Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 24

   

     "అదే - నేను వెతుక్కూంటున్న జవాబు."
   
    ఓ పదిహేను నిముషాలు యిరువురూ మౌనంగా వుండిపోయారు. కనుచీకటి పడుతోంది. కొండల దొంతరలు చీకటితెరల్లో మూసుకుపోతున్నాయి. అందంగా పలుచగా ప్రవహిస్తోన్న ఏరు నిశీధిని నిట్టూర్పులా సవ్వడి చేస్తోంది. ఏటి ఒడ్డున తీసిన చలాలలో పాతనీరు చిమ్మివేసి, ఊరుతున్న నీటిని బిందెలతో నింపుకుని స్త్రీలు యింటిదారి పట్టారు. మిత్రులిద్దరూ లేచి నడక సాగించారు.
   
    వేణుగోపాలస్వామి కోవెలదాకా వచ్చాక మోహన్ అడిగాడు 'పెళ్ళి చేసుకోవా?'
   
    మోహన్ తడుముకుంటూ 'అదే....ఓహో....సరే.....సరే..'
   
    ఆ రాత్రి భోజనాలైనాక "మీకు పులిజూదం వచ్చునా" అనడిగాడు మోహన్ బావగారు. ఆయన యాభైయ్యేళ్ళు పైబడిన మనిషి.   
   
    "రాదే" అన్నాడు శివనాథరావు.

    "మీకు నేర్పుతాను పట్టండి" అంటూ మోహనరావును గవ్వలు తీసుకురమ్మని పురమాయించి నేలమీద చతికిలపడ్డాడు. గీతలుగీశాడు. పావులు వచ్చాక ఓ ఐదునిముషాలు ఇలా-ఇలా ఆడాలని చూపించాడు. శివనాథరావుకు ఓ మాదిరిగా అర్ధమైంది. మేకల్ని తీసుకుని ఆయన్ను కట్టించలేడేమోనని పులులే తీసుకున్నాడు. ఆట ప్రారంభించాడు. అరగంట గడిచింది....గంట..గడిచింది. వరుసగా ఒకటి-రెండు-మూడు మేకలు ఎగిరిపోయేసరికి ఆయన నిస్పృహతో 'గట్టివారే! మీరు క్రొత్తగా ఆట నేర్చుకున్నారంటే నమ్మశక్యంగా లేదు' అని అన్నాడు.
   
    "చూశారా బావగారూ! ఇన్నాళ్ళకు మిమ్మల్ని పల్టీ కొట్టించగల మొనగాడ్ని ఊరినుంచి పట్టుకువచ్చాను. నాకింక నిద్రవస్తోంది, పడుకుందాం పదండి" అన్నాడు మోహనరావు ఇందాకటినుంచే ఓపిక పట్టినవాడల్లా.
   
    శివనాథరావుకు నిద్రరావటంలేదు. ఐనా పడుకుని విశ్రాంతిగా ఆలోచించు కోవాలని వుంది కాబట్టి మారుపలక్కుండా ప్రక్కమీదకు చేరాడు. మోహనరావు హరికేన్ లాంతరు తగ్గించి, ఓ మూలనపెట్టి వచ్చి పడుకున్నాడు. కాసేపు బావా, మరుదులు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. మధ్యమధ్య శివనాథరావును ఏవో ప్రశ్నలు వేసి-అతనేమీ పలక్కపోవడం వలన నిద్రపోయాడు కాబోలని ఊరుకున్నారు. కాసేపటికి వాళ్ళమాటలు వినిపించడం మానేశాయి. చాలా సేపటికి శివనాథరావు కూడ నిద్రపోయాడు.
   
    అతడు బద్దకంగా కళ్ళు విప్పి చూసేసరికి-తెలతెలవారుతోంది. లేద్దామని అనుకుంటూండగానే హఠాత్తుగా ఎక్కడినుంచో ఓ కూత వినిపించసాగింది. అది అంతకంతకూ హెచ్చు స్థాయిలోపడి నిర్విరామంగా వినిపించసాగింది. అతనికి అర్ధంగాక చిత్రంగా అటూయిటూ చూడసాగాడు. ఈ ఊరిలో సైరన్ ఎక్కడిది? అప్పుడు నిద్రలేచిన మోహన్ ఇతని ఆశ్చర్యం కనిపెట్టి నవ్వుతున్నాడు. ఇంతలో ఆ ధ్వని ఆగిపోయింది. మూడోమంచం మీద ముసుగులోంచి తలకాయ బయటకు పెట్టి మోహన్ బావగారు 'సిగ్నల్ అందుకున్నారా' అన్నాడు గంభీరంగా.
   
    "ఇంకా తయారు కాలేదు" అన్నాడు మోహన్ మామూలుగా.
   
    "ఏమిటి?" అని శివనాథరావు అడిగాడు ఉత్కంఠగా.
   
    "కాఫీ, బావగారు కాఫీకోసం ఈ సిగ్నల్ యిస్తారు."
   
    శివనాథరావు నవ్వుకుని బయటకు వచ్చాడు.
   
    ఆ రోజుకూడా సరదాగా గడిచిపోయింది. స్నానాలు చేసి ఊరు నలుమూలలా తిరుగుధామని యిద్దరూ బయలుదేరారు. ఎక్కువభాగం పాకలే మొహనరావుకీ మరో ఐదారుగురు బ్రాహ్మణులకీ కొంతమంది వెలమవాళ్ళకి తప్ప పెంకుటిళ్ళు లేవు. నిరుడు ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసి వచ్చి గ్రామీణ సేవకే. తన జీవితం అంకితం చేయదల్చిన డాక్టరుగారి ఆసుపత్రి బాగుంది. తనుకూడా ప్రాక్టీస్ ఓ పల్లెటూరిలో పెట్టాలనుకున్నాడు శివనాథరావు. మునసబుగారి తమ్ముడు సూరయ్య, గుళ్ళో చిన్న పూజారి ఆచార్యులుగారూ, మరో యిద్దరు యువకరైతులూ మోహనరావు స్నేహితులు. వీళ్ళంతా కలిసి ఓ చిన్న లైబ్రరీ నడిపిస్తున్నారు. స్నేహితుడ్ని గుళ్ళోనేవున్న ఆ రీడింగ్రూమ్ కి తీసుకువెళ్ళి వాళ్ళని పరిచయం చేశాడు మోహనరావు. దూరంగా వీధిబడి పిల్లలు చేసే అల్లరి లీలగా వినిపిస్తోంది. ఎలక్ట్రిసిటీ త్వరలో వస్తే బాగుండునన్నాడు సూరయ్య. శివనాథరావుకు రాకపోతే బాగుండుననిపించింది. పల్లెలుకూడా బస్తీలైపోతే తనబోటి జీవికి ఒకింత శాంతియిచ్చే జాగా ఏది? ఇద్దరూ అక్కడినుండి బయల్దేరారు. మోహన్ వాళ్ళు పొలాలదగ్గరకు వెళ్లారు. అతని రెండో అన్నగారు దగ్గరుండి కోత జరిపిస్తున్నాడు. ఆడవాళ్ళంతా కొడవలి వేస్తూ ముక్తకంఠంతో  ఏదో పాట పాడుతునంరు. ఈ క్రొత్తవ్యక్తిని చూచినప్పుడు ఆపేశారు. సిగ్గుతోను, చిరునవ్వుతోనూ శివనాథరావుని ఒకరికొకరు చూపించుకుంటూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు.
   
    మోహన్ 'పాడమనరా వాళ్ళని విందామని వుంది' అన్నాడు శివనాథరావు.
   
    "భామయ్యా" అన్నాడు మోహన్ 'ఆపేశారేం? పాడమను' అన్నాడు వచ్చిన వ్యక్తితో.
   
    ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో అడిగివచ్చి 'పాడరట దొరా, సిగ్గు పడుతున్నారు' అన్నాడు.
   
    ఇంటికి తిరిగివస్తూ మామూలు దారిన రాక మాలపల్లి మీదుగా తిరిగి వచ్చారు. పదీ, పదిన్నర అవుతుంది. ఓ యిరవై, యిరవైమూడేళ్ళ వయస్సులో తెల్లగా మెరిసిపోతోన్న స్త్రీ అక్కడొక పాకదగ్గర నిలబడి దూరంగా వున్నా కొండలకేసి చూస్తోంది. ఎవరో వస్తున్న అలికిడివిని వీళ్ళనిచూచి మరుక్షణంలో పాకలోనికి మెరుపుతీగెలా అదృశ్యమయింది.
   
    "ఆమె మాలవనితా?" అన్నాడు శివనాథరావు ఆశ్చర్యంగా.
   
    "కాదు. బ్రాహ్మణ పిల్ల."
   
    "అయితే అదేమిటి?"
   
    మోహన్ సిగరెట్ వెలిగించి - భుజాలెగురవేశాడు. "దానికో విషాద గాధ వుంది. ఆనిక్కి చెబుతాను.
   
    "కాదు, ఇప్పుడు చెప్పాల్సిందే!"
   
    "నీకు మరీ ఆత్రంరా విను, ఏడేళ్ళక్రితం ఆమె మా ప్రక్కవీధిలోనే నివసిస్తూ వుండేది. తల్లీ,తండ్రీ, అన్నా వున్నారు. పధ్నాలుగేళ్ళ వయసులోనే ఒకడికిచ్చి పెళ్ళిచేశారు. పెళ్ళయిన ఆరు నెలలకే వాడుకాస్తా క్షయో ఏదో వచ్చి చచ్చిపోయాడు. ఈ అమ్మాయి పుట్టింటికే వచ్చి వుంటోంది. వీరడనే మాలవాడొకడు వాళ్ళ యింట్లో పనిచేస్తూ వుండేవాడు."
   
    "ఓసారి తల్లీ, తండ్రీ ఏదో ఊరికిపోయారు. అన్నేమో పొలానికి పోయాడు. ఈ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా వుంది. మధ్యాహ్న సమయం, ఈ వీరడు యువకుడేలే. మెల్లిగా ఆ మాటా యీ మాటా చెబుతూ దగ్గరకు చేరాడు. "అమ్మగారూ" అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏదో జాలివున్నట్లు ప్రశ్నలు వేయసాగాడు. "పాపం ఎట్లా వుంటున్నారో? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. ఆ దేముడికి చేతులెట్టా వచ్చినయ్యో మీకుమాత్రం కోరికలుండవా!" అంటూ సానుభూతి చూపిస్తూ అమాంతంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పిల్ల తెల్లబోయింది. అదిరిపోయింది. అసహ్యించుకుంది, బ్రతిమిలాడింది, ఏడ్చింది, సిగ్గువిడచి అరవబోయింది. కానీ వాడు అరవనివ్వలేదు లొంగిపోయింది.
   
    "ఈ విషయం ఎవరికీ తెలియకుండా వుంటే ఏం జరిగేదో తెలియదు. ప్రక్కింటివాళ్ళు పసిగట్టారు. ఊరంతా చాటారు. అన్నకు తల కొట్టేసినట్టయి ఓండ్రపెట్టాడు. ఆ వీరడ్నీ పిలిపించి అడిగారు. వాడంతా ఒప్పుకున్నాడు."
   
    ఆ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు.
   
    "సరాసరి వెళ్ళి బావిలో పడబోయింది. ఇంతలో వీరడొచ్చి ఆమె కాళ్ళ మీదపడి ఆమె జీవితాన్ని అంతం చేసుకోవద్దని, తనతో వచ్చి వుండమనీ బ్రతిమిలాడాడు. ఆమె మొదట 'ఛీ' అనుకుంది. నిర్ఘాంతపోయింది. తరువాత ఏమాలోచించుకుందో ఏమో, ఈ లోకంమీద కసి తీర్చుకోవాలనుకుందేమో, వీరడితో మాల గూడేనికి వెళ్ళిపోయింది."
   
    వాడితో అక్కడే జీవితాన్ని వెళ్ళబోస్తోంది.
   
    శివనాథరావు కన్నులు చెమర్చాయి. ఇది ప్రేమగాధ కాదు, విధి రక్కసి వికృతచర్య చరిత్ర.
   
    "పోనీ సుఖపడుతోందా?" అన్నాడు మెల్లిగా.
   
    "సుఖం ఎక్కడుంది శివా? ఆ వీరడికి అంతకుమునుపే ఓ భార్య వుంది. అది ఈమెను ఎప్పుడూ కాల్చుకుతింటూ వుంటుంది. ఆమె సుఖాన్ని ఆశించి అక్కడకు పోయి ఉండదు. అందుకని ఆశాభంగం అంతగా వుండదు."
   
    శివనాథరావు నిట్టూర్పు విడిచాడు. ఇల్లు సమీపించింది.
   
                              *    *    *

 Previous Page Next Page