"తీసుకోండి" అంటూ తన చేతిలోని ప్రసాదాన్ని ముగ్ధ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. దూరంగా, ముందుకెళ్ళిపోతున్నా అతని కంఠంలోంచి స్తోత్రపాఠం నిశ్శబ్ద సమయంలో తిరుమల వీధుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది.
తూర్పు మెల్లమెల్లగా తెల్లవారుతోంది.
ఫ్రెండ్స్ అందరూ లేచేవరకూ కాటేజ్ వరండాలో రోడ్డుమీద పోయే భక్తులవేపు చూస్తూ కూర్చుండిపోయింది ముగ్ధ.
"ప్రతి స్త్రీలోని మహాదేవతను చూసే ఆ యువకుడు' పదే పదే గుర్తు కొస్తున్నాడు. అతను ఎలాంటివాడై వుంటాడు? విశ్లేషించడానికి ప్రయత్నిస్తోంది ముగ్ధ.
సురభి, నీలిమ బయటకొచ్చారు ఆవులిస్తూ.
"అప్పుడే దైవదర్శనం చేసుకుని వచ్చేశావా!" ఆశ్చర్యంగా అడిగింది సురభి.
"అన్నీ అయిపోయాయి వేగిరం తయారవండి. రెస్టారెంటు కెళ్ళొద్దాం. అలకనికూడా లేపండి."
మరో పావుగంటకు సురభి, నీలిమ తయారయి వచ్చారు.
"సౌండ్ స్లీప్ లో వుంది అలక. మనం వెళ్ళొద్దాం" నీలిమ అంది.
అరవింద్ గురించి ఆలోచనల్తో రాత్రి నీలిమ సరిగ్గా భోజనం చెయ్యలేదు.
నీలిమను హంట్ చేస్తున్న ఏకైక ప్రశ్న-
అరవింద్ తిరుపతి చేరాడా? చేరకపోతే ఏమైవుంటాడు?
ముగ్గురూ రెస్టారెంట్లో కూర్చున్నారు.
ఆర్దరివ్వకుండానే మూడు ప్లేట్ల ఇడ్లీ సాంబారుతో వచ్చాడు సర్వర్.
"ఇక్కడ ఇడ్లీ సాంబారు భలేగుంటుంది కదూ" సురభి అంది.
"ఇడ్లీ సాంబారు తినాలంటే తమిళనాడులోనే తిరుపతిలో తెల్లవారు ఝామున హోటల్ కొస్తే అడక్కుండానే ఇడ్లీ సాంబారిచ్చేస్తారు" ముగ్ధ చెప్పింది.
సాంబారులో పూర్తిగా నానిన ఇడ్లీలని తింటున్న సమయంలో-
ఏదో అపరిచితమైన గొంతులా విన్పిస్తే చటుక్కున తలెత్తింది ముగ్ధ.
పక్కటేబిల్ దగ్గర కుర్చీలో-
తెల్లవారు జామున కన్పించిన ఆ కుర్రాడు!
అదే డ్రెస్ లో-
"ఏవయ్యా బుద్దిలేదా, స్టీలుప్లేట్ లో ఇడ్లీ ఇస్తావా అరిటాకుల్లేవా వెళ్లి శుభ్రంగా అరిటాకు కడిగి తీసుకురా అప్పుడు ఇడ్లీలు వడ్డించు" సర్వర్ తో గట్టిగా అంటున్న ఆ యువకుడివేపు ఆసక్తిగా చూసింది ముగ్ధ.
ఆ యువకుడు చెప్పినట్లుగానే అరిటాకులో ఇడ్లీలుపెట్టి సాంబారు వేసి వెళ్లిపోయాడు సర్వర్.
పవిత్రంగా ఆకుచుట్టూ నీళ్ళు జల్లుకుని తింటున్నాడు ఆ యువకుడు.
ఏదో పద్యాన్ని చదువుకుంటూ టిఫిన్ తింటున్న అతన్ని చూస్తూ అందరూ నవ్వుకుంటున్నారు.
"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు అని శ్రీ శ్రీ ఇలాంటివాళ్ళ గురించే అనుంటాడు కదూ" నీలిమ మెల్లగా కామెంట్ చేసింది.
అందుకు సురభి మెల్లగా నవ్వింది.
కానీ ఆ కామెంట్ అతనికి వినబడింది కాబోలు తలెత్తి సీరియస్ గా నీలిమవేపుచూసి మళ్ళీ టిఫిన్ మీద పడ్డాడు.
మొదటిసారి తెప్పించుకున్న నాలుగిడ్లీలూ తినేసాక ఇంకో నాలుగు ఇడ్లీలు తెప్పించుకున్నాడు.
ఆ తర్వాత ఇంకో నాలుగు.
సర్వర్ తోపాటు ముగ్ధ, నీలిమ, సురభి, కూడా ఆ టిఫిన్ పర్వాన్ని చూస్తున్నారు ఆశ్చర్యంగా, ఆ ఇడ్లీలుకూడా పూర్తయిపోయాయి.
"ఓ గ్లాసుడు సాంబారు తీసుకురా పో" సర్వర్ తో గట్టిగా చెప్పాడు లేకపోతే ఎక్కడ తంతాడోనని, సర్వర్ గ్లాసుతో సాంబారు తేగానే దాన్ని అందుకుని గడగడా త్రాగేసి-
"ఈ హోటల్లో సాంబారు బాగుందోయ్" అని కాంప్లిమెంట్ ఇచ్చి తనవేపే అలా చూస్తున్న అమ్మాయిలవేపు చూస్తూ-
"తిండికలవాడేను మనిషోయ్ అన్నారు పెద్దలు. అలా రెండిడ్లీలు చాక్ లెట్లు తిన్నట్టు తినడంకాదు. ఆరు తినాలి తెల్సుకోండి" అని తేన్చుకుంటూ లేచి బిల్లు చెల్లించి బయటికెళ్ళిపోయాడు ఆ యువకుడు.
"పుట్టుకతో వృద్దుడేకాదు తిండిపోతు కూడాను" వెళ్ళగానే కామెంట్ చేసింది నీలిమ.
దానికి నవ్వారు మిగతా ఇద్దరూ.
"ఉదయాన్నే నాకు గుళ్ళోకూడా తారసపడ్డాడు. నా కాళ్ళకు సాష్టాంగ నమస్కారంచేసి మీలో దేవతను చూస్తున్నానని అన్నాడు" కాఫీ తాగుతూ చెప్పింది ముగ్ధ.
"ఈ తిండిపొతుకు దైవభక్తికూడానన్నమాట" గేలిచేస్తున్నట్లుగా అంది సురభి.
"ఎందుకే పాపం...మనకు అతనెవరో తెలీదు. ఏమిటో తెలీదు. కామెంట్ చెయ్యడం తప్పుకదూ" ముగ్ధ అంది.
ముగ్గురూ రెస్టారెంట్ లోంచి బయటికొచ్చారు. అప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహం కన్పిస్తోంది.
"ఆ కుర్ర వృద్దుడు ఎలాంటి వాడంటావ" సురభి అడిగింది ముగ్దని.
"రోడ్డుమీద కన్పించే ప్రతివాడ్నీ చూబెట్టి వాడెలాంటివాడో చెప్పు అంటే ఎలాగే" కసురుకుంది ముగ్ధ.
"మాకయితే ఇది ఫస్టు టైమ్ నువ్వు రెండోసారి చూడడం కదా నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ పనికిరాదా" నీలిమ అడిగింది.
"ఒక వ్యక్తిగురించి పూర్తిగా తెలియాలంటే అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చెయ్యాలి. ఇలా చూడగానే అలా చెప్పడం కుదరదు కల వచ్చిందనుకో కల వచ్చినట్టు నీకు స్పష్టంగా తెల్సినా, ఆ కలను పూర్తిగా నువ్వు గుర్తుపట్టలేవు. నువ్వేకాదు-ఎవరికయినా అంతే కొన్ని దృశ్యాల కలయిక కల. నీకు అన్ని దృశ్యాలూ జ్ఞాపకం వుండవు. వున్నట్టుగా వుంటాయి. అలాంటిదే ఇది కూడాను. రెండుసార్లు ఒకవ్యక్తి మనకు కనిపించాడు. మొదటిసారి చూసినపుడు అతని భక్తి, తతృరతలో అతని హావభావాలు, రెండోసారి చూసినపుదు అతని ఆకలిదగ్గర హావభావాలు చూసాం. ఇంకా అతన్ని ఎనలైజ్ చెయ్యాలంటే ఇంకొన్ని సంఘటనలు అవసరం" చెప్పింది ముగ్ధ.
"మరి మొట్టమొదటిసారి చూసినపుడు జయాధ్యక్షను ఎలా ఎనలైజ్ చేసావ్" సురభి ప్రశ్నించింది.
"మంచి ప్రశ్నేగానీ.... ఇందులో నీకర్ధంకానిది ఒకేఒక పాయింట్ వుంది. అదేమిటంటే ఆ సమయంలో జయాధ్యక్ష ఎదుటి వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్నదానికి, వింటున్న దానికి అక్కడ మనకు ఎక్స్ ప్రెషన్ స్పష్టంగా కన్పిస్తోంది. ఇక్కడలాగలేదే. ఇక్కడ ఆ ప్రత్యేకత లేదుకదా" ఎనలైజ్ చేసింది ముగ్ధ.
"అదన్నమాట కధ" ఆలోచిస్తూ అంది సురభి.
ముగ్గురూ మలుపుతిరిగి, అల్లంత దూరంలో కన్పిస్తున్న కారుని ఆశ్చర్యంగా చూసి, ఒకరివేపు ఒకరు చూసుకున్నారు.
"నవ్వన్నది కరక్టే జయాధ్యక్ష వచ్చుంటాడు కదూ" సురభి ముగ్ధవేపు చూస్తూ అంది.
"వచ్చుంటాడు కాదు. వచ్చాడు" నీలిమ నవ్వుతూ అంది.
ముగ్గురూ కాటేజ్ దగ్గరకు వెళ్ళేసరికి లోన నుండి నవ్వులు వినపడ్డాయి. ముగ్గురూ వరండాలో కుర్చీల్లో కూర్చున్నారు.