Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 22

   

         మోహనరావు స్నేహితుడ్ని తమ పల్లెటూరికి ప్రయాణంకమ్మని బలవంతం చేశాడు. అసలతను ఎప్పట్నుంచో అడుగుతున్నాడు రమ్మని. ఈసారి శివనాథరావు ముఖం వికసించింది. సరే అన్నాడు.
   
                             *    *    *
   
    వచ్చి రెండురోజులైంది. పాడు బస్ లు-పాడు ప్రజలు. 'అగ్ని జ్వాలను ఆర్పుదాం, శాంతిని కనుగొందాం' ఇవి అతని అభిప్రాయాలు.
   
    ఆరోజు మోహనరావూ, అతను బెజవాడలో బస్సు ఎక్కారు. రెండుగంటలు ప్రయాణం. చెముటూరు కిళ్ళీదుకాణం ముందు బస్సు వాళ్ళను దింపేసింది. కొట్టుచుట్టూ కూర్చున్న ఐదారుగురు మనుషులు వీళ్ళని గమనిస్తున్నారు. వాళ్ళకు మోహనరావు తెలుసు. ఇంకా నాలుగుమైళ్ళు వుంది వాళ్ళ ఊరు. బస్సు పోదు.
   
    "ఏమిటి చూస్తున్నావు?" అన్నాడు శివనాథరావు.
   
    "బండి రావాలి."
   
    నడిచి పోదామన్నాడు.
   
    "ఓ అరగంట చూసి, రాకపోతే ఆపనే చేద్దాం. అంతదాకా ఆ హోటల్లో కూచుందాం పద" అంటూ ఓ పూరిపాక కాఫీ హోటలుకు దారితీశాడు. ఇద్దరూ వంగి అందులోకిపోయి బల్లమీద కూర్చున్నారు.
   
    ఒంటిమీద బనియనైనా లేని వ్యక్తి వాళ్ళదగ్గరకు వచ్చి వినయంగా-'ఏం కావాలి అయ్యా?' అని అడిగాడు.
   
    "ఏమున్నాయి?"
   
    "ఇడ్లీ, ఉప్మా, దోశ."
   
    శివనాథరావు యిడ్లి పట్టుకురమ్మన్నాడు, మోహనరావు ఉప్మా కావాలన్నాడు....వచ్చాయి.
   
    ప్రక్కబెంచీలమీద అయిదారుగురు మనుష్యులు చేరి తీవ్రంగా రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. బయట ఎలక్షన్ల గొడవ. అందులో ఒకడు ఇటుతిరిగి 'మీది ఏ ఊరండీ?' అన్నాడు.
   
    "బెజవాడ."
   
    "మీ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు బాబూ?" అన్నదతని రెండోప్రశ్న.
       
    "ఏమో, నాకు తెలియదండీ."
   
    ఇది విని, వాళ్ళలో వాళ్ళు ఏదో చెప్పుకుని, నవ్వుకుని మళ్ళీ వాళ్ళ ధోరణిలో పడ్డారు.
   
    దాదాపు ఓ అరగంట ఎదురు చూశాక బండివచ్చింది. మోహనరావు బయటకు వచ్చి 'ఏరా యింత ఆలస్యం చేశావు? నా ఉత్తరం అందలా అన్నాడు.
   
    "అందింది దొరా. మన ఎద్దుల్ని మునసబుగారు భీమవరప్పాడు తోలుకెళ్ళారు. ఊరంతా తిరిగితేగాని ఎక్కడా దొరకలా. చివరికి సిద్దయ్యగోరి ఎద్దులు తోలికొచ్చినా" అన్నాడు.
   
    "ఎక్కరా" అన్నాడు మోహనరావు.
   
    శివనాథరావుకైతే నడవాలని వుంది. కాని అట్టే ఒత్తిడి చేయలేదు. అతన్తోబాటు బండిలో ఎక్కి కూర్చున్నాడు. బండి త్రోవనపడి నడవసాగింది. బండివాడికి ఎడ్లు క్రొత్త అవటంవల్ల కాబోలు, కొంచెం మారాం చేస్తున్నాయి.
   
    శివనాథరావు చుట్టూ కలియజూశాడు. నీరెండ కాస్తోంది. ఎటుచూసినా కనుచూపుమేరలో తాటిచెట్లు. విడిచివచ్చిన ఊరు వెనకబడింది. ఏదో కొత్తగాలి పీలుస్తున్నట్లుగా వుంది. తూర్పుదిక్కున తనస్థానం మారినట్లు భ్రమ కలిగిస్తోంది.
   
    వాళ్ళవెనకనే మనిషి నడిచివస్తున్నాడు. అతనిచేతిలో ఉత్తరాల కట్టనుబట్టి అతన్ని పోస్టుమేన్ అని అనుకున్నాడు.
   
    "కృష్ణమూర్తీ! మా యింటికేమన్నా ఉత్తరాలున్నాయా?" అనడిగాడు మోహనరావు బండిలోంచి.
   
    "లేవు సార్."
   
    మొహమాటంకోసం గావును అతను మళ్ళీ "దా, బండిలో ఎక్కు" అన్నాడు.
   
    పోస్టుమేన్ చిన్నగా నవ్వి "ఎందుకులెండి, నడుస్తాను" అన్నాడు.
   
    బండి మందంగా సాగిపోతుంది. ఓచోట ఎత్తు ఎక్కసాగింది. ఎడ్లు బలాన్నంతా ఉపయోగిస్తూ, అప్పుడప్పుడూ గునుస్తూ లాగుతున్నాయి. బండివాడు చాలా జాగ్రత్తగా ముందువుండి నడిపిస్తున్నాడు. ఎడ్లని అదిలించడం మానేశాడు. "చూడు" అన్నాడు మోహనరావు. ఏమిటా అని శివనాథరావు చూశాడు. బండి భూమికి చాలా ఎత్తులోవుంది. చక్రాలు చాలా పిరికిగా తిరుగుతున్నాయి. బండికి అటూయిటూ ఒక అడుగుమేర నేలక్రింద విశాలమైన లోయ ఇరుప్రక్కలా ఏరువస్తే ప్రయాణాలు బంద్ అని చెప్పాడు మోహనరావు. ఖర్మగాలి ఎవరైనా ఎదురువస్తే జాగ్రత్తగా తను బండిని వెనక్కి నడిపించుకుని తీరాల్సిందే. ఎడ్లు కొంచెం తప్పటడుగులు వేస్తే తాము ఎక్కడుంటారా అనుకున్నాడు శివనాథరావు. ఒకడు పద్దెనిమిదంతస్తుల మెడ మీది పిట్టగోడమీద చెక్కనుపరిచి దానిమీద నాట్యం చేశాడు. మరొకడు విమానం తోకను తనచుట్టూ బిగించి అవలీలగా గాలిలో ఎగిరిపోయాడు. ఇవన్నీ అపాయాలు, కానీ అందులోనే ఆనందం వుంది.
   
    ఒంతెన దిగి బండి క్రిందకు వచ్చేసింది. 'హమ్మయ్య' అనుకుని ఊపిరి తేలిగ్గా పీల్చాడు శివనాథరావు. ఊరు చేరేసరికి పదిన్నర దాటింది.
   
    అంతా క్రొత్త చాలా పెద్ద పెంకుటిల్లు. వాళ్ళు వస్తారని ముందే తెలియటం చేత ఆ యింట్లో పిల్లలు బయట నిలబడి నవ్వుతూ చూస్తున్నారు. కొత్తవ్యక్తిని చూద్దామని గుమ్మం అవతలనుంచి వంటమనిషి చీకటికి అలవాటు పడిన నేత్రాలుగావును- కళ్ళు చికిలించుకుని చూస్తున్నాయి. శివనాథరావుకు సిగ్గుతో చచ్చిన చావయింది. ఈ క్రొత్తచోటుకు ఎందుకు వచ్చానా అని విచారించాడు క్షణంసేపు. వచ్చేదాకా వున్న ఉబలాటం ఇప్పుడులేదు. స్నేహితుడితో మెల్లిగా లోపలకు అడుగుపెట్టాడు.
       
    మోహనరావు తన రెండో అన్నగార్నీ, పెద్ద బావగార్నీ పరిచయం చేశాడు. పొట్టిపొట్టి గుమ్మాలు, లోపలకు పోతుంటే పొడుగాటి శివనాథరావు తల ఠంగున కొట్టుకుని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. "మీరు కొంచెం వంగి నడవాలి. పల్లెటూరి కొంపలు" అన్నారు మోహన్ అన్నగారు నవ్వుతూ.
   
    ఈ వాతావరణం ప్రారంభంలో వున్నంత నిరుత్సాహంగా తరువాత లేదు. తనలోకూడా నూతన పరిసరాలకు యిమిడిపోయే సహనం వుందే అనుకుని విస్మయం చెందాడు.
   
    మధ్యాహ్నం చాలాసేపు అంతా కబుర్లలో పడ్డారు. ప్రక్కింట్లో కాపురం వుంటున్న కరణంగారుకూడా వచ్చారు. "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా వుంది" అన్నాడు శివనాథరావుతో.
   
    "చూసే వుంటారు" అన్నాడతను కొంచెంచిరాగ్గా.
   
    "మీ పేరుకూడా ఎక్కడో విన్నట్లుంది."
       
    "వినే వుంటారు."
   
    "ఎక్కడై వుంటుందంటారు?"
   
    "మా ఊళ్ళో అయివుంటుంది. బెజవాడ."
   
    "కానీ, ఈమధ్య నేనెప్పుడూ అక్కడికి రాలేదే?"
   
    "వచ్చి వుండరు!"
   
    "అయితే మిమ్మల్ని ఎలా చూశాను?"
   
    "చూసి వుండరు."
   
    ఈ ధోరణికి కొంచెం చిన్నబుచ్చుకుని, ఓ క్షణంగడిచాక ఆయన "ఈ ఊళ్ళో పాములెక్కువండోయ్" అన్నాడు ఉత్సాహంగా శివనాథరావు వినీ విననట్లు ఊరుకున్నాడు. అదో పెద్దవిషయం కాదన్నట్లుగా.
   
    ఆ సాయంత్రం చల్లబడ్డాక స్నేహితులిద్దరూ షికారు బయల్దేరారు. "నీకు ఏరు చూపిస్తానురా" అన్నాడు మోహన్. నాలుగుఫర్లాంగులు నడిచి ఎరు చేరుకున్నారు. తప్పుచేసి తలవంచుకున్న అమ్మాయిలా నీళ్ళు పొగరణిగి, అడుగు ఎత్తుకూడా లేని రాళ్ళకుసైతం ఒదిగిఒదిగి మందగమనంతో పారుతున్నాయి. శివనాథరావుకు గమ్యస్థానం చేరుకున్నానన్న అనుభూతి చేరుకుంది. ప్రకృతి కాముకుడే అన్నమాట. ఇన్నాళ్ళూ నిద్రాణమై వున్న అభిరుచులు నిరామయా వస్థనుదాటి ఒక విషాదకరమైన మేలుకొలుపు గీతంపాడి జాగృతిని కలిగించాయి. అతను పొరపడటం లేదుకదా? లేదు అది విషాదగానమే. అవి మధుర స్మృతులే నీళ్ళలోదిగి-పైజామా తడవకుండా కొంచెం కాలు ఎత్తి తడిసిన పాదాన్ని చూసుకున్నాడు. సంధ్యాకాంతికి నీటిబిందువులతో అతని పాదం జలజలా మెరిసింది. స్మృతిపధంలో ఓ సంఘటన మెదిలి హృదయపు చిలిపి మువ్వల్ని సుతారంగా మోగించింది.

 Previous Page Next Page