Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 22


    
    ఆలోచిస్తూ, ఉత్త చేతులతోనే అన్నం గిన్నె దించబోయింది. చుర్రుమని చెయ్యి అంటుకుపోయినట్లయింది.
    
    "అబ్బ!" అని బాధగా అంటూ, అన్నం గిన్నె వదిలేసింది. అన్నం దొర్లిపోయింది. వేడివేడిగా ఉన్న మెతుకులు పాదాలమీద పడ్డాయి.
    
    నిస్సహాయతతో, బాధతో శారదకి పట్టలేని దుఃఖం వచ్చింది. అన్నం గిన్నెలోకి ఎత్తే ప్రయత్నం చెయ్యకుండా, మోకాళ్ళమధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వుండిపోయింది.
    
    "శారదా!" అంటూ కంగారుగా వంటింట్లోకి వచ్చాడు శంకర్రావు. "ఏమయింది?"
    
    ఏమయింది? ఒక రాక్షసుడు తనని.....తలుచుకుంటే వెగటుగా వుంది.
    
    కడుపులో దేవినట్లయింది. వాంతి అయిపోయింది శారదకు.
    
    "ఏమయింది? ఏమయింది?" అంటున్నాడు శంకర్రావు.
    
    ఏమయిందో ఇప్పుడు అర్ధమయింది శారదకి. జరిగింది ఇక మర్చిపోవడానికి వీల్లేకుండా, చిరకాలం ఉండే గుర్తులా, ఇప్పుడు తనకి.....నెల తప్పింది. అందుకే కొద్ది రోజులుగా పొద్దునపూట లేవగానే నీరసం, వికారం....
    
    ఆమెని లేవదీసి పెరట్లోకి తీసుకెళ్ళాడు శంకర్రావు. గోడవారగా కూర్చోబెట్టీ చెవులు గట్టిగా మూశాడు.
    
    వద్దు వద్దని వారిస్తూనే వుంది శారద.
    
    "ఏమిటీ విశేషం?" అంది పంపు దగ్గర వున్న దుర్గ వాళ్ళ అమ్మ, అంట్లు తోమడం ఆపి నవ్వుతూ.
    
    'విశేషమే! నేను సుధీర్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను' అనుకుంది శారద అక్కసుగా.
    
    "పద! డాక్టరుగారి దగ్గరి కెళ్దాం" అన్నాడు శంకర్రావు ఆదుర్దాగా. "నెల రోజుల్నుంచి నేను మొత్తుకుంటుంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు మరి!"
    
    "ఏమీ అక్కరలేదయ్యా, బాబూ! ఆ కొట్టుదాకా వెళ్ళి ఒక సోడా తెచ్చిపెట్టు! అదే సర్దుకుంటుంది. ఇక నుంచీ ఆ కొట్టుకి తేపతేపకీ తెగ తిరుగుతావులే-పిప్పరమెంట్లనీ, చాక్లెట్లనీనూ!" అంది ఆవిడ నవ్వుతూ.
    
    శంకర్రావు ఉబ్బిపోయాడు. నిజంగా బాబాగారి మహత్యం! ఆయన పొద్దున చెప్పాడు. అది మధ్యాహ్నానికి నిజమైపోతోంది!
    
    శారదని ఇంట్లోకి నడిపించుకు వచ్చి, ఆమెని కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు శంకర్రావు.
    
    "శారదా! ఒక సుఖం అందుబాటులో కొచ్చి అలవాటైపోయాక, అందుబాటులోలేని ఇంకో సుఖం మనసుని భూతంలా ఆక్రమించేసుకుని, శాంతి లేకుండా చేస్తూ వుంటుంది. నీతో సంవత్సరం పాటు స్వర్గ సుఖాలూ అనుభవించేసిన తర్వాత, 'మనకి పిల్లల్లేరే!' అన్న చింత, చింతగింజ ప్రమాణంలో మొదలయి, చింతచెట్టులా బ్రహ్మాండంగా పెరిగి వేళ్ళు తన్నుకుపోయి, నాసంతోషంమీద తన నీడని పరిచేసింది. ఎంతమంది దేముళ్ళకి మొక్కాం! ఎంతమంది బాబాల చుట్టూ తిరిగాం! మళ్ళీ దేముడితో ఆర్గ్యుమెంట్ మొదలెట్టాను. 'దేముడా! నాకు చక్కటి పెళ్ళాన్నిచ్చావ్, ఆ పెళ్ళానికి పండంటి పాపల్ని ఎందుకివ్వవూ?' అని.
    
    "దేముడు మళ్ళీ నా ఆర్గ్యుమెంటుకి లొంగాడు, శారదా! నేను కాంపౌండరుగాణ్ణి కాకుండా లాయర్నయి ఉంటే బాగుండేదేమో! దేముణ్ణి కూడా అదరగొట్టేసేవాణ్ణి."
    
    అనుమానంగా అతనివైపు చూసింది శారద.
    
    "శివరావుగారని ఒక పెద్దమనిషి, పాము మంత్రం అవీ వేస్తుంటారట! ప్రశ్న చెబుతారట. మన రామ్మూర్తి తీసుకెళ్ళాడు."
    
    శారద కళ్ళలో భయం కనబడింది. ఏం చెప్పాడాయన? ఏం చెప్పి వుంటాడు?
    
    "నన్ను చూడగానే చెప్పేశారు, శారదా! 'నీ భార్య గర్భవతి అవుతుంది' అని! అలా చెప్పి నా మొహంలోకి విచిత్రంగా చూశారు. 'ఈ కేతిగాడికి కూడా పిల్లలమీద భ్రమ ఏమిటి?' అనుకున్నాదేమో!"
    
    "ఇంకేం చెప్పారు?" అంది శారద అప్రయత్నంగా.
    
    "ఇంకేం చెప్పలేదు. సరిగ్గా ఒకే ఒక్క ముక్క చాలు అన్నట్లు. అనవసరమైన మాటలు వంద ఎందుకు శారదా! విలువైన ఆ ఒక్క ముక్కా చాలదూ?" అన్నాడు.
    
    శారద తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తను ఈ నిమిషంలో చనిపోవడానికి సిద్దం!
    
    కానీ, కానీ, దోషిలా ఆయన ముందు నిలబడి సంజాయిషీ చెప్పుకోలేదు. ఆ వూహే దుర్భరం. ఆ సన్నివేశాన్ని ఎదుర్కొనే బదులు వెయ్యిచావులు చావడానికి తను తయారుగా వుంది.
    
    ఇంక ఆ సమయ మొచ్చేసింది. ఇంక ఎవ్వరూ తనని ఆపలేరు.
    
    "నీకూ ఒక్క కొడుకు పుడితే, ఆ తరవాత నువ్వూ, నాబాబూ ఉంటే నాకు చాలు. శారదా! ప్రపంచంలో ఇంకేమీ అక్కరలేదు నాకు. ఇంకెవర్నీ ఇంకేమీ అడగను. ఇంక కంప్లెయింట్స్ ఉండవు?" అని, ఆమెని వూపిరి తిరక్కుండా కావలించుకున్నాడు.
    
    శారదకి బక్క కోపం వచ్చింది. తనని చనిపోనీయకుండా ఈయన!
    
    "లేవండి! అవతల పనులు తగలబడిపోతున్నాయి. మనమిట్లా కూలబడిపోతే ఎలా?" అంది విసురుగా.
    
    శంకర్రావు విస్తుబోయి చూశాడు. పిల్లిలా అయిపోయి, ఆమె కోపం ఎందుకో అర్ధం కానట్లు భయంగా చూశాడు.

 Previous Page Next Page