లింగప్పదొరకి షేర్ ఖాన్ చేసిన ప్రకటన తెలిసింది. సవరలు పలాస సమీపం అడవుల్లోనే అధికంగా వున్నారు. వాళ్ళ గూడాలకు యేకైక తీర్పరి లింగప్పదొర. ఆయనను చూస్తేనే వాళ్ళు వొంగి వొంగి నడుస్తారు.
లింగప్పదొర యీ ప్రకటన వినగానే కలికి చెప్పు వేసి, చేతికి కర్రయిచ్చి తలకు కుచ్చు తలపాగా చుట్టి బయలుదేరాడు. ఆయన కోడి కూతకు లేచి బయల్దేరితే భోజనంవేళకు నలభైమైళ్ళు నడుస్తారు. భోజనం చేసి రవ్వంత నడుంవాల్చి ప్రొద్దు తిరిగాక బయల్దేరితే మళ్ళీ భోజనం వేళకు యిల్లు చేరుకుంటారు. రోజుకి యెనభైమైళ్ళు పాదయాత్ర చెయ్యగలిగిన హార్సు పవరు కలవాడాయన.
అయిదారు సవరగూడాలను చూచాడు వాళ్ళదగ్గర పిల్లవాడి జాతకం తెలియలేదు. కులపెద్దలు అటువంటి ఆచూకీ దొరికితే తప్పకుండా తెలియచేస్తామని హామీ యిచ్చి గూడెం వెలుపలవరకూ ఆయనని సగౌరవంగా సాగనంపారు. తండ్రి తప్పుచేస్తే పిల్లవాడిని దండించటం యేమిటి అన్నది ఆయన తర్కం. యిటువంటి పెద్దమనిషి తరహా ఆలోచన భారతదేశాన్ని నిర్వీర్యం చేసి పరాయిరాజుల పాలనకి గురిచేశాయని కొందరంటారు. అది నిజమో కాదో కాని యిందువల్ల శత్రువులకి అలుసు చిక్కేమాట నిజం.
దేశాన్ని దోచుకుని, ప్రజల్ని హింసించి, కొట్టి, నరికివేస్తూ అక్కడి వాళ్ళని అవమానిస్తూ వుంటే వాళ్ళ విషయంలోనూ ధర్మబద్దంగా ఆలోచిస్తారు హిందువులు.
అది మంచితనం కావచ్చు. బలహీనత కావచ్చు. దానివల్ల నష్టాలే అధికం కావచ్చు మనవాళ్ళు ఆ ఆలోచన విడిచిపెట్టరు. యిప్పుటి కాలం వేరు. యిప్పటి ఆలోచనలు వేరు ధర్మంకన్నా ఆకలి తీర్చుకోవటం ముఖ్యం.
లింగప్పదొర ఆలోచిస్తూ రంగవాక వచ్చాడు. అల్లంత దూరాన వుండగానే దొరను చూచారు సవరలు. ఆఘమేఘాలమీద వార్త గోమంగోకు చేరింది, గోమంగో వెంటనే దొలబెహర, కుడంగ్ లను వెంటపెట్టుకుని యెదురువచ్చాడు. సాగిలపడ్డాడు.
లింగప్పదొరను ఆహ్వానించి గూడెంలోని తన గుడిసె దగ్గరకు తీసుకుపోయాడు తన ధర్మాసనం మీద లింగప్పదొరను కూర్చోపెట్టి తాను తన సహచరులతో ప్రక్కన వినయంగా నిలబడ్డాడు.
"ఏమి దొర వొచ్చినవు?" గోమంతో వినయవిధేయతలతో అడిగాడు.
"సవరలంటే సామాన్యులనుకున్నాను. మీ పేరు మొగలు పాదుషాకు చేరింది." మీసం సవరిస్తూ నవ్వాడు లింగప్పదొర.
గోమంతో మీసాల చాటునించి నవ్వాడు. మామూలుగా అయితే మీసం సవరించేవాడే! యెదురుగా వున్నది దొర కాబట్టి అంత పని చెయ్యలేదు. అతడు అమాయక ప్రాణి. ప్రకృతి ఒడిలో పుట్టి ప్రకృతి ఒడిలో పెరిగినవాడు కలాకపటం తెలియనివాడు. మాటనుమాటున పెట్టుకోవటం యెరుగడు. వెంటనే బైటపడిపోయాడు.
"కుర్రకుంకులు సేసిన్రుదొరా! అయిదు వేల సైన్యంలోకి జొరబడి గొప్ప సాహసమే సేసిన్రు. అమ్మతల్లి దయ సల్లగున్నది. లేకుంటే గుంటలు అక్కడే వుసుర్లు ఒదిలెయ్యాల్సింది" అంటూ అసలు సంగతి బయటపెట్టాడు.
లింగప్పదొర ఆశ్చర్యపోలేదు. యిట్లా వచ్చిందా కధ అనుకున్నాడు. లింగప్పదొర అనుభవంలోనూ, వూహలోనూ కూడా వాళ్ళు మూర్ఖులు వాళ్ళతో యెంతో జాగ్రత్తగా మాట్లాడాలి. యే పని చెయ్యాలన్నా, మానాలన్నాకూడా కులకట్టు అనే మాట వాళ్ళనోటంట రాకుండా చూచుకోవాలి.
ఆ మాట వాళ్ళనోటంట వచ్చిందంటే యిహ ప్రాణమయినా యిస్తారు కాని మాట మార్చుకోరు. బ్రహ్మంతవాడు చెప్పినా వినరు.
"ఆ గుంటడిని సంపెయ్యాలని కులకట్టు నిర్ణయం" అన్నారంటే యిహ ఫాలాక్షుడు కూడా వాళ్ళని వెనక్కు మళ్ళించలేరు. అది మంచిపని అయినా, చెడ్డపని అయినా, యెంత క్రూరమయిన ఘోరమయిన పనిఅయినా చేసి తీరుతారు. అందునించి వాళ్ళ కులకట్టు పరిధిలోకి యీ కుర్రాడి వ్యవహారం రాకుండా తప్పించుకుంటూ మాట్లాడాలి.
లింగప్పదొరది వ్యవహారం తెలిసిన బుర్ర కాబట్టి యివన్నీ ముందుగా వూహించి ఆ దారి తప్పించి మాట్లాడాడు.
"కుర్రకుంకలు కాక పెద్దవాళ్ళు, అన్నీ తెలిసినవాళ్ళు యెందుకు చేస్తారీ పని యిటువంటి పని నువ్వూ, నేనూ చెయ్యమంటే చేస్తామా? తండ్రి తప్పుచేస్తే కొడుకుని శిక్షపాలు చెయ్యటం తప్పుకాదూ! యిటువంటి పనిని అమ్మతల్లి కోపగించుకోదూ!" అంటూ మెల్లగా అంటించాడు నిప్పు.
అది రాజుకుని మంట అయింది. ఆ మంటలు అలా అలా పెరిగివ్యాపించి కూచిపోతి ఆశల్ని, వ్యక్తిత్వాన్ని అవి కాల్చివేసినాయి.
గోమంగో, దొలబెహర, కుడంగ్ ముగ్గురూ కనుసైగలు చేసుకుని కుర్రవాడి విషయంలో తాము తొందరపడ్డామనే నిర్ణయానికి వచ్చారు.
కూచిపోతి అడవిలోకి వేటకుపోయింది. ఆమె మామూలుగా వెళ్ళే దారులవెంట మనుషుల్ని పంపారు. ఆ వెళ్ళినవాళ్ళు చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు. కూచిపోతి జాడ తెలియలేదు.
ఆ పూట లింగప్పదొర రంగవాకలో మకాం చెయ్యకతప్పలేదు. గోమంగో తన యింటిని అలంకరించి దొరకు యిచ్చాడు, ఆ రాత్రి మకాం చెయ్యటానికి. దొర లోపలకు వెళ్ళగా అందరూ వాకిలిముందు కూర్చున్నారు. పొద్దు వాలిపోతోంది. కూచిపోతో రాలేదు.
సూర్యుడు యెర్రబడి చెట్ల సముద్రంలో మునిగిపోతున్నాడు. చెట్ల చివర్లు రక్తవర్ణంతో మెరుస్తున్నాయి. ఎండ నేల తాకటంలేదు. పక్షులు అన్నీ గూటికి చేరినాయి. కీచురాళ్ళ రొద ఆరంభం అయింది. నెగడు వెలిగించారు యెండిన సొరకాయ డొప్పలోంచి యిప్పహరా గొంతుల్లోకి ప్రవహిస్తోంది. అడవిలో జంతువుల అరుపులు విన్పిస్తున్నాయి. పిల్లలంతా యీతాకు చాపలమీద పడిపోయారు. చీకటిని చీల్చుకుని పదే పదే దాడివంక చూస్తున్నాడు గోమంగో!