"ఎవరు చెప్పారు మీకలా అని?" అడిగాడతను.
"మన పక్కింటి శ్రీధర్ చెప్పాడు బాబాయ్"
"అవున్రా! ఎవరో దుర్మార్గులు చంపేశారు------"
"బాబాయ్! వాళ్ళను మనం చంపేద్దామా!" కోపంగా అడిగాడు శంకు.
సృజన్ ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు కన్నీటితో.
"చంపెద్దాం రా! తప్పకుండా చంపుదాం! అన్నాడు కన్నీరు తుడుచుకుంటూ.
"మేము కూడా నీతో వస్తాం బాబాయ్..."
"వద్దు! మీరు అమ్మ దగ్గరే వుండండి! నేనిప్పుడే వస్తా - ఒరే స్వరూప్! వదినను జాగ్రత్తగా కనిపెట్టి వుండు--" స్వరూప్ తో చెప్పి రంగాను తీసుకుని పోలీస్ స్టేషన్ కి బయల్దేరాడతను.
ఇన్ స్పెక్టర్ రాహి అతనిని చూస్తూనే ఆహ్వానించాడు.
"మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మీ వాళ్ళు వచ్చారా?"
"వచ్చారు సార్......"
"వెరీ గుడ్! అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేశాను---ఎన్ని గంటలకు చెయ్యాలనుకుంటున్నారు."
"మేము సిద్దంగానే ఉన్నాము........"
అయితే ఇంకో గంటలో మీరు మార్చురీ దగ్గరకు వచ్చేయండి. అక్కడి నుంచి వాన్ లో శ్మశానానికి వెళ్దురుగాని........"
"అలాగే" అంటూ సంకోచంగా నిలబడ్డాడు.
"ఇంకేమిటి? ప్రస్తుతానికి నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు . ఈ అంత్యక్రియలకు ఎంత ఖర్చవుతుందో తెలీదు. ఎంతయినా గానీ నేను ఓసారి మా ఇంటికెళ్ళితే పంపగలను ఈలోగా.........."
యిన్ స్పెక్టర్ చిన్నగా నవ్వాడు.
"మీకు చెప్పటం మర్చిపోయాను....ఈ ఊళ్ళో దీనజన సేవా సమితి అనే సోషల్ ఆర్గనైజేషన్ వుంది. మీలా నిస్సహాయపరిస్తితులల్లో వున్నవారికీ, బీదలకు సహాయం చేస్తుందది అంటే ఉచితంగా దహన క్రియల ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు."
"అలాగా! అయితే సమస్య లేద్సార్! ప్రస్తుతం వాళ్ళా ఏర్పాట్లన్నీ చూస్తే తరువాత నేను వారికి డబ్బు కట్టేయగలుగుతాను........"
"వాళ్ళు ఉచితంగా చేస్తారని చెప్పాను కదా?"
"అది బహుశా మాలాంటి వాళ్ళ కోసం అయుండదు సార్! దిక్కు లేని శవాల అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసి వుంటారు. అలాంటి పవిత్రమైన ధర్మాన్ని అంతో ఇంతో ఆర్ధికస్థోమత వున్న మాలాంటి వాళ్ళు దుర్వినియోగం చేయకూడదు......"
"అల్ రైట్! అది మీ ఇష్టం........సరే! మీరు వెళ్ళండి. మార్చురీ దగ్గరకు నేను వస్తాను-------"
"అలాగే సార్"
సృజన్ , రంగా హోటల్ కు బయలుదేరారు మళ్ళీ.
"అన్నయ్యాను ఎవరు చంపారో ఏమయినా తెలిసిందంట్రా?" అడిగాడు రంగా.
"ఇంతరవరూ ఏమీ తెలీలేదు, అన్నయ్య ఛాతిలో దొరికిన పిస్టల్ గుండును బట్టి ఎవరో రివాల్వర్ తో కాల్చి చంపినట్లు తెలుస్తోందట. అలాంటి రివాల్వర్లు ఈ ఊళ్ళో ఎవరెవరి దగ్గరున్నాయో చెక్ చేయటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు."
"ఎక్కడ మర్డర్ చేశారట--"
"ఊరి బయట రోడ్ మీద పడి వుండగా చూశారట...అన్నయ్య లాంటి మంచి వ్యక్తిని చంపటానికి ఎవరికయినా మనసెలా వచ్చిందో తెలీటం లేదు."
"ఆ తరువాత ఇద్దరూ మౌనంగా నడిచి హోటల్ చేరుకున్నారు.
గదిలోకి అడుగు పెట్టగానే భారతి కనిపించిందతనికి.
"ఓ! వచ్చేశారా?" అడిగాడతను.
"అవును! నా వల్ల అలస్యమేమీ కాలేదు కదా! ఆఫీస్ కెళ్ళి ఇవాల్టికి ఒకరోజు శెలవు పెట్టి వచ్చాను. అందుకని కొంచెం ఆలస్యమయింది."
"సరయిన టైముకే వచ్చారు -------కానీ ఆఫీస్ కి ఎందుకు శెలవు పెట్టినట్లు?"
"మీ వదినకు తోడుగా నేనుండటం వల్ల మీకు కొంత ఇబ్బంది తప్పుతుందని........."
అప్పుడు గానీ స్పురించలేదు సృజన కి. ఈ సమయంలో సుభద్రకు మరొక స్త్రీ తోడుగా వుండటం చాలా అవసరమని.
"ఇదిగోనండి! వెయ్యి రూపాయలు సంపాదించగలిగాను-------" అంటూ బాగ్ లోనుంచి పది వంద నోట్లు తీసి అతనికిచ్చింది.
"భారతిగారూ! మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీటం లేదు" ఉద్వేగంతో అన్నాడతను.
"ఇందులో నేను చేసిన సహాయమేమీ లేదులెండి."
అప్పటికప్పుడే అందరూ అటోల్లో మార్చురీకి బయలుదేరారు.
దహన క్రియలన్నీ జరిగేసరికి మధ్యాహ్నం రెండయింది. ఆ ఏర్పాట్లన్నీ చేసిన "దీనజన సేవాసమితి" వలంటీర్ దగ్గరకు నడిచారు సృజన్.
"నమస్కారం సార్! మీరెంతో సహాయం చేశారు మాకు! ఈ ఏర్పాట్లన్నీ మీకయిన ఖర్చు చెప్తే నేనిచ్చేస్తాను" అన్నాడతను.
అతను చిరునవ్వు నవ్వాడు.
"మా సంస్థ వ్యాపారసంస్థ కాదు నాయనా! సమాజానికి సేవ చేయడానికి ఉద్దేశించబడింది."