Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 23

    "అట్లనే."
    "లచ్చిమిని చంపినమని ఒప్పుకోవాలె".
    అగ్గి కురిసింది, చంపింది అమీను. అది అంతా చూచారు. కాని, తాము చంపామని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే తమకు వకీలా? సాక్ష్యమా? న్యాయం చాల విలువైనది. దాన్ని వారు కొనగాలరా? ఒప్పేసుకోవడమే మంచిది. ఖాజీ చెప్పినట్లూ జుట్టూ మొలత్రాడూ తీసేసి తురకల్లో కలుస్తే మంచిదేమోననుకున్నారు. వెంటనే మారిపోయింది ఆలోచన. జుట్టు, మొలత్రాడు తీసివెయ్యనందుకు ఇంత హింసపెట్తారా? సరే, కానివ్వు చూతాం అనుకున్నారు.
    "అట్లనే."
    "గిప్పుడు రస్తకొచ్చిన్రు (దారికొచ్చారు). చంబార్ కే దేవ్ కొ చప్పల్ కీ పూజా (తోళ్ళవాడి దేవుడికి చెప్పులతో పూజా). నర్మి (మెత్తగా చెబితే) తోటి ఇంటారు?" అన్నాడు అమీను.
    "ఖోల్ దేవ్ (విప్పెసెయ్యండి)" ఆజ్ఞాపించాడు అమీను.
                                                                         x       x      x
    "గుగ్లోత్ లాల్యా వగయిరా ముల్జిమీన్ (నేరస్తులు) హాజర్ హై (హాజరై ఉన్నారా) అని మూడు సార్లు కేక వేశాడు కోర్టు జవాను.
    లంబాడీలనూ కోర్టులో ప్రవేశపెట్టారు. సర్కారు వకీలు ముందుకు వచ్చి "అలీ జనాబ్! ముల్జిమ్ లు లాల్యా వగైరా డాకా వెయ్యిటాన్కి పోయి లక్ష్మిని చంపిన్రు. తాజీరాత్ (హైదరాబాదు రాజ్యపు శిక్షాస్మృతి) ముమాలిక్ మహరుసా సర్కార్ ఆలియాయొక్క దఫా 224 (సెక్షను 224) ఖత్లె (హత్య) ఆమద్ 291 హమ్ లా (దాడి) 314 సర్జా (దొంగతనం) 327 డకేటీ (దోపిడీ) క్రింద తహభీఖాత్ (విచారణ) జరిపి సజా (శిక్ష) ఇవ్వవలసిన ఆరజ్ (వినతి)" అన్నాడు.
    మేజిస్ట్రేటు పేర్లు వగైరాలడిగి "ఘిదాకో హాజర్ నాజర్ జాన్కర్ కహతా హుకిమై జోకుచ్ భీ కహూంగా సహి కహుంగా. సివాయే సహికే ఔర్ కుచ్ నహీ కహుంగా (భగవంతుడు ప్రత్యక్షంగా వున్నట్లు భావించి నిజం చెపుతాను. నిజం తప్ప వేరు చెప్పను) అని ప్రమాణం చేయమన్నాడు.
    లంబాడీలంతా తికమకపడ్డారు. సత్యం చెపుతామని ప్రమాణం చేసి అబద్దం ఎలా చెప్పాలి? సత్యం చెప్పేద్దామానుకున్నారు కానీ, అందువల్ల ప్రయోజనం లేదనుకున్నారు. దేవునిసాక్షిగా అబద్దం చెప్పలేమనుకున్నారు.
    "ఖసం తినం (ఒట్టు పెట్టుకోము)" అన్నారు.
    అమీను వళ్ళు మండింది. "సర్కార్ ఖసం తిన్నట్లుగా అన్కోవాలని అరజ్" అని విన్నవించాడు. మేజిస్ట్రేటు సర్కారీ వకీలువైపు చూచాడు. అతని కళ్ళేమో చెప్పాయి.
    "అచ్చా" అన్నాడు మేజిస్ట్రేటు.
    "డాకాకు పోయిన్రా?" సర్కారీ వకీలు అడిగాడు.
    అమీను కళ్ళెర్రజేసి, చెప్పండి చెప్పండి అన్నట్లు సంజ్ఞ చేశాడు.
    "పోయినం సర్కార్!"
    "లక్ష్మిని ఖతల్ చేసిన్రా?"
    ".... .... ...."
    ఎవరి నోటిలోంచి మాట రాకుంటే ఎముకలు విరక్కొడ్తానన్నట్టుగా కర్ర చూపాడు అమీను.
    'చేసినం సర్కార్!'
    'ముల్జిములు జురుమ్ ఖుబూల్ (నేరం ఒప్పుకున్నారు) చేసిన్రు కాబట్టి ఒకొక్కనికి మూడేండ్లు సజాయే ఖైద్ (ఖైదు శిక్ష) ఇవ్వనైనది. ముల్జిములు ఇకనుంచి బుద్దిగలిగి ఉండాలె' అని తీర్పు ఇచ్చారు మున్సఫ్.
    లంబాడీలందరికి బేడీలు వేసి తీసికెళ్ళారు పోలీసులు.
    తరువాత భీక్యాను చంపిన అబ్దుల్ సలామ్ కానిస్టేబుల్ను కోర్టులో ప్రవేశపెట్టారు.
    నేరారోపణ ప్రమాణం చేయించడం వగైరా లాంఛనాలు అయిపోయింతర్వాత మేజిస్ట్రేటు అడిగాడు:
    'భీక్యాను కొట్టినవా?'
    'కొట్టిన్నుండి!'
    "ఎందుకు కొట్టినవ్?"
    "హిరాసత్ల (కస్టడీలో నుండి) నుంచి ఫరార్ (పరారీ) అయితాంటే."
    "బేడీలు లేవు?"
    "ఉన్నయ్యండి."
    "అయితే ఎట్లు ఫరారయ్యిండు?"
    "ఎట్ల ఫరారయ్యిండు?" అని అమీనువైపు చూచాడు.
    కొరికినట్లు సంజ్ఞచేశాడు అమీను.
    "పండ్లతోని కొరికిండులే ఫరారయ్యాండు."
    "పండ్లతో కొరికిండులే ఇనుప భేడీల్ను?"
    "అబ్బ! వానికెంత తాఖత్ (బలం) ఉన్నదనుకున్నారు. ఇట్ల కొరికేటార్కాల్ల..."
    "ఇంతకు ఫరారైతాంటే కొట్టినంటవు?"
    చెప్పొద్దన్నట్లుగా సంజ్ఞచేశాడు సర్కారు వకీలు. భీక్యా చాలా బలహీనంగా ఉన్నాడనీ, మామూలు దెబ్బకే ప్రాణాలు వదిలాడనీ నిరూపించటం వాళ్ళ ఉద్దేశం.
    ఏం చెప్పాలో అర్ధంకాక, "పండ్లూడిపోనయుండి" అన్నాడు సలామ్.
    "ఇంతకు ఫరారైతాంటే కొట్టిన్నంటవు?"
    "అంతేకాదుండి మరి."
    "ముల్జిం అబ్దుల్ సలామ్. భీక్యాను చంపాల్నని కొట్టలేదు. భీక్యా ఫరార్ అయితూంటే ఫరజ్ అంజామ్ చేయటాన్కి (కర్తవ్య నిర్వహణకు) కొట్టిండు. కాబట్టి ముల్జిమ్ ను బేఖుసూర్ గా (నిర్దోషిగా) భావించి రిహా చేస్తున్నం (వదిలివేస్తున్నాం)" అని తీర్పు ఇచ్చాడు.
                                                     12
    ఆ రాత్రి నిద్రపట్టలేదు వనజకు. "ఈ రేయి నన్నొల్లనేరవా?" ఆవిడ మెదడులో ఇంకా గింగురమంటూనే వుంది. అతని పాట హృదయాన్ని కరిగిస్తుంది. మాట గుండెలకు జలదరింపచేస్తుంది. అతడంటే తనకు ఎనలేని ప్రేమ ఏర్పడింది. ప్రేమ అనే పదానికి ప్రత్యక్షంగా అర్ధం చెప్పుకున్నా, ప్రేమ అనేది ఒకటి వుందని తెలియజేసినవాడు అతడే. తన పేరు అందమయినదనీ, దాని కర్ధం తామర పూవనీ తెలియపర్చింది అతడే. చెరువునిండా వుండే తామరపూలు గుర్తుకు వచ్చాయి. ఎంత అందంగా వుంటాయి తామరపూలు! ఎంత అందమయినది తన పేరు! ఎవరు పెట్టారో అడుగుదామనుకొంది. ఎవర్నడగాలి? నిలువుటద్డం ముందు నుంచొని చూచుకుంది. నిజంగా తను అందమయినదే. ఆ తరువాత ఏవేవో గిలిగింతలు పెట్టే మాటలు చెప్పాడు. అతణ్ణి చూడకుండా ఉండలేని దశ వచ్చిందే. ఎంత తియ్యగా మాట్లాడ్తాడు. వెన్నెల విరిసినట్లు, పూలు కురిసినట్లు!

    అతణ్ణి ప్రేమించింది తాను. వలచింది, వరించింది. కాని తానెవరు? దాసి, ఆడబాప, అంటే సుమారు వేశ్య అని అర్ధం. వేశ్య డబ్బుకై తన తనువును అమ్ముకుంటుంది. తన తల్లీ, తన ఆచారాలూ తనను అమ్మి వేశాయి, జంతువును అమ్మినట్లు. తాను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ దొరకు బానిసే. తాను వేశ్యకంటే కడుహీనం. వేశ్య తాను ఒద్దనుకుంటే, తనకు డబ్బు అవసరం లేదనుకొంటే తనను అమ్ముకోవాల్సిన పనిలేదు. కాని, తాను? తనకు ఇష్టం వున్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా అర్పించేయాల్సిందే కోరిన వారికి - గడీకి వచ్చినవారికి. ఇది గుండెలేని జీవితం. ఇలాంటి జీవితాన్ని కోరితెచ్చుకొనేవా రెవ్వరూ ఉండరు. అది వచ్చిపడినప్పుడు అందులోని కుళ్ళును గ్రహించి, దాన్నుంచి బయటపడాలని చూసేవారు తక్కువే. సరళ, విమల, ప్రమీల - వారూ తనవలెనే జీవిస్తున్నారీ గడీలో అతడు రాకముందు తానూ వారివలెనే జీవించింది.
    అతడు వచ్చాడు. తన బ్రతక్కూ, ప్రేమకూ, అర్ధం తెలిసింది. తాపత్రయం పెరిగింది. ఈ కుళ్ళులోంచి బయటపడాలని నాటినుంచి మధనపడుతూంది తాను. కాని, ఏం చేయాలి? మనసారా ప్రేమించిందతన్ని. అతనికి తన ప్రాణం సహితం ఇవ్వడానికి సంకోచించదు. అతని బాధల్నూ దుఃఖాల్నూ పంచుకోగలదు. అదే తనకు కావల్సింది. అంతే తనకు కావాల్సింది.
    అతడెంత మంచివాడు! ఎన్నో రోజులుగా తనను చూస్తున్నాడు. ఎన్నో రకాలుగా మురిసిస్తున్నాడు. కాని, ఒక్కనాడయినా కామం వ్యక్తం పర్చాడా?" అతడు నరుడుకాడు. వట్టి రాతిమనిషిలాంటి తనలో ప్రాణం పోశాడు. గుండె ఏర్పరచాడు. అట్లాంటి అతనితో జంటగా ఫోటో దిగుదామనుకుంది. దొరతో చెప్పి.
    పెళ్ళాడ్దామనుకుంది. అతని వక్షంలో తలదాచుకున్న నాటి ఆనందాన్ని తల్చుకొని ఉబ్బిపోయింది. తనకూ ఒక భర్త ఉంటాడనీ, అతనితో జంటగా అందరికీ కనిపించవచ్చుననీ ఉబ్బిపోయింది. ఆ గాలిమేడలూ, ఆ ఆశాసౌదాలూ అన్నీ ఏం కావాలి?
    కూలిపోవాలి. కాలిపోవాలి.
    కాళ్ళకింద భూమి కరిగిపోయింది. పాతాళంలో పడిపోయింది. అంతా అంధకారం. ఎవరో గట్టిగా గుండెను పట్టుకొని ఆపినట్లు అనిపించింది, ఊపిరాడలేదు. తబ్బిబ్బైంది.
    కొన్ని క్షణాలకుకాని మళ్ళీ మామూలు మనిషి కాలేదు.
    కూలిపోవాలి. కాలిపోవాలి.
    అవును. దైవంలాంటివాడికి కుళ్ళిన పండులాంటి తనను ఎలా అర్పిస్తుంది? తన వృత్తాంతమంతా పాణికి చెప్పెయ్యాలి. కాని, చెప్పేస్తే తనవాడనుకున్న ఒక్కడూ చేయిజారిపోతాడు. ఎందుకు జారిపోతాడు? తనకు కావలసింది ప్రేమ. శారీరకమైన వాంఛల్తో తనకు నిమిత్తంలేదు. అతడు తనను ప్రేమించలేదా?
    ఎలా?
    అన్నలా! 

 Previous Page Next Page