"అలా అన్నానా?"
"ఆ..... అలాగే అన్నారు."
"ఎందుకన్నానబ్బా?"
"ఏమోనబ్బా!"
"ఇంతలోనే యింత మతిపోయిందా? ఏమిటో నీవిలా దగ్గరగ రా!"
"ఎందుకు?"
"నీ ముఖంలో ముఖంపెట్టి నీ కళ్ళల్లో వెతుకుతాను."
"ఏమిటి?"
"పోయిన మతిని."
రామకృష్ణ డ్రెస్ పూర్తి చేసుకోటం పూర్తి అయింది. సీతని దగ్గరకు తీసుకున్నాడు.
"అయ్యొయ్యో డ్రస్ నలిగి పోతుందండీ?"
"నాకు లేని బాధ నీకెందుకు!"
"మరీ యింత యిది పనికిరాదు."
"భార్యని భర్త ముద్దు పెట్టుకోటం యిదా?"
"ఇది కాకపోతే ఏమిటిట? ఈ ముద్దు పెట్టుకునే సీన్లు సినిమాలలో వుంటాయి. లేకపోతే నవలల్లో వుంటాయి. అంతేగాని నిజజీవితంలో వుండవు" దబాయింపుగ అంది.
"సరేలే" అంటూ సీతని వదిలేశాడు రామకృష్ణ.
"సరేలే అంటే ఏంటి?"
"రేపు ఆఫీసుకెళ్ళేటప్పుడు చెపుతాను."
సీత చిరుకోపం తెచ్చుకుని మూతి సున్నాలా చుట్టి ఆ తర్వాత పెదవి బిగింపులో నవ్వు దాచుకుంది.
రామకృష్ణ బెడ్ రూమ్ లోంచి బైటికి వస్తూ సీత బుగ్గమీద చిరుచిటిక వేశాడు. "సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా వుండు. దిక్కుమాలిన మొగుడికి వెళదాం" అన్నాడు.
సీతామనోహరి కిలకిల నవ్వింది.
రామకృష్ణ స్కూటర్ మీద కూర్చుని టాటా చెప్పి రయ్యిన వెళ్ళిపోయాడు.
"నా మొగుడు ఎంత మంచివాడమ్మా!" అనుకుంది సీత.
ఆ యింటి మొత్తం మీద సీతామనోహరి, రామకృష్ణ ఇద్దరే వుండటం వల్ల అప్పులు, రోగాలు లాంటి బాధలు లేకపోవటం, గిజాటు సంసారం కాకపోవటం - ముఖ్యంగా పరస్పర అనురాగం వారి మధ్య మెండుగా వుండటంతో ఇంతవరకూ వారి మధ్య సరదాలు తప్ప మరెదీ చోటుచేసుకోలేదు.
పూర్తిగా ప్రపంచం తెలియని సీత అలా అని అమాయకురాలు కాదు. అటు పుట్టింట, యిటు అత్తింట బాధలు లాంటివి బొత్తిగా తెలియకపోవటం, చిన్న కష్టంలో కూడా తలదూర్చే అవసరం రాకపోవటం వల్ల సీతకి అనుభవంలో చాలా తెలియవు.
కాశీమజిలీ కధలు చదివి ఆ కాలంలో కీలుగుర్రాలు, మహా మాంత్రికులు, రాక్షసులు వున్నారని అనుకున్నట్లే - ఇప్పుడు సీత తెలుగు సినిమాలు చూసి, తెలుగు నవలలు చదివి ప్రపంచంలో ఆడవాళ్ళు చాలా రకాలుగా నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కువ సంసారాలలో భర్తలే భార్యలని కష్టపెడుతున్నారు అనుకుంది.
సీత అలా అనుకోటానికి తోడు ఏ ఇల్లాలిని కదిలించినా ఏదో ఒక కష్టాల కధ కానరావటమే.
సీతని బాగా అర్ధం చేసుకున్న రామకృష్ణ తరచూ అనేమాట - "సీతా! నీవు అమాయకురాలివయినా గడుగ్గాయివి."
ఈ మాటకర్ధం బొత్తిగా తెలియలేదు సీతకి.
రామకృష్ణ ఆఫీసుకి వెళ్ళింతరువాత సీత పావుగంటలో పనంతా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఏం చేయాలా తెలియక కాలుగాలిన పిల్లిలా యిల్లంతా తిరిగింది. ఏదన్నా జాబ్ చేస్తే ఎలా వుంటుంది? అని కాసేపు ఆలోచించింది. అంత అవసరం కనపడలేదు.
"కాలక్షేపానికి ఏం చేయాలి?" సీత చాలా రకాలుగా ఆలోచించింది.
"కుట్లు, అల్లికలు......"
"పెద్ద బోర్! అయినా బజారునిండా రకరకాలవి దొరుకుతుంటే అదో శ్రమ దేనికి?"
"అగ్గిపెట్టెలు, సిగరెట్టు పెట్టెలు, ఇంజక్షన్ సీసాలతో బొమ్మలు తయారుచేస్తే!"
"అవి ఏమంత అందంగా వుంటాయి కనుక.....!"
"అన్నింటికన్నా బెటర్ - రచనలు చేయటం!"
"నిజమే - అదయినా చేతయి చావాలికదా!"
"ఇంత చదువూ చదివి ఇల్లు అల్లుక్కోటానికా అన్నట్లు ఆమాత్రం రాయలేనా! డిగ్రీ దాకా చదివి ఇల్లు అలుక్కోటానికా అన్నట్లు - ఆమాత్రం రాయలేదా! డిగ్రీ దాకా చదివినదాన్ని! వార, మాస పత్రికలు కాక, నవలలు తెగ చదివిందానిని - ఓ రచన చేయటం అంత కష్టమా? రచనలంటూ చేస్తే ఇటు కాలక్షేపం, అటు పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు.... రాజకీయ నాయకులకి లేని పేరు రచయిత్రులకి వుంది. కనుక కాలక్షేపంగా రచనలు చేయటం మంచిది."