Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 22

    జరిగింది వెనక్కి తీసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. జరిగిందానికి క్షమాపణ చెప్పుకుని వాడికేని యిష్టమో తెలుసు కాబట్టి అవి గుప్పితే నోరు మూసుకుంటాడు. కాద్మతే అప్పటి సంగతి అప్పుడు అంతకన్నా చేసేది ఏమీలేదు__
   
    బన్సీలాల్ ఆలోచనలు అలా సాగుతున్నాయి.
   
    ఇన్ స్పెక్టర్ మాత్రం వళ్ళెరగని నిద్రలో పడివున్నాడు.
   
                                              16
   
    "వాడు అన్ని మాటలు ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా స్వరం మార్పు రాలేదా?" ఇన్ స్పెక్టర్ ధుమ ధుమ లాడుతూ అడిగాడు.

    "వాడు అసాధ్యుడండీ బాబూ! అచ్చం మీ స్వరం లాగానే వుండటం అటుంచి నన్ను మాటలతో గాభరా పెట్టేశాడు....అప్పటికే ఓసారి మోసపోయి వున్నానేమో వాడి మాటలు నమ్మాను..... బన్సీలాల్ అంటూ వుండంగానే ఓ నౌకరు టేబుల్ సర్ది విస్కీ బాటిల్ గ్లాసులు మిర్చి మసాలా ప్లేట్లు పెట్టటం మొదలు పెట్టాడు."
   
    ఇన్ స్పెక్టర్ ఓరకంటితో వాటిని చూసి ఓ గుటక వేసి మళ్ళీ ముఖం గంటుపెట్టుకుని వుండిపోయాడు.
   
    మరో నౌకరు ఫారన్ ప్యాంట్ పీసుముక్కలు తెచ్చాడు.
   
    "మీకు కావాల్సినవి తీసుకుంటే మిగతావి వాళ్ళకి యిచ్చి వస్తాను" అన్నాడు. పాతిక ప్యాంటు పీసులు కళ్ళ ముందు పెట్టి.
   
    బన్సీలాల్ నాలుగు ప్యాంట్ పీసులని తీసి పక్కన పెడుతూ "ఇవన్నీ ఫారెన్ వి. నెంబర్ వన్ క్లాత్ మీకు కావాల్సినవి ఓ అరడజను ఏరండి" అన్నాడు అతనితో.
   
    ఇన్ స్పెక్టర్ కన్నారావుకి ఫారెన్ సరుకు అంటే మహాప్రీతి...ఆఖరికి చీపురు పుల్లయినాసరే ఫారెన్ అయితే చాలు తీసుకెళ్ళి గాడ్రెజ్ బీరువాలో దాచేరకం.
   
    అతని చూపులన్నీ ప్యాంట్ పీసులమీదే వున్నాయి. అయితే ప్రస్తుతం కోపం భుజిస్తున్నాడు కాబట్టి బింకంగా వుండ దలిచాడు...."ప్యాంటు పీసులు నాకు అవసరం లేదు. అయినా ఫారన్ వి యిక్కడిదాకా ఎవరు తీసుకు వచ్చారు" అన్నాడు సీరియస్ ముఖం పెట్టి.
   
    "కొత్తగా ఒకడ్ని పట్టాను...మధ్య మధ్య మనకి ఫారన్ మందు సప్లయ్ చేసేవాడే వాడ్ని చూపించాడు... ప్యాంట్ పీసులు షర్టు ముక్కలు అనుకోకండి....వాచీలు, కెమేరాలు, సిగరెట్ లైటరు, టేప్ రికార్డర్ ఎన్ని రకాలో తెస్తాడుట వాడు. నేను ముందే చెప్పి పెట్టాను. ఫారెన్ సరుకు ఏది నీ దగ్గరకు వచ్చినాసరే ముందు నాకు చూపించు. నాకు కావాల్సినవి తీసుకుంటాను. ఆ తర్వాత మిగిలినవి నీవు అమ్ముకో అన్నాను...అన్నట్లు మీ కోసం గట్టిగా చెప్పి వుంచాను. గోల్డ్ కవరింగ్ సిగరెట్ లైటర్, సంగీతం వినిపించే టైం పీసు, ఆషాయ్ స్ప్రే బాటిల్స్" ఇన్ స్పెక్టర్ ముఖకవళికలు గమనిస్తూ చెప్పాడు బన్సీలాల్.
   
    అతని ముఖంలో అప్పటికే ప్రసన్నత చోటు చేసుకుంది. అలా అని తను కరిగిపోతే లోకువ అవుతానను కున్నాడు....ముక్తసరిగా ఊ కొట్టి ఊరుకున్నాడు.
   
    బన్సీలాల్ ప్యాంట్ పీసులు తీసుకోమని మరోసారి చెప్పాడు.
   
    ఆరేం ఖర్మ ఏకంగా పది ప్యాంట్ పీసులు పక్కన పెట్టి"ఈ పది ముక్కలకి డబ్బు పంపిస్తాను....డబ్బు ఎంతో కనుక్కోండి" అన్నాడు గంభీరంగా.
   
    "మీరు డబ్బు యిస్తే నేను తీసుకుంటే యింక మన స్నేహానికి అర్ధమేంటి? అలాంటి పిచ్చిపనులు చేయకండి" నవ్వుతూ అన్నాడు బన్సీలాల్.
   
    "ఇలాంటివి నాకిష్టం వుండవు."
   
    "అంటే నన్ను పరాయివాడిని చేస్తున్నారన్న మాట అంతేనా! అదేదో చెప్పండి బాధపడి ఊరుకుంటాను."
   
    "అదికాదు లాల్ జీ! ఇలాంటివి..."
   
    "ఇంకేం చెప్పవద్దు ముందీగ్లాసు అందుకోండి" బన్సీలాల్ కళ్ళముందుకి విస్కీగ్లాసు తెస్తూ అన్నాడు.
   
    విస్కీ వాసన నాసికలోదూరి మెదడుకి ఎక్కి మత్తుగా గమ్మత్తుగా వుంది. పంచప్రాణాలు అటే పీకుతుమ్తే కరిగి పోవటం మొదలుపెట్టాడు....
   
    ముఖం మాత్రం గంటుపెట్టుకుని అయిష్టంగా అందుకున్నట్లు గ్లాసు అందుకున్నాడు.
   
    బన్సీలాల్ మనసు కుదుటపడింది. "అమ్మయ్య" అనుకున్నాడు.
   
    పది నిమిషాల తర్వాత.
   
    వాళ్ళ మధ్య మామూలు వాతావరణం చోటు చేసుకుంది.
   
    "అయితే వాడు అచ్చం నేను మాట్లాడినట్లే మాట్లాడాడన్నమాట!" ఇన్ స్పెక్టర్  సాలోచనగా ఆలోచిస్తూ అడిగాడు.
   
    "అక్షరం పొల్లు పోకుండా ఇదే గొంతుకతో మాట్లాడాడు. కంగారు పెట్టేశాడు మాటలతో దాంతో నేను గాభరాచెంది...." బన్సీలాల్ ఆపై మాట్లాడటం ఇష్టం లేక మౌనం వహించాడు.
   
    "దాంతో మీరు నా వళ్ళు వాయ గొట్టించారు అంతేనా?"

 Previous Page Next Page