Previous Page Next Page 
షా పేజి 21

 

    "ఎవరు కావాలి?" అందామె పరీక్షగా చూస్తూ.
    "నా పేరు సృజన్ అండీ! హైదరాబాద్ నుంచీ వచ్చాను. అర్జంటుగా ఓసారి భారతిగారిని కలుసుకోవాలి! ఆవిడ ఈ అడ్రస్ లో ఉంటానని చెప్పారు-"
    ఆమె కళ్ళల్లో అనుమానం తొంగిచూసింది.
    "భారతీ!" అంటూ అక్కడే నిలబడి లోపలకు చూస్తూ పిలిచింది.
    "వస్తున్నా పిన్నీ! అంటూ వినిపించింది భారతి గొంతు. మరుక్షణం ఆమె తలుపు దగ్గిరకొచ్చి సృజన్ ని చూస్తూనే ఆశ్చర్యపోయింది.
    "మీరా" అంది చాకితురాలయి.
    "మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి........." అన్నాడు సృజన్.
    "రండి! లోపలికొచ్చి కూర్చోండి" అందామె దారి యిస్తూ-- అతను లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు.
    "ఎప్పుడొచ్చారు మీరు?" అడిగిందామె.
    ఆమె పిన్ని అక్కడే నిలబడి ఇద్దరినీ జాగ్రత్తగా పరీక్షిస్తోంది.
    "ఇందాకే ! అనుకోకుండా ఒక ఘోరం జరిగిపోయింది. అందువల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా అన్నయ్యా ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికొచ్చాడు. అతనిని ఎవరో హత్య చేశారు." భారతి ఉలిక్కిపడింది. ఆమె పిన్ని కళ్ళల్లో భయం కనబడుతోందిప్పుడు.
    "హత్య చేశారా?" అడిగింది నమ్మలేనట్లు.
    "అవును! స్పష్టంగా హత్యే నంటున్నారు ఇన్ స్పెక్టర్ గారు."
    కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.
    "వదిన వాళ్ళు రేపొద్దున్న వస్తున్నారు. రేపే అంత్యక్రియలు జరపాలని అనుకుంటున్నాను."
    "ఓ........అలాగా!"
    "అంతా సడెన్ గా అనుకోకుండా జరిగిపోయే సరికి నాకు మిగతా ఏర్పాట్లు చేసుకోడానికి వీల్లేకపోయింది. అందుకని మీరు ఈ అంత్యక్రియల కోసం డబ్బెమయినా సర్దగలరేమో అని వచ్చాను. నిజానికి మీరున్న పరిస్తితులల్లో మీరూ ఏమీ చేయలేక పోవచ్చునని నాకు తెలుసు! అయినా ఈ సితిలో మీరు తప్పితే ఇంక తెలిసిన వారెవరూ లేరు నాకు! అందుకే మీ దగ్గర కొచ్చాను."
    భారతికి నోట మాట రావటం లేదు. తన దగ్గర చాలా తక్కువ మొత్తం ఉంది. అదీ తను నెలంతా బస్ లో ఆఫీస్ కెళ్ళి రావటానికీ అప్పుడప్పుడు కాఫీ తాగడానికీ సరిపోతుంది. ఒకవేళ ఆ వందరూపాయలు అతనికిచ్చినా దాని వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు, కనీసం అయిదారువందలయినా లేందే తన సహాయానికి అర్ధం వుండదు. అంతవరకూ వాళ్ళ మాటలూ వింటూ నిలబడ్డ ఆమె పిన్ని ఆ పరిస్థితి చూసి చకచకా లోపలికెళ్ళిపోయింది.
    "సారీ! మీకిది సాధ్యం కాదని తెలుసు - అయినా-"
    భారతి నిరశాగా నవ్వింది.
    "మీరున్న పరిస్థితిలో నా దగ్గరకు రావటమే మంచిదయింది. నేను ఓ పని చేస్తాను. మా ఆఫీస్ లో నా కొలీగ్ ఒకామె ఉంది. పరిచయమయి నాలుగయిదురోజులే అయినా అయ్ థింక్ షి కెన్ హెల్పర్" ఆలోచిస్తూ మాట్లాడిందామె.
    "ఆమె ఇల్లెక్కడా?"
    "కరెక్టుగా తెలీదు. నేను రేపు ఉదయమే ఆమె ఇల్లు ఎలాగోలా వెతికి పట్టుకుని ఆమె సహాయం అడుగుతాను."
    "దయచేసి నాకోసం ఈ సహాయం చేయండి భారతి గారు! మీ డబ్బు పదిరోజుల్లోపలె తీర్చి వేస్తాను."
    "మీరు మరీ ఇంత ఇదిగా అడగక్కర్లెదులెండి! మీకు ఈ పరిస్థితిలో సహాయం చేయడం నా బాధ్యత - నాకు మీరు చేసిన సహాయం సంగతి నేనెప్పటికీ మర్చిపోలేను . నిజానికి ఇది నాకు దొరికిన అవకాశం ఇప్పుడు మీకు సహాయం చేయలేకపోతే ఇంకేప్పటికి చేయలేనేమో" ఉద్వేగంతో అందామె.
     అయితే నన్ను రేపు ఉదయం ఎన్ని గంటలకు రమ్మంటారు?"
    "మీరు రానవసరం లేదు. మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి మీకందజేస్తాను" అందామె.
    "నేను ఓ చెత్త హోటల్లో ఉంటున్నాను. హోటల్ "వైజాగ్ కోస్ట్" దాని పేరు. స్టేషన్ రోడ్ లో ఉంది."
"సరే! తొమ్మిది గంటల లోపే నేనక్కడి కోస్తాను."
    "థాంక్యూ భారతిగారూ! మీ సహాయం తీసుకోటానికి సిగ్గుగానూ ఉంది. ఆనందంగానూ ఉంది. వస్తా" అతను లేచి బయటికొచ్చాడు. అతని వెనుకే రోడ్ వరకూ వచ్చిందామే.
    "సారీ! వీళ్ళింట్లో గెస్ట్స్ ని సరిగ్గా ట్రీట్ చేసేస్వాతంత్యం కూడా లేదు నాకు" అందామె నొచ్చుకుంటూ.
    "మీరేమీ బాధపడకండి! ఒకరిమీద ఆధార పడినప్పుడు వాళ్ళ ఇష్టా ఇష్టాల ప్రకారమే నడుచుకోవటం మంచిది."
    ఆమె ఆగిపోయింది. వడివడిగా హోటల్ వేపు నడవటం మొదలు పెట్టడతను,
    

                                                               *    *    *    *

    ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది బస్.
    రంగా, స్వరూప్ , సుభద్ర, పిల్లలు బస్ దిగారు. ఆ రెండు రోజుల్లోనే సుభద్ర పిచ్చిదానిలా తయారయింది. వుండుండి ఆమె కళ్ళ నుంచి కన్నీరు జారిపోతూనే వుంది.
    అందరినీ తన హోటల్ గదికి తీసుకొచ్చాడు సృజన్.
    "మీరిక్కడే వుండండి వదినా! నేనోసారి పోలీస్ స్టేషన్ కెళ్ళి వస్తాను - అని చెప్పి బయటకొచ్చాడతను . సీతా, శంకూ అతని వెనుకే బయటకు పరుగెత్తుకొచ్చేశారు.
    "బాబాయ్! దాడీని ఎవరో చంపెశారుట కదా" అడిగారిద్దరూ. సృజన్ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు.

 Previous Page Next Page