Previous Page Next Page 
హిమసుందరి పేజి 21

    సీత అన్నది సరోజకి అంతగా రుచించలేదు. మౌనం వహించింది. అది గ్రహించిన సీత మరోవేపు నవ్వుతూ తిప్పింది.

    అక్కడ కూడా చుక్కెదురైంది సీతకి.

    "భర్త అన్న తర్వాత ఎప్పుడో భార్యమీద చేయి చేసుకుంటాడు. అది తప్పంటే ఎలా? ఆడజన్మ అంటే ఏమిటి అణిగిమణిగి వుండటమే కదా! ఓసారి నామతి మరుపుతో మా వారికి కోపం వచ్చి చేయి చేసుకున్నారు. తప్పు నాది అని చెప్పిం తరువాత గాని వారు శాంతించలేదు...." అంటూ సరోజ చెప్పుకుపోయింది.

    "నా తల్లీ! చదువుకున్న మూర్ఖురాలివి. శ్రీకృష్ణలీలలు కధ చెప్పినంత రమ్యంగ నీ సంసారం కధ చెపుతున్నావు" అనుకుంది సీత.

    మరో అరగంట తర్వాత.

    "మావారు ఆఫేసు నుంచి వచ్చేసరికి నేను యింట్లో లేకపోతే చిందులు శివాలు అనుకొండి. మా వారికి కోపం వచ్చిందా తగ్గటానికి ముచ్చటగ మూడురోజులు పడుతుంది" అని చెప్పి సరోజ వెళ్ళిపోయింది.

    ఇది సీతకి చేదు అనుభవం.

    సరోజ యిక్కడ వున్న గంటలో గొప్ప మనోహరమైన కధలా తన పెళ్ళి మొగుడు సిగరెట్లు చెంపదెబ్బలు తేలిగ్గా వినిపించి వెళ్ళిందిగాని సీత హరించుకోటానికి చాలా సమయమే పట్టింది.

    "లోకంలో సరోజలాంటి ఆడవాళ్ళు కూడా వుంటారన్నమాట?"

    రెండుచేతుల మధ్య తలకాయ యిరికించుకుని ఆలోచిస్తూ కూర్చుంది సీతామనోహరి.
   



                                         9


    "సాయంత్రం మాంచి హాస్యరసం చిందించే చిత్రరాజం 'ఊరందరికి మొగుడు' వెళదాం" అన్నాడు రామకృష్ణ.

    "ఊరందరికి భార్య ఈ పేరుతో ఏ నిర్మాత సినిమా తియ్యలేదా?" సీతామనోహరి సాంబారులోని ములక్కాడలని గరిటతో తీసి రామకృష్ణ కంచంలో వేస్తూ వ్యంగ్యంగా అడిగింది.

    "ఖర్మకాలి ఏ నిర్మాత ఊరందరికి భార్య అనే టైటిల్ తో పిక్చర్ తీశాడే అనుకో, మీ ఆడాళ్ళు తెరని చించి పోగులు పెట్టటమే గాక సినిమా హాలుని కూడా తగలబెడతారు."

    రామకృష్ణ చెప్పిన తీరుకి కిలకిల నవ్వింది సీత.

    "అవతల ఆఫీసు టైం అయిందని హడావిడిగ నేను భోం చేస్తుంటే అలా నవ్వకు" కోప్పడ్డాడు రామకృష్ణ.

    "అదేంటమ్మా!" ముద్దుగ అడిగింది సీత.

    "నాకు కొలమారుతుంది."

    "బాగుంది వేషాలు. బోడిగుండుకి మొకాలుకి ముడిపెట్టినట్లు వుంది. నా నవ్వుకి మీ కొలమారటానికి సంబందం ఏమిటి?"

    "ఏమో నాకలా అనిపించింది" కొంటెగా అన్నాడు.

    "దేనినే వేషాలు అంటారు."

    "వేషాలు అయితే ఫరవాలేదు. తిట్టులాంటిది అయితే చాలా కష్టం" అంటూ భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు రామకృష్ణ.

    సీత కూడా భోజనం పూర్తి కావటంతో రామకృష్ణ వెనుకనే బెడ్ రూమ్ లోకి వచ్చింది.

    "సాయంత్రం ఊరంతా మొగుళ్ళు పిక్చర్ కి వెళదామా వద్దా చెప్పనేలేదు" రామకృష్ణ బూటు లేసు బిగించుకుంటూ అడిగాడు.

    "పేరు మార్చేశాడు!"

    "నీ పేరా?"

    "ఉహూ పిక్చర్ పేరు."

    "ఎవరు?"

    "మీరే మహానుభావా! ఊరందరికి మొగుడు అని యిందాక చెప్పారు. ఇప్పుడేమో ఊరంతా మొగుళ్ళు అంటున్నారు."

 Previous Page Next Page