Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 22


    చిన్మయికి కూడా వెళ్ళటానికి ఇష్టంలేదు. కాని మంజుభార్గవి చాలారోజుల తర్వాత వచ్చి ఆప్యాయంగా పిలిచింది. ఇది చాలా చిన్న సందర్భమే కావచ్చు. కాని ఆమెగా ఆమె వెతుక్కుంటూ వచ్చి పిలవటం చిన్మయిని ఏమాత్రమో కదిలించింది. అంతేకాకుండా మనిషిలో ఓ విచిత్రమైన గుణముంటుంది. ఒకరిమీద ఎంత విముఖత్వమున్నా దూరంగా కనిపించకుండా వుండి చాలా రోజుల తర్వాతో, సంవత్సరాల తర్వాతో కనిపిస్తే అనుకోకుండా సాఫ్టు కార్నర్ ఏర్పడుతుంది.
    
    మర్నాడు సాయంత్రం రాజీవ్ ఆఫీసునుండి వచ్చాక అతనితోబాటు మంజుభార్గవి యింటికి వెళ్ళింది. కిరణ్మయిని కూడా తీసుకెళ్ళారు.
    
    మంజుభార్గవి పార్టీ ఆడంబరంగానే చేసింది. అతిథులు చాలామంది వచ్చారు.
    
    పార్టీ డాబామీద ఏర్పాటు చేశారు.
    
    చిన్మయి తాను తెచ్చిన ప్రెజెంటేషన్ మంజుభార్గవికి ఇవ్వటానికి దగ్గరకు వెళ్ళింది.
    
    "బాబుని చూశావా?" అని అడిగింది మంజుభార్గవి.    

    "ఏడీ?"
    
    "అదిగో! రజనీకాంత్ దగ్గర వున్నాడు. రజనీ ఇటురా" అని పిలిచింది.
    
    బాబునెత్తుకొని రజనీకాంత్ అటుకేసి వచ్చాడు. చిన్మయికి యిరకాటంలో పడినట్లయి ఏంచెయ్యాలో తెలీక మౌనంగా వూరుకుంది.
    
    "బాబునెత్తుకోండి" అంటూ రజనీకాంత్ అందించాడు.
    
    బాబు ముద్దుగానే వున్నాడు. కాని అతని చేతుల్లోంచి అందుకోవాలంటే ఎలాగో అన్పించి మంజుభార్గవికోసం తల ప్రక్కకి త్రిప్పింది. అదే సమయానికి ఎవరో పిలిస్తే అటుకేసి తిరిగి మాట్లాడుతోంది. చిన్మయికి తప్పలేదు.
    
    చేతులు జాపి అందుకుంది. బాబును అందించేటప్పుడు అతను కావాలని చేతులు తగిలించడం ఆమె గమనించకపోలేదు. ఒక్కక్షణం వళ్ళంతా దహించినట్లయి బాబునెత్తుకునే దూరంగా తప్పుకుంది.
    
    పార్టీ గంటా గంటన్నరసేపు జరిగింది. నిఖిలేశ్వర్ కన్నా వచ్చిన ఆహుతులందర్నీ రజనీకాంత్ పలకరిస్తూ వుండటం, ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ వుండటం ఆమెకేమీ ఆశ్చర్యమనిపించలేదు. బాధ్యతంతా అతనికి వదిలేసి నిశ్చింతగా వుండటంమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది.
        
    చేతుల్లో వున్న బాబుమొహంలోకి ఏదో అనుమానం తోచి పరిశీలనగా చూసింది. కొంపతీసి వీడు... ఆ రజనీకాంత్...
    
    మళ్ళీ ఛీ అనుకుంటూ ఆ ఆలోచనను త్రోసిపుచ్చింది. కాని ఆ అభిప్రాయం మనసులోకి ప్రవేశించాక వాడినిహ ఎత్తుకోలేకపోయింది. ప్రక్కనించి పోతున్న మంజుభార్గవికందించి దూరంగా తప్పుకుంది.
    
    భుజంమీద ఎవరిదో చెయ్యి పడినట్లయి ఉలిక్కిపడి తలత్రిప్పి చూసింది.
    
    ఆనంద.
    
    "మీరా?" అంది.
    
    ఆనంద మునపటిలాగే వుంది. ఈ నాలుగయిదేళ్ళలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా లేదు.
    
    "బావున్నారా?" అని పలకరించి "యిన్నాళ్ళలో ఒకసారి కూడా ఆకనిపించలేదేం?" అనడిగింది ఆనంద.
    
    "కారణమేం లేదండీ మీరెలా వున్నారేం?"
    
    "నాకు సుఖం ఎక్కడ వుంటుంది చిన్మయిగారూ? నా మొగుడివల్ల బొత్తిగా మనశ్శాంతి లేకుండా వుంది. ఈవేళ మంజుభార్గవిగారింట్లో ఫంక్షన్ వుంది. తొందరగా రమ్మన్నానా? ఇంతవరకూ పత్తాలేడు. చూసి చూసి విసుగుపుట్టి ఇహ బావుండదని ఒక్కదాన్నీ వచ్చేశాను. అబ్బే! అతనితో వేగడం కష్టమండీ. మనిషిలో మార్పు వస్తుందేమోనని యిన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇహ లాభంలేదు. విడాకులిచ్చిపారేస్తాను."
    
    ఆ మాట వింటూంటేనే చిన్మయి వళ్ళు జల్లుమంది. "సరిపెట్టుకోవాలి గానీ... అంతంత పెద్దమాటలు..."
    
    "నా మొగుడి గురించి తెలిస్తే మీరా మాటలు అనరు. మీ మొగుడిగారి సంగతి నాకు తెలీదుగాని, అయ్యో... ఈయనతో సరిపెట్టుకోవటమా? అర్ధరాత్రి ఏ మండలతోనో కులికి... తర్వాత నాతో... ఛీ ఛీ ఈ కాపరం నేను చెయ్యలేను."
    
    "భర్త లేకుండా ఆడదానికే..."
    
    "ఏం? బతకలేననా? హాయిగా బతుకుతాను. ఎక్కడన్నా వంట చేసుకుని బతుకుతాను. అంట్లు తోముకుని బతుకుతాను. లేకపోతే వళ్ళమ్ముకున..."
    
    కంకర రాళ్ళు...
    
    చిన్మయి భరించలేక "మా పాప ఏడుస్తోంది. నే వెడతాను" అంటూ అక్కడ వుండకుండా వచ్చేసింది.
    
                                                                * * *
    
    రాజీవ్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. చిన్మయి అతని ప్రక్కనే కూర్చుంది. కిరణ్మయి ఆమెవళ్ళో తలపెట్టుకుని నిద్రపోతోంది.
    
    "చిన్మయీ! నువ్వు కారు డ్రైవింగ్ నేర్చుకోమంటే నేర్చుకోవేం?" అనడిగాడు రాజీవ్.
    
    "నా ఉద్దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం కారులో తిరగటమన్నా కారు డ్రైవింగన్నా ప్లెజెంట్ గా వుండేది. ఇప్పుడు రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా, రోడ్డుమీద అడుగడుక్కి అడ్డంకుల్లో, రోడ్ సెన్స్ లేని ప్రజానీకం... ఇప్పుడు కారంటే టెన్షన్ తప్ప సరదా ఎక్కడుంది? బాంబేలో కారున్నవాళ్ళు కూడా వాటిని యిళ్ళదగ్గరే వదిలేసి ఎలక్ట్రిక్ ట్రైన్స్ లో తిరుగుతూంటారని విన్నాను. ఒకప్పుడు మద్రాసు చాలా డీసెంట్ గా వుండేది. ఇప్పుడు ఇది కూడా బాంబేలా తయారయిపోతుంది" అంది చిన్మయి.
    
    రాజీవ్ కారు డ్రైవింగ్ చేస్తోన్నప్పుడల్లా ఆ టెన్షన్ అనుభవిస్తున్నవాడే గనుక ఆమె మాటలతో పూర్తిగా ఏకీభవించాడు.
    
    "ఏమండీ! ఒక్కమాట."
    
    "ఏమిటి?"
    
    "భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాలు సఖ్యతగా కాపరం చేసి అర్ధంలేని గొడవలు పెట్టుకుని విడిపోవడం దేనికి?"
    
    "గొడవలకు మనిషి అతీతుడు కాదుగనుక."

 Previous Page Next Page