"ఏం చేసిన్రురా" అడిగాడు కుమ్మరి.
"ఏం చేసినమా? ఆ కరణం లేడు? ఆని బిడ్డను" అని పళ్ళుకొరికాడు భీక్యా.
మిగతావాళ్ళంతా అతన్ని వారించి "కరణపాయనకు డబ్బిచ్చినం జమీన్ కని. డబ్బు తిన్నడు. జమీన్ ఇయ్యమంటే గిట్ల చేసిండు. ఆని పెండ్లాన్ని చంపించిండు" అని చెప్పాడొకడు.
"ఈ దేశంల ఏమన్న సర్కారున్న దనుకుంటున్రురో! దొరలు, కరణాలే రాజ్యమేలతాన్రు, పోలీసోల్లు వాళ్ళ చేతుల్ల కుక్కలు" అని అటూ ఇటూ చూసి ఎవరు దగ్గర్లో లేరనే విషయం ధ్రువపర్చుకొని, "ఒక గడ్డపు తురకోడొస్తడు. తురకల్ల కల్వమంటడు గాని ఆని మాట ఇనకురి. రాజ్యమంతా తురకల్ను చెయ్యాలనీ చూస్తాన్రు" అని చెవుల్లో చెప్పినంత మెల్లిగా చెప్పి, "ఎప్పుడు తిన్నరో, బువ్వ పట్టకొస్త" అన్నాడు పెద్దగా అందరూ వినేట్లు.
అన్నాలు తెచ్చి పెట్టాడు కుమ్మరి అందరికీ. నూనె తెచ్చి శరీరాల నిండా రాచాడు. "ఎప్పుడిరగడైపోతదో ఈ దొరల రాజ్యం" అన్నాడు కుమ్మరి. అన్నాలు తిని కాస్త సేద తీరింతర్వాత లక్ష్మి విషయం గుర్తుకు వచ్చింది వారందరికి. అంతా ఒక్కసారి గొల్లుమన్నారు.
"హుష్! నోర్ముయ్యి. ఎవళ్ళో చచ్చినట్లు ఏడుస్తరేవర్రా" అన్నాడు తుపాకీ పట్టుకొని కాపలా కాస్తున్న పోలీసు జవాను.
"చచ్చింది నీ పెళ్ళామా?" అన్నాడు భీక్యా.
"ఏమన్నావురా! నా పెండ్లాన్ని చావమంటావు?" అని తుపాకి మడమతో భీక్యా నెత్తిమీద కోపంతో బాదాడు పోలీసు. కాళ్ళకూ, చేతులకూ బేడీలున్నాయి. ఏం చేస్తాడు పాపం?
"అబ్బ" అని పడిపోయాడు.
తల పగిలి రక్తం ప్రవహించింది. పోలీసులు పరిగెత్తుకొనివచ్చి లేపారు. ఆ రక్తాన్ని చూచి బెదిరిపోయారు. కొందరు తడిగుడ్డల్తో రక్తం తుడుస్తుంటే ఒకడు అమీను ఇంటికి పరిగెత్తాడు. అమీను వచ్చి చూస్తే భయంకరమైన దృశ్యం కనిపించింది. తల తిరిగిపోయింది.
"కౌన్ మారా(ఎవరు కొట్టారు)" అంటూ ప్రాణాలు వదిలాడు భీక్యా.
లంబాడీలు గొల్లుమన్నారు.
ఊరంతా ఉడికిపోయింది. కానీ, ఒక్కరూ లంబాడీల సహాయానికి రాలేదు.
భీక్యా శవాన్ని, దెబ్బలుతిన్న పోలీసువాణ్ని హాస్పిటలుకు పంపించారు.
లంబాడీలు రెక్కల్లేని పక్షుల్లా విలపించారు.
ఆకాశంవైపు చూచి న్యాయం కలుగజేయమని భగవంతున్ని ప్రార్ధిస్తూ ఏడిచారు.
x x x
పోస్టుమారటం చేసి శవాన్ని అప్పగించారు. ఖనన సంస్కారం చేసి వచ్చేశారు లంబాడీలంతా. సంస్కారానికి అయిన డబ్బేకాక, త్రాగుడుకు కూడా కొంత ఇచ్చాడు కరణం. బేడీలుతీసి ఒక కొట్లోవేసి తాళం వేశాడు. బాగా తాగారు. మైమరచి నిద్రపోయారు - శరీరానికి, హృదయానికి తగిలిన గాయాల్ను లెక్క చేయకుండా.
తెల్లవారి ఖాజీ వచ్చాడు. అందర్నీ చెట్లక్రింద కూర్చుండబెట్టి ఇస్లాంను గురించి సుదీర్ఘంగా ఉపన్యసించాడు.
"....కావున, శిలలను, నరులను నమ్మరాదు. ఈ భూమిని ఆకసమును అల్లాయే సృష్టించినాడు. లా ఇలాహ ఇల్లల్లాహి మహమ్మదున్ రసూలల్లా హి - అనగా అల్లా తప్ప వేరు దైవము లేదు. మహమ్మదు అతని చివరి ప్రవక్త అయి ఉన్నాడు. ఈ విషయమును నోటితో పఠించి మనసార విశ్వసించుటే "ఇస్లాం" అనబడును. లోకమున నిదొక్కటియే మతము. ఇదొక్కటియే విశ్వాసము. మీరు ఇస్లాం స్వీకరించుడు. మీకు మేలు కలుగును, ఇక్కడి మున్సిఫ్ ఖ్వారా ఇనాయతుల్లా బేగ్ లాహరీ మంచి ముసల్మానుడు. అతడు మీకు ఎట్టి శిక్ష పడకుండ చేయుటేకాక మీ భూమి మీకు ఇప్పించగలడు.
నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖా బహద్దూర్ ఖలదల్లాహుస్సల్తనతా మన ప్రభువు. అతడు ముసల్మానులకు అనేక సౌకర్యములు కలిగించుచున్నాడు. మీరు సమ్మతించిన ఇప్పుడే మీకు ఇస్లాం ఇవ్వగలను."
లంబాడీలు ఒకరు ముఖాలు ఒకరు చూచుకున్నారు. చాటుకు వెళ్ళి సంప్రదించుకున్నారు. "మా తండా నాయక్ ఎట్ల చెపితే అట్ల ఇంటం" అన్నారు.
"అయినా మీరు ఇస్లామును స్వీకరించరా?" ఖాజీ అడిగాడు.
ఎవరూ మాట్లాడలేదు.
"చావుడు. మీకు పోగాలము దాపురించినది. మీ అందరిని జేలుకు పంపకున్న నేను ఖాజీని కాను" అని ఉగ్రుడై అమీనుతో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి లంబాడీల్ను యమయాతన్లు పెట్టారు పోలీసులు.
వరుసగా లంబాడీల్ను కూర్చోపెట్టారు. ఒక్కొక్క పోలీసు ఒక్కొక్కన్ని లాఠీలతో మోచేతులమీద, మోకాళ్ళమీద కొట్టారు. దెబ్బలకు తాళలేక లంబాడీలు మొత్తుకొంటూంటే "ఒప్పుకోండి, ఒప్పుకోండి" అన్నాడు అమీను.
లంబాడీలు ఒప్పుకోలేదు.
"జనపనార" అన్నాడు అమీను.
లంబాడీల్నందర్నీ నుంచోపెట్టి జనపనార నులకతో బిగించికట్టారు భుజాలదగ్గర్నుంచి బిగుసుకుంటూంది. వళ్ళంతా హూనం అవుతూంది. 'ఒప్పుకోండి, ఒప్పుకోండి' అన్నాడు అమీను. 'చెయ్యందెట్లు ఒప్పుకుంటమండి' అన్నాడొకడు. 'జవబ్బీ చెపుతరులే' అని మారో(కొట్టండి)' అన్నాడు అమీను.
పోలీసులు బాదారు. లంబాడీలు ఒప్పుకోలేదు.
"తలకు కట్టూరి లంబాడి దయ్యాలు ఖుబూల్ (నేరం ఒప్పుకొనుట) చేస్తాయి ఆసానీగ(సులభంగా) అన్నాడు అమీను.
జనపనార తలలకు కట్టి రెండు చివరలు కలిసేచోట పుల్లలు పెట్టి తిప్పారు. పుల్లను తిప్పుతూంటే తలను ఒత్తేస్తూంది త్రాడు. మోకాళ్ళకూ, మోచేతులకూ దెబ్బలు తగిలివున్నాయి. ఒంటికి బిగుసుకుపోతున్న జనపనార, తలకు త్రాళ్ళు కట్టి బిగిస్తున్నారు. "లబో దిబో" మొత్తుకోసాగారు. 'అరుస్తారు బే' అని బాదసాగారు పోలీసులు. 'ఇద్దరూ చచ్చిన్రు. అందరెందుకు చస్తార్రా? పెళ్ళాలు మందిపాలైతరు. ఒప్పుకోండి' అన్నాడు అమీను.
శరీరంతోపాటు గుండె మండుతూంది. ఒక్కసారి అందరూ కలిసి పోలీసుల్ని చంపేసి, పోలీసు స్టేషన్ తగలబెట్టి, తురకరాజ్యం కూలతోయాలన్నంత కసి పుట్టింది వారికి. కానీ, యేంచేయగలరు? పోలీసులు, తుపాకులు, రాజ్యం వాళ్ళది.
'చంపురి. కొయ్యురి. చెయ్యంది ఎట్లొప్పుకుంటముండీ?' అన్నారు. మోకాళ్ళపై దేబ్బాలకే అందరిచేతా నేరాలు ఒప్పించాడు తాను. లంబాడీల చేత నేరం ఒప్పించకుంటే తనను ఒట్టి చాతకానీ వాడంటుంది సర్కారు. ఇద్దర్ని చంపినా, ఇన్ని హింసలు పెట్టినా, ఇస్లాంలో చేరమంటే చేరరు. నేరం ఒప్పుకోమంటే ఒప్పుకోరు. లిప్తపాటు వారిమీద గౌరవభావం ఏర్పడింది. వెంటనే తాను మనిషి కాదనీ, పోలీసని గుర్తుకు వచ్చింది. రాక్షసుడైపోయాడు.
'కారం, కర్రలు' అన్నాడు అమీను.
కర్రలకు కారంపూసి ఆసనాలలో పెట్టారు. లంబాడీలు బాధ భరించలేక ఓ అంటే ఓ అని మొత్తుకోసాగారు. మొత్తుకుంటుంటే బాదసాగారు పోలీసులు.
'ఖుబుల్లేవ్. నితో జలాదూగా(ఒప్పుకోండి, లేకపోతే కాల్చేస్తా)అని పిస్తోలు తీశాడు అమీను.
'చంపురి, బతికి చేసేదేమున్నది?' అన్నాడొకడు.
'ఒప్పుకుంటం, ఒప్పుకుంటం' అన్నాడొకడు.
అతన్నే అనుసరించారంతా.
'షేక్ లతీఫుల్ హసన్ అమీన్ అంటే ఏమనుకున్నరు?' అని విజయగర్వంతో నవ్వేశాడు అమీన్.
ఆ నవ్వు చూచి మెడ పిసికేయాలన్నంత కోపం వచ్చింది లంబాడీలకు. అయినా ఎవ్వడు మాట్లాల్లేదు.
'ఏమొప్పుకుంటరు?" అడిగాడు అమీను.
'ఏమొ, మా కేమెరుక?'
'రేపు మున్సఫ్ కచ్చేర్కి తీస్కపోతం. ఆడ సర్కారు వకీలు ఏది చెప్పుతే అది ఒప్పుకోవాలె.'
'అట్లనే!'
'ఊర్మీద్కి డాకా వేయటాన్ని వచ్చినమని ఒప్పుకోవాలె.'
లంబాడీల ఎదల్లో అగ్గి మండింది. దొమ్మీకి వచ్చారా వీరు? తమ హక్కు కోరడానికి వచ్చారు. తండ్రి డబ్బు తింటాడు. పొలం ఇయ్యడు. కొడుకు ఇంకొకనికి పొలం అమ్ముకుంటాడు. అది అడగడానికి రావడం డాకాకు వచ్చినట్లు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే బ్రతికేట్లులేరు. భూమి దొరక్కున్నా బ్రతకనయితే బ్రతకాలి కదా? పగ తీర్చుకోవాలిగా? ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు.