Read more!
 Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 2

 

    వేపచెట్టు కిడ్నా చెట్టు నానుకుని కూర్చుని , పక్కన బండి మీద అముతున్న మిరపకాయ బజ్జీలు కొనుక్కుని తింటున్నాడు పానకాలు. లంచ్ అవర్ లో . కాలేజిలో మంచి క్యాంటినుంది.
    ఫ్రెండ్సందరూ కలిసో, విడిగానో అందరూ క్యాంటిన్ వెళతారు. కావలసినవేవో తింటారు. కూల్ డ్రింక్స్ తాగుతారు. అంతేకాని స్కూలు పిల్లలా బండి మీద చేసే బజ్జీలూ , పకోడీలు కొనుక్కు తినటం జరగదు. అందులోనూ ఒక్కడే కూర్చుని తినడం అస్సలు జరగదు. ఫ్రెండ్సందరూ కలిసి సరదాగా అనుకుంటే రోడ్డు మీద పెప్పరమేంట్ బిళ్ళలు కూడా కొనుక్కు తినొచ్చు. కానీ ఇలా వొంటరిగా , లంచ్ అవర్ లో చెట్టు కింద కూర్చుని బజ్జీలు తినడం "అబ్సర్డ్" అంది భార్గవి. మళ్ళీ అందరూ పకపకా నవ్వారు.
    "ఇంకా నయం! చెట్టు కింద కూర్చుని తింటున్నాడు, కోటి లాగా చెట్టు మీద కూర్చుని తినకుండా" అన్నాడు అటు కేసి వస్తున్న భాస్కర్! అతని స్నేహబంధం అంతా పగలబడి నవ్వారు.
    అది గమనించిన పానకాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మాట్లాడకుండా.
    "పాపం, మన బాధ పడలేక వెళ్ళిపోయాడు" అంది కౌసల్య.
    "నీ జాలి గుండె కరిగి నీరైపోయిందా చెల్లి?" అంది నవ్వుతూ రాగిణి.
    "పోండే, మీరు మరీను! తోటి మనిషిని అలా ఏడిపించకూడదు. అతని కిష్టమైనాదేదో అతను తింటున్నాడు. మనకెందుకు మధ్య?" అంది బాధపడుతూ కౌసల్య.
    ఈలోగా గడియారం చూసుకుని "మైగాడ్! టైమయింది. మనకిప్పుడు క్లాసుంది కదూ?" అంది భార్గవి.
    "ఎస్! మనం టైం చూసుకోలేదు. లెటజ్ .....గో!" అంటూ ఒక్కొక్కళ్ళీ పరుగెత్తారు.
    ఆ రోజు లెక్చరర్ గారు షేక్స్ ఫియర్ డ్రామాల గురించి చెబుతున్నాడు. ఉన్నట్టుండి క్లాసులో సంచలనం చెలరేగింది. ఒక చిన్న కాగితం మీద ఏదో రాసి మడిచి పెట్టి, దాన్ని ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తూ పోతున్నారు. చీటీ అందగానే విప్పి చదవడం , వెంటనే మడిచి నవ్వుకుంటూ పక్క వాళ్ళ కివ్వడం, ఇలా ఇంచుముంచు క్లాసులో వాళ్ళందరికీ చేరింది చీటీ. అందరూ నవ్వులు మొదలెట్టారు.
    "ఎందుకు నవ్వుతున్నారు?" అడిగాడు లెక్చరర్. ఎవరూ సమాధానం చెప్పలేదు.
    లాభం లేదని, పాఠంలో నిమగ్నమైపోయాడు లెక్చరర్.
    కాస్సేపటికి మహేశ్ బృందం మళ్ళీ చీటీలు పంచుకున్నారు. వాళ్ళని గమనిస్తూ ఎవ్వరూ లెక్చరర్ చెప్పేది వినడం లేదు.
    ఉన్నట్టుండి పానకాలు కంగారుగా లేచి నుంచున్నాడు. బుష్ కొటులోపల నుంచి వీపు మీద చేతులు పెట్టుకుని తడుముకుంటూ.
    మొగ పిల్లలు అందరూ రాక్ అండ్ డాన్స్ చెయ్యి పానకలూ అనీ, కాదు, కాదు బ్రేకు డాన్స్ చెయ్యి అని కొందరు అరవడం మొదలెట్టారు. పానకాలు వాళ్ళ మాటలు వినిపించుకోలేదు.
    గబుక్కున బుష్ కోటు విప్పిపారేశాడు.
    "బాబోయ్ స్త్రీకింగ్ చేసేట్టున్నాడు. ప్యాంటు కూడా ఊడబీకుతున్నాడు" అంటూ బయటకు వచ్చేశారు అమ్మాయిలంతా.
    "పానకాలూ వాటీజ్ అల్ దిస్?" అంటూ అరిచాడు లెక్చరర్ రాందాసు.
    క్లాసులోని వాళ్ళందరూ ఘొల్లుమని నవ్వారు.
    "బల్లి......బల్లి......సార్......ఈ వెధవలెవరో నా బుష్ కోటు లోంచి వీపు మీద పడేశారు" అంటూ బుష్ కోటునంటుకున్న బల్లిని చూపించాడు పానకాలు.
    "మాకేం తెలియదు సార్! మమ్మల్ని వెధవలూ గిధవలూ అనడానికి వాడెవడూ? వాడే వెధవ!" అంటూ గోల చేశారంతా.
    "కంట్రోల్ యువర్ టంగ్ పానకలూ! అలాంటి బాష మాట్లాడకూడదు. అయినా బల్లిని ఎవరో వేశారని ఎందుకనుకోవాలి? అదే పడుండొచ్చుగా? అన్నాడు లెక్షరర్ రాందాస్.
    "అవును సార్! అతడు మాకు క్షమాపణ చెప్పాలి" అన్నాడు మహేశ్.
    "నెవర్!" అన్నాడు పానకాలు.
    కాస్సేపు ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.
    అనుభవజ్ఞుడైన రాందాసు ఇరువురికీ సర్ది చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బుష్ కోటుని దులిపి వేసుకుంటున్న అతణ్ణి చూసి మళ్ళీ నవ్వారు అంతా.
    "పార పళ్ళు కనిపిస్తూ అలా నవ్వితే అందంగా ఉన్నమనుకుంటున్నారా? వెధ...ల్లారా!" చివరిమాట అనబోయి మళ్ళీ నాలిక్కరుచుకొని గొణుక్కున్నాడు మెల్లగా.
    మహేశ్ కి కొంచెం పళ్ళేత్తుగా ఉంటాయి. ఆ మాట తనని చూసే అన్నాడని ఉద్రేకంతో "పారపళ్ళూ , గీర పళ్ళు అన్నావంటే జాగ్రత్త! నీ పళ్ళు రాల్తాయి." అంటూ ఒక ఊపులో వెళ్ళి పానకాలు బూష్ కోటు కాలర్ ని పట్టుకుని గట్టిగా లాగాడు. కోపంతో ఊగిపోతూ మహేశ్.
    "నిన్ననలేదు.......నిన్నేమీ అన్లేదు" అన్నాడు బెదిరిపోయిన ఆడపిల్లలా తడబడిపోతూ పానకాలు. "ఒదిలేయ్యావోయ్ ఇంక పాపం!" అన్నాడు వెంకటేశ్వరరావు మహేశ్ ని చూస్తూ.
    "జాగ్రత్త! పిచ్చి పిచ్చిగా వాగకు" అంటూ వార్నింగ్ ఇస్తున్నవాడిలా పానకాలు కేసి చూసి బుష్ కోటు కాలర్ పట్టు ఒదిలిపెట్టాడు మహేశ్.
    వెంటనే పసిపిల్లాడిలా పరుగు లంకించుకున్నాడు పానకాలు.
    "పిరికిపంద......" అని మహేశ్ వెంకటేశ్వరరావులు నవ్వుకోవడం పానకాలుకు వినిపిస్తూనే ఉంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే , షర్టుతో కళ్ళు తుడుచుకొని వెళ్ళి వేపచెట్టు కింద కూర్చున్నాడు . కాస్త ఖాళీ దొరికినా, లంచ్ అవర్ లోను వెళ్ళి అలా వేపచెట్టు కింద కూర్చోవటం పానకాలుకు అలవాటైపోయింది. చివరకు పానకాలుని ఆ చెట్టు కింద చూసీ చూసీ దాన్ని 'పానకాలు చెట్టూ' అని పిలవడం మొదలెట్టారు.

 Previous Page Next Page