ఆ మాటలు వింటుంటే చిన్మయికి ఒళ్ళు జలదరించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
మనసులో రాజీవ్ మెదిలాడు. తమకు ముందు ముందు పిల్లలు పుడతారు. వాళ్ళ పెంపకంలో, జీవన సమరంలో ఎన్నో సమస్యలు, సంఘటనలు ఉత్పన్నమవుతూ వుంటాయి. అయినా ఇద్దరిమధ్యా ఎలాంటి పోరలూ ఏర్పడకూడదు. ఇద్దరిమధ్యా ఎలాంటి చీకట్లూ ఆవరించకూడదు. ఆ ఒడ్డుకు చేరినప్పుడు కూడా, ఆ చరమాంకంలో కూడా ఇలాగే పవిత్రమైన జాహ్నవి తరంగంలాగే, గంభీరంగా వెలిగే కార్తీక వెన్నెలలాగే తమ జత జగతిలో కాంతులని నింపుకుంటూ...
ఊహలు ఆకాశపు అంచుల్ని దాటి వెళ్ళిపోతున్నాయి.
"చిన్మయీ!" అని ఆమె పిలుస్తూ భుజంమీద చెయ్యి వేసేవరకూ తెలివిలోకి రాఎల్దు.
అయిదేళ్ళు గడిచిపోయాయి. ఈ అయిదేళ్ళలో కొన్ని పరిణామాలు జరిగాయి. రాజీవ్ కు ప్రమోషనొచ్చి ఉద్యోగంలో బాగా హోదా పెరిగింది. అతను కారు కొనుక్కున్నాడు. ఇంటికి ఫోనొచ్చింది. ఆళ్వార్ తిరునగర్ లో ఇప్పుడు వుంటోన్న ఇంటినే కొనేశాడు. ఆ యింటినే బాగా రీమోడల్ చేసి యింకా అధునాతనంగా తీర్చిదిద్దుకున్నాడు.
అన్నిటికన్నా ముఖ్యం.... వాళ్ళకో పాప ఇప్పుడు ఆ పాపకు కిరణ్మయి అని పేరు పెట్టుకున్నారు.
కిరణ్మయికి ఇప్పుడు నాలుగేళ్ళు.
"మన కిరణ్ ని బాగా చదివించాలండీ! ఊటీలో మంచి స్కూల్స్ వున్నాయి కదా! అక్కడ జాయిన్ చేద్దామా?" అనడిగింది చిన్మయి.
రాజీవ్ కొంచెంసేపు నిశితంగా ఆలోచించాడు. "ఊటీలో యిప్పుడు సీటు రావాలంటే చాలా కష్టం. కిరణ్ కు ఏడాది కాకుండానే ముఫ్ఫయివేలో ఎంతో డొనేషన్ కట్టి, పేరు రిజిష్టర్ చేసుకుంటే, అయిదారేళ్ళు పోయాక ఎంట్రెన్స్ టెస్టు అదీ పెట్టి ప్యాసయితే సీటు యిస్తారు. లేకపోతే డబ్బు రిటర్న్ చేసేస్తారు. ఆ పని అప్పుడు మనం చెయ్యలేదు- తెలీక ఇంకొకటేమిటంటే పిల్లల భవిష్యత్తు కోసమని ఎప్పుడో ఏడాదికోసారి మాత్రం కలుసుకుంటూ మిగతా కాలమంతా దూరంగా వుంచటం, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య ఎడాన్ని సృష్టిస్తుంది. ఇద్దరిమధ్యా ఓ యాంత్రికత్వం నిర్లిప్తత ఏర్పడుతుంది. నా దృష్టిలో యిదంత సమంజసమైన నిర్ణయం కాదు. మద్రాసులో కూడా మంచి మంచి స్కూల్స్ వున్నాయి. ఇక్కడే చదివిస్తే బాగుంటుంది" అన్నాడు.
చిన్మయికి కూడా అతని అభిప్రాయాలు బాగున్నట్లు తోచింది.
రాజీవ్ మద్రాసంతా గాలించి గాలించి తెలిసిన వాళ్ళతో సంప్రదించి కిరణ్మయిని మంచి స్కూల్లో చేర్పించాడు.
* * *
ఓ మధ్యాహ్నం యింటిముందు కారాగినట్లు వినిపిస్తే చిన్మయి బయటకు వచ్చి చూసింది.
మంజుభార్గవి కార్లోంచి దిగుతోంది.
ఈ మధ్య ఆమెని చూసి రెండు మూడేళ్ళయింది. ఒకసారి రాజీవ్ తో కలిసి పాండీబజార్ కి వెళితే షాపింగ్ చేస్తూ కనిపించింది. తనని చూసి ఆప్యాయంగానే పలకరించింది.
"మీకు పాప పుట్టిందట కదా? బారసాల, బర్త్ డే ఇలాంటి ఫంక్షన్స్ కి పిలవలేదే? కావాలని ఎవాయిడ్ చేస్తున్నారా?"
"అదేం లేదండీ! నా డెలివరీ అమ్మా వాళ్ళింట్లో జరిగింది. మొదటి ఫంక్షన్ అక్కడే జరిగింది. తర్వాత బర్త్ డే వగైరాలు ఘనంగా చేసుకోలేదు. రాజీవ్ కు ఆడంబరాలు ఇష్టంలేదు. వాళ్ళ ఆఫీసులో వాళ్ళని మాత్రం పదిమందిని పిల్చాం."
"ఒక్క పాపేనా? తర్వాత..."
"ఏమీలేదు."
"అదేమిటి?"
చిన్మయి మాట్లాడలేదు.
"ఫ్యామిలీ ప్లానింగా? దానంతటదే ఆగిపోయిందా?"
చిన్మయి నవ్వి వూరుకుంది.
"మేము మొదట ఫ్యామిలీ ప్లానింగ్ చేశాం. తర్వాత ఆపేసి పిల్లలు కావాలని అనుకున్న పుట్టడంలేదు. మరేమిటో" అంది భార్గవి ఆమెమాటల్లో కొంత విచారం ధ్వనించింది.
ఆ తర్వాత మళ్ళీ యిప్పుడే చూడటం.
చిన్మయి గేటు తాళంతీసి బయటకు వెళ్ళింది.
"రండి" అంది సాదరంగా ఆహ్వానిస్తూ.
మంజుభార్గవికి మునుపటికన్నా వొళ్ళొచ్చింది. అప్పటికన్నా నిండుగా, అందంగా కూడా తయారయింది.
"రేపు మా బాబు ఫస్ట్ బర్త్ డే మీరు, మీవారు కలిసి తప్పకుండా రావాలి" అంది మంజుభార్గవి.
"మీకు..."
మంజుభార్గవి నవ్వింది. "మొత్తంమీద పాపం డాక్టర్ల కృషివల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నిరుడు విజయా హాస్పిటల్లోనే డెలివరీ అయింది. అఫ్ కోర్స్! సిజేరియన్ అనుకోండి. చెబుదామంటే యిన్నాళ్ళూ కుదరలేదు...." అంది.
"కంగ్రాట్స్" అంది చిన్మయి ఏమనాలో తోచక.
"రేపు తప్పకుండా రావాలి."
మంజుభార్గవిలో ఒక విశేషముంది. యితరులగురించి ఎక్కువ చాడీలు చెప్పదు, ఎంతో అవసరమనుకుంటే తప్ప మనసులో ఏమున్నా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎవరిమీదా ద్వేషం వెళ్ళగ్రక్కదు.
ఆ సాయంత్రం రాజీవ్ యింటికి వచ్చాక మంజుభారగావి గురించి చెప్పింది.
రాజీవ్ విని మెదలకుండా వూరుకున్నాడు.
"వెడదామా?" అంది చిన్మయి.
"నీ యిష్టం! నాకు వాళ్ళంటే యిష్టంలేదు. అయిష్టమూ లేదు. సొసైటీలో కొన్ని తప్పవు కాబట్టి వెడదామంటే కంపెనీ యిస్తాను."