Previous Page Next Page 
ముగ్ధ పేజి 20

 

     ఆ మాటను వినిపించుకోలేదు అలక.
    
    మెట్లు దిగి, పరుగు పరుగున గార్డెన్ దాటి, సిమెంట్ రోడ్ దాటి కాటేజ్ వేపు పరిగెడుతోంది. పరుగున వచ్చి, కాటేజ్ మెట్లెక్కి, ఎవరితో మాట్లాడకుండా లోన గదిలోకి వెళ్లిపోయింది అలక. చెప్పుకోలేని దుఃఖంతో కుమిలిపోతోంది అలక. జీవితంలో మొట్టమొదటిసారి ఆకర్షించిన వ్యక్తి జయాధ్యక్ష తనంత తాను వెళ్ళిన మొట్టమొదటి పురుషుడు జయాధ్యక్ష.
    
    అతని చుట్టూ అల్లుకున్న ఆశలన్నీ తన కళ్ళెదుటే వేళ్ళసందుల్లోంచి రాలిపోతున్న ఇసుక రేణువుల్లా అయిపోతుంటే తట్టుకోలేక పోయింది అలక.
    
    పావుగంట తర్వాత తనను తాను ఓదార్చుకుని లేచి వరండాలో కొచ్చింది అలక. అలకకి జయాధ్యక్ష సరిపోతాడని నిర్ణయించేశారు మిగతా ముగ్గురూ అప్పటికే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు వారికి తెలిసిపోయింది గనుక.
    
                                    *    *    *    *    *
    
    "పదండి డిన్నర్ కు వెళ్దాం" అలక మానసిక పరిస్థితిని ముగ్గురూ అంచనా వేస్తున్నారు.
    
    నలుగురూ రెస్టారెంట్లోకెళ్ళి ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు.
    
    సర్వర్ నాలుగు ప్లేట్లలో మీల్స్ తెచ్చి, సర్ది వెళ్లిపోయాడు.
    
    "చీటీలో నీకేం వచ్చిందో..... ఆ కాండిడేట్ దొరికాడుగా దాని కెందుకు బాధపడటం? సూటబుల్ పర్సన్ ఫర్ ఏ సూటబుల్ ఛాలెంజ్ అతని మనస్థత్వం ఎలాంటిదో అతన్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను. గో ఎహెడ్" ముగ్ధ సాలోచనగా అంది.
    
    డిన్నర్ పూర్తిచేసి నలుగురూ బయటికొస్తున్నపుదు-
    
    "అతనిమీద ఏమేం కేసులున్నాయో తెలీదు పోలీసుల చేతిలోంచి బయటకొస్తాడంటావా?" అనుమానంగా, బెంగగా అంది అలక.
    
    "డోంట్ వర్రీ మై ఫ్రెండ్! అతనిమీద ఏ పోలీసు కేసూ వుండదు. రేపుదయం ఎనిమిది గంటలకల్లా నీ దగ్గరుంటాడు చూస్తుండు" అంది ముగ్ధ.
    
    "నువ్వే గనక ఏదైనా ఆశ్రమం పెట్టుకుంటే లక్షలు లక్షలు వస్తాయే" అంది సురభి.
    
    "ఆశ్రమాలు, అమ్మల వేషాలు మనకెందుకే సైంటిఫిక్ వరల్డ్ ఆశ్రమాలతో పనిలేదు, ఆలోచనతోనే సైకాలజీ, బాడీ లాంగ్వేజ్ ఈ రెండిట్నీ పూర్తిగా చదువుకొ మనిషి అనే జీవి గురించి నీ కెవడూ చెప్పక్కర్లేదు. నువ్వు కష్టపడి పైకి రావాలంటే ఈ శాస్త్రాల జ్ఞానమే నీకు ముఖ్యం" ధీమాగా చెప్పింది ముగ్ధ.
    
    కాటేజ్ కి వెళ్ళాక గంటసేపు రకరకాల కబుర్లు చెప్పుకున్నాక బెడ్స్ మీదకు చేరారు నలుగురూ.
    
    "తెల్లవారుఝామున మీరెవరూ లేవకముందు, మూడుగంటలకు నేను దైవదర్శనానికి వెళతాను. నేను లేనని కంగారుపడకండి" ఒత్తిగిలి పడుకుంటూ అంది ముగ్ధ.
    
    "తెల్లవారుఝామున మీరెవరూ లేవకముందు, మూడుగంటలకు నేను దైవదర్శనానికి వెళతాను. నేను లేనని కంగారుపడకండి" ఒత్తిగిలి పడుకుంటూ అంది ముగ్ధ.
    
    సైంటిస్ట్ శ్రీధర్ గురించి ఆలోచిస్తూ సురభి-
    
    జయాధ్యక్ష గురించి ఆలోచిస్తూ అలక-
    
    అరవింద్ గురించి ఆలోచిస్తూ నీలిమ-
    
    వాళ్ళందరికీ కనులమీదకు నిద్ర వచ్చేసరికి పన్నెండయింది.
    
                                      *    *    *    *    *
    
    జనవరి 1.
    
    తెల్లవారుఝామున సరిగ్గా మూడు గంటలైంది.
    
    అప్పటికే తలస్నానం చేసి తయారయి, కాటేజ్ తలుపుల్ని దగ్గరగా వేసి బయటికొచ్చింది ముగ్ధ.
    
    వెంకటేశ్వరస్వామి దైవదర్శనం మూడున్నరకే ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా వుండదు కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకుంది ముగ్ధ.
    
    అక్కడక్కడ పల్చగావున్న భక్తుల మాటలుతప్ప, తిరుమలంతా నిశ్శబ్దంగా వుంది.
    
    దీపాల పల్చటి వెలుతురులో వీధులన్నీ ప్రశాంతంగా వున్నాయి.
    
    కౌంటర్లో ప్రత్యేక దైవదర్శనం టిక్కెట్ తీసుకుని లోనికడుగు పెట్టింది ముగ్ధ.
    
    ఆ సమయంలో ఒక భక్తుడు గట్టిగా వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదువుతూ లోనికి ప్రవేశించాడు.
    
    పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుటికి నిలువు నామాలు, తెల్లటి వర్చస్సు...
    
    అతనికో పాతిక ఏళ్ళుంటాయి.
    
    ఆలయ అర్చకులు సైతం అతని సుప్రభాత పఠనానికి తలెత్తి ఆశ్చర్యంగా చూశారు.
    
    అతను అవేవీ పట్టించుకోవడంలేదు.
    
    వెంకటేశ్వర సుప్రభాతం అయిపోయింది రెండు నిమిషాల తర్వాత విష్ణు స్తోత్రం ప్రారంభించాడు.
    
    క్యూ నెమ్మదిగా ముందుకు వెళ్తోంది.
    
    ఒక్కొక్కభక్తుడూ తనివితీరా దైవదర్సనం చేసుకుంటున్నాడు. ఒక్క ముగ్ధ తప్ప మరెవరూ ఆ సమయంలో లేరక్కడ.
    
    తాను, తన స్నేహితురాళ్ళు చేపట్టిన ప్రయత్నం సఫలం చెయ్యమని, ఏ అడ్డంకులూ కలగకూడదని కోరుకుని ముకుళిత హస్తాలతో బయటపడింది.
    
    కొంచెం దూరంలో వున్న అరుగుమీద కూర్చుంది ముగ్ధ.
    
    దైవదర్శనం చేస్తున్నంతసేపూ ఆ యువకుడు దైవస్తోత్రం చేస్తూనే వున్నాడు.
    
    ఆ తర్వాత అక్కడున్న మిగతా దేవుళ్ళని విడివిడిగా పూజించాడు.
    
    గుడి కుడిపక్క, ఎడమపక్క, వెనుకన నిలబడి చాలాసేపు ప్రార్ధన చేసాడు.
    
    నియమ నిష్ఠలతో గుడిలోని ప్రతి భాగాన్ని ముట్టుకుని ప్రార్ధిస్తున్న అతన్ని ముచ్చటగా చూస్తోంది ముగ్ధ.
    
    దైవ ప్రార్ధనలన్నీ అయిపోయాక ఆ యువకుడు గబగబా ముగ్ధ ముందుకొచ్చి సాష్టాంగపడ్డాడు.
    
    ముగ్ధ, ముగ్ధతోపాటు పక్కన కూర్చున్న మిగతా భక్తులూ, ఆ సంఘటనకు కంగారుపడ్డారు.
    
    "పిచ్చివాడేం కాదుగదా!" ఎవరో దూరంనుంచి నవ్వుకుంటూ వ్యాఖ్యానించడం ముగ్ధ చెవిన సోకింది.
    
    ముగ్ధకు సాష్టాంగ నమస్కారం పెట్టి, అతను 'మాతృస్తవాన్ని చదువుతున్నాడు.
    
    చదువుతూ లేస్తూ-
    
    భయంగా అతనివేపే చూస్తున్న ముగ్ధవేపు చూసి-
    
    "కంగారుపడకండి. ఇక్కడ ఎవరూ స్త్రీలు లేరు. ఉన్న ఒక్క స్త్రీ మీరే. మీరెవరో నాకు తెలియకపోయినా, మీలో నేను మాతృదేవిని చూడగలుగుతున్నాను. సర్వశక్తిమతి మాత కన్పించని ఆ మాత సృష్టిలోని ప్రతి స్త్రీలోను కనిపిస్తుంది. మీకేం అభ్యంతరం లేకపోతే మీ పాదాలను స్పృశించవచ్చా?" గాభరా గాభరాగా అని, ముగ్ధ ఏమంటుందోకూడా లెక్కచేయకుండా రెండు చేతులతో ఆమె పాదాలను స్పర్శించి, కళ్ళకద్దుకుని, ఆమె చుట్టూ మూడుసార్లు తిరిగి, ముందుకెళ్ళిపోయాడు ఆ యువకుడు.
    
    "భలే భక్తుడే" బిత్తరపోయిన ముగ్ధ తనలో తనే అనుకుంది.
    
    ప్రసాదం కౌంటర్ తెరిచాక ప్రసాదం తీసుకుని కాటేజ్ వేపు వస్తుండగా మళ్ళీ ఆ యువకుడు పక్కనుంచి వెళ్లిపోతూ-

 Previous Page Next Page