అర్ధమైపోయింది ఆశ్రితకి... సైకలాజికల్ గా కుదిపి సులభంగా జవాబు రాబట్టగలిగింది. అమర్ శ్వేత దూకుడుకి తట్టుకోలేక ఏకంగా కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు.
రాజేష్ కి జరిగింది తెలుసు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.
బహుశా రాజేష్ కూడా అప్పుడు ఇలాగే ఆలోచించి వుంటాడు కాని ఇంత అనర్ధాన్ని ఎక్స్ పెక్ట్ చేసి వుండడు.
ఎందుకో వున్నట్టుండీ వశిష్ట అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి.
రాజేష్ మీద ఈవ్ టీజింగ్ కేసులున్నాయట...
గడ్డిపరకలా చిరుగాలి అలకి సైతం కదలాడే రాజేష్ అమ్మాయిల వెంటపడి అదేపనిగా అందర్నీ హింసించేవాడట...
ఆత్మన్యూనతాభావాన్ని ఆయువుగా మార్చుకుని ఎంతో కష్టపడితే తప్ప ఎదగటం కష్టమని సుమారు రెండు దశాబ్దాల వయసులోనే ఆశావాదపు కుంకుమపూలని ఆలోచనల లక్ష్యాలకి అర్చనగా మార్చుకున్న ఓ పసికందు జులాయి వెధవలా అమ్మాయిల్ని వేధించడమేగాక పోలీస్ రికార్డ్స్ దాకా వెళ్ళాడట...
ఆశ్రిత నేత్రాలు రుధిరాసురసంధ్యలా అరుణిమని పుంజుకుంటున్న సమయాన చూసింది సమీపంలో ఓ ఖరీదైన కారు ఆగటాన్ని.
"శ్వే....త" కారులోంచి దిగుతున్న అమ్మాయి గురించి గుసగుసల్లా మాట్లాడుతూ విద్యార్ధులు కంగారుగా కదలడం ప్రారంభించారు.
కూలింగ్ గ్లాసెస్ ని తీసి ఓరకంట చూసింది శ్వేత.
ముందుకి రెండడుగులు వేసింది గర్వంగా అది గర్వం కూడా కాదు నాకేం తక్కువ భూగోళాన్నే కాదు కావాలనుకుంటే ఖగోళాన్ని కాల్చి విడిచిపెట్టగలనన్న అహం. సరదాపుడితే సముద్రాన్ని కూడా కాలేజీకి రప్పించి ఉప్పెనని సృష్టించగలనన్నట్టుగా నడుస్తూంది...
"శ్వేతా..."
పిలిచింది ఆశ్రిత అసంకల్పితంగా.
"ఎస్" ఆగింది శ్వేత హుందాగా.
అంతవరకూ ఆశ్రిత చుట్టూ గుమికూడిన స్టూడెంట్స్ క్లాస్ రూముల వైపు నడుస్తున్నారు అనవసరమైన రాద్దాంతానికి తాము సాక్షులం కాలేమన్నట్టుగా.
"మీతో మాట్లాడాలి" అంది ఆశ్రిత సాధ్యమయినంత తగ్గు స్వరములో....
"ఏ విషయంలో."
శ్వేత దురుసుగా మాట్లాడినా కోపగించుకోకూడదు అనుకుంది ఆశ్రిత. శ్వేతని కలిసి మాట్లాడాలని ఆశ్రితకీ లేదు ఆ క్షణందాకా కానీ హఠాత్తుగా కనిపించేసరికి ఉత్సుకతని ఆపుకోలేకపోయింది.
అసలు ఆమెను నిలదీయడం ఆశ్రిత అభిమతం కాదు. పోలీసులేమన్నా ఎవరి అభిప్రాయం ఎలా వున్నాకాని శ్వేత రాజేష్ వట్టి అమాయకుడని ఒక్కమాట అంటే చాలు అణువంత సంతృప్తితో వెళ్ళిపోవాలనుకుంది.
"నేను రాజేష్ అక్కని..."
శ్వేత మొహంలో ఆశ్చర్యంలేదు. "సో వాట్" అంది.
ఆమె మనసు చివుక్కుమంది.
నిన్నగాక మొన్న వెంటపడి తన ఇష్టాన్ని ప్రదర్శించిన శ్వేత రాజేష్ మరణానికి అణుమాత్రమైనా కలత చెందుతున్నట్టు లేదు.
"మీ నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను" శ్వేత తనకన్నా వయసులో చిన్నదని తెలిసినా గౌరవంగా బహువచనం ఉపయోగిస్తోంది ఆమె "ఓ అయిదు నిమిషాలు స్పేర్ చేయగలరా?"
"నాకు టైం లేదు"
"ప్లీజ్..." అర్దిస్తున్నట్టుగా చూసింది ఆశ్రిత... "జస్ట్ ఫైవ్ మినిట్స్."
ఇలా ఆమె ప్రాధేయపడడం నచ్చిందేమో "అడుగు" అంది ఏకవచనంతో
"రాజేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
"అది పోలీసుల్ని అడిగితే బెటరు."
నవ్వింది ఆమె.
"మీకున్న పరపతితో పోలీసుల్ని మీకు అనుకూలంగా పెరెడ్ చేయించగలరు శ్వేతా!"
"మరి తెలిసీ నన్ను నిలదీయడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?"
"నేను నిలదీయడం లేదు... రాజేష్ గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను."
"హీ యీజె రోగ్..."
ఆమె పిడికిలి బిగుసుకుంది.
"నా స్థాయి చూడకుండా నా వెంటపడి నన్ను ట్రేప్ చేయాలని చూసేవాడు.
"కానీ ఈ కాలేజీలో అంతా మరోలా చెప్పారు."
"వాళ్ళంతా రోగ్స్"
"వాళ్ళు రోగ్సో లేక నువ్వు ఏదన్నా చేసి నెగ్గుకు రాగలనని నిరూపించుకోవాలనుకునే రోగిష్టివో నాకు తెలియదు శ్వేతా. కానీ అంతా చెప్పింది రాజేష్ వెంటపడే దానివన్న నిజం."
"అంత ఖర్మ నాకేం పట్టింది" సీరియస్ గా అంది శ్వేత.
"గావుకేకలు పెట్టకు శ్వేతా" ఆశ్రిత హెచ్చరికలా అంది కోపాన్ని దిగమింగుకుంటూ "నువ్వేమిటీ అన్నది ఒక్కటే కాదు, రాజేష్ కోసం నువ్వెంత వెంపర్లాడేదానివో స్టూడెంట్స్ అంతా స్టేట్ మెంట్స్ లా రాసిచ్చారు. అది చాలు"
"ఏం చేస్తావే?" శ్వేత హద్దులు దాటింది ఆవేశంగా రెండడుగులు ముందుకేసి-
"ఈ సాక్ష్యాధారాలని నేను పత్రికలకి అందించగలను. నీ తండ్రి పరపతి మూలంగా నిద్రపోయినట్టు నటిస్తున్న పోలీస్ డిపార్టుమెంట్ ని మేల్కొలపగలను. కనీసం వ్యక్తిగతంగా నిన్ను చాలా నష్టానికి గురిచేయగలను" విభ్రమంగా చూస్తున్న శ్వేతతో అంది ఆశ్రిత ఆవేశంగా "నా తమ్ముడి చావు విషయంలో నీ తండ్రిని శిక్షించగలనో లేదో నాకు తెలియదు శ్వేతా! కానీ పెళ్ళి కావాల్సిన నిన్ను అన్ పాప్యులర్ చేయగలను. అది నా ఉద్దేశ్యం కాదు. అందుకే చాలా భవిష్యత్తు గల నిన్ను నేను పర్సనల్ గా అడుగుతున్నాను... ఒక్కమాట, కేవలం నా తమ్ముడు అమాయకుడన్న ఒక్కమాట నీ నోటినుంచి వింటే చాలు నా పోరాటంలో నిన్ను నీ పేరుని ఉపయోగించకుండా జాగ్రత్తపడ్తాను... ఎస్ శ్వేతా.. నేనెంత నష్టపోయినాగానీ సాటి ఆడపిల్లగా నిన్ను నష్టానికి గురిచేయకుండా వుండాలి అంటే నిజాయితీగా నిజం చెప్పు."
"నువ్వు గానీ, నీ సపోర్టుగా నిలబడ్డ ఈ కాలేజీ స్టూడెంట్స్ గానీ నన్నెలాంటి నష్టానికి గురిచేయలేరు ఆశ్రితా..." ఎగతాళిగా నవ్వింది శ్వేత. "ఎందుకో తెలుసా... నేను కమీషనర్ సవ్యసాచికి కాబోయే కోడల్ని కాబట్టి"
దిగ్భ్రాంతిగా చూసింది ఆశ్రిత.
చాలా ప్రశ్నలకి జవాబులా శ్వేత అద్బుతమైన నిజం చెప్పింది... తన తండ్రి కంప్లయింట్ చేసినా సవ్యసాచికి కాబోయే కోడల్ని కాబట్టి"
దిగ్భ్రాంతిగా చూసింది ఆశ్రిత.
చాలా ప్రశ్నలకి జవాబులా శ్వేత అద్బుతమైన నిజం చెప్పింది.... తన తండ్రి కంప్లయింట్ చేసినా సవ్యసాచి ఎందుకు జోక్యం చేసుకోలేదో అర్ధమైపోయింది.
"సో... వశిష్టకి కాబోయే భార్యవన్నమాట"
ఒకవేళ వశిష్ట కూడా రాజేష్ విషయంలో తన తండ్రి ఆలోచనల్నే సమర్ధించడానికి కారణం ఇదేనేమో అని ఆశ్రిత క్షణంపాటు అనుకుంటే అది ఆమె తప్పు కాదు.