Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 22


                                                             6
    
    ఎవరీ గౌతమ్!
    అచ్చం తనలాగే ఉండటం ఏమిటి?
    ఉన్నాడే పో, తనచుట్టూ నీడలా తిరగడం ఎందుకు?
    అతడి సంతకం అచ్చం తన సంతకంలాగే ఉంది. అంటే అతడు తన సంతకం చూసి ఉడాలి. దాన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి.
    ఎందుకు చేశాడు?
    ఎందుకేమిటి డబ్బుకోసం! రూపంలో పోలికల్ని ఉపయోగించుకొని మోసాలు ప్రారంభించాడు. వెంటనే పోలీసులకు రిపోర్టు చేస్తే? దానికి ఫ్రూఫ్ ఏముంది? ఆఫీసులో వాళ్ళను ప్రశ్నిస్తారు. వాళ్ళు తనే ఆ డబ్బు తీసుకెళ్ళినట్టు చెప్తారు. చివరికి తనకు పిచ్చెక్కిందని నిర్ణయిస్తారు.
    ఇందు కూడా అతడ్ని చూసి తననే భ్రమపడింది. ఇక పరాయివాళ్ళు భ్రమపడటంలో ఆశ్చర్యంలేదు.
    ఈ రూప సామ్యం ముందు ముందు ఇంకెన్ని అనర్ధాలకు దారి తీస్తుందో?
    వాడి అసలు పేరు గౌతమ్ అయి ఉండదు. తన పేరు మీద చెలామణి కావాలని చూస్తున్నాడు.
    ఆ ఆలోచన రాగానే గౌతమ్ కు అంతకుముందు తన అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి.
    అతని పేరు కూడా గౌతమ్ అయి ఉండాలి.
    అనేకసార్లు తనను కొందరు గౌతమ్ అని పిల్చారు వెనకనుండి. తిరిగి చూసినా తనను మరో గౌతమ్ లా భావించి మాట్లాడటం జరిగింది. అప్పుడు తను ఈ విషయానికి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. మనిషిని పోలిన మనిషి ఉంటాడులే అని భావించాడు.
    అలాంటి అనుభవాలే అతడికీ కలిగి ఉంటాయి. అతడిలో కుతూహలం రేకెత్తి ఉంటుంది. తనను వెతుక్కుంటూ వచ్చి ఉంటాడు.
    ఆ తరవాత అతడికి తన అవాతరం ఎత్తి డబ్బు సంపాదించాలని కోర్కె కలిగి ఉంటుంది.
    రవికి అసలే తనంటే కోపంగా ఉంది.
    తన డబ్బు తీసుకొన్నాడని అతడు భావించవచ్చు.
    రవితో పేచీలు మొదలవుతాయి.
    ఎలా ఈ సమస్యను విడదియ్యడం?
    అతడెవరో తెలుసుకోవాలి.
    అతడెవరు? తనలా-అచ్చం తనలా రోజూ తనను చూసేవాళ్ళు కూడా మోసపోయేంతలా, ఎవరో అయితే ఎలా ఉంటాడు?
    అతడు తన తోడబుట్టిన వాడే అయి ఉండాలి.
    తామిద్దరూ కవలలు అయి ఉండాలి.
    "అవును! అంతే అయి ఉండాలి.
    అయితే అతడు ఎవరో అమ్మకు తెలిసే ఉండాలి. అతడు ఎక్కడ ఉంటాడో కూడా తెలిసే ఉండాలి.
    మరి అమ్మ తనకు ఈ రహస్యం ఎందుకు చెప్పలేదు?
    ఎలా చెప్తుంది?
    తను ఆమెకు శంకర్రావుతో వివాహానికి పూర్వమే పుట్టినట్లు చెప్పడానికి ఎంత మానసిక వ్యధ చెందింది?
    తనకు మరో అన్నో, తమ్ముడో ఉన్నాడనీ, అతడు మరెక్కడో పెరుగుతున్నాడనీ ఏం చెబుతుంది? ఎలా చెబుతుంది?
    అమ్మ అవివాహితగా కన్నబిడ్డల్లో ఒకడ్ని పుట్టగానే ఎవరికో ఇచ్చేసి ఉండాలి.
    మరి తనకెందుకివ్వలేదు?
    గౌతమ్ స్కూటర్ కు ఎదురుగా వచ్చిన కారు అల్లంత దూరంలో సడన్ బ్రేకుతో 'కీచు' మని శబ్దంచేసి ఆగింది.
    గౌతమ్ కు తన అప్పు అర్ధం అయింది. ఆలోచనలతో ఎదురువచ్చే బండ్లను కూడా చూసుకోవడంలేదు. కారును దాటుకువెళ్తున్న గౌతమ్ కు కారు వాడు తిట్టడం వినిపించింది. అయినా విననట్టే తప్పుకొని ముందుకు సాగాడు.
    అతడికి తన జన్మరహస్యం ఆలస్యంగా తెలిసి ఉంటుంది.
    అందుకే ఆ రోజు రాత్రి తనను కన్నతల్లిని చూడాలని వచ్చి ఉంటాడు.
    అతడ్ని చూసి అమ్మ ఎందుకు మూర్చపోయింది?
    భయపడిపోయిందా?
    తన రక్తమాంసాలు ప[అన్చుకొని పుట్టినబిడ్డ___ తనచేత త్యజించబడిన బిడ్డ____అనుకోకుండా ఆరడుగుల ఎత్తునవచ్చి ఎదురుగా నిల్చుంటే ఆమె హృదయం ఆనందంతో తుళ్ళిపడలేదా?
    పుత్ర పరిష్వంగ సుఖం కోసం ఆరాటపడలేదా?
    కేవలం భయపడిందా?
    ఎందుకు?
    తన రహస్యం ప్రపంచానికి తెలిసిపోతుందనేనా?
    స్త్రీకి తన బిడ్డ ప్రేమకంటే సమాజంలో ఉన్న పేరు ప్రదిష్టలే ఎక్కువా? నో! నో! అలా కాదు. కానేకాదు. అలా అయితే స్త్రీత్వమే తన సంతానం ముందు సిగ్గుతో తలవంచాలి.
    తల్లిని చూడాలనీ, అలా తనను చూడగానే ఆ తల్లిహృదయం ఉప్పెనలా పొంగి వాత్సల్యంతో ముంచేస్తుందనీ ఆశించి వచ్చిన ఆ అభాగ్యుడికి ఆ తల్లి ప్రవర్తన విరుద్ధంగా కనిపించినప్పుడు అతడి హృదయం ఎంత ఆక్రోశించి ఉంటుందో?
    ఆ తిరస్కారం అతడిలో కసిని రేకెత్తించి ఉండాలి. ఆ కసి ప్రతీకారాన్ని కోరుతూ ఉండి ఉండాలి. అందుకే అతడు ఇలా తనవెంటబడి ఉంటాడు.
    తన తల్లికి తనంటే ప్రేమని అతడికి తెలిసి ఉండాలి. తనను హింసించి ఆమె మీద ఏర్పడిన ద్వేషాన్ని కక్కేయాలి.
    అమ్మ ఎందుకు అలా భయపడింది?
    అమ్మను తను ప్రేమమయిగా భావిస్తూ వచ్చాడు.
    అమ్మ అతడ్ని తిరస్కరించి ఉండదు.
    పసిగుడ్డుగా వదిలేసిన బిడ్డ ఎదురుగా నిలుచుని నిరసనగా, హేళనగా కసిగా చూస్తే ఏ తల్లి భరించగలదు! ఆమె హృదయం ఎంత తల్లడిల్లి పోయిందో? అది భరించలేక ఆమె స్పృహ కోల్పోయి ఉంటుంది. ఎవరైనా చూశారని భయపడి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడే అతడ్ని ఇందు చూసింది. తను అని భ్రమపడింది.
    అంతటితో అతడు ఆ విషయాన్ని వదల్లేదు.
    ఆ మాటకొస్తే తనే పరిస్థితుల్లో ఉంటే తను మాత్రం పడగలడా?
    తన ఊహలే ఇవన్నీ.
    అమ్మను అడిగితే గాని నిజానిజాలు తెలియవు.
    స్కూటర్ ఆపి లోపలకు నడిచాడు గౌతమ్.
    గౌతమ్ లోపలకు వెళ్ళేసరికి అన్నపూర్ణమ్మ హాల్లో కూర్చుని ఎదురింటి కౌసల్యమ్మతో మాట్లాడుతోంది.
    "ఏం బాబూ! బాగున్నావా?"
    "బాగానే ఉన్నను మీరెలా ఉన్నారు పిన్నీ?" అన్నాడు గౌతమ్ కౌసల్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా.
    "బాగానే ఉన్నాను. మీ బాబాయికే ఒంట్లో అంత బాగుండటం లేదు" అన్నది కౌసల్యమ్మ.
    "ఏమైంది?"
    "అదే___షుగర్ జబ్బుందని తెలుసుగా! మరీ ఎక్కువైంది అన్నది కౌసల్యమ్మ లేస్తూ.
    "వస్తాను అన్నపూర్ణా! వస్తారా గౌతమ్!" అంటూ వెళ్ళిపోయింది.
    "ఇంత ఆలస్యం అయిందేం? రా- భోజనం చెయ్యి" అన్న అన్నపూర్ణమ్మ.
    "నువ్వు తిన్నావా?"
    "ఇంకా లేదు."
    "రవి వచ్చాడా?"

 Previous Page Next Page