ఆ చప్పుడుకి లోన్నుంచి వచ్చింది అలక. ఆ వెనుక జయాధ్యక్ష.
"మిమ్మల్ని ముగ్గుర్నీ నిన్న చూసాను కాని పరిచయం చేసుకోవడం జరగాలి కదా" తనే అంటూ తననితాను పరిచయం చేసుకున్నాడు జయాధ్యక్ష.
తన మిత్రురాళ్ళని పరిచయం చేసింది అలక. అయిదు నిమిషాల తర్వాత వెళ్లిపోయాడు జయాద్యక్ష.
అతనలా కారెక్కి వెళ్ళిపోగానే-
"ఎవరో అనుకుని తనని తీసి కెళ్ళారట పోలీసులు ఓగంట తర్వాత సారీచేప్పి వదిలేసారట" చెప్పింది అలక.
అది నిజం కాదేమో అన్పించింది ముగ్ధకు కానీ బయటకు అనలేదు.
జయాధ్యక్ష ఆ కాస్సేపు తనతో మాట్లాడి, తనని పొగడిన తీరుని వుదాహరణలతో చెపుతోంది అలక పరవశంగా.
అదే సమయంలో పేపర్ బాయ్ ఓ పేపర్ పడేసి వెళ్ళాడు.
ఆ పేపర్ ని గబుక్కున చేతిలోకి తీసుకుని చూసింది నీలిమ ఫస్టు పేజీలో చూడగానే ఆకర్షించైనా ఓ వార్తని చదువుతోంది.
"తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న హైద్రాబాద్ విద్యార్ధులు."
వార్తను పూర్తిగా రెండుసార్లు చదివి ఆనందంగా వూపిరి పీల్చింది నీలిమ.
"అరవింద్, అరవింద్ ఫ్రెండ్సూ తప్పించుకున్నారే" ఆనందంగా అందరి వేపూ చూస్తూ అంది నీలిమ.
నీలిమ చేతిలోంచి పేపర్ని లాక్కుని గబగబా చదివింది ముగ్ధ.
"అరవింద్ పోలీసుల చూపుల్లోంచి బయటపడ్డాడుకదా మరి మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు" నీలిమవేపు చూస్తూ అడిగింది సురభి.
"హైద్రాబాద్ లో కలుద్దామన్నాడు అరవింద్" చెపుతున్న సమయంలో టెలిఫోన్ మోగింది. సురభి లేచివెళ్ళి రిసీవర్ని తీసింది. ఒక్కసెకెండ్ తర్వాత-
"నీలిమా ! నీకే. అరవింద్ ట."
ఆ మాట వినగానే లేడిపిల్లలా ఎగిరెళ్ళి సురభి చేతిలోని రిసీవర్ని అందుకుంది.
"హలో అరవింద్! నేనే నీలిమను."
ఫోన్ లో అరవింద్ గొంతు బాగా స్పష్టంగా వినిపిస్తోంది.
"నేనే అరవింద్ ని! నిన్న మీరు కోపరేట్ చెయ్యకపోతే నేను కూడా పోలీస్ స్టేషన్ లో వుండేవాడ్ని నా తరఫునా, నా మిత్రుల తరఫునా థాంక్స్, పోలీసులు మళ్ళా మీ దగ్గరకు రాలేదు కదా?"
"లేదు!"
"ఓ.కే! పోలీసులకు టోకరా ఇచ్చి మా ఫ్రెండ్స్ కూడా తప్పించుకున్నారు. ప్రస్తుతం మేం కాళహస్తిలో వున్నాం. పన్నెండుగంటలవరకూ ఇక్కడే వుంటాం. మీ కిప్పుడు ఏదయినా పనివుందా?"
"లేదు."
"మరోసారి మనం కల్సుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. రాగలరా?"
వెంటనే ఏం జవాబు చెప్పాలో అర్ధంకాలేదు నీలిమకు.
"వస్తానని చెప్పు" పక్కనుంచి మెల్లగా అంది సురభి.
"వస్తాను ఎక్కడకు రావాలి?"
"కాళహస్తి దేవాలయం ఎదురుగా రోడ్డుమీద బస్సాగుతుంది. దిగిపొండి మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటాను" టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. రిసీవర్ని యధాస్థానంలో పెట్టేసి వరండాలో కొచ్చింది.
"మీ అరవింద్ గారు రమ్మంటున్నారా? ఎక్కడున్నాడు?" ఆసక్తిగా అడిగింది ముగ్ధ.
"కాళహస్తిలో..." అని ఒక క్షణం ఆగింది.
ఆ పైన లోనికెళ్ళి పదినిమిషాల్లో తయారయిపోయి బయటికొచ్చింది నీలిమ.
"నేను వెళుతున్నానే. సాయంత్రం కలుస్తాను. అక్కడనుంచి ఫోన్ చేస్తా" చెప్పి మెట్లు దిగింది.
"ఇప్పటికి మూడు సెటిలైపోయాయి. నువ్వొక్కదానివే ఉన్నావే" ముగ్ధను చూస్తూ సురభి అంది.
దానికి జవాబుగా నవ్వి ఊరుకుంది ముగ్ధ. ఆమెకు చటుక్కున గుళ్ళోని పుట్టుకతో వృద్దుడు జ్ఞాపకం వచ్చాడు.
* * * * *
అప్పటికి సరిగ్గా ఎనిమిది గంటలైంది.
తిరుమల బస్టాండులో నిలబడింది నీలిమ. ఆర్టీసీ ఎంక్వయిరీ కౌంటర్లో అడిగితే-
పది నిమిషాల ముందు రెండు కాళహస్తి బస్సులు వెళ్లిపోయాయని అరగంటవరకూ బస్సు లేదని చెప్పారు.
అరగంట వెయిట్ చేయాలా?
ప్రపంచంలో అతి ఛండాలమైన జాబ్ వెయిటింగ్- అయినా తప్పదు. అరవింద్ కోసం వెయిట్ చేయక తప్పదు.
అరవింద్ ను తను ప్రేమిస్తోందా? ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు నీలిమకు.
తనకు చీటీలో వచ్చిన ఉద్రేక స్వభావి, తనకు తారసిల్లిన అరవింద్ ఒక్కరే.
అందుకేనేమో అరవింద్ అంటే ఇష్టం ఏర్పడింది, లేక అరవింద్ స్వభావమే తనకూ వుందా? రకరకాలుగా ఆలోచిస్తోంది నీలిమ.
ఆ సమయంలో చాలా సేపట్నించి బస్ స్టాండ్ ని చెక్ చేస్తున్న తిరుమల పోలీస్ ఇన్ స్పెక్టర్ దృష్టి నీలిమ వేపు పడిందని నీలిమకు తెలీదు.
ఈ అమ్మాయి ఎక్కడకు వెళుతోంది? ఆ అరవింద్, వాళ్ళ మిత్రులూ తప్పించుకుని ఎక్కడో వుండి వుంటారు. ఆ అరవింద్ ఫోన్ చేసి వుంటాడు. ఈ అమ్మాయి వెళ్తోందేమో?
పోలీస్ ఇన్ స్పెక్టర్ బుర్రలోకి ఓ అనుమానం వచ్చింది. అనుమానం రానంతవరకూ పోలీసు మనిషిలాగే ఆలోచిస్తాడు. అనుమానం వచ్చాక రాక్షసుడిలా ఆలోచిస్తాడు.
నీలిమ మాత్రం ఆ విషయంలో జాగ్రత్తపడలేకపోయింది.
అరగంటవరకూ నీలిమనే వాచ్ చేస్తూ నిలబడ్డ పోలీస్ ఇన్ స్పెక్టర్ శ్రీ కాళహస్తి బస్ రాగానే, నీలిమ ఎక్కడం చూసి, నలుగురు పోలీసులతో పాటు తనూ జీపెక్కాడు.
నీలిమ ఎక్కడకు వెళ్తోంది? కాళహస్తి? లేక దారిలో ఎక్కడైనా దిగిపోతుందా? పోలీసు బుర్రలో ఆలోచనలు.
బస్సు బయల్దేరింది. బస్సు వెనుక జీపూ బయల్దేరింది.
* * * * *
"నేను పుట్టుకతో వ్రుద్దున్ని దత్తత చేసుకుంటే ఎలాగుంటుందే?" ఇద్దరి ఫ్రెండ్స్ వేపూ చూస్తూ అడిగింది ముగ్ధ.
"ఛస్తావ్! అమాయకుడో తెలీదు, అజ్ఞానో తెలీదు, మూర్ఖుడో తెలీదు. భక్తుడో తెలీదు, అలా నటిస్తూన్నాడో తెలీదు. నాకయితే మాత్రం నీ ప్రపోజల్ పెద్దగా నచ్చలేదే" అలక అంది.
"ఏం?" అడిగింది ముగ్ధ.
"మనందరం పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవాళ్ళంకదా! ఎంత ఛాలెంజ్ అయినా మరీ పల్లెటూరి మొద్దుని ఎంచుకుంటే ఎలాగే! కోరి జీవితాన్ని నరకం చేసుకోకు" అంది సురభి.
"పల్లెటూరివాడిలా కన్పిస్తున్నా, అతను చుద్వుకున్నవాడేమో" ముగ్ధ సందేహం వ్యక్తం చేసింది.
"నాకైతే అలా కన్పించడంలేదు" మళ్ళీ సురభే అంది.