Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 23

  

          ఇంటర్ చదువుతోన్న రోజుల్లో-ఓ వర్షం కురుస్తోన్న సాయంత్రం ప్యాంటు మోకాళ్ళ క్రిందవరకూ నిర్లక్ష్యంగా మడిచి మోహనరావుతో కూడా కాలేజీ దగ్గర బస్సు ఎక్కాడు. బస్సంతా కిటకిటలాడుతోంది. కొన్నికొన్ని సీట్లలో అవసరానికి మారుపేరైన నాగరికత ప్రబలింది. ఉన్నట్టుండి మోహన్ మోచేతితో పొడిచి ఏదోచూడమన్నట్లు సౌంజ్ఞలు చేశాడు. ప్రక్కసీట్లో కూర్చున్న ఓ కాటుకకళ్ళ ఊర్వశి తన పాదాలకేసి తదేకంగా చూస్తోంది. నిజానికి ఆమె అందానికి పట్టపగ్గాలు లేవు. "ఏమిట్రా?" అన్నాడు మోహన్ తో మెల్లిగా. "నీ పాదాలు చూస్తోందిరా" అన్నాడతను రహస్యంగా.
   
    "అయితే?" అన్నాడు తను నిజమేనని ఒప్పుకుంటూ.
   
    "నిన్ను ప్రేమించిందిరా" అన్నాడు.
   
    "అదేమిటి?"
   
    "అదంతే ఇవాళ నీ పాదాలు అమోఘంగా వున్నాయి."
   
    గట్టిగా మాట్లాడితే అతనితో వాదానికి దిగవలసి వస్తుందని నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. సెంటర్ లో యిద్దరూ దిగుతూ వుంటే "అదిగో" అన్నాడు మోహన్ ఆతృతగా. అతని పాదాలతోబాటు ఆమెచూపులూ కదులుతూ వెను వెంటనే వస్తున్నాయి.
   
    బస్సు దిగాక మోహన్ తో అన్నాడు కోపంగా "ఏమిట్రా నీ మొహం? ఎవరయినా పాదాలు చూసి....?"
   
    అతని మాటలు పూర్తికాక ముందే అడ్డుకుని 'అదికాదురా నీ ముఖంకన్నా పాదాలే బాగున్నాయిప్పుడు' అన్నాడతను దృఢంగా.
   
    చిందిన చిరునవ్వును అయిదారు కనురెప్పపాట్లు మాత్రం అనుభవించి శివనాథరావు నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. ఏటికి అవతలవైపున ఎడమ ప్రక్కగా బ్రహ్మాండమైన మామిడితోట కనిపిస్తోంది. దూరంగా-కొండల దొంతరలు వింత రంగుల్లో దృగ్గోచరమౌతున్నాయి సూర్యాస్తమయానికి ఆపైన అదంతా అడవిట. అందులో చాలాభాగం తమదే అని చెప్పాడు మోహనరావు. ఆ అడవిలోకి పోయి ఒంటరిగా జీవించాలనిపించింది శివనాథరావుకు. ఏరు ఎంతవరకు కనిపిస్తుందోనని చూశాడు. కొన్ని మైళ్ళు నిడివిగల ఒక పెద్దసర్పం మన్నుతిని బద్దకంగా పాకుతున్నట్లుగా వుంది. వందమంది సుందరీమణులు పకపక నవ్వినట్లు సూర్యరశ్మికి మధ్యమధ్య ధవళకాంతులు ఇలాంటి ఏకాంత స్థలంలో కూర్చుని వయొలిన్ వాయించుకోవాలి. మనుషులు కానివారు వింటారు. ఈ యిసుకలో పడుకుని కూనిరాగాలు తీసుకోవాలి. అదే ఆత్మానందానికి అంతిమ స్థాయి.
   
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" మోహనరావు అడిగాడు సందేహాస్పదంగా.
   
    "ఏమీలేదు" అని ఇసుకలో కూర్చున్నాడు. పిచ్చుకగూళ్ళు కడదామనిపించింది. కానీ యిసుక తడిగాలేదు. శ్రమ ఫలించలేదు.
   
    "నిన్నో ప్రశ్న అడిగేదా?" అంటూ ప్రారంభించాడు మోహన్.
   
    "అడిగెయ్."
   
    "కొన్ని రోజులక్రితం మీ యింటికి మీ బంధువులమ్మాయి వచ్చింది...."
   
    "బాగుంటుంది కదూ."
   
    "అది కాదు... మీ యిద్దరూ-ఏమిటి?"
   
    "ఏమీ లేకపోలేదు."
   
    అయోమయంగా చూశాడు.
   
    "నన్ను క్షమించరా. నేను యిప్పుడు మూడ్స్ లో లేకపోవడం ఒక్కటే నీకు జవాబు చెప్పకపోవటానికి కారణం కాదు" అన్నాడు శివనాథరావు విరామం తీసుకుని.
   
    "ఊహించగలను."
   
    "సరే ఊహించు."
   
    అతను మాటమారుస్తూ "మా ఊరు బాగుందా?"
   
    "చాలా బాగుంది."
   
    మోహనరావు జేబులోంచి సిగరెట్ పెట్టె తీశాడు. వెలిగించుకుని 'యిదో దురభ్యాసం అయిపోయిందిరా' అంటూ నిప్పుపుల్ల యిసుకలో పాతిపెట్టాడు.
   
    "నాకో సిగరెట్ యివ్వరా మోహన్."
   
    "ఏం చేస్తావ్?"
   
    "తాగే వాళ్ళంతా ఏం చేస్తారో అదే."
   
    "వద్దురా, అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు" అని అతడు వారించబోయాడు.
   
    "లాభంలేదు. ఇవ్వాల్సిందే" అతని నిశ్చయం చూసి ఇవ్వకతప్పలా మూడు నాలుగు అగ్గిపుల్లలు తగలేశాడు. అంటించుకోవటం చాతకాలా మోహన్ నవ్వి దగ్గరగా వంగి తనే అంటించిపెట్టాడు. శివనాథరావు గట్టిగా పీల్చాడు. పొగ లోపలి పోయి ఉక్కిరిబిక్కిరయింది. కళ్ళలోకి నీళ్ళు వచ్చినయి. అసహ్యంతో సిగరెట్ నీళ్ళలోకి విసిరేశాడు. మోహనరావు ఏమీ మాట్లాడలేదు. శివనాథరావు క్రిందికి జారి యిసుకలో పడుకున్నాడు. "మోహన్" అన్నాడు.
   
    చూశాడు.
   
    "నీ వెవర్నయినా ప్రేమించావురా?"
   
    అతను సిగ్గుతో "పోరా" అన్నాడు.
   
    "చెప్పరా?"
   
    మోహన్ తల వచ్న్హుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. హఠాత్తుగా తలెత్తి "అలా జరిగిందిరా" అన్నాడు.
   
    "ఎలా?"
   
    "నువ్వన్నట్లు."
   
    "చెప్పు."
   
    "ఆ అమ్మాయి పేరు ఉష."
   
    "నాకు యిష్టమయిన పేరు."
   
    "మా క్లాస్ మేట్, వాల్తేరులో."
   
    "గుడ్."
   
    "నేను హాస్టలులో వుండట్లేదని తెలుసుగా. ఊళ్ళోనే ఓ మేడమీద రూమ్ లో ఉంటున్నాను. వంద గజాల దూరంలోనే ఆమె యిల్లు తనూ, ఓ ముసలమ్మా వుంటున్నారు ఆ యింట్లో వాళ్ళ యింటిచుట్టూ చిన్న ప్రహరీగోడ వుంది. ఆ ప్రహరీగోడను ఆనుకుని ఓ వేపచెట్టు వుంది. ఆమె ఎప్పుడూ గేటులోంచి లోపలకు సజావుగా వెళ్ళేదికాదు. చెట్టుఎక్కి గోడదూకి, లోపలకు పోతుండేది. నేను మేడమీది వసారాలో నిల్చుని ఆ సోయగాన్ని చూస్తూ నివ్వెరపోతూండేవాడ్ని."
   
    "ఆడవాళ్ళ విషయంలో నేనుచాలా పిరికివాడనని తెలుసుగా నీకు? కానీ నేను ఆకర్షితుడనైపోయాను. నిరంతరం నా చూపులు ఆ యింటిమీదే ప్రసరిస్తూ వుండేవి. అదే ధ్యాస కానీ నాకు భయం మాట్లాడలేను, ఎదురుగా వస్తుంటే ముఖంలోకి చూడలేను. అదేదోవిధంగా నవ్వాలంటారు. నవ్వలేను కదా సిగ్గువిడిచి?" అతని కపోలాలు ఎర్రనైనాయి.
   
    "ఎన్నో తడవలు మాట్లాడించుదామని ప్రయత్నించాను. చాతకాలా మళ్ళా లా చదువుతున్నాను. ఎందుకూ? ఆ కళ్ళలోని వెలుగూ, మెరుపూ, ఆ హొయలూ, నవ్వులోని కొంటెతనం చూసి వెర్రెత్తిపోయాను. ఆమె నాకు కావాలి."
   
    "ఎన్నోసార్లు యింటిదాకా వెళ్ళి ఏమీచేయలేక తిరిగివచ్చాను. ఓసారి తెగించి గబగబా కొట్టుకుంటున్న గుండెతో లోపలకు వెళ్ళాను. కిటికీలోంచి తొంగి చూసేసరికి ఆమె చాపమీద పడుకుని నిద్రపోతోంది. ఒణుకుతూన్న గొంతుతో ఉషా అని పిలిచాను. నాపిలుపు ఆమెకు అందలేదు. మరోసారి పిలుద్దామంటే నా గొంతు నాకు స్వాధీనంకాలేదు. భగ్న హృదయంతో తిరిగి వచ్చేశాను."
   
    "ఇహ ముఖాముఖి మాట్లాడలేనని తెలుసుకున్నాను. ఏమీ తోచక ధైర్యం చేసి ఓ ఉత్తరం రాశాను. అది చాలా పెద్దలేఖ. ఏమి రాశానో తెలీదు. నాకంత భాష వచ్చనికూడా తెలీదు. పోస్టు చేశాను."
   
    "చేశాక కాలేజీకి వెళ్ళలేకపోయాను. ఉష కనిపిస్తోందేమోనని భయం. గది తలుపులు బిగించి కూర్చునేవాడ్ని."   
   
    అతను ఆగాడు. ముఖం ప్రేమోద్రేకంతో వెల్లివిరిసిపోతోంది. చూపు యిక్కడ లేదు.
   
    "చివరకు ఓరోజు పోస్టుమేన్ వచ్చి కవరు యిచ్చివెళ్ళాడు. ఒణుకుతున్న చేతుల్తో చించి చూశాను. లోపల ఓ చిన్న కాగితం వుంది. ఒక అందమైన స్త్రీ కలం పాలభాగాన్ని ఆనించి ఏమి రాయనా అని ఆలోచిస్తోన్న చిత్రం మనోహరంగా గీయబడింది."
   
    "ఆమె ఆర్టిస్టా?" శివనాథరావు ఉత్సాహంగా అడిగాడు.
   
    "నాకూ అప్పుడే తెలిసింది. నాకు అర్ధంకాలేదు. ఏమీ చెయ్యలేకపోయాను. ముఖమెత్తి అటువైపు చూడలేకపోతున్నాను."       
   
    "ప్రయత్నించి యిహ ఆమెతో మాట్లాడలేవా?"
   
    "అదే తెలియటం లేదు."
   
    "మోహన్, నువ్వెందుకింత పిరికివాడివి?" అనడిగాడు శివనాథరావు.

 Previous Page Next Page