"చెప్పండి ! ఏమిటి ప్రాబ్లం.
"నా దగ్గర డబ్బేమీ లేదు-------"
"లేపోతే మీ వదినను ఇక్కడకు రప్పించండి! ఇక్కడే అంత్యక్రియలు ఏర్పాటు చేయిస్తాను."
అదే ఉత్తమంగా కనిపించింది సృజన్ కి.
"సరే! మా వదినకు టెలిగ్రామిస్తాను---'
"ఓ.కే. -- ఇక్కడ మీరే హోటల్లో దిగారు?"
"అది అంత స్థోమత లేదు --------' ఇన్ స్పెక్టర్ కి అర్ధమయింది!
"ఓ.కె. ఓ.కె. బస్ స్టాండ్ దగ్గిర లాడ్జికి ఫోన్ చేస్తాను. రెండు రోజులు తక్కువ రేటుకి రూమ్ ఇస్తాడు. అక్కడ వుండండీ"
"థాంక్యూ........"
లాడ్జికీ ఫోన్ చేసి మాట్లాడాడు ఇన్ స్పెక్టర్.
"ఇంక మీరు హోటల్ కి వెళ్ళండి. నేను రేపు ఉదయం కబురు చేస్తాను.
"మీకూ-------"
"సరే-----"
సూట్ కేస్ తీసుకుని ఆటోలో టెలిగ్రాం ఆఫీస్ చేరుకొని రంగా రావ్ కి టెలిగ్రామ్ యిచ్చి హోటల్ కి చేరుకున్నాడతను. చాలా నాసిరకం హోటల్ అది! వెలసిపోయిన రంగులు, శిధిలావస్థలో వున్న గోడలు, వాటిమీదే మరకలు -----
"ఇన్ స్పెక్టర్ రాహీగారు పంపించారు........." అన్నాడు సృజన్ కౌంటర్ ముందు నిలబడి బ్రాకెట్ చార్ట్ చూస్తోన్న నల్లటి వ్యక్తీ తల పైకెత్తి సృజన్ వేపు చూశాడు.
"మీరు సృజానేగా?"
"అవును-----"
"ఒరేయ్ దేవదాస్!" లోపలకు చూస్తూ కుర్రాడిని పిలిచాడతను. ఓ కుర్రాడు పరుగుతో వచ్చాడు.
"ఆయనను రూమ్ నెంబర్ 204 కి తీసుకెళ్ళు."
కుర్రాడు సూట్ కేస్ అందుకొని సోరంగంలా వున్న నడవాలోకి నడిచాడు. అతనితో పాటు గదిలోకి నడిచాడు సృజన్.
చాలా చిన్న గది అది గదిలో ఫాన్ లేదు. ఒక చిన్న కిటికీ వుంది గానీ ఆ కిటికీకి అంతా చదలు పట్టి వుంది. చదపురుగులు కిటికీ అంతా పాకుతున్నాయ్. మూతి విరిగిన కూజా పట్టుకెళ్ళి నీళ్ళు తెచ్చి వుంచాడు బాయ్. మూలగా ఇనపమంచం తుప్పు పట్టి వుంది. దాని మీద అక్కడక్కడ బొడిపెలు కట్టినట్లున్న పరుపు. పరుపు మీద బాగా మాసి పోయిన చారాల దుప్పటి!
మంచం మీద కొద్ది సేపు నడుము వాల్చాడతను. మర్నాడు ఉదయానికల్లా వదినను రంగారావ్ తీసుకొస్తాడు. తను బస్ స్టాండ్ కెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కానీ రాత్రి ఎలాగయినా దహన క్రియలకు ఎంతో కొంత డబ్బు సమకూర్చుకోవాలి వైజాగ్ లో తనకు తెలిసిన వారెవరూ లేరు ఎలా? ఏమిటి చేయటం ఏమీ పాలుపోవటం లేదతనికి! పోలీస్ ఇన్ స్పెక్టర్ మంచి వ్యక్తీలాగున్నాడు అతనేమయినా సహాయం చేస్తాడా? అతనినే ఆశ్రయించి ఉన్నదున్నట్లు చెప్పేస్తే మంచిదేమో! తీరా ఆఖరి నిమిషంలో అతనికి చెప్పినా బావుండదు. కనీడం తనకు ఎవరి ద్వారా అయినా అప్పు కొంత మొత్తం ఏర్పాటు చేసినా తర్వాత ఎలాగోలా తను తిరిగి తీర్చేయగలడు! ఒకవేళ అతను "సారీ" అంటే? అప్పుడేమిటి చేయటం శరీరాన్ని ప్రభుత్వం వాళ్ళే అంటే పోలీసులే దహనం చేయమంటే చేస్తారు! కానీ అది తనకిష్టం లేదు-- అన్నయ్య అలా దిక్కులేని చావుకి లోనవకూడదు తన కంఠంలో ప్రాణముండగా అలాంటి దహనానికి తను వప్పుకోడు.
దిక్కులేని శవాన్ని పోలీసులు ఎలా దహనం చేస్తారో తనకు బాగా తెలుసు. ఆ శవాన్ని వాళ్ళకు లొంగివుండే కొంతమంది బికారులికిస్తారు. ఆ బికారులు శవాన్ని తీసుకెళ్ళి బిజీగా వున్న రోడ్డుపక్కన పడుకోబెట్టి "దిక్కులేని శవం బాబు! దహనానికి ధర్మం చేయండి బాబూ" అంటూ దహనానికి వాళ్ళకు వారం పదిరోజులు వరకూ తాగుడుకీ, తిండికీ సరిపోయెంత మొత్తం సమకూరే వరకూ అడుక్కుంటారు. ఒకోసారి శవం రెండు రోజుల పాటు రోడ్డుపక్కనే ఉండిపోతుంది.
శసృజన్ లేచి గదిలో పచార్లు ప్రారంభించాడు.
ఈ నగరంలో తను ఇంకేవరిని ఆశ్రయించగలడు! యిన్ని లక్షల మందిలో తనకు సహాయం చేసే వారోక్కరూ లేరా?
హటాత్తుగా భారతి గుర్తు కొచ్చిందతనికి! అవును! భారతి ఇక్కడే వుంది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్........., ఇక్కడికే ఉద్యోగం కోసం వెళుతున్నానని చెప్పి ఇక్కడి అడ్రస్ కూడా ఇచ్చింది తనకు.
ఒక్క ఉదుటున తన సూట్ కేస్ బయటకు లాగి డయిరీ కోసం ఆత్రుతగా వెతకసాగాడు. పెట్టె అడుగున కనిపించిందది! త్వరత్వరగా తిరగేశాడు పేజీలన్నీ. ఆఖరి పేజీల్లో కనిపించిందది. భారతి, 6/69/328/68-B ఈస్ట్ పాయింట్ కాలనీ , విశాఖపట్నం. అతనిలో ఎక్కడ లేని అనందం కలిగింది. తనకు ప్రగడమయిన నమ్మక ముంది. భారతి తనకు సహాయం చేస్తుంది.
వాచ్ టైము చూసుకున్నాడతను. ఏడున్నరవుతోంది. కనుక వెంటనే అడ్రస్ వెతుక్కుంటూ వెళితే కనీసం ఎనిమిదన్నర లోపల కనుక్కోగలడేమో?
త్వరత్వరగా డ్రస్ చేసుకొని గదికి తాళం వేసి రోడ్ మీద కొచ్చాడు. ఈస్ట్ పాయింట్ కాలానీ కెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాల్సిందీ నలుగురయిదుగుర్ని వాకబు చేసి వెళ్ళి బస్ స్టాప్ లో నిలబడ్డాడు. అరగంట గడిచిపోయింది గానీ బస్ లేమీ ఆగటం లేదు. ఇంకతను ఆలస్యం చేస్తే తనకున్న ఒకే ఒక్క అవకాశాన్ని పోగొట్టుకున్నట్లవుతుంది ...........అటో పిలిచి అడ్రస్ డ్రైవర్ కిచ్చాడతను. చాలా సేపు ఆ ఏరియాలో వెతికాక దొరికిందా అడ్రస్. అటో పంపించివేసి డోర్ బెల్ మోగించాడతను. కొద్ది క్షణాల తర్వాత ఓ మధ్య వయస్కురాలు వచ్చి తలుపు తెరచింది.