ముహూర్తం ప్రవేశించిందన్నట్లు పెళ్ళి పందిట్లో మంగళ వాయిద్యాలు మ్రోగడం ప్రారంభించాయి" అంటూ చెప్పడం ముగించింది ఆమె.
ఆమె చెప్పిన ఈ సంఘటనకు గోపాలకృష్ణ కదిలిపోయాడు. కళ్ళల్లో పలుచటి నీటిపొర.
చాలాసేపటివరకూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోయారు.
* * *
యిదంతా చాటు నుంచి గమనిస్తున్న పులిరాజు ఠక్కున పైకి లేచాడు.
అతడు గోపాలకృష్ణ మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి కదిలాడు.
ఊరిలోకి వచ్చి దివాను వెంకట్రామయ్య ఇంటి తలుపు తట్టాడు. మరో ఐదు నిమిషాలకు తలుపులు తెరుచుకున్నాయి.
అంత రాత్రిపూట దెయ్యం జడలా పరమవికారంగా కనిపిస్తున్న పులిరాజును చూసి ఆయన ఓక్షణం పాటు జడుసుకున్నాడు. కాసేపట్లో సర్దుకుని అతన్ని లోపలికి పిలిచాడు.
* * *
సాయంకాలమైంది. సూర్యుడు ఆకాశం కొంగు చివరను పట్టుకొని అవతలి ప్రపంచంలోకి జారిపోతున్నాడు. పక్షులు రెక్కల్లోంచి చివరి సారిగా శక్తినంతా తెచ్చుకుని ఇళ్లవైపు మళ్ళాయి.
లోకం తాంబూలం వేసుకున్న నోరును తెరిచినట్టు సంధ్య నింగికీ, నేలకూ మధ్య ఎర్రగా అలుముకుంది. పేషన్ పెరేడ్ లో పాల్గొంటున్న అమ్మాయిల్లా పల్చటి మబ్బులు రకరకాల ఆకారాల్లో ముందుకు సాగుతున్నాయి.
గోపాలకృష్ణ ఫ్రెష్ గా తయారై ఇంటి బయటికొచ్చి నిలబడ్డాడు. తెల్లటి లాల్చీ, జుబ్బా వేసుకున్న అతను మల్లెమొగ్గల మధ్య ఒంటరి మందారపు మొగ్గలా వున్నాడు.
అతను కదిలిపోతుంటే నరుడు వెనక నుంచి పిలిచాడు. "గురుడా! ఈరోజు నేను నీతోపాటు షికారుకొస్తున్నాను. ఒంటరిగా ఇక్కడ ఏం తోచటంలేదు."
"సరే. బోర్ కొడుతూ వుందనిపిస్తే ముసి ముసిగా నవ్వుతూ గురువుగార్ని వెంబడించాడు. చాలారోజుల తర్వాత సాయంకాలం పూట అలా బయటపడడం అతనికి చాలా ఆనందంగా వుంది. గోపాలకృష్ణ రోజూ తప్పనిసరిగా సాయంకాలంపూట అలా నడిచి వస్తూంటాడు. ఈ సమయంలో అతడు గురువుగారి బట్టలు ఉతుకుతూనో, ఇల్లంతా ఊడుస్తూనో వుండేవాడు. ఈరోజు అలా హాయిగా తిరిగి రావాలనిపించడంతో బయల్దేరాడు.
ఇద్దరూ కొండ దిగి పొలాలవెంట సాగిపోతున్నారు.
"గురుడా?"
"ఏమిటి నరుడా?" నాటక ఫక్కీలో అన్నాడు గోపాలకృష్ణ.
"గురుడా! రోజూ సాయంకాలాలు ఇటోస్తుంటావు. కదా. ఏం కనిపిస్తుందని?" అని అడిగాడు.
"ఏమైనా కనిపిస్తుందని ఇటొచ్చావా....?" ఎదురు ప్రశ్నించాడు గోపాలకృష్ణ.
"కాదనుకో. కానీ ఇలా పొలాల మీద తిరగడం కన్నా ఊరిలో తిరిగితే కాస్తంత కలర్ అయినా కనిపించేది కదా అని."
"కలరంటే?"
"ఇది రైల్వేస్టేషన్ భాష. కలరంటే ఆడపిల్లలు"
"అయితే నీకు ఆడగాలి సోకిందన్న మాట. ఈ ఊరిలో పులిరాజు అనే భూతవైద్యుడున్నాడు అతని దగ్గరకెళ్ళు, వదలగొట్టేస్తాడు" అని వెనక్కి తిరిగి చూసి నవ్వాడు.
"మరి సాక్షాత్తూ మదనకామరాజు వంశానికి చెందిన ఇంట్లో పనిచేస్తున్న వాడిని. పక్కనే శతసహస్ర వనితా మనోహర మదనాకరుడి దేవాలయంలోని దేవుడ్ని పూజిస్తున్న వాడిని. మరి ఆడగాలి సోకకుండా ఉంటుందా? ముఖ్యంగా ఆ దేవాలయంలోకి వెళ్ళే పైటల్లేని ఆ స్త్రీలను చూస్తుంటే నా సామిరంగా......"
"అక్కడ ఆ పద్ధతి పెట్టింది మోహం రగుల్కోవడానికి కాదు, మోహం తగ్గడానికి."
"ఆడపిల్ల టాప్ లెస్ గా కనిపిస్తే మోహం తగ్గుతుందా? మరికొంత పెచ్చరిల్లుతుందిగానీ."
"అందుకేనన్న మాట సమయం దొరికితే చాలు దేవాలయంలో దూరుతున్నావ్."
"శివశివా! అంత మాట అనకు. ఏదో కాలక్షేపానికి పంతులుతో మాట్లాడదామని వెళుతున్నాను. అయితే ఈరోజు అటు పోబుద్ధి కాలేదు. నీతో ఎంచక్కా ఊరిలో చక్కర్లు కొడదామనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా పొలాల కల్లే తీసుకొచ్చావ్" అంటూ నసిగాడు.
"నేను మాత్రం ఇటే వస్తున్నాను. కాస్తంత చల్లగాలి పీల్చుకుందామని."
"నీకేం అవసరం లేదు గురుడా. కోరుకున్న పిల్లకు కబురంపితే వచ్చి ఒళ్ళో వాలుతుంది."
"మరి అదంతా మా వంశ మహత్యం"
"ఏం వంశం గురుడా మీది? గొప్ప సువిశాల సామ్రాజ్యం కన్నా వంశ పారంపర్యంగా ఓ అద్భుతమైన ఆచారం ఇచ్చారు. ఇలాంటి ఛాన్స్ వచ్చిన నీది గురుడా అదృష్టమంటే"
"నిజంగా అదృష్టమంటావా? కానీ నాకు మాత్రం....." అంటున్న అతనికి చాలా దూరంలో ఇద్దరమ్మాయిలు కనిపించారు. దాంతో వాక్యం పూర్తి చేయకుండా ఎవరి వుంటారా అన్న ఆలోచనలో పడ్డాడు.
కాసేపు ఇద్దరూ మౌనంగా నడిచారు.
"గురుడా! చాలా రోజుల్నుంచి నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవు కదా?" నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు నరుడు.
"ఏమీ అనుకోనులే అడుగు."
"ప్రేమంటే ఏమిటి గురుడా?"
"ప్రేమంటేనా? నాకూ తెలియదే. ఎందుకంటే ఇంతవరకు ఎవర్నీ నేను ప్రేమించలేదు గనుక"
"ప్రేమించలేదా? ఇంతమంది అమ్మాయిలతో పరిచయం వుంది. ఇంతవరకు ఎవర్నీ ప్రేమించకపోవడం విచిత్రమే" నరుడు ఆశ్చర్యం ప్రకటించాడు.
"దానికి నేనేం చేయను? ఎవర్నీ ప్రేమించాలనిపించలేదు. అసలు ప్రేమంటే ఏమిటన్న సందేహం అప్పుడప్పుడు నాకు వస్తుంటుంది. బహుశా భగవంతుడు ఒక్కో భక్తుడికి ఒక్కో రూపంలో కనిపించినట్టు ప్రేమ కూడా అంతేనేమో. భగవంతుని ఉనికి భక్తుడి మీద ఆధారపడ్డట్టు ప్రేమ ఉనికి ప్రేమికులనుబట్టి వుంటుందేమో."