Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 20


    "తీసుకోమ్మా అసలు గంట గంటకూ ఏదొకటి తీసుకుంటూ వుండాలి. ఈ జ్యూస్ నేనే తయారుచేశాను. గ్రేప్స్, లెమన్, మేంగో, పైనాపిల్, ఆరెంజ్, రకరకాల జ్యూస్ లు చేస్తాను. ఈ ఊళ్ళో చక్కగా జ్యూస్ లు తయారుచేయటం నేర్పించే సంస్థలు చాలా వున్నాయి."
    
    పిల్ల ఇద్దరికీ గ్లాసుల్లో లెమన్ జ్యూస్ తీసుకొచ్చింది.
    
    చిన్మయి తీసుకుంది. చాలా టేస్ట్ గా వుంది.
    
    "ప్రిజర్వేటివ్ చేస్తే ఎన్నాళ్ళయినా చెడిపోకుండా వుంటుంది. యాక్చువల్ గా ఇది నేను ప్రిపేర్ చేసి నాలుగయిదు నెలలయింది. కాని ఎంత ఫ్రెష్ గా వుందో చూడు."
    
    "నాకు జ్యూస్ చేయడం నేర్పించండి" అనడిగింది చిన్మయి.
    
    ఆమెకు వీణాంబగారు సందర్భానుసారంగా వాడే ఇంగ్లీష్ పదాలు ఎబ్బెట్టుగా లేకుండా ఎంతో సహజంగా, వీనులవిందుగా కూడా వుంది.
    
    "తప్పకుండా ఇంకో విషయం ఎప్పుడో ఒకసారి కొంచెం తినేసి, రిపీటెడ్ గా తినటం తప్పనుకుంటాం. దీనివల్ల కేలరీస్ వాల్యూ పడిపోవటమే కాకుండా లేనిపోని నీరసాలు, గాస్ట్రిక్ ట్రబుల్స్ ని ఇన్ వైట్ చేసినట్టుగా వుంటుంది. స్టేట్స్ అలాంటిచోట్ల అయితే గంట గంటకూ ఏదో ఒకటి తింటూ వుంటారు డ్రై ఫ్రూట్స్, ఛీజ్, జ్యూస్ లు తాగటం. మీల్స్ తీసుకోవటం వాళ్ళ కప్పులు ఎంత పెద్దవిగా వుంటాయో తెలుసా?" అంటూ లేచివెళ్ళి షోకేసు లోంచి రెండుకప్పులు రెండుచేతులతో పట్టుకుని తీసుకొచ్చింది. అవి... ఇక్కడి కప్పులకు రెండింతలు, పావులీటరు ద్రవపదార్ధం పరిమాణంలో వున్నాయి. చిన్మయి వాటివంక ఆశ్చర్యంగా చూసింది.
    
    "ఇవి అక్కడ దొరికేవాటిలో మినిమమ్ సైజు. ఇవి నాకు అమ్మాయి పంపిస్తూ "ఇంతకంటే ఇక్కడ చిన్నవి దొరకవు మమ్మీ. ఇంకా చిన్నది యిమ్మని అడుగుతూంటే ఇక్కడ షాపులవాళ్ళు నవ్వుతున్నారు" అని రాసింది.
    
    పాలూ, డ్రింకింగ్ చాక్ లెట్లూ అవీ తాగేస్తూ, కేడ్ బరీస్ చాక్లెట్లు ఎడాపెడా తినేస్తూ వుంటారు.
    
    "అన్నట్లు నువ్వు నీరసంగా కనబడుతున్నావు. ఉపవాసాలు అవీ చేస్తూ వుంటావేమిటి?" అనడిగింది.
    
    "లేదులెండి" అంది చిన్మయి మొహమాటపడుతూ.
    
    "దేవుడిమీద భక్తి మంచిదే నీలోవున్న జీవుణ్ణి అంటే ఆత్మారాముడి రూపంలో వున్న భగవంతుడ్ని బాధపెట్టకూడదు. నేనూ పూజలు చేస్తాను. కాని ఉపవాసాలు చెయ్యను. ఇదిగో ఇవి నీకు ప్రజెంట్ చేస్తున్నాను వుంచు" అని ఆ కప్పుల్ని అందివ్వబోయింది.
    
    చిన్మయి తీసుకోలేదు. "వద్దండీ! మీకు మీ అమ్మాయి ప్రేమతో పంపించినవి."
    
    "నువ్వుమాత్రం మా అమ్మాయివి కావా? మా యింట్లో ఇలాంటివి చాలా వున్నాయి. మొదటిసారి మా యింటికి రావటం వట్టిచేతుల్తో పంపించకూడదు. తీసుకో" అని బలవంతం చేసింది.
    
    చిన్మయి కాదనలేకపోయింది.
    
                                                               * * *
    
    ఆ సాయంత్రం రాజీవ్ ఇంటికి వచ్చేసరికి చిన్మయి వాటిలో ఓ కప్పునిండా కాంప్లాన్ కలిపివుంచింది.
    
    "ఇదేమిటి, ఇంత పెద్దదిగా వుంది? నేనేమైనా మనిషిననుకున్నావా? లేక..." అన్నాడు రాజీవ్ దానిసైజు చూసి బెదిరిపోయి.
    
    "ఇహనుంఛీ మీరు ఇంతకు తక్కువ తాగితే ఒప్పుకోను. ఫారిన్ లో ఇలాగే త్రాగుతారట. ఎదురింటి మామీ చెప్పింది" అంది చిన్మయి.
    
    "సరే" అని రాజీవ్ కప్పు చేతిలోకి తీసుకొని మొత్తం తాగేశాడు. తర్వాత ఆయాసపడుతున్నట్లుగా కుర్చీలో కూలబడిపోయాడు.
    
    "ఏమిటండీ?" అంది చిన్మయి గాభరాగా.
    
    "రాత్రికి.... అన్నం తినలేదు. ఇంకా ఏమీకూడా..." అన్నాడు కళ్ళు మూసుకుంటూ.
    
                                                                    * * *
    
    చిన్మయి వాళ్ళయింటికి వారానికి ఒకటి రెండుసార్లన్నా వెళ్ళసాగింది. తర్వాత తర్వాత ప్రజాపతిరావుగారి దగ్గర కూడా ఆమెకు చనువు పెరిగింది.
    
    వాళ్ళిద్దరిమీదా ఆమెకెంతో గౌరవం కలిగింది. అవటానికి వృద్దులే అయినా వారి భావాలు, అభిప్రాయాలూ ఆమెకెంతో నచ్చేవి.
    
    "మామీ ఈ వయసులో మీరిద్దరు ఎవరి సాయం లేకుండా ఇలా వుండటం కంటే పిల్లల దగ్గరకు వెళ్లిపోతే మంచిదికదా మీకు శ్రమ లేకుండానూ వుంటుంది. పిల్లలదగ్గర వున్నామన్న తృప్తి వుంటుంది" అన్నది చిన్మయి ఒకరోజు.
    
    వీణాంబగారు నవ్వింది. "నా పిల్లలంటే నాకు ప్రేమే. అలాగే వాళ్లకుకూడా మేమంటే అభిమానమే కోడళ్ళు కూడా ఎంతో గౌరవంగా చూస్తారు. కాని పెద్దవాళ్ళమైనాక మాకు కొన్ని చాదస్తాలూ, ఇతరులకి విపరీతంగా కనిపించే చిన్న చిన్న సరదాలూ వుంటాయి. అది వాళ్ళకు విసుగ్గా, వేళాకోళంగా మా ఉనికి కొంత ఇబ్బందిగాకూడా వుండవచ్చు. నన్ను వాళ్ళు చిన్నచూపు చూస్తే ఆయన భరించలేరు. ఆయన్ని విసుక్కుంటే నేను తట్టుకోలేను. మనస్సులో ఎంత ఆపేక్షలూ, అంతఃకరణలూ వున్నా ఒకరికి మనం బరువుగా వున్నప్పుడు ఏవో లోపాలు కనబడుతూనే వుంటాయి. అవతల వాళ్ళ మనోభావాలు ఏదో రూపంలో బయటపడుతూనే వుంటాయి. మధ్య మధ్య విసుగు కలిగి ఆ విరక్తి అనిపించినా ఒకరి స్వభావాలు మరొకరికి పూర్తిగా నచ్చకపోయినా జీవితాంతం రాజీపడేది భార్యాభర్తలు మాత్రమే. ఆ రాజీలో సొగసుంది. అందముంది. ఆనందముంది త్యగాముంది. 'జీవితపు రహస్యముంది. అగాధమంత ఆధ్యాత్మికతవుంది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైన సహచర్యంలో, ఒడిదుడుకుల్లో, పొరపాట్లతో, విభేదాల్లో కట్టుబాట్లతోనో, అధికార దర్పాలలో, హక్కుల బంధిఖానాలో, అహంకారాల అభిజాత్యాల ప్రవర్తనలలో చివికి తఃదిసి అలసిపోయి చివరకు మిగిలేది యీ అంతిమ అనుబంధమేనమ్మా జీవితంలో యీ వొడ్డుణ నిలబడినప్పుడూ పోట్లాడటానికి ఓపిక వుండదు. తప్పులు చెయ్యటానికి శక్తి వుండదు. ఇతరుల నైజాలతో, స్వభావాలతో విసిగి వేసారి, జీవితసత్యం చివరి క్షణంలో దర్శనమిచ్చినట్లు జ్ఞానోదయమై, ఒకరికొకరు చివరిక్షణంలో ఇంకా చేరువై కోరికలు లేని నిష్కామమైన తుదియావస్థలో కూడిన నిజమైన భార్యభర్తల గమనం ఇప్పుడేనమ్మా."

 Previous Page Next Page