మనసంతా పాలకొండమీదినించి గడ్డనీరు ధారల్లా దూకినట్లు ఆలోచనలతో నిండివుంది. ప్రవాహంలాంటి ఆలోచనలు.
గోమంగో ప్రక్కన దొలబెహర యీటె పట్టుకుని నుంచున్నాడు. కుడంగ్ చింతయేరుమీద కూర్చున్నాడు. బిబ్సాడి పెద్ద రాయిమీద కూర్చున్నాడు. నెగడు చుట్టూ చతికిలపడి కూర్చున్నారు సవరలు. ప్రతి ఒక్కరి చేతిలోనూ మొరటు తరహా ఆయుధాలున్నాయి. గోమంగో చెప్పాడు.
"ఓరన్న! సవరబిడ్డలూ, ఇన్నరా యీ చోద్ధెం సేర్ కాను (షేర్ ఖాను) యెత్తివచ్చిండు. పెస కస్స (పేష్ కష్) కట్టాలంట. నసర బిడ్డలతో సైయ్యాటలా యీడికి సవర రగతం అంటే సన్నీళ్ళు అను కన్నడా యీ తురకబిడ్డ. సవరకెంపొ (కడుపు)ల మీద కొడతడా యీడు. నరసిమ్మవేయుండు (నరసింహస్వామి) అనగా పలుకుతుండ. నసర మందాలు (మనుషులు) ఏతెరగాళ్ళా? (ఏతెర, ఏడుపుగొట్టు) రగతంతో దారాళమ్మ దేవత కాళ్ళు తడవాల. లబో (నేల) యీనినట్టు సవరంలంతా లెగండి )పై పదాలన్ని తురేనియన్ భాషాపదాలని మాక్స్ ముల్లర్ వ్రాశారు. అవి సవరభాషలోకి యెలాగో వచ్చాయి) యీటె పట్టండి. పోటు మిగలండి" అంటూ చెప్పాడు.
కూచిపోతి రక్తం మరిగింది. చేతిలో యీటెని బిగించి పట్టుకుని ఆవేశంతో లేచి నిలబడింది.
"ఓరయ్య! సవరజాతి చిన్నదాన్ని. ఒకే ఒక్కమాట చెప్పబోవాలి. యినండి మనసంతా పెట్టి యినండి. సేరు కాను (షేర్ ఖాన్) అంటే బెబ్బులి కాదా! పులిని చూచి సవరజాతి నంటోడుకూడ దడవడు. దానిపేరు పెట్టుకున్న యీ కుక్కని చూస్తే భయమా! లెగండి. సేరు కాను రగతంతో సవర నేలకు తిలకం దిద్దాం. లెగండి. యీటెలు పట్టండి" అంటూ వీరాలాపం చేసింది కూచిపోతి.
ఆ మాటలు సవరల ఆధైర్యాన్ని పోగొట్టినాయి. యెవరికి అందిన ఆయుధం తీసుకుని వాళ్ళంతా యుద్దానికి తయారుఅయినారు. మగ సైన్యానికి దొలబెహర, ఆడ పటాలానికి కూచిపోతి నాయకత్వం వహించారు.
సైన్యం బయలుదేరిపోతూ వుంటే కుడంగ్ అడ్డు వచ్చాడు.
"ఆగండి, ఆగండి, అంతా వురుకులు పరుగులేనా? ఆలోచన అక్కరలేదా? సేరుకానుకు సైన్యం వుండాది. మనసంతా నూరుమందిమి లేము అయిదువేల లెక్కలో వున్న సేరుకను సైన్యాన్ని మనం ఎట్టా యెదిరించాల ఆలోసింసండి. పరుగెత్తి పోతే పానాలు పోతయ్యి మీ మీదికి మారెమ్మ తోలింది సేరుకానుని. మారెమ్మతల్లిని మంత్రాలు సదివి పిలుస్తాను ముగ్గేసి మారెమ్మను సల్లపరుత్తాను. అమ్మతల్లి నా మంత్రాలు ఆలకించి అనుగ్గరం (అనుగ్రహం) సూపుతాది. అమ్మతల్లి అగ్గన యిచ్చిందంటే సేరుకాను సెప్పకుండా పోతాడు" అంటూ చెప్పసాగాడు.
ఈ మాయమాటలు విని కూచిపోతికి వళ్ళు మండిపోయింది. మంత్రాలు సదివితే మారెమ్మ తల్లి పలుకుద్దా? అది నిజమయితే యీ కుళ్ళిపోవటం యెందుకూ? వేట కొట్టలేనోళ్ళకి అమ్మతల్లి అన్నం తెచ్చి యిచ్చుద్దా? అయితే ఆకలితో సావులు యెందుకూ? యియన్నీ వుట్టి మాటలు మాయమాటలు సవరలు వాళ్ళశక్తిని వాళ్ళు నమ్ముకుంటే తనకు కూడు వుండదని యీడు యీ మంత్రం చేతన్నాడు, అని ఆలోచించింది కూచిపోతి చాలామంది సవరలు కుడంగ్ మాటలకు మంత్ర ముగ్ధులు అయి ఆగిపోయినారు వేడిరక్తం చల్లబడిపోయింది.
"కాదు, సేరుకాను వుసురు తియ్యాల. ఆడి రగతంలో నేలతల్లి నుదర్న తిలకం దిద్దాల. నీ సప్పిడి మాటల్తో సవరజాతి పరువు తియ్యకు" అంటూ హుంకరించింది కూచిపోతి.
ఆమె తండ్రి గోమంగో వురిమాడు.
"ఏయ్ కూన! మాట పెంచి గీటు దాటేవు. కుడంగ్ అంటే దైవాలకూన ఆడికి అమ్మా పలుకుతాది అయ్యా పలుకుతాడు యింతలో ముంచుకొచ్చింది యేముంది? మంత్రాలతో మారెమ్మను పిలవనియ్యి. అమ్మ ఆగ్గిన అయితేనే ఆయువు పట్టాల. తెలిసిందా?" అంటూ కూతురు మాటల్ని ఖండించాడు.
కూచిపోతికి తండ్రి అమాయకత్వం మీద జాలివేసింది. అయినా ఆయన మాటకు యెదురు చెప్పకూడదు. రంగవాక గ్రామంలో మలి పెద్ద ఆయన యెదురు చెప్తే కూతురని అయినా చూడరు. తల తీస్తారు.
సవరలంతా చప్పబడిపోయినారు. కుడంగ్ ఆవేశం తెచ్చుకుని అర్ధంకాని భాషలో పెద్ద పెద్దగా మంత్రాలు అరుస్తూ అక్కడినించి వెళ్ళి పోయాడు రంగవాక గూడెంలో అందరూ యెవరి గుడిసెలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. కడలి కెరటం వువ్వెత్తున లేచి విరిగి నేల కరిచింది.
కూచిపోతి గుండెలు కాలిపోతున్నాయి. కుడంగ్ అమ్మతల్లిని పిలిచేలోపు షేర్ ఖాన్ వచ్చి చెయ్యవలసిందంతా చేసి పోతాడని ఆమెకు అర్దమయింది. ఆమెలోని సవర రక్తం మరిగింది. యెలాగైనా రంగవాకను రక్షించాలి. ఆమె కళ్ళు విశాలం అయినాయి. తన మాట వినే వారి నందర్నీ ఒక్కొక్కర్నీ నిద్రలేపింది.
కూచిపోతితో వాళ్ళంతా కలిసి పదిహేనుమంది అయ్యారు. వాళ్ళ చేతుల్లో కాగడాలు, ఆయుధాలు వున్నాయి. వాళ్ళు పలాసదిక్కుగా నడిచి పోయారు. అడవిదారి కావటంనించి యెంతో కష్టంమీద వాళ్ళు అర్ధరాత్రి దాటేవేళకు పలాస సరిహద్దులమీద కాళ్ళు పెట్టారు.
షేర్ ఖాను విడిది చేసిన గుడారాలు దూరంగా కన్పించినాయి. కాగడాలు నేలలో గుచ్చి ఆర్పేశారు కూచిపోతి యీటెను గట్టిగా పట్టుకుంది.
"ఓరయ్యా! ఆగండాగండి ఆ కన్పించే యెత్తయిన గుడారంలో వుంటాడు షేర్ ఖాను ఆడి తల తుంచాల మనం వెనుకచాటుగా పోవాల. ఆడి తల నేలమీదికి దొర్లేంతదాక మనం అలికిడి సెయ్యకూడదు అంతా రగస్సెంగా జరిగిపోవాలి" అంటూ హెచ్చరించింది కూచిపోతి.
యువకులంతా వుత్సాహంతో తలలు వూపారు. అయిదువేల సైన్యం మధ్యకు వెళ్ళితే తాము యేమి అవుతామన్న ఆలోచన వాళ్ళకిలేదు. సవరజాతి రక్తంతో నేల తడిపాడు షేరు ఖాను.