"ఇంకెప్పుడూ సవరజాతి మనిషివంక కన్నెత్తికూడ చూడను. యీ నేలమీద కాలుకూడా పెట్టను" అంటూ లెంపలు వాయించుకున్నాడు షేర్ ఖాన్.
"తియ్యరా పోతు. యీటె తియ్యి. ఆడి పానాలు ఆడికి దానమియ్యి" అన్నది కూచిపోతి.
ఆ అవకాశాన్ని తీసుకుని మెరుపులా లేచాడు షేర్ ఖాన్. ప్రాణభయంతో అరుచుకుంటూ పోయి గుడారాల మధ్య మాయం అయ్యాడు.
కూచిపోతికి మతిపోయింది. మరుక్షణంలో మొత్తం సవరల ప్రాణాలు పోతాయని ఆమెకు అర్ధమయింది. మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది ఆమెకు.
అదే గుడారంలో ప్రక్కన మరొక మంచంమీద ఆదమరచి నిద్రపోతున్న పసికందుని యెత్తి భుజాన వేసుకుంది. ఆమె చుట్టూ సవరలు దడికట్టారు అందరూ కలిసి గుడారం దాటి యివతలకు వచ్చేసరికి సైన్యం వాళ్ళని చుట్టుముట్టింది.
షేర్ ఖాన్ తన కొడుకు సవర పితూరీల పరం అయిపోవటంచూచి తల్లడిల్లిపోయాడు. సైన్యాన్ని ముందుకు పోవద్దని ఆదేశించాడు.
అతడు యెన్నో యుద్దాలలో గ్రామాలమీదపడి అనేక దురంతాలు చేశాడు. పాలు తాగుతున్న పసిపిల్లల్ని అలాగే తల్లి ఒడిలోనే నరికివేశాడు. పాలిచ్చే తల్లుల రొమ్ముల్ని కోశాడు. బాధతో వాళ్ళు విల విలా తన్నుకుంటూ వుంటే ఆనందించాడు. తలతో బంతులాట ఆడాడు. కాని తన ఒక్కగా నొక్క కొడుకు సవరలచేతిలో చిక్కేసరికి యెన్నడూ కలగనంత బాధ అతనికి కలిగింది. దుఃఖం అంటే యేమిటో తెలిసింది.
"ఓరోరి బిడ్డా! మంచికిపోతే మాయచేస్తవా! అడుగు ముందుకు పడిందంటే అయిపోతడు నీ గుంటడు" అంటూ పిల్లవాడి మెడమీద యీటె ఆనించింది కూచిపోతి. యెవ్వరూ ముందడుగు వెయ్యలేదు.
అందరూ చూతూ వుండగానే సవరలంతా చీకట్లో కలిసిపోయారు.
ఆ మర్నాడే గూడాలమీద పడి దోచుకు తింటున్న తన సైన్యాన్ని వెనుకకు పిలిపించి సవరలతో రాజీ ప్ర్రారంభించాడు షేర్ ఖాన్.
ఇటువంటిదే మరొక సంఘటన జరిగితే తన ప్రాణాలకు అపాయం కలుగుతుందని అతనికి తెలిసింది. వెంటనే అక్కడనించి పేష్ కష్ మాట దేవుడెరుగు, వచ్చినదారి పట్టాడు. మళ్ళీ శ్రీకాకుళం పోయాక తన కొడుకును తిరిగి తెప్పించుకునే ప్రయత్నాలు ప్ర్రారంభించాడు. బహుమతులు ప్రకటించాడు.
షేర్ ఖాన్ మన్యం అడవులు వదిలిపోయినాడని తెలిశాక కూచిపోతి పిల్లాడిని తీసుకుని అడవుల్లోనించి రంగవాక వచ్చింది తనకు 'పితూరి' అని ఒక బిరుదు వచ్చినందుకు విరగబడి నవ్వుకుంది.
కుడంగ్ ఒక ప్రచారం ప్రారంభించాడు. తాను ముగ్గువేసి అమ్మ తల్లిని పిలిచాననీ, ఆమెను కూచిపోతిలో ఆవేశింపచేసి పిల్లాడిని పట్టుకునేలా చేశాననీ చెప్పి అమాయకుల్ని నమ్మించాడు.
తల లక్ష్యం నెరవేరింది కాబట్టి అతడు యేం చెప్పుకుంటున్నాడన్న విషయం అంతగా పట్టించుకోలేదు కూచిపోతి పిల్లవాడి ప్రాణం తియ్యటానికి ఆమెకు జాలి అడ్డుపడింది. మన్యం అడవుల్లో రంగవాకకు దూరంగా వున్న నూకాలమ్మ గుడిలో పిల్లాడిని దాచి భద్రంగా పాడుతుంది.
అతడికి వేళకు నిప్పులమీద కాల్చిన కంజుమాంసమూ తేనె అందిస్తోంది. జీలుగుపిండితో కాల్చిన రొట్టెలు పంపుతోంది.
ఊళ్ళోకి తీసుకువచ్చి వుంచితే ప్రతీకారంతో మండిపడుతున్న సవరల్లో యెవరో ఒకరు అతడిని తునా తునకలుగా చేసేవారు ఆ ప్రమాదంనించి కాపాడేందుకే ఆమె ఆ కుర్రాడిని రహస్యంగా దాచింది.
షేర్ ఖాన్ పిల్లాడిని పట్టించి యిచ్చినవాళ్ళకి గొప్ప బహుమానం యిస్తాడని తెలియగానే అతని అనుగ్రహంకోసం అర్రులు దాచుతున్న చిన్న చిన్న రాజులు జమీందారులు యెగబడ్డారు.
ఆ పిల్లాడి చహరా తియ్యటం కొంతమందికి వుద్యోగం అయింది. కాని రంగవాకమీదికి యెవరి చూపులూ ప్రసరించలేదు.
సవరలూ, కోయలూ, కోదులూ వీళ్ళకి ఒక్కొక్కప్పుడు తగవులు వస్తాయి అవి తీర్చటం గోమంగో పని. కాని కొన్ని తగవులు తీర్చటం అతనికి తలకు మించిన పని అవుతుంది అప్పుడు వాళ్ళు యితరుల మీద ఆధారపడతారు.
లింగప్పదొర (బొబ్బిలి రంగారావుల మూలపురుషుడు) గొప్ప నేర్పరి. సవరలకు లింగప్పదొర అంటే వల్లమాలిన గౌరవం. అభిమానం. అతడు మన్యప్రాంతం గ్రామాల్లోకి వెంకటగిరినించి దత్తు వచ్చాడు.
పద్మనాయక ప్రభువులు రాచకొండ, దేవరకొండలను పరిపాలించే వారు. ఆ రాజ్యం విచ్చిన్నమైపోయి వాళ్ళంతా దేశంమీదికి వెదచల్లబడ్డారు. అలా వలస వచ్చిన పద్మనాయకవీరులు వెలమలు అయ్యారు.
వెంకటగిరి పద్మనాయకులది రాజరక్తం. మన్యం అడవుల్లోనూ రాజరక్తం కలిగిన పద్మనాయకులు వున్నారు. యెలా వచ్చారో యిక్కడ స్థిరపడ్డారు. వీళ్ళ కుటుంబాలలో యెవరికి అయినా సంతులేకపోతే వెంకట గిరినించి దత్తు తెచ్చుకుంటారు కాని మరొకచోట తెచ్చుకోరు.
అలా దత్తు వచ్చిన పద్మనాయక యువకుడే లింగప్ప దొర. మంచి ఆలోచనాపరుడు, చుట్టుపట్ల గ్రామాల్లో గొప్ప తీర్పరిగా పేరుపొందాడు.
నిలువెత్తు మనిషి యింతింత రెట్టా యింతింత కళ్ళూ, యింత వెడల్పున ఛాతీ! వింత వింత చూపులూ, యెత్తు అయిన నుదురూ! పెద్ద ముక్కూ, చెవుల మీద యింతింత పొడవు వెంట్రుకలూ, కాలికి వెండి కడియం. కిర్రుచెప్పులూ, పొన్నుకర్రా, దృఢత్వమూ, అందమూ కలబోసి నట్లు వుండే మనిషి. అంగ చాచి వేశాడంటే గజంన్నర.
చెవిమీద వెంట్రుకల బారులు తీరిన సైనికుల్లా కన్పిస్తాయి. కనురెప్పలు డొప్పల్లా వుంటాయి ఆ డొప్పలమాటున అధికంగా తేనె సేవించటం వల్ల మిలమిల లాడుతున్న కోడెదూడ కళ్ళలాంటి కాటుక కళ్ళూ, ముక్కు మీదినించి జుత్తులోకి వెళ్ళిన యెర్రని బొట్టూ, చెవులకు రాళ్ళపోగులూ, చెంగావి పంచీ, ఒత్తుగా పెరిగిన నుదుటి వెంట్రుకలూ యిదీ ఆయన ఆకార విశేషం.
పల్లెవాటు వేసుకుని పొన్నుకర్ర పట్టి నడుస్తూ వుంటే నేల అదురుతుంది గొంతు విప్పి మాట్లాడితే జలపాతం వినిపిస్తుంది. తప్పు చేసిన వారి ముఖంలోకి చూస్తే యెంతటివాడైనా గుండె దడ దడ లాడుతుంది నిజం కక్కించాలంటే ఆయన సూటిగా చూస్తే చాలు.