అతను నడుస్తున్నవాడల్లా ఠక్కున ఆగాడు.
ఎవరో మాట్లాడుతున్నట్లు మాటలు విన్పిస్తున్నాయి.
అప్పుడు చుట్టూ పరికించి చూశాడు. తను ఎక్కడ వున్నాడో తెలుసుకోవడానికి అయిదు నిముషాలు పట్టింది.
తను గోపాలకృష్ణ బంగళా దగ్గరకు వచ్చాననీ, కొండశిఖారాగ్రాన వున్నానని తెలిసింది. మాట్లాడుతున్నాది గోపాలకృష్ణ, మరో స్త్రీ అని కూడా బోధ పడింది.
ఆరోజు పౌర్ణమి అవునో కాదో తెలుసుకోవడానికి పైకి చూశాడు. కొరవలు లేని చందమామ నిండుగా వుంది.
అతని వృత్తికి పౌర్ణమి పడదు.
గోపాలకృష్ణ ప్రవృత్తికి అమావాస్య పడదు.
ఇలా రెండు విభిన్న ధృవాలయిన వారిద్దరూ శత్రువులై భయంకరమైన యుద్దానికి తలపడడానికి బీజాన్ని పునర్వసు వేసింది. ఆమె అతడిని ప్రేమించకపోగా, తను ఎవరిని ఇష్టపడుతూ వుందో చెప్పింది. దాంతో గోపాల కృష్ణ మీద ద్వేషం బయల్దేరింది అతనిలో. ఆ ద్వేషమే అతనికి తెలియకుండానే అతన్ని అక్కడికి లాక్కొచ్చింది.
గోపాలకృష్ణ పక్కన మరో స్త్రీ వుందంటే ఆరోజు ఖచ్చితంగా పౌర్ణమి అయి వుంటుందని పులిరాజుకి తెలుసు.
తను కనబడకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ అక్కడున్న పెద్దరాయి వెనకకు వెళ్ళి నిలబడ్డాడు.
అక్కడ్నించి చూస్తే గోపాలకృష్ణ ఓ అమ్మాయి స్పష్టంగా కనిపిస్తున్నారు.
వాళ్ళిద్దరూ పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పులిరాజు మోకాళ్ళు కింద ఆనించి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడం ప్రారంభించాడు.
8
"విశాఖా! మరి నీ జీవితంలో ఎవరికీ చెప్పని సంఘటన గురించి చెప్పు....." మురిపెంగా ఆమె చుబుకాన్ని పైకెత్తి అడిగాడు గోపాలకృష్ణ.
అంటే ఆరోజు విశాఖ వంతు వచ్చిందన్నమాట అనుకున్నాడు పులిరాజు. ఆమె రఘుపతి భార్య ఇరవై ఎనిమిదేళ్ళు వుంటాయి. లావుగా బొద్దుగా, అందంగా వుంటుంది.
"ఊఁ!" అంటూ ప్రారంభించింది ఆమె.
"ఎప్పుడో ఆరేళ్ళక్రితం సంగతి. అయినా ఇది నిన్నో, మొన్నో జరిగినట్టు అనిపిస్తుంటుంది. ఈ సంఘటన తాలూకు మధురస్మృతే లేకుంటే నేను బహుశా ఇంకా మొగుడికి సేవ చేసుకుంటూ ఇక్కడ వుండేదాన్ని కాదేమో.
నాకు అప్పుడు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి నాలోని స్త్రీ హార్మోన్లన్నీ పూర్తి స్థాయిలో స్రవించడం ప్రారంభమైందనుకుంటా. వెన్నెల వేడిగా అనిపిస్తున్న వయసు. ఏ పురుషుడితోనో గాఢమైన స్నేహం చేయాలని వుబలాడపడుతున్న మనసు.
ఈనాడు పిల్లలంతా ప్రేమ విషయంలో ఏదో ఒక స్థాయిలో వున్నారు. ఓ అమ్మాయి చూపులు కలిపే స్టేజిలో వుంటే, మరో అమ్మాయి మాట్లాడే దశలో, ఇంకో అమ్మాయి లవ్ లెటర్లు రాసే స్థాయిలో వున్నారు. నాకు అప్పటికి ఇంకా ఏ కుర్రాడిమీదా మనసు పడలేదు. ఏదో క్యాజువల్ గా వీధిలో అబ్బాయిలు పోతుంటే చూసేదాన్ని.
అలా చూస్తున్నప్పుడు అందరికంటే సుధీర్ కొంత డిఫరెంట్ గా కనిపించాడు. అతను అప్పుడు యూనివర్శిటీలో ఎం.ఏ. చదువుతుంటేవాడు. మా వీధిలోనే ఇల్లు. ఓ నాలుగిళ్ళ అవతల ఇల్లన్న మాట. అతను యూనివర్శిటీ నుంచి ప్రతి శని, ఆదివారాలు ఊరొచ్చేవాడు.
మనిషి మరీ ఫాస్ట్ కాదు. అల్లరి చిల్లరి వేషాలు వేసేవాడు కాదు. ఈస్థటిక్స్ వుండే మనిషని అతని చూపులనుబట్టి, అతని ప్రవర్తనబట్టి అనుకున్నాను.
అయితే అతడిమీద అప్పటికి పెద్ద ఇష్టం ఏమీలేదు. గేటు దగ్గర నిలుచున్నప్పుడు అతను వీధిలో వెళుతుంటే చూసేదాన్ని. అంతే తప్ప మరో అడుగువేసే స్థితిలో లేను.
అదిగో అప్పుడే మా ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
శ్రీరామనవమి ఉత్సవాలు మా వూరిలో చాలా బ్రహ్మాండంగా జరిగేవి. సాయంకాలం నుంచి రాత్రి పడీ పదకొండు గంటల వరకు ఊరంతా హడావుడిగా వుండేది.
మా వీధిలోనే దేవాలయం వుండేది. ఉత్సవాలు జరిగే రోజుల్లో రోజుకొకరు ఉభయం చేసేవారు. అంటే ఆరోజు పూజ, ప్రసాదాలు పెట్టే బాధ్యత ఒక్క కుటుంబమే నిర్వహించేది.
సాయంకాలం నుంచి భజన జరిగినా దేవుడి అలంకరణ, ఉభయం అన్నీ ఎనిమిదిగంటలకు మొదలై పదీ పదకొండుకి ముగిసేవి.
మేము- అంటే మా ఈడు ఆడపిల్లలందరూ ఎనిమిది గంటల ప్రాంతాన గుడివెనక చేరేవాళ్లం. ముందంతా అబ్బాయిలుంటారు గనుక దేవాలయం వెనక అ మసకచీకట్లో నిల్చుని చూసేవాళ్ళం. టైమయి ప్రసాదం వచ్చే సమయానికి వీధిలో వుండే మిగిలిన స్త్రీలంతా వచ్చి మాతో చేరేవాళ్ళు. ప్రసాదం పెట్టే వ్యక్తి ముందున్న మగాళ్ళకూ, పిల్లలకూ పెట్టాక మా దగ్గరికి వచ్చి ప్రసాదం పంచేవాడు.
ఇందులో అతి ముఖ్యమైన ఘట్టం- సరదా అంశం ఏమిటంటే గంధం పూయటం.
దేవుడికి ఉభయదార్లు గంధం ఓ పెద్దగిన్నెలో తెచ్చేవాళ్ళు. పూజారి దాన్ని తీసుకుని అక్కడున్న వాళ్ళకు ఇచ్చేవాడు దాన్ని. మనం మనకు ఇష్టమైన వ్యక్తికి పూయచ్చు. దీన్ని కొందరు తీసుకుంటారు. మరికొందరు తీసుకోరు.
అయితే అబ్బాయిలు, అమ్మాయిలు మాత్రం తప్పక గంధాన్ని చేతుల్లోకి తీసుకుని సమయం చూసుకుని ఎవరూ చూడకుండా ఒకరికొకరు పూసుకునేవాళ్ళు.
చాలా ప్రేమలు గంధం పూయడంతోనే పుట్టేవి, మిగిలిన వాళ్ళకూ తెలిసేవి.
ఆ సంవత్సరం ఉత్సవాలు ప్రారంభమయిన మొదటిరోజు మొదటి సారిగా నేను గంధం తీసుకున్నాను. గంధం చేతిలో రాసుకున్నాక అమ్మాయిలతో పాటు నేనూ దేవాలయం వెనుకకు వచ్చేశాను. మిగిలిన స్నేహితురాళ్ళు తమకు ఇష్టమయిన అబ్బాయిల కోసం వెయిట్ చేస్తున్నారు.
మొదటిగా దేవాలయం ముందు భాగం నుంచి శీను వీధుల్లోకి రావడం మొదలుపెట్టాడు. అతను ఖచ్చితంగా గంధం రాయడానికే వస్తున్నాడని తెలుసు. ఆలస్యమైతే అమ్మలూ, అమ్మమ్మలూ ప్రసాదానికి అక్కడికి చేరుకుంటారు గనుక ఈ గంధం. కార్యక్రమాన్ని పెద్దవాళ్ళు చూడకుండా ముగించాలని అటు ఆడపిల్లలూ, ఇటు అబ్బాయిలూ తొందరపడుతుంటారు.
శీను మా దగ్గరికి వచ్చి ఓ క్షణం నిలబడ్డాడు. అతను తన కోసమే వచ్చాడని తెలిసిన సునంద ఠక్కున మా వెనుక దాక్కుంది.
కాసేపు అలానే వుంటే అతను వెళ్ళిపోతాడన్న అనుమానంతో కాబోలు ఆమె కొంటెగా నవ్వుతూ తల పక్కకు పెట్టి చూసింది అంత చాలు ఆమె ఉనికిని అతను గుర్తుపట్టడానికి. అతను రెండు అంగల్లో ఆమెను చేరుకొని ఎడమచేత్తో ఆమె చేయి పట్టుకుని లాగి, కుడిచేతిలో వున్న గంధాన్ని అంతే స్పీడుతో ఆమె చుబుకం కింద పూశాడు.