"బ్రహ్మ కడిగిన పాదం
బ్రహ్మము తానే నీ పాదం
చెలిగి వసుధ కొలిచిన నీ పాదం
తలగక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము"
తనకిష్టమైన అన్నమాచార్యుల కీర్తన ముఖారి రాగంలో పాడేసుకుంటోంది.
పని పూర్తయ్యాక డ్రాయింగ్ రూంలోకి వచ్చి రాజీవ్ ఫోటోని గోడకి తగిలించింది.
"రాజీవ్!" అని పిలిచింది.
ఫోటోలో కళ్ళు ఆమెవంక చూస్తున్నాయి.
"ఎంతో కొంత నీకు చెప్పకుండా దాచాను. నిన్ను మోసం చేసే ఉద్దేశంతో కాదు. నీ మనోనైర్మల్యాన్ని భంగపర్చటం ఇష్టంలేక.... నన్ను క్షమించు."
"రాజీవ్! నువ్వు నా ప్రాణం. నా సర్వస్వం. నాలోని ప్రతి అణువూ అలమటించేదీ, ఆరాధించేదీ నీకోసం."
ఫోటో తగిలించటంకోసం ఆమె కుర్చీమీద నిలబడివుంది. వంగి పెదవులతో అతని ముఖాన్ని స్ప్రుశించబోయి ఏదో గుర్తువచ్చి గుండెలో ముల్లుగుచ్చుకున్నట్లయి ఆగిపోయింది.
ఆ వాడకట్టులో అందరికీ పగటిపూట కూడా గేటుతాళం పెట్టుకోవటం అలవాటు. బయట్నుంచి వచ్చినవారు బజర్ నొక్కితే ఇంట్లోనివారు వచ్చి తాళం తీస్తూ వుంటారు.
చిన్మయి ఈ పద్దతికలవాటు పడటానికి కొన్నాళ్ళు పట్టింది.
పేపర్ బాయ్ అయితే విసురుగా పేపర్ లోపలికి విసిరేసి వెళ్ళేవాడు. కాని కూరగాయలమ్మే అతను వచ్చినప్పుడూ, పాలప్యాకెట్స్ వచ్చినప్పుడూ, పోస్టు మేన్ వచ్చి 'పోస్ట్' అని కేకేసినప్పుడూ చిన్మయి చీటికీ మాటికీ గేటు దగ్గరకు వెళ్ళవలసి వస్తూ వుండేది.
మొదట్లో గమనించలేదు. ఆమె గేటుదగ్గరికి వచ్చినప్పుడల్లా ఎదురింట్లోంచి ఒక వ్యక్తి తనవంక తదేకంగా చూస్తున్నట్లు తెలుసుకొంది. అప్రయత్నంగా అతనివైపు చూసింది. ఏభైఏళ్ళు పైనుంటాయి. ఎప్పుడూ లుంగీ బనియన్ తో వుండేవాడు. తమిళుడై వుండవచ్చు. ఉద్యోగం సద్యోగం లేనట్లు ఎప్పుడూ ఇంట్లోనే వుండి జరదాకిళ్ళీలు నములుతూ ఉమ్ములేస్తూ వుండేవాడు. పెళ్ళాం, వయసొచ్చిన పిల్లలూ వున్నారు. అయినా చిన్మయి కంటబడితే చాలు ఒళ్ళంతా కళ్ళుచేసుకుని చూసేవాడు. ఇక్కడకూడా ఎవడో దాపరించాడా అనుకుంటూ చిన్మయి అతను కనుపించగానే తలవొంచుకుని లోపలికి వెళ్ళిపోయేది.
కాని ఇలా ఎంతకాలం భయపడుతూ బ్రతకడం? ఒకసారి కళ్ళు మండి అతను తనవంక చూస్తుంటే తనూ అతని మొహంలోకి చూస్తూ కదలకుండా నిలబడింది. అలా రెండునిముషాలు గడవగానే అతనేదో గెలిచినట్లయి చిన్నగా ఈల వేశాడు. తరువాత నాలిక బయటపెట్టి వెక్కిరించాడు.
'ఓరి రాస్కెల్' అనుకొంటూ చిన్మయి అసహ్యించుకొని లోపలకెళ్ళి పోయింది.
* * *
ఆ ఇంటిప్రక్కనేవున్న చిన్న బిల్డింగులో వృద్దదంపతులుండేవారు. తెలుగు వాళ్ళే ఆయన పేరు ప్రజాపతిరావు. పోస్టుమాస్టర్ గా చేసి రిటైరయికూడా పదేళ్ళయింది. అంటే ఇప్పుడు డెబ్బయి ఏళ్ళ వయసుందన్నమాట.
ఆయనా, ఆయన భార్య వీణాంబా చాలా అన్యోన్యంగా వుండేవారు. ప్రపంచంలోని అన్యోన్యత అంతా వారిద్దరి మధ్యే వున్నట్లు కనిపిస్తూ వుండేది. వాళ్ళ పిల్లలెవరూ ఇక్కడ లేరు. ఒకరు స్టేట్స్ లో ఒకరు ఇరాన్ లో, ఒకరు కెన్యాలో సెటిలయిపోయి వున్నారు. దగ్గర ఎవరూ లేరు. వారిద్దరే ఒకరికొకరు తోడు-జోడు వుంటారు. ఆవిడకేమైనా వస్తే ఆయన విలవిల్లాడిపోతాడు. ఇంటికి డాక్టర్ ను తీసుకొచ్చి పదిసార్లు డాక్టర్లచుట్టూ తిరిగి గంటగంటకూ మందులిచ్చి పాలు, పళ్ళరసాలు కలిపి ఇచ్చి నానా హైరానా పడిపోతాడు. ఇవన్నీ యాంత్రికంగా చేయకుండా చాలా ఇష్టంగా, ఆప్యాయంగా తహతహ లాడుతూ చేస్తాడు. అలాగే ఆవిడ ఆ వయసులోకూడా ఎంతో వొద్దికగా వుంటూ, ఏ మాత్రం ఓపిక వున్నా ఆయనకూడా వుండి అన్నీ అందచేస్తూ ఎంతో అరమరికగా వుండేది. ప్రజాపత్య్రవుగార్కి గంటగంటకూ తినటానికి ఏదో ఒకటి కావాల్సివచ్చేది. ఒకసారి బిస్కెట్లూ, మరోసారి బంగాళాదుంపల ఫింగర్సూ, ఇంకోసారి అప్పడాలూ.... ఇలా ఏదొకటి అయినా ఆవిడ విసుక్కోకుండా ఎంతో అనురాగంతో అన్నీ అందచేస్తూ వుండేది. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకొంటూనే కనిపించేవారు. ఇంట్లో వంట చేయడానికి ఒక మనిషి, చిన్న చిన్న పనులు చేయటానికి ఓ పిల్లా వుండేవారు. అయినా ఆమె చేస్తున్నట్లు కనిపించేది.
సాయంత్రమవగానే ఇద్దరూ టి.వి.కి ఎదురుగా కూర్చునేవారు.
అరవ ప్రోగ్రాంగానీ, హిందీ చిత్రహార్ గానీ, ఇంగ్లీష్ న్యూస్ గానీ, తెలుగు, అరవం, హిందీ సినిమాగానీ ఎంతో ఆసక్తిగా చూసేవారు. ఇహ క్రికెట్ ఆడేరోజులు వచ్చాయంటే ప్రొద్దుట్నించీ టీ.వీ. కంటుకుపోయి కూర్చుండే వాళ్ళు. వీణాంబగారికి గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రిల గురించేకాక పాకిస్థాన్ ఇమ్రాన్ ఖాన్, మియాన్ దాదాల గురించీ వెస్టిండీస్ రిచర్ద్సు, మార్షల్ ల గురించీ, న్యూజిలాండ్ హాడ్లీ గురించి, ఇంగ్లాండ్ టోథమ్, గోవర్ ల గురించి శ్రీలంక మెండిస్, మహానామాల గురించి ఆస్ట్రేలియా బోర్డర్, మాథ్యుస్ ల గురించి క్షుణ్ణంగా తెలుసు.
బ్యాట్స్ మెన్ బౌండరీ కొట్టినప్పుడు ఇద్దరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎవరైనా సెంచరీ కొడితే వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలుండేవి కావు.
చిన్మయికి వాళ్ళిద్దర్నీ చూస్తుంటే కనులపండువగా వుండేది. ముచ్చటగా వుండేది.
ఒకరోజు వుండబట్టలేక తనే వెళ్లి పరిచయం చేసుకుంది.
'రామ్మా' అని ఆప్యాయంగా ఆహ్వానించింది వీణాంబగారు.
'నా పేరు చిన్మయి......మావారు...." అని వివరాలు చెప్పింది.
ఆమె చిన్మయిని ఎంతో ఆత్మీయంగా తనప్రక్కన కూర్చోబెట్టుకుంది.
"మీ ఇద్దర్నీ నేనూ, ఆయనా చూస్తూనే వుంటాం. చిలకాగోరింకల్లా వుండే హ్యాపీ కపుల్ అని మిమ్మల్ని చూసి మేము ఇద్దరం ముచ్చట పడుతూంటాం" అని పిల్లని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది.
"వద్దండి" అంది చిన్మయి మొహమాటపడుతూ.