ఆ స్పీడ్ లో అతని చేయి ఎక్కడెక్కడ తగలాలో అక్కడంతా తగిలింది. క్షణం ఆలస్యం చేస్తే ఎవరైనా వస్తారుమోనని అతను మరో రెండు అంగల్లో వీధిలోకి రాబోయాడు. అప్పుడు సునంద పరుగెత్తి అతని వెనక నుంచి ముందు చేయి పోనిచ్చి బుగ్గలకు గంధం రాసింది.
ఇలా అక్కడున్నవాళ్ళు తమ హీరోలకు గంధం రాసి, గంధం రాయించుకున్నారు.
చివరికి నేను మిగిలిపోయాను. నా చేతిలోని గంధం అప్పటికే గట్టిపడుతోంది. అప్పటివరకు నాకంటూ ఒక వ్యక్తి లేడు. అలా ఆలోచిస్తుంటే ఠక్కున నాకు సుధీర్ గుర్తొచ్చాడు. అతను సాయంకాలం అలా వీధిలో వెళుతుంటే చూశాను. ఆరోజే యూనివర్శిటీ నుంచి వచ్చాడన్న మాట.
కానీ అతను దేవాలయం వెనక్కి వచ్చే అవకాశం లేదు. నేను ముందుకు వెళ్ళలేను. ఎం చేయాలో అని ఆలోచిస్తూ వుండిపోయాను. చివరికి పక్కనున్న మీనాకి పూద్దామని అనుకున్నానుగానీ- చెప్పాను గదా, హార్మోన్లు డానికి అనుమతించలేదు.
మరికొంతసేపు నిరీక్షించాలని నిర్ణయించుకున్నాను.
మరి నా మొర ఆ శ్రీరామచంద్రుడు ఆలకించాడేమో తెలియదుగానీ ఇంటి నుంచి దేవాలయానికి వస్తున్న సుధీర్ కనిపించాడు. ఏదో థ్రిల్ మనసును ఊపేసింది. శరీరమంతా మధురమైన కంపనాలు. అంతవరకు అనుభవించిన ఫీలింగ్ అది. మత్తుగా, గమ్మత్తుగా వుంది.
అతను దగ్గర పడుతున్నాడు.
ఆగలేకపోయాను. వీధి అని కూడా ఆలోచించకుండా మసకచీకట్లోంచి ముందుకు కదిలి అతని బుగ్గలమీద సుతారంగా గంధం పూశాను. నా చేయి వణకడం, నాలుక తడారిపోవడం తెలుస్తూనే వుంది.
అతను మొదట ఆశ్చర్యపోయి, ఆ పిమ్మట నన్ను గుర్తించి చిన్నగా నవ్వాడు.
అంత జరిగాక ఆ రాత్రి నిద్ర పడుతుందని నాకు అనిపించలేదు. తెల్లవారేవరకు అలా నవమి మహోత్సవాలు జరుగుతూనే వుంటే బావుంటుందని అనిపించింది. కానీ వెంటనే ప్రసాదం పెట్టడం ప్రారంభించారు.
ప్రసారం తీసుకున్నాక ఇంటికొచ్చానుగానీ ఏమీ చేయలేక పోయాను. అతని బుగ్గల గరుకుదనం నా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పడకమీద పడుకున్నానుగానీ కళ్ళమీద నిద్ర వాలడం లేదు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాను. ఏవేవో రంగురంగుల కలలు కన్నాను.
వారానికి ఓసారి వచ్చే అతనికోసం ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. అతను వచ్చాడంటే నా ఒక్కదానికే పండగా వచ్చినట్లుండేది. ఆ రెండు రోజులూ ఏ పని చేయకుండా వీధి గేటుకి నా చూపుల్ని వేలాడదీసేదాన్ని. అతనూ అంతే. ఊరకనే అలా వీధిలో తిరుగుతూ నాకోసం చూపుల వలను విసిరేవాడు.
ఎప్పుడయినా చీకట్లో తారసపడ్డప్పుడు గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేవాడు. ఆ క్షణంలో నా రక్తప్రసరణ ఆగిపోయేది.
అప్పుడప్పుడూ లవ్ లెటర్లు ఇటునుంచి అటుకి, అటునుంచి ఇటుకి నడిచేవి. అందరూ పడుకున్నాక రూమ్ లో ఒంటరిగా కొవ్వొత్తి వెలుగులో అతని లవ్ లేటరు చదువుకోవడం గొప్ప థ్రిల్లింగ్ గా వుండేది.
మేమెప్పుడూ నిముషంకన్నా ఎక్కువసేపు కలిసే వీలు కలగడం లేదు. అతను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటికొచ్చాడు. మరో రెండు మూడు నెలలు ఊర్లోనే వుంటాడు.
ఓ రోజు మేమిద్దరం గంటకు పైగా ఏకాంతంగా గడిపే ఛాన్స్ దానంతట అది రాలేదు. మేమిద్దరం అలా ప్లాన్ చేసి కలుసుకున్నాం.
ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటలవరకు సూర్యగ్రహణం. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనబడడనీ, ఆ గంటసేపు చీకటిగా అయిపోతుందనీ, అప్పుడు ఎవరూ బయట తిరగకూడదనీ, సూర్యగ్రహణం తరువాత బయటికి రావాలనీ ఊరులో పెద్ద ప్రచారం జరిగింది.
పట్ట పగలు చీకట్లు ముసురుకోవడం ఊహించలేని విషయం. ఈ అద్భుతాన్ని సుధీర్ తో కలిసి చూడాలని ఆరాటపడింది మనసు.
మా ఇంటి వెనక, విసిరేసినట్టు వీధికి దూరంగా సరస్వతి అవ్వ ఇల్లుంది. ఆ ఇంట్లో ఆమె తప్ప మరెవ్వరూ వుండరు. అక్కడికి వెళ్ళిపోతే సూర్యగ్రహణం సమయంలో ఎవరూ అక్కడికి రారు గనుక మేమిద్దరం హ్యాపీగా గడపవచ్చన్న ఐడియా వచ్చింది. మూడుగంటలకు అయిదు నిముషాల ముందు అక్కడికి రమ్మని కబురంపాను.
రెండున్నర గంటల ప్రాంతంలో అమ్మతో "నేను అవ్వ ఇంట్లో వుంటాను. ఇక్కడ బోర గా వుందని" చెప్పాను.
"ఇక్కడో, అక్కడో ఓ చోట కుదురుగా వుండు. గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు."
"అలానే."
నేను సరస్వతి అవ్వ ఇల్లు చేరుకున్నాను. ఆమెకు ఎనభై ఏళ్ళు పైగానే వుంటాయి. నడుం పూర్తిగా వంగిపోయింది. కళ్ళు మసగ్గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పడుకుంటూ వుంటాను గనుక అమ్మ కూడా ఎలాంటి సందేహం లేకుండా పంపింది.
నేను వెళ్ళేసరికి ఓమూల పడుకుని వుంది ఆమె.
లికిడి కాగానే "ఎవరూ?" అంది.
"నేనే"
గొంతుపట్టి కనిపెట్టింది. మళ్ళీ ముసుగుదన్ని పడుకుంది.
అది పెద్ద అడ్డాపిల్లు. ఓవార తడిక కట్టి వుంటుంది. దాంట్లో అవ్వ బట్టలు, ఓ పెద్ద చెక్కపెట్టె వుంటాయి. ఇవతల ఓ పెద్ద నులకమంచం వుంటుంది. దానిమీద పరుపు, రెండు దిండ్లూ వుంటాయి.
పరుపుమీద పడుకుని కాలక్షేపం కోసం తెచ్చుకున్న వీక్లీ తెరిచాను.
మరో పదినిముషాలకు సుధీర్ వచ్చాడు.
యధాప్రకారం అవ్వ "ఎవరూ?" అంది.
"సుధీర్ ని"
అవ్వ తిరిగి కళ్ళు మూసుకుంది.
ఆమెకు సరిగా కనిపించదని, సక్రమంగా వినిపించదనీ తెలుసు కాబట్టి సుధీర్ రాగానే నా పక్కన మంచంమీద కూర్చున్నాడు.
ఇంకా గ్రహణం ప్రారంభం కాలేదు కాబట్టి అటు ఎవరయినా వచ్చే ప్రమాదం వుందని ఠక్కున లేచి మంచానికి దగ్గరగా వున్న స్టూలుమీద కూర్చున్నాను.
ఇద్దరం ఏవేవో స్వీట్ నాన్సెన్స్ అంతా మాట్లాడుకుంటున్నాం.
మూడయ్యింది.
గ్రహణం ప్రారంభమైంది. అయితే అందరూ చెప్పింట్లు చీకట్లు కమ్ము కోలేదు. ఎండ తీక్షణత బాగా తగ్గింది. అంతేగాక ఎండలో ఏదో మార్పు వచ్చింది. కొలిమిలో బంగారును కరగబెడుతున్నట్లు ఎండ బంగారు రంగులోకి మారిపోయింది.