"ఈ తంతు జరిగేటప్పుడు చెప్పులు పెడతారుగదా చెప్పులు నాకొద్దు బూట్లు కావాలి. అవీ యాక్షన్ కంపెనీవి... లేసులుండాలి" అని కోరాడు.
నాకైతే అతని చెంపలు వాయించాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాను. ఇలాంటివాణ్ని ప్రేమించడం సాధ్యం కాని పని అందుకే చాలా జంటల్లో పెళ్ళి సంబంధమే కానీ ప్రేమబంధం వుండదు.
అన్నిటికీ నాన్న ఒప్పుకున్నాక నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. మరో ఇరవై రోజుల్లో వుండే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.
పెళ్ళికొడుకు వాళ్ళు ఉదయం వెళ్లగానే మా ఇంట్లో పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి.
పెళ్ళంటే వుండాల్సిన థ్రిల్ గానీ, పట్టలేని ఆనందంగానీ, లేవు. పైపెచ్చు ఏదో చెప్పలేని దిగులు నాలో పేరుకుపోయింది.
డబ్బు కోసం గడ్డి తినే ఆ మనుషుల మధ్య జీవితం మీద మమకారాన్ని పోగొట్టుకోకుండా ఎలా బతకాలాన్న ఆలోచనే నాకు. అందుకే పుట్టింటినుంచి ఆ అపురూపమైన కానుక నొకదానిని తీసుకువెళ్ళాలన్న కోరిక పుట్టింది. అయితే అదేమిటో నాకు బోధపడడం లేదు.
పెళ్ళి దగ్గర పడింది. పనులు చకచకా జరుగుతున్నాయి.
పెళ్ళి మరో వారం రోజులు వుండగా శుభలేఖలు వచ్చాయి. మొదటి శుభలేఖను తీసుకుని దానిమీద "ఫలానా రోజున నా పెళ్ళి అనీ, ఈలోగా ఓసారి వచ్చి కలవమనీ' రాసి సుధీర్ కు పోస్టు చేశాను.
గోళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం, మ్యాచింగ్ బ్లౌజులు కుట్టుకోవడం, స్నేహితురాళ్ళకు శుభలేఖలు పంచడం, వస్తున్నా బంధువులను రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోయింది కాలం.
మరుసటి రోజు తెల్లవారుజామున మా ఊరికి దగ్గరలోని వెంటకగిరిలోని ఓ సత్రంలో పెళ్ళి. అందువల్ల ఆరోజు సాయంకాలం నేను పెళ్ళికూతురై తరలి వెళ్ళాను.
సత్రం చేరుకునే సరికి సాయంకాలం ఏడయ్యింది. ఆడపెళ్ళి వారంతా అక్కడ సర్దుకున్నారు. మగపెళ్ళి వాళ్ళకోసం హోటల్లో గదులు బుక్ చేశారు. పెళ్ళికొడుకు తెల్లవారుజామున మూడుగంటలకు విడిది నుంచి బయల్దేరి వస్తారు. మధ్యలో దేవుడి పూజ తదితర ఘట్టాలున్నాయి.
రాత్రి పదిగంటల ప్రాంతాన భోజనం చేశాను. ఓ గదిలో పడుకున్నాను. రెండు గంటల ప్రాంతాన అమ్మలక్కలు వచ్చి లేపారు. ఇక స్నానం చేశాక నన్ను సింగారించడం ప్రారంభించారు. అలంకరణ పూర్తయ్యేసరికి తెల్లవారు జాము మూడయ్యింది. తామూ స్నానాలు చేసి తయారవుతామని చెప్పి అమ్మలక్కలంతా వెళ్ళిపోయారు.
అలా ఒంటరిగా గదిలో మిగలిపోయాను. మ్యారేజ్ హాల్లో వున్న కొంతమంది బంధుజనం మాటలు తప్ప ప్రశాంతంగా వుంది సత్రమంతా.
అక్కడే వున్న సూట్కేసు మీద నడుం ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరో రెండు గంటలకి పెళ్ళి.
అంతలో ద్వారం దగ్గర అలికిడి అయ్యింది. కళ్ళు విప్పి చూస్తే ద్వారం దగ్గర నిలబడి వున్న సుధీర్ కనిపించాడు.
ఒక్క ఉదుటున పైకి లేచి కెరటంలా అతని దగ్గరకి వచ్చి నిలబడ్డాను.
"సారీ! ముందు రాలేకపోయాను. బ్యాంక్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ వుంటే హైదరాబాద్ వెళ్ళాను. రాత్రే గదికి వచ్చాను. తలుపు తెరవగానే నీ శుభలేఖ. బట్టలైనా మార్చుకోకుండా ఇలా వచ్చేశాను" చాలా బాధపడుతూ చెప్పాడు.
నోట మాట రావడం లేదు. ఏదో తెలియని భావోద్వేగం నన్ను ఊపేస్తుంది. కాని టైమ్ లేదు. నా నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి.
"సుధీర్! నీకోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా! ఇక నాపెళ్ళిలో నువ్వు రావేమోనన్న దిగులు, ఇదిగో ఈ పట్టుచీరకంటే బరువుగా నా గుండెల్లో పేరుకుపోయింది. ఇంకో రెండు గంటల్లో పెళ్ళి, నువ్వు నాకో అపురూపమైన బహుమతి ఇవ్వాలి. ఇస్తావా?"
"తప్పకుండా! ఏం కావాలి?" తన ఒంట్లోని రక్తాన్నంతా తోడివ్వమని అడిగినా జంకని ఈ దీరుడి ముందు సీకో వాచ్ కోసం, లేసులున్న బూట్లకోసం యాగీ చేసిన పెళ్ళికొడుకును పోల్చుకోకుండా వుండలేక పోయాను. నా నిర్ణయం సరైనదేనని కళ్ళముందు రుజువు కనబడింది.
"నువ్విచ్చే బహుమతి నన్ను అత్తింటి ఆరళ్ళ నుంచి కాపాడుతుంది. అన్నం వార్చేటప్పుడు చేయి వణికి గంజి నాపై పడి చర్మం కాలిపోయినప్పుడు నా కన్నీళ్ళను తుడుస్తుంది. ఇంట్లోని దరిద్రానికంతా నేనే కారణమని మా అత్తా నన్ను గదమాయించినప్పుడు తిరగబడే శక్తినిస్తుంది. కూరలు బాగాలేవని మా మామగారు విసుక్కునప్పుడు నన్ను ఊరడిస్తుండి. నావల్ల తన సుఖాలన్నీ దూరమైనాయని నా భర్త నావైపు అసహ్యంగా చూసినప్పుడు భుజం తట్టి ధైర్యమిస్తుంది."
ఏడుపు తన్నుకుంటూ రావడంతో నా మాటలు తడబడుతున్నాయి. కానీ ఆపలేదు. చెప్పుకుపోయాను.
"అవును సుధీర్! నువ్విచ్చే బహుమతి నాకు ప్రతిక్షణం మన ఊరును గుర్తుకు తెస్తుంది. నా స్నేహితురాళ్ళను నా కళ్ళముందు నిలుపుతుంది. మా అమ్మా నాన్నల వెచ్చటి ఒడిని మరిపిస్తుంది. పెరట్లోంచి కాలు పెట్టగానే పచ్చ పచ్చని చేతులతో ఆహ్వానం పలికే పంటచెలు నా మనసులో మెదులుతుంది. ఇదంతా ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి ఏమిటో తెలుసా? ఓ అందమైన జ్ఞాపకం. అవును సుధీర్. జ్ఞాపకం అయితే అది ఎప్పటికీ ఎడబాటు లేకుండా నా గుండెల్లో ఉండిపోతుంది. నాలో రసస్పందన చచ్చిపోకుండా కాపాడుతుంది. అత్తింటి నరకాన్ని మరిచిపోవడానికి పుట్టింటి నుంచి నేను తీసుకుపోవాలను కుంటున్నది ఓ అందమైన జ్ఞాపకాన్ని. అది నువ్వొక్కడివే ఇవ్వగలవు. మరిస్తావా?" అని చేయి ముందుకు చాచాను.
అతని కళ్ళల్లో నీళ్ళు ఊరడం లైట్ వెలుగులో స్పష్టంగా తెలుస్తోంది.
నా చేతిలో చేయి వేసాడు.
"అయితే రా" అంటూ ముందుకు కదిలాను.
అలా నడుస్తున్న నాకు తాళం వేయకుండా కేవలం గొళ్ళెం పెట్టిన ఓ గది కనిపించింది. అదృష్టం నా పక్కనుంది. తలుపులు తెరిచి చూస్తే ఎవరూ లేరక్కడ. స్టోర్స్ గది కాబోలు ఓ మూల ఉల్లిపాయలు, వాటి ప్రక్కన బీన్స్, కాబేజీ, టమేటాలు రకరకాలు కూరగాయలున్నాయి.
సుధీర్ లోపలికి రాగానే తలుపులు మూసి బోల్టు వేశాను. మధ్యలోనున్న జీరో క్యాండిల్స్ బల్బు మసగ్గా వెలుగుతోంది. అలానే పెళ్ళికూతురి అలంకరణలో వున్న నేను ఇంకో గంటలో వేరోకడిచేత తాలి కట్టించుకోవాల్సిన నేను గోడకు జారగిలబడి కూర్చుని సుధీర్ చేయి పట్టుకుని లాగాను. అతను నాపైపడి సర్దుకున్నాడు.
అతన్నిగాఢంగా హత్తుకుంటూ "ప్లీజ్! కరుణించవా- అని ఎప్పుడూ అడిగేవాడివి. ఇదిగో ఇప్పుడు కరునిస్తున్నాను" అని అతని పెదవులను నా పెదవులతో అద్దాను.
అతను నను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
పదినిమిషాల తరువాత ఇద్దరం ఒకరి నుంచి ఒకరు విడివడ్డాం.
"వస్తాను సుధీర్. ఈ అద్భుతమైన జ్ఞాపకాన్ని నాకందించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడంలేదు. నేను అత్తింటికి నాతో పాటు తీసుకువెళుతున్న ముప్ఫైవేల రూపాయలను వాళ్ళు భూముల్లోకి మార్చేయవచ్చు. నా ఒంటిమీదున్న పాతిక సవర్ల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు. సారెతో పాటు నేను తీసుకెళ్ళే వెండిబిందెను చెడగొట్టి తండ్రీ కొడుకులు మొలతాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ మధురమైన జ్ఞాపకాన్ని వాళ్ళు నా నుంచి దొంగిలించలేరు కదా. అదే నాకు శ్రీరామరక్ష" చివరిగా అతని ముంజేతిమీద ముద్దు పెట్టుకుని తిరిగి నా గదికి వచ్చేశాను.