Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 22


    
    పొద్దున్నే  లేచి ఎవడి మొహం చూశాన్రా బాబూ అనుకుంటున్నాడు.
    ఇంతలో స్టేషన్ బయట కోలాహలం ప్రారంభమయింది.
    కానిస్టేబుల్స్ లోపల జనం సంగతి మరచి బయటికి పరిగెత్తారు.
    "గీత... గీత...."
    "అవును గీతే...."
    "ఎందుకొచ్చినట్టు?"
    "ఏమో! కేసు పెట్టడానికే అయుంటుంది"
    రకరకాల వ్యాఖ్యలు.
    కానీ వాటిని లక్ష్యపెట్టకుండా కారు దిగి తిన్నగా  స్టేషన్ లోపలికి వచ్చింది గీత.
    తిన్నగా అవధాని దగ్గరకొచ్చి అతని కెదురుగా వున్న కుర్చీలో కూర్చుందామె.
    గీతను చూడగానే రమాదేవి తిరిగి ఆలోచనలో పడిపోయింది.
    'ఈ అమ్మాయి ఎందుకొచ్చినట్టు? కేసుని మరింతగా జటిలం చేయడానికి కాదు కదా!'  అని కంగారుపడసాగింది.
    గీతని చూసి అవధాని కనుబొమలు విచిత్రంగా ముడుచుకున్నాయి.
    అప్పటివరకూ డి. జి. పి. తన అంకుల్ అనీ  హోమ్ మినిస్టర్ తన చినమామగారనీ అదరగొట్టేసింది లెక్చరర్ రమాదేవి.
    ఇప్పుడు తిరిగి ఈ కొత్త శాల్తీట
    'ఛీఫ్  మినిస్టర్ కూతుర్నంటుందో, కోడల్నంటుందో....'
    ఖర్మ! ఈ పోలీసు ఉద్యోగాలు ఏం పాపం చేస్తే దొరుకుతాయో!
    "ఇన్స్ పెక్టర్ ... నా పేరు గీత......"
    "అయితే ఏమిటి?"
    "అభినయ్ ని మీరు వెంటనే విడిచిపెట్టాలి"
    "నువ్వెవరి రికమెండేషన్ తో వచ్చావు?"
    "నాన్సెన్స్ ... నేను పి. పి. ధర్మారావుగారి కూతుర్ని!"
    ఉలిక్కిపడ్డాడు అవధాని.
    "వ్వాట్ మిస్....."
    "అవును నేనే ... మా డాడీ, మీరు కూడా చాలా పొరపాటు చేశారు" అంది గీత.
    రమాదేవి కళ్ళు మెరుస్తున్నాయి.
    ఆప్యాయంగా గీత భూజంమీద చేయివేసింది రమాదేవి.
    "అంటే?" ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్ పెక్టర్.
    "అభినయ్ నా మీద ఏ విధమైన ఆత్యాచారం చేయలేదు" అంది గీత.
    పి.పి. గారు తనకి కంప్లెయింట్ యిచ్చారు. అభినయ్ పూర్ణతో తను నేరంచేసినట్లు ఒప్పుకోవడం తన చెవులతో తను విన్నాడు. కానీ ఈ అమ్మాయి....?
    "మీ డాడీ పర్సనల్ గా ఫోన్ చేసి రిపోర్టు ఇచ్చారమ్మా" అన్నాడు ఇన్స్ పెక్టర్ అవధాని.
    "ఎవరో కాలేజీనుంచి డాడీకి తప్పుడు సమాచారం యిచ్చారు. ఐనా నాకేదన్నా జరిగితే నేను కదా రిపోర్టు  యివ్వాల్సింది. నేను రిపోర్టు యివ్వకుండానే అతన్ని మీరు అరెస్టు చేస్తారా?" అడిగింది గీత.
    "అసలేదో ఒకటి జరగకపోతే ఇంత గొడవ కాదు కదా మేడం?"అన్నాడు ఇన్స్ పెక్టర్.
    గీత అతనికేసి సీరియస్ గా చూసింది.
    "నేను కాలుజారి పడబోతే అభినయ్ యాధృచ్చికంగా నన్ను పడకుండా పట్టుకున్నాడు.  పడిపోతానేమోనన్న భయంతో నేనే అతన్ని గట్టిగా కైగలించుకున్నాను. దట్సాల్" అంది గీత.
     అవధానికి మతిపోతోంది.
    "అతన్ని వెంటనే విడిచిపెట్టండి."
    "204" పిలిచాడు అవధాని.
    కానిస్టేబుల్ వచ్చి నించున్నాడు అతని ముందు.
    "అభిన్ ని బయటికి తీసుకురా"అన్నాడు.
    204 సెల్ లోకి వెళ్లాడు.
    "ఏయ్, లే.... లేవవయ్యా బాబూ!" అని తట్టాడు అతన్ని.
    అభినయ్ కదలలేదు. చలనంలేదు.  అతనిలో.
    కానిస్టేబుల్ అతన్ని తట్టి లేపబోయాడు. అభినయ్  పక్కకి ఒరిగిపోయాడు.
    అతని శరీరం  చల్లగా వుంది.
    204 ఉలిక్కిపడ్డాడు.
    కంగారుగా బయటికి పరుగెత్తుకొచ్చాడు.
    "సార్... సార్.... అతను కదలడంలేదు" అన్నాడు.
    అవధాని నిర్ఘాంతపోయాడు.
    "చచ్చిపోయాడేమో సార్!" కానిస్టేబుల్ సన్నగా వణికిపోతున్నాడు.
    "మరో లాకప్ డెత్!" ఎవరో అరిచారు.
    ఆ మాటతో స్టూడెంట్స్ బిల బిలమని పోలీసు స్టేషన్ లోకి దూసుకొచ్చేస్తున్నారు.
    పోలీస్ స్టేషన్ యుద్దభూమిగా మారబోతున్న వాతావరణం నెలకొంటోంది.
    రమాదేవికి కాళ్ళకింద భూమి పాతాళానికి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది.
    గీత మేడం చేతిని గట్టిగా పట్టుకుంది.
    "అభినయ్ చనిపోయాడా?" అప్రయత్నంగా ఆమె నోటినుంచి మాట నీరసంగా వెలువడింది.
                                    11
    ఇన్స్ పెక్టర్ అవధానికి పరిస్థితి పూర్తిగా విషమించినట్టుగా అర్దం అయిపోతోంది.
    ధైర్యం దిగజారిపోతోంది.
    జనం రెచ్చిపోయేలా వున్నారు.
    వాళ్ళని అదుపు చేయలేకపోతే తను పీక లోతు ఊబిలో కూరుకుపోతాడు.
    "ఏయ్! ఆగండి. ఇప్పుడేం జరిగిందని అల్లరి చేస్తున్నారు?"
    "ఇంకేం జరగాలి?" కోపంగా ప్రశ్నించాడు పూర్ణ
    ఇన్స్ పెక్టర్ రివాల్వర్ తీసి చేత్తో పట్టుకుని సెల్ లోపలికి నడిచాడు.
    "204 నీళ్ళు తీసుకురా!" అరిచాడు అవధాని.
    "కూల్ డ్రింక్  తేనా సార్!" వినయంగా అడిగాడు.
    "షటప్! నీళ్ళు తెమ్మంటున్నాను."

 Previous Page Next Page