Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 21


    సవరజాతి ఆడవాళ్ళని అవమానించాడు అందుకు ప్రతీకారం చెయ్యటం ఒక్కటే వాళ్ళ లక్ష్యం ఆ తరువాత తాము చచ్చిపోయినా యిష్టమే!
    కూచిపోతి నాయకత్వంలో వాళ్ళు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ పెద్ద గుడారంవైపుగా నడుస్తున్నారు.
    గుడారాల్లో కాగడాలు వెలుగుతున్నాయి. రవ్వంత వెలుతురు గుడారాల మధ్య నేలమీద పరుచుకుంది. ఆ వెలుగు చీకటుల సయ్యాటల మధ్య వొంగి వొంగి నడుస్తున్నారు సవరలు. తాను ధరించిన యిత్తడి, రాగి, వెండి ఆభరణాలు శబ్దం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ నడుస్తోంది కూచిపోతి చాల గుడారాలు దాటివచ్చారు.
    ఒక గుడారం దాటి వస్తూ వుండగా ఒక సవర పొరపాటు పడి కూచిపోతి చేతికి తగిలాడు. దాని వెండి, గాజు ముందుకు జారి ముంజేతి నుంచి మణికట్టున వున్న మరొక గాజుతో ఢీకొంది. చిన్నశబ్దం అయింది.
    అందరూ ఆగిపోయినారు. వూపిరి బిగబట్టి ఆ శబ్దం యెవరైనా విన్నారేమోనని పరిశీలించటం ప్రారంభించారు.
    ఆ గుడారంలో ఒక ఫౌజ సిపాయి యింకా నిద్రపోలేదు. దూర దేశంలో వదిలి వచ్చిన పెళ్ళాం, పిల్లల్ని తలపోసుకుంటూ మేలుకునే వున్నాడు. తన ఖర్మకు తానే యేడుస్తున్నాడు. తాను యే యుద్దంలో ప్రాణం పోగొట్టుకుంటాడో తెలియదు. యే పూట ముంచుకొస్తుందో తెలియదు. యింటికి చేరేసరికి రెండు కాళ్ళు, రెండు చేతులూ వుంటాయో తెగిపోతాయో తెలియదు. ఆ ఆలోచనల్లో వుండి అతడు యీ చిన్ని శబ్దాన్ని విన్నాడు. అది గాజుల మోత కావటంనించి అతనికి అనుమానం వచ్చింది. కాగడా తీసుకుని గుడారం వెలుపలకు వచ్చేడు. కూచిపోతి సవర యువకులు అందర్నీ గుడారం చాటుకు తప్పుకోమని హెచ్చరిక చేసింది. వాళ్ళందర్నీ వెనుక ఉండమని తాను ముందు ప్రక్క మోకాళ్ళమీద వంగి కూర్చుంది.
    సిపాయి కాగడా తీసుకుని గుడారం వెనుకకు వచ్చాడు. పదిహేను మంది మనుషులు నీడలాంటి శరీరవర్ణంతో నేలమీద పాకుతూ వుండటం అతనికి కన్పించింది. ఒరనించి కత్తి లాగాడు.
    ఆ క్షణాన్ని వృధా పోనివ్వకుండా కూచిపోతి అతని మీదికి దూకింది. కత్తి ఒరనించి లాగకముందే అతని నోరు మూసి వెనక్కు విరిచి పట్టుకుంది. ఒక సవరవీరుడి చేతిలోని యీటె అతని గుండెల్లో దిగింది.
    
                            6
    
    చడీ చప్పుడూ లేకుండా అతని ప్రాణాలు బలి అయినాయి. కోడి పెట్టను గొంతు కోసినట్లుగా కాస్సేపు తన్నుకుని అతడు తల వ్రేలాడ వేశాడు. అంతవరజూ కూచిపోతి తన పట్టును రవ్వంత ఒదిలిపెట్టలేదు.
    అతడికి ప్రాణం పోయేముందు దూరదేశంలో వున్న భార్యాబిడ్డలు గుర్తుకు వచ్చారు. తాను బ్రతికే వున్నాననీ డబ్బు సంపాదించి తెస్తాననీ ఆశ పెట్టుకుని, యెదురుచూస్తూ వుంటారు వాళ్ళు. ఆ ఆశ యిక యెన్నటికీ తీరదు. అతని ప్రాణం పోయింది.
    కూచిపోతి విజయగర్వంతో అతనిని నేలకు విసిరికొట్టింది. మొదలు నరికిన అరటిబోదెలా అతడు దబ్బున నేలమీద పడిపోయాడు.
    స్కాంద పురాణంలో యీ సవరజాతి గురించి ఒక కధ వుంది. అది గొప్ప పాంటసీ! నమ్మటమూ నమ్మకపోవటమూ విన్నవాళ్ళ యిష్టమే!
    హిమాలయ పర్వతాలమీద వామదేవుడు తపస్సు చేసుకుంటున్నాడు. గంధర్వ యువకులు ఆ ప్రాంతమంతా కలయతిరుగుతూ అక్కడ వున్న శబర యువతుల్ని ప్రేమించారు కామించారన్న మాట.
    ఆ యువకులకీ యీ యువతులకీ ముందు చూపులూ, ఆ తరువాత మనసులూ, చేతులూ, శరీరాలూ యేకం అయినాయి. యిష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. యిది వామదేవునికి మంట అయింది. మీరంతా అనాగరికంగా ప్రవర్తించారు కాబట్టి శబరుల యిళ్ళల్లో పుట్టండి అని శాపం యిచ్చాడు.
    వాళ్ళు ఆయన కాళ్ళమీదపడి లబ లబలాడితే వెళ్ళి మహావిష్ణువుని ప్రార్ధించుకోమన్నాడు. మహావిష్ణువు శివుడి దగ్గరకు పొమ్మన్నాడు.
    ఆ రోజుల్లో  దేవుళ్ళు అంత అందుబాటులో వున్నారు కాబోలు. యిప్పుడు మనం ప్రక్కవాళ్ళ యింటికి వెళ్ళి వచ్చినట్టుగా వుంది వీళ్ళ వరస వెంటనే శివుడు దగ్గరకు పోయారు శివుడు చెప్పాడు.
    మహేంద్రగిరికి దక్షిణంగా కళింగదేశం వుంది. అది చాల పవిత్ర మయిన దేశం. (స్కాంద పురాణం రాసినాయన కళింగదేశాన్ని చూచే వుండాలి) అక్కడ కొద్దిరోజుల్లో విష్ణుమూర్తి శ్వేతాచలంమీద కూర్మ రూపంలో వెలుస్తాడు. ఆ ప్రాంతంలోనే వంశ ధారానది వున్నది. దానికి అనుకుని మధూకవనం వుంది అక్కడ శబర కుటుంబాలున్నాయి. వారికి మీరు పుట్టండి (ఎవళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకి పుట్టటం వాళ్ళ యిష్టం కాబోలు) నేను మీకు అక్కడ ప్రత్యక్షం అవుతాను. అప్పుడు మీకు శాప విమోచనం అవుతుంది అన్నాడట. యిది స్కాంద పురాణంలో సవరజాతి పుట్టుక కధ. గొప్ప ఫాంటసీ!
    అట్లా పుట్టిన సవరలకు ఒకప్పుడు చిత్రగాయకు డనే నాయకుడు వచ్చాడు. అతనికి చిత్తి అని ఒక పెళ్ళాం యిదివరకే వుంటే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఒకరోజు అడవిలోకి వేటకోసం వెళ్ళాడు. ఒకామె కన్పించింది పేరు అడిగితే చిత్కళ అని చెప్పింది. శ్రీశైలం దేవాలయంలో ఒక పూజారి కడుపునా పుట్టానని చెప్పింది. యెక్కడికి పోతున్నావంటే శ్రీశైలం పోతున్నానని చెప్పింది.
    "సరే వెళ్ళు యింకా నిలబడ్డావెందుకు?" అని అడిగాడు చిత్రనాయకుడు తాను వేటాడుతున్న మృగం కనుమరుగై పోతుందనే భయంతో.
    ఇంకా యెక్కడకు పోతాను? నిన్ను ప్రేమించాను నన్ను పెళ్ళాడు అని పీట వేసుక్కూచుంది చిత్కళ అతడు అరక్షణం ఆలోచించకుండా పెళ్ళాడేశాడు.

 Previous Page Next Page