"పల్లీలు......పల్లీలు కావాలా?"
"అక్కర్లేదు వెళ్ళు. వెళ్ళమంటుంటే?" కసిరింది పల్లీల కుర్రాణ్ణి ఇందుమతి.
"ఊఁ.....ఆ తర్వాత ఏమైంది?"
"డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. అప్పటికే రవి టిఫిన్ చేస్తున్నాడు. రవీ! అమ్మ ఎలా ఉంది అన్నాను. అందుకువాడు సమాధానం ఇవ్వలేదు. పైగా ఏ భూతాన్నో చూసినట్టు నన్ను కళ్ళు విప్పి, నోరు తెరచి చూడసాగాడు."
"ఏమిటలా చూస్తావ్?"
"నువ్వు.....నువ్వు....." గొంతు పిడచ కట్టుకు పోతున్నట్టుగా ఆ పైన అతడి కంఠంనుంచి మాటలు పెగల్లేదు.
"ఏమిటి? నువ్వు.....నువ్వు అంటూ అలా వెర్రిముఖం పెట్టావేం? నేను మళ్ళీ చచ్చిపోయినట్టు ఎవరైనా చెప్పారా?" పకపక నవ్వాను.
"నువ్వు తొమ్మిది గంటలకే టిఫిన్ చేసి వెళ్ళిపోయావుగా?"
"నేనా? తొమ్మిది గంటలకు టిఫిన్ చేసి వెళ్ళానా?" ఆశ్చర్యంగా అడిగాను.
"అవును బాబూ! తవరు పొద్దున్నే టిఫిన్ తిన్నారుగా? ఒకసారి ఊరినుంచి వచ్చారు. మళ్ళీ ఊరినుంచి వచ్చినట్టే పెట్టెతో వచ్చారు" అన్నది వంటమనిషి భయంగా చూస్తూ.
నాకు నెత్తిమీద సుత్తిదెబ్బ పడినట్టుగా అయింది.
"నేనా! నేను ఇప్పుడే వచ్చాను."
"పరాచికాలాడుతున్నారు బాబుగారు" అన్నాడు పని కుర్రాడు చంద్రయ్య.
నేను రవి ముఖంలోకి చూశాను. "ఏమిటి రవీ ఇదంతా? పొద్దుట ఎవరైనా వచ్చారా?"
"ఎవరైనా రావటం ఏమిటి నువ్వె వచ్చి...."
నేను తుళ్ళిపడ్డాను.
"అమ్మ ఏదీ?"
"అదికూడా మరిచిపోయావా?"
"ఏమిటి?"
"అదే అమ్మకు ఫిట్స్ వచ్చిందన్న సంగతి?"
"అవును బాబూ తవరూ చిన్నబాబుగారేగా అమ్మగార్ని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు?" పని కుర్రాడు నన్ను పిచ్చివాడిని చూసినట్లు చూస్తూ అన్నాడు. నాకు ఆ సమయంలో నిజంగానే మతిపోయింది.
"నీకు ఒంట్లో బాగున్నట్టు లేదు. సైక్రియాటిస్టును చూడు" అనేసి రవి చరచర వెళ్ళిపోయాడు మేడమీదకు.
నాకు మెడమీద కరాటే దెబ్బ తగిలినట్టుగా అయింది.
ఎంతసేపు అలాగే కూర్చుండిపోయానో నాకే తెలియదు.
చిన్నగాలేచి అమ్మ గదిలోకి వెళ్ళాను.
"పెద్దబాబుకు టిఫిన్ పెట్టు" అంటూ రంగమ్మను కేకవేసింది అమ్మ.
కుర్చీ లాక్కుని మంచంపక్కన కూర్చున్నాను.
"అమ్మా! అమ్మా!"
అమ్మ కళ్ళు తెరచింది. నన్ను చూసింది. కొద్ది క్షణాలు చూస్తూనే ఉండిపోయింది.
"ఎప్పుడొచ్చావు బాబూ!" ఎంత ప్రేమ ఆ కంఠంలో?
"ఇంతకుముందే. ట్రైన్ ఆలస్యం అయింది."
"టిఫిన్ చేశావా?"
"ఇంకా లేదు."
"అదేంటమ్మగారూ! పెద్దబాబుగారు టిఫిన్ చేశారుగా?"
"టిఫిన్ చేశాడా? ఎప్పుడూ?"
"తవరికి ఫిట్స్ వచ్చి....."
"రంగమ్మా" అమ్మ గావుకేక పెట్టింది.
నేను ఆశ్చర్యపోయాను. రంగమ్మ బిత్తరపోయింది.
"ముందు నేను చెప్పింది చెయ్యి. అధిక ప్రసంగం చెయ్యకు అరిచినట్టే అన్నది అమ్మ.
"అలాగేనమ్మా!"
రంగమ్మ గిర్రున తిరిగి వెళ్ళిపోయింది.
"వెళ్ళుబాబూ! వెళ్ళి టిఫిన్ చెయ్యి" అనేసి కళ్ళు మూసుకుంది అమ్మ.
అమ్మకు మాట్టాడటం ఇష్టం లేనప్పుడు కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి పడుకుంటుంది. నాకు టిఫిన్ చెయ్యాలనిపించలేదు. గదిలోకి వెళ్ళి పడుకున్నాను.
జరిగిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు" అని ఆగి గౌతమ్ ఇందుమతి ముఖంలోకి చూశాడు.
"ఆ సమయంలో నేను గుర్తొచ్చానా?"
"అవును! ఆ రాత్రి నువ్వు నన్నే చూశాననుకొన్నావు. అతడు ఇంట్లోనుంచే బయటికి వచ్చినట్టు కూడా చెప్పావు. ఆ రోజు అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. మళ్ళీ ఇవాళ స్పృహతప్పి పడిపోయింది" సాలోచనగా ఇందుమతి ముఖంలోకి చూశాడు.
"అవును!" తనకుతనే చెప్పుకుంటున్నట్టుగా చిన్నగా అన్నది ఇందుమతి.
"అంటే నాలాంటివాడు మరొకడు ఉన్నాడు. అతడు ఎందుచేతనో ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అతన్ని చూసి అందరూ నేననే భ్రమ పడుతున్నారు. కాని అమ్మ భ్రమపడలేదు."
"అలాగే అనిపిస్తుంది. కాని ఆమె అతన్ని చూసి ఎందుకు భయపడుతోంది." ఇందుమతి సాలోచనగా అన్నది.
"అవును భయపడుతోంది. కారణం అతడెవరో అమ్మకు తెలుసు.
"తెలిస్తే?"
"అంతకంటే నేనేమీ చెప్పలేను. మొత్తంమీద అతడెవరో అమ్మకు తెలుసు. అతడు నేను కాదని ఇతర్లకు తెలియడం అమ్మకు ఇష్టంలేదు. అందుకే భయపడుతోంది."
"చాలా చిత్రంగా ఉంది. సినీమాహాల్లో నిన్ను చూసి...."
"నన్ను కాదు."
"సారీ అతన్ని చూసి నువ్వే అనుకున్నాను."
"నీకే అలా అనిపిస్తే మిగతా వాళ్ళ సంగతి?....."
"అవును మరి అత్తయ్యా ఎలా గుర్తించ గలుగుతుందో?"
"ఆమె కన్నతల్లి."
"ఎవర్ని కన్నతల్లి నిన్నా- అతడ్నా?" సర్దాగా అని నాలుక కరచుకుంది ఇందుమతి గౌతమ్ ముఖం చూసి.
గౌతమ్ గంభీరంగా ఉన్నాడు.
"సారీ గౌతమ్! తమాషాగా అన్నాను."
"తమాషాగా అన్నా నిజమే అన్నావని నాకు అనిపిస్తోంది."
"గౌతమ్!"
"అవును ఇందూ! మనిషిని పోలిన మనుషులుంటారంటారు. కాని ఇంత పోలికలు అసంభవం."
"ఎందుకు అసంభవం? కవల పిల్లల్లో ఉంటారుగా?"
"కరెక్టు నేనూ అదే ఆలోచిస్తున్నాను."
ఇందుమతి త్రుళ్ళిపడింది.
"మేమిద్దరం ఒకే తల్లి బిడ్డలం అయి ఉండాలి."
"కవలలు కూడా...." అని ఆగింది ఇందుమతి.
"అవును నాకూ అలాగే అనిపిస్తూంది."
"కాని....."
"గౌతమ్ చివ్వునలేచి నిల్చున్నాడు.
"ఇక వెళదాం" అన్నాడు.
"అప్పుడే?"
"వెళదాం ఇందూ, నాకు మనసు బాగాలేదు. అమ్మనుంచి నిజం తెలుసుకోవాలి."
ఇందుమతి సమాధానానికి ఎదురుచూడకుండానే నడక సాగించాడు ఇందుమతి అతడ్ని అనుసరించింది.
లోయర్ టాంక్ బండ్ రోడ్డుమీద మోటార్ బైక్ స్పీడుగా పోతున్నది.