగించసాగింది.
    అదంతా చూస్తుంటే గీతకి అతనిపట్ల ఆరాధనాభావం  కలగసాగింది కొన్ని గంటల క్రితం..... అతను, తన పెదవులను చుంబించిన ఆ క్షణం గుర్తుకొచ్చింది.
    ఇప్పుడది....ఆమెకెంతో మధురమైన క్షణంగా అనిపించడం మొదలుపెట్టింది.
     అంతేకాదు..... నిజంగా అతనికి అపకారం జరిగివుంటే అందరి కంటే తనే ఎక్కువగా బాధపడేది!
     అవునా?
    తనను తానే ప్రశ్నించుకుంది గీత.
    కళ్లెదుట వున్న  అతడి పరిస్థితిని మరచిపోయి ఊహల్లోకి వెళ్లిపోయింది గీత.
    ఇప్పుడతను అడిగితే తనే ఇస్తుంది ఎన్ని కావాలంటే  అన్ని..... ఏం కావాలంటే అది!
     ఆమె చెక్కిళ్ళు ఎర్రబడిపోతున్నాయి.
    కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి.
    సెల్ పక్కనే  నించుని అతనికేసే చూస్తోంది గీత.
    "మీరతన్ని తీసుకెళ్లచ్చు" అన్నాడు అవధాని.
    వాళ్ళు అక్కడనుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేకపోతే వున్నకొద్దీ జనం పోగవుతున్నారు.
    ఓ పక్క లెక్చరర్ రమాదేవి డి. జి. పి. కి, హోం మినిష్టర్ గారికీ బంధువునంటోంది. ఈ గొడవను మనసులో పెట్టుకుని తననెక్కడ ముంచిపారేస్తుందోనన్న భయం ఓ పక్క పట్టుకొంది అవధానికి!
    అభినయ్ లేచి కూర్చోబోయాడు.
    కానీ అతని ప్రయత్నం విఫలమైంది చిన్నగా మూలిగి తిరిగి సిద్దార్ద వడిలోకి జారిపోయాడు.
     అది చూసి తిరిగి  రెచ్చిపోయాడు పూర్ణ!
    "ఇన్స్ పెక్టర్.....! ఒకసారి చూడు... పశువుకి, మనిషికీ తేడా వుంటుంది అయినా పశువుని మనిషనుకొని ఎవరూ కొట్టరు... కానీ మనిషిని పశువుగా  ఎంచి కొట్టడం మీ డిపార్ట్ మెంట్ కే చేతనవును. నీ మీద క్రిమినల్ చర్య తీసుకుని నిన్ను శంకరగిరి మాన్యాలకి పంపించందే నిద్రపోను" అన్నాడు పూర్ణ.
    అవధాని ఏదో మాట్లాడబోయాడు.
    కానీ ఈలోగా "పూర్ణా" అని పిలిచాడు అభినయ్.
    అతను చిన్నగా నవ్వాడు.
    ఆ నవ్వు అతని పెదాల మీద తేలిపోయింది.
     "ఒరే! నీకింతకు మునుపే చెప్పాను. పోలీసులు  మనకి  శతృవులు కారు.
    శాంతిభద్రతలు కాపాడ్డానికి, నేరాలను అరికట్టడానికీ వాళ్లు ఖాకీ బట్టలు వేసుకుంటారు.
    వాళ్లూ మనలాంటి మనుషులే!వాళ్లలోనూ మానవత్వం వుంది! సున్నితమయిన మనసూ వుంటుంది!
    కానీ ఆ మానవత్వాన్ని కానీ,  సునిశితమైన మనసును కానీ బయటికి క్రిమినల్స్ కి కనబడనివ్వకూడదు. పోలీసుల్లో మంచితనం బయటికి కనబడితే నేరస్థులు విజృంభిస్తారు.
    అందుకే ఆ మంచితనాన్నీ, మంచి మనసునీ ఖాకీ బట్టల చాటున బంధించి, చట్టాన్ని అమలుపరచటానికి  చేసే ప్రయత్నంలో ఎప్పుడయినా ఒకటీ అరా పొరపాట్లు జరగవచ్చు. అంతమాత్రాన ఆ డిపార్టుమెంట్ నే మనం ఒక శతృవుగా భావించడం చాలా పొరపాటురా పూర్ణా!
     ఒక్కసారి నువ్వే ఆలోచించు.
    నువ్వే ఇన్స్ పెక్టర్ స్థానంలో వుంటే ఏం చేసేవాడివి...? ఆఖరికి నేనైనా అంతే!
    తప్పదురా.... ఇన్స్ పెక్టర్ గారికి క్షమాపణ చెప్పు" అన్నాడతను నీరసంగా.
    అతని మాటలకు అందరూ చకితులయిపోయారు.
    ఇన్స్ పెక్టర్ అవధాని అతని వ్యక్తిత్వాన్ని హిమాలయ శిఖరం స్థాయిలో వూహించుకుంటున్నాడు.
    తనతన్ని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడే తనెంత పొలైట్ గా లొంగిపోయాడో గుర్తుకొచ్చి అతన్ని కొట్టించడం అనే దారుణానికి దిగి తనెంత తప్పు చేసిందీ అర్దమైంది.
    "సారీ సర్!" అన్నాడు పూర్ణ మెల్లగా.
    ఇన్స్ పెక్టర్ కిప్పుడు చాలా ఆనందంగా వుంది.
    తను రొంపిలోకి దిగిపోయానని, జనం తనను విడిచిపెట్టరనీ ఊహించుకున్న ఇన్స్ పెక్టర్ మరో కోణంలోంచి అభినయ్ తనని, తన డిపార్ట్ మెంట్ గురించీ వివరణ యివ్వటంతో పొంగిపోయాడు.
    అభినయ్ కి లేవనెత్తి బయటకి తీసుకెళుతున్నారు జనం బిలబిలమని స్టేషన్ బయటకి నడుస్తుంటే ఊపిరి పీల్చుకుని చివరగా బయటకి వెళుతున్న గీతని పిలిచాడు అవధాని.
    "మిస్ గీతా! నిజం చెప్పు అతను నిన్ను..."
    గీత నవ్వింది.
    "దటీజ్ పర్సనల్!" అని బయటకి నడిచింది.
    ఇన్స్ పెక్టర్ మరోసారి నివ్వెరపోయాడు.
    "ఇప్పుడు బాబుని ఎక్కడకి తీసుకెళుతున్నారు?" అడిగింది పువ్వుల రత్తమ్మ.
     "నా రూంకి" చెప్పాడు సిద్దార్ద.
    "వద్దు. నేను ఇంటికి వెళ్ళిపోతాను" మెల్లగా అన్నాడు అభినయ్.

 Previous Page Next Page