Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 22


    అతనికి ఒక మధూక వృక్షం వుండేది. అది పూచే పూలు అమ్ముకుంటే కోమటులు కొనేవారు. మధూకం చెట్టు అరుదైన చెట్టు  దాని పూలు అంటే సమాజంలోని ఆనాటి వున్నత వర్గాలకు చాల యిష్టం. డబ్బు పెట్టి కొనుక్కుంటారు ఆ పూలని. అవి అమ్ముకుని చిత్తి సంపన్నురాలయింది.
    చిత్రనాయకుడు చిత్తికీ, చిత్కళకీ సమంగా చెరొక కొమ్మా వంచి యిచ్చాడు. మన కధల్లో కల్పనకూ, కవిత్వానికీ కొదువ వుండదు.
    చిత్తికి యిచ్చిన కొమ్మ మామూలు పూలు పూస్తూ వుంటే చిత్కళకి యిచ్చిన కొమ్మ వాసన వచ్చే బంగారుపూలు పూస్తోందట. అవి అమ్ముకుని ఆమె మొదట భార్యకన్నా యెక్కువ డబ్బు కూడబెట్టింది.
    ఇది సవతులపోరు అయింది. యీ సృష్టిలో మగవాడు చెయ్యలేని పని యేదయినా వున్నదంటే అది సవతులపోరు తీర్చటమే గదా!
    పెద్ద భార్య తాకిడికి తట్టుకోలేక కొమ్మల పంపకం రివైజు చేశాడు చిత్రగాయకుడు. యీ రివిజన్ లో చిత్కళకు బంగారుపూలు యిస్తున్న కొమ్మ చిత్తికి వచ్చింది. చిత్తికి మామూలు పూలు యిస్తున్న కొమ్మ చిత్కళకి వచ్చింది. అయినా మళ్ళీ చిత్కళకే బంగారుపూలు దొరుకుతున్నాయి.
    ఇంకేముంది! సవతుల యుద్ధం అడవి తగలబడిపోతున్నట్లు ఆకాశ మెత్తు మంటలా లేచింది. చిత్రనాయకుడు విసిగిపోయాడు.
    చెట్టుమీద విసుగు పుట్టి గొడ్డలి తీసుకుని రెండు తుండాలుగా నరికాడు. అప్పుడు సవరలకు యిచ్చిన వరం ప్రకారం శివుడు అక్కడ ప్రత్యక్షమయినాడుట. శబరులకు శాపం తీరిందిట.
    ఈ కధ అంతా ముఖలింగేశ్వర ఆలయంలో శిల్ప కధలుగా చెక్కబడి వున్నది. కధకి కాళ్ళుండవు.
    ఎట్లా అయితేనేం యీ కథలో శబరులు సవరులగా మారిపోయారు.
    ఈ కధ విన్న తర్వాత సవరులు అంటే దక్షిణాదికి వచ్చిన దేవతలు కాబోలు అని నా కనిపించింది. యీ కధని తాత్త్విక అర్ధంలో ఆలోచిస్తే సవరులు ఆర్య ద్రావిడజాతుల సంకరంవల్ల పుట్టినవాళ్ళు అనిపిస్తుంది.
    "సంకరో నరకాయైన" అని గీత చెప్పినట్లు పాపం వీళ్ళు నాగరికతకు దూరంగానే మారుమూల దుర్గమారణ్యాలలో నరకప్రాయమైన జీవితంలో వున్నారు.
    అయితే వీళ్ళకి దక్షిణాత్యులయిన అనార్యులకు వుండవలసిన స్వేచ్చాప్రయత్నమూ, ఔత్తరాహులయిన ఆర్యులకు వుండవలసిన ముగ్ధ నైపుణ్యమూ రెండూ వున్నాయి. వాళ్ళ ప్రతినిధి కూచిపోతి.
    అనుకున్న విధంగా ఆమె తన పదిహేనుమంది పటాలంతో పెద్ద డేరాలవైపుగా దూసుకుపోతోంది. యెవరైనా సడివిని వచ్చి చూడబోతే కిక్కురుమని శబ్దం కాకుండా వాళ్ళని చంపుతోంది.
    పెద్ద డేరాలో అప్పుడే గానాబజానా ఆగిపోయింది. అందరూ అలసి సొలసి అస్తవ్యస్తంగా పది నిద్రపోతున్నారు.
    డేరాకు వెనుకవాటంగా వెళ్ళి చురికతో దాన్ని చీల్చింది కూచిపోతి. ఆమె లోపలకు వెళ్ళింది. మిగిలిన సవరలు డేరాను చుట్టుముట్టారు. డేరా ముందు కాపలా వున్నవాడిని నిశ్శబ్దంగా చంపివేశారు.
    కూచిపోతి లోపలకు వెళ్లి షేర్ మహమ్మద్ ఖాన్ ని తట్టి లేపింది. అతడు కళ్ళు విప్పి యెదురుగా యింతెత్తున నల్లగా జుట్టు విరబోసుకుని వున్న కూచిపోతిని చూచి నీరైపోయినాడు. లేవబోయినాడు. ఆమెతోపాటు గుడారంలోకి వచ్చిన సవర యువకుడు పదును అయిన యీటెని షేరు ఖాన్ నిలువుగుండెలమీద ఆనించి నిల్చున్నాడు. రవ్వంత బరువు ఆనిస్తే యీటె కస్సున దిగి గుండెల్ని చీల్చేస్తుంది.
    "ఏం కావాలి మీకు?" అరిచాడు షేర్ ఖాన్.
    "ష్.......ఓలోలి బిడ్డా అరవమోక. బాగా బలిసిన పందుల్ని చీల్చే యీటె అది. అదుపులో వుండు" అంటూ తల యెగురవేసింది కూచిపోతి. ఆమె మాట్లాడుతూ వుంటే తలమీద అలంకరించిన బాతు యీకలు విచిత్రంగా వూగుతున్నాయి. మెడమీదినించి రొమ్ములమీదికి వచ్చిన రాతి వెండి కడియం ఆమె ఆవేశానికి ఎగిరిపడుతోంది.
    ఆమెకు పెళ్లి కాలేదు. అవుతుందన్న ఆశ కూడాలేదు. యెందుకంటే, సవరజాతి యువకుడు పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులకు పూసలూ, యిప్పసారా, మాంసమూ తీసుకువెళ్ళి యివ్వాలి. అవి వాళ్ళు తీసుకుంటే పెళ్ళికి ఒప్పుకున్నట్లు అవుతుంది.
    అలా కాకపోతే చేతనయిన వీరుడు ఆ యింటి వారందరినీ ద్వంద్వ యుద్దంలో జయించి ఆ అమ్మాయిని తీసుకుపోవచ్చు. చాతకాకపోతే ఆ పోరాటంలో ప్రాణాలు అయినా పోగొట్టుకోవచ్చు.
    గోమంగోకు యెవరైనా పూసలు, యిప్పసారా, మాంసమూ యివ్వవస్తే అతడు పుచ్చుకోడు. ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా యెత్తుకుపోయేందుకు వస్తే తన కుటుంబప్రతినిధిగా తనే యుద్దానికి సిద్దం అవుతుంది కూచిపోతి.
    ఆమె గజం గుడ్డ మొలమీద దట్టీగా బిగించి తొడ చరిచి బరిలో నిలబడితే యెదిరించి బరిలోకి దిగే వీరుడే లేడు రంగవాకలో. అలాంటప్పుడు ఆమెకి పెళ్ళి యెలా అవుతుంది?
    అలా పెళ్ళి కాకుండా యెక్కువకాలం వుండగలిగిన ఆడది ఛాలంజీ రాణి అన్నమాట. మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా ఆమెకు మోకరిల్లాలి. చంద్రమండలంమీద కాలుపెట్టిన యువతిని మనం యెంత అబ్బురంగా చూస్తామో ఆమెను సవరలు అంత అబ్బురంగా చూస్తారు.
    పెళ్ళి కాకుండా వుండగలిగిన యువతికి అంత గౌరవం.
    కూచిపోతి షేర్ ఖాన్ గుండెలమీద కాలుపెట్టి తొక్కింది.
    "ఓలోలి బిడ్డా! సవర రగతంతో సరాగమాడ వచ్చావా? చచ్చేవన్న మాటే యిప్పుడు. బిడ్డా తెప్పరిల్లు యింకెప్పుడూ సవర గూడెంలో కాలెట్టనని నిన్ను కన్నతల్లిమీద ఆనసెయ్యి. పిడికెడు బిచ్చం వేసినట్టు నీ పానాలు నీకు దానం యిత్తాను. ఊఁసే స్తవా? సస్తవా?" అని అడిగింది కూచిపోతి.

 Previous Page Next Page