Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 22

  

       "మీ పరిధిలో మీరు మాట్లాడారు వశిష్టా! అది విని నేను అలాగా అంటూ వూరుకోలేను... మీకు మీ నాన్నగారి మాటల మీద ఎంత నమ్మకము వుందో నాకు నా తమ్ముడి మీద అంతే నమ్మకం వుంది. కాబట్టి జరిగినదానికి ఇదంతా ప్రారబ్ధం అంటూ నేను సరిపెట్టుకోదలుచుకోలేదు. అయినా నేను ఎందుకు నిశ్శబ్దంగా వుండాలి.... పరపతిగల వ్యక్తులతో పోరాటం దేనికనుకుంటే దీనికి అంతం ఎక్కడ.... ఇలా నేను ఆలోచించటానికి కారణం నేను వున్నది ఆటవిక వ్యవస్థలో కాదన్న ఆలోచనే వశిష్టగారూ... అసలు ప్రాచీన రాచరిక వ్యవస్థలలో సైతం మనుషులు పెద్ద చేప చిన్న చేపని మింగటం న్యాయమే అంటూ సరిపెట్టుకోలేదే... అలాంటి అనాగరికమైన పద్దతుల నుంచి వ్యవస్థని రక్షించటానికి చాణక్యుడు 'అర్ధశాస్త్రం' టామిల్ క్లాసిక్ 'తిరక్కురల్' రాయబడిందిగా... మన పోలీసు వ్యవస్థకి ప్రేరణలు ఆ గ్రంథాలే అని తెలిసిన నేను అప్పటి మనుషుల్లా సందిగ్ధంగా నిలబడను... ఈ మోడరన్ సొసైటీలోని సివిలైజ్డ్ క్రిమినల్స్ చేసిన పనిని తవ్వి నేరస్థుల్ని ప్రపంచం ముందు నిలబెడతాను. ఈ డెసిషన్ తీసుకున్నది ఇప్పుడు కాదు వశిష్టా... నా తమ్ముడూ, తండ్రుల శవాల్ని చూశాక..."
    
    దారెటో తెలీని చీకటి కూడలిలో నిలబడి ఏకతార శ్రుతిలా విలక్షణంగా తన మనోభిష్టాన్ని వ్యక్తం చేస్తుంటే విస్మయంగా చూస్తూ వుండిపోయాడు.
    
    కానీ అదెలా సాధ్యం... తను ఢీకొనాలనుకుంటున్నది సామాన్యమైన వ్యక్తులుకాదు.... జరిగిన దానిలో ఎవరి ప్రమేయం ఎంతైనా కానీ ఒక ఒంటరి ఆడపిల్ల చాలా రిస్కు తీసుకుంటుందని బోధపడిపోయింది.
    
    "ఇప్పుడు చట్టరీత్యా నేను ఓడిపోతానన్నది మీ ఆలోచన కావచ్చు కానీ యు సీ మిస్టర్ వశిష్టా... ఓటమిని అంగీకరిస్తేనే దాన్ని ఓటమి అంటాన్నేను. లేనప్పుడు అది పోరాటమవుతుంది. పోరాటానికి తెలివి, నిబ్బరం ఒక్కటి చాలదు. గెలవాలన్న డిజైర్ కావాలి.... అది నాకు పుష్కలంగా వుంది... దాన్ని కడదాకా ఆర్గనైజ్డ్ గా కొనసాగించగల మొండి పట్టుదల వుంది. ఇవన్నీ నా తండ్రి దగ్గర నేర్చుకున్నవే వశిష్టా కానీ ఆయన భయస్థుడిలా కడతేరిపోయాడు... ఈ విషయంలో మాత్రం నేను ఆయనకి వారసురాల్ని కాను, కాదలచుకోలేదు. నీకున్న శక్తి ఏమిటీ అంటే చెప్పానుగా పెర్సిస్టెన్స్..... ఏమైతేనేం అన్న మొండి పట్టుదల."
    
    డెసిషన్ తీసుకోవడమే సగం గెలుపుకి గుర్తున్నంత ధీమాగా ఆమె మాట్లాడి వెళ్ళిపోతుంటే "ఒక్కమాట" అన్నాడు.
    
    "చెప్పండి"
    
    "మీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేనున్నాను."
    
    ఫకాల్న నవ్వింది "మీరా?"
    
    "ఏం" ఎవర్నయినా నోరు మూయించే శక్తి, సెన్సాఫ్ హ్యూమర్ గల వశిష్ట ఈమె సమక్షంలో ఎక్కువసేపు శ్రోతగానే మిగిలిపోతున్నాడు. "ఎందుకు నవ్వుతున్నారు?"
    
    "ఇప్పటికింత చేసిన మీరు ఇంకా ఏదో చేయగలనంటే నవ్వురాక ఏమవుతుంది.
    
    వశిష్ట అహాన్ని గాయపరచిన ఆశ్రిత ఉద్వేగంగా వెళ్ళిపోయింది.
    
                                              *    *    *
    
    ఉదయం పదిగంటల సమయంలో కాలేజీ కేంపస్ లో అడుగుపెట్టింది ఆశ్రిత...
    
    నిన్నటిదాకా ప్రశ్నలతో వేధించిన బేతాళుడిలా వున్న మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా వుంది. సమస్యల కొండ అంచున ఘనీభవించిన జలపాతంలాంటి కోరికతో ఇప్పుడామె చాలా చేయాలనుకుంటూంది.... ఆమె ఏదో చేయాలన్న కోరిక దగ్గరే ఆగిపోయి వుంటే జరిగిన నష్టంతో ఆ తర్వాత రాజీపడి రొటీన్ లో పడేది కానీ ఫలానాది చేయాలన్న సంకల్పం ఆమెకు ఖచ్చితమైన గమ్యాన్ని నిర్దేశించగలిగింది. పర్వత సానువుల్లో నుంచి పుట్టి నేలపైకి సెలయేరు పయోధిదాకా ప్రవహించటానికి సిద్దపడితే అది జీవనది కాగలుగుతుంది.... సరిగ్గా ఆశ్రిత అలాగే వుందిప్పుడు.
    
    కేవలం నిమిషాల వ్యవధిలో పాతికమంది విద్యార్ధుల్ని తన దగ్గరకు రప్పించుకుంది. అరగంట మాట్లాడేసరికి పాతికమంది వందమంది విద్యార్ధులు అయ్యారు... ఆ తరువాత రాజేష్ గురించి అందరి అభిప్రాయాల్ని సేకరించడంగాని, రాజేష్ సాత్వికుడూ మంచి నడవడి కలిగిన విద్యార్ధిగా రాతపూర్వకంగా అందరి దగ్గరా తీసుకుని రేపు సాగించాలనుకున్న ఉద్యమానికి ఓ మంచి ఆయుధాన్ని సమకూర్చుకోవడంగాని ఆమెకు కష్టం కాలేదు.
    
    క్రమంగా ఆమె చేస్తున్నదేమిటో కాలేజీ స్టాఫ్ దాకా వెళ్ళింది.... అంతెందుకు, ప్రిన్సిపాల్ కూడా ఆశ్రిత చేస్తున్నదేమిటో గ్రహించాడు. కానీ ధైర్యంగా ముందుకు రాలేకపోయాడు. మొహం చెల్లలేదు... అయితే ఎందుకో కంగారుపుట్టింది... అసాధారణమైన తెలివితోపాటు ఐ.ఎ.ఎస్. ఇంటర్వ్యూదాకా వెళ్ళగలిగిన అమ్మాయిగా ఆశ్రిత గురించి తెలిసిన ప్రిన్సిపాల్ గారు ఇప్పుడేం కాబోతూందీ అని ఆలోచిస్తుండగానే స్టూడెంట్స్ ఆశ్రిత దగ్గరికి ఓ అబ్బాయిని లాక్కొచ్చారు.
    
    "మేడమ్... వీడి పేరు అమర్..."
    
    పరిచయం చేశారు బిడియంగా తలవంచుకుని నిలబడ్డ అమర్ ని చూపిస్తూ.
    
    మనిషి కూడా ఇంచుమించు రాజేష్ లానే వున్నాడు సాత్వికంగా.
    
    "శ్వేత నెక్స్ట్ టార్గెట్ వీడే."
    
    ఆశ్రిత అర్ధంకానట్టు చూసింది.
    
    ఓ స్టూడెంట్ చెప్పుకుపోయాడు. "శ్వేతకి తన చుట్టూ కొందరు అబ్బాయిల్ని తిప్పుకునేట్టు చేసుకోవడం ఓ హాబీ ఆశ్రితగారూ.... అందుకే రాజేష్ చనిపోయి నెల తిరక్కముందే మరో టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది. అమర్ కూడా రాజేష్ లా తెలివైనవాడు, పిరికివాడు కావడంతో ఇంచుమించు అదే సిట్యుయేషన్ లో అమర్ ని టార్చర్ చేయడం ప్రారంభించింది శ్వేత. అసలు ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఖచ్చితంగా మాకు తెలీదు కానీ అమర్ ని అదే పనిగా వేటాడుతూంది. రాజేష్ తర్వాత హోంమినిష్టరుగారి మనుశులకి అమర్ బలవుతాడనుకుంటాను"
    
    ఆశ్రిత అమర్ ని తదేకంగా చూసింది... ఎందుకో చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అమర్... బహుశా ఈ నిజం అందరి ముందూ చర్చించబడటం ఇష్టం లేదో లేక శ్వేతకి తెలిసిపోతే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయమో మరి దిగులుగా దిక్కులు చూస్తున్నాడు.
    
    "నువ్వు చెప్పేదేమన్నా వుందా" అడిగింది అమర్ ని.
    
    అమర్ గొంతు తడారిపోయినట్టుంది "అబ్బే....ఏం....లేదు...అసలు అదేం నిజం కాదు."
    
    భయపడిపోతున్నాడు.
    
    "శ్వేతని ఇష్టపడుతున్నావా?"
    
    "అహ" కంపించిపోయాడు జవాబు చెబుతూ.
    
    "శ్వేత నిన్ను ఇష్టపడుతుందా?"
    
    "అహ... కాదు" పొడిపొడిగా జవాబు చెబుతుంటే వున్నట్టుండీ టక్కున అడిగింది "మరి ఏం చేయాలనుకుంటున్నావ్?"
    
    "మరో కాలేజీలో చేరిపోదాం" అనుకుంటున్నాను."

 Previous Page Next Page