ఒసే తువ్వాలు అందుకో
'ఆహా......ఏమి.....నా......ఆ....ఆ.....భాగ్యము....
పాడుతూ స్నానాలగదిలో ప్రవేశించాడు. సంగీతం ప్రపంచ
భాష అయితే స్నానాలగది గానమందిరం. ప్రాక్పశ్చిమాల
భేదంలేని ఆచారం స్నానాలగదిలో సంగీతం పాడడం!
ఒంటిమీద నీళ్ళు పడతాయంటే గొంతుక తంత్రులు
సవరిస్తుంది.
తలుపు వేసుకున్నాడు.
'ఆహా......ఏమీ.......నా......ఆ-'
సరిగ్గా సక్కుబాయిలాగే విరుపులు విసిరాడు. అంటే తుంగల చలపతిరావులాగ దాసరి కోటిరత్నం ఎలా పాడుతుందో వినలేదు. చచ్చి ఏ స్వర్గాన వున్నాడో చలపతిరావు అసలు చచ్చిపోయాడో లేదో రామనాథశాస్త్రి అనుకుంటాను. లేదు ఇద్దరూ.
"ఆ.......భాగ్యము స్వామి కనిపించెను."
గాపంచా విప్పేశాడు.
"పండరినాథుని పాదమె దొరకెన్......పాపము లన్నియు నేడే తొలగెన్....."
చలివేస్తోంది. నీళ్ళు ఒంటిమీద పడనంతసేపే ధైర్యం చేసి చెంబెడు నీళ్ళు పోసుకున్నాడు. ఆ వరసని నాలుగైదు చెంబులు గబగబా దిమ్మరించుకున్నాడు. బిందెడు వేన్నీళ్ళు తగలెయ్యకూడదూ పెళ్ళాం ముండ! కర్రలయిపోతాయట. ఏం చేస్తోందో, వంటింట్లోంచి ఊడి పడదు.
* * *
వంటింట్లో సన్నగా, ఆడగా, వంటపొగలలో కలిసి మెలసి కంఠం.
"తొలి నే జేసిన పూజాఫలము"
చదువుకుంటానంటే సంగీతం నేర్చుకుంటానంటే, బలవంతం మీద ముడి వేయించారు. వద్దంటే వినక నన్ను నరకంలో తోసేరు. ఎన్నాళ్ళయినా ఇంతే నాకిది జన్మశిక్ష వీణ మరచిపోతున్నాను. నేర్చుకొని వంట నా నెత్తిమీద పడింది.
-ఏమేవ్ సబ్బు కనబడదేం?
పడమటి గూట్లో వుంటుంది.
తలుపు తీశాడు. తోశాడు తడుసుకుంటూ వెళ్ళాడు అలాగే సబ్బు తెచ్చుకున్నాడు. గదిలోకి వెళ్ళాడు. మళ్ళీ తలుపు వేశాడు. మరో నాలుగు చెంబుల నీళ్ళు పోసుకున్నాడు. ఈలతో పాడుతున్నాడు భాగ్యం పాట.
"షాషా.....షీషీ......షా.....షాషష......
ఏమిటో వెధవబతుకు స్నానం, భోజనం చెయ్యాలి. తాంబూలం, బట్టలూ, జోళ్ళూ వెయ్యాలి. వెళ్ళాలి ఆఫీసుకి టైమయిపోతోంది. వంటయిందో లేదో, రోజూ ఇదే ఏడుపు. వారానికి రెండు ఆదివారాలూ, నెలకి డజను ఫస్టు తారీఖులూ ఉండకూడదూ? దొరల దేశాల్లో ప్రతివారం జీతాలిస్తారు. కాని ఏం లాభం? తాగేస్తారు. దోరాలకి చలి వెయ్యదూ? స్నానం చెయ్యరు ఉన్ని దుస్తులు వేసుకుంటారు. మాసిపోయిన గడ్డం చేసుకుంటే వూలుకోటు విప్పినట్టుంటుంది.
నోట్లో నీళ్ళుపోసుకుని పుక్కిలించాడు. ముక్కులోని కెళ్ళాయి. ఉక్కిరి బిక్కిరైపోయాడు. సుజలాం, సుఫలాం, మలయజ శీతలంగానే వున్నాయి.
* * *
వంటింట్లో 'వందేమాతరం' పాట.
ఎందుకో ఈజైళ్ళకి వెళ్ళడం? ఎవరి స్వాతంత్ర్యం కోసం? ఆడదానికి అడుగుతీసి అడుగువేసే అధికారం లేదుకదా నేనసలు పెళ్ళి చేసుకోననే అన్నాను. స్వతంత్రంగా బతుకుదామనుకున్నాను. నాలుగేళ్ళలోనే నా బతుకెంత నాశనమయి పోయిందో, రెండుమార్లు ఆసుపత్రిలో పడ్డాను. ఈ మాటయినా నిలుస్తుందో నిలవదో వీడి కేవో జబ్బులున్నాయి. ఏవో దురలవాట్లున్నాయి. ప్రతిరాత్రీ ఆలస్యంగా ఇంటికి రావడమే ఎలా తప్పుతుంది నాకీ ఖైదు?
'.....సస్య శ్యామలాం, మాతరం.......వందేమాతరం.'
* * *
వందేమాతరం పాటని ఫిలింలలో పాడనివ్వరట. స్నానాలగదుల్లో పాడుకో నిస్తారను కుంటాను. ఇరవై ఏళ్ల కిందటి నాన్ కో ఆపరేషన్ పాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు.
నిరాకరణ మను మిఠాయి ఇదిగో.....
'కన్వర్ట్ కన్వర్ట్ హాల్లో కల్లు కస్టమర్సు ఇంటూ నాన్కోపారేష నను నవీన మతమునా.....'
ఆ రోజుల్లో అవే బాగున్నాయి. అప్పుడు వాటి అర్ధం తెలిసేది కాదు. స్కూళ్ళు ఎగ్గొడితే హెడ్మాస్టరు బెత్తం దెబ్బలు వడ్డించాడు.
'మరో ప్రపంచం మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది......'
ఈ పాటమీద నిషేధం ఉందా? ఎవరు చెప్మా దీన్ని రాశారు. ఎవడో కమ్యూనిస్టు కాబోలు ఇదో వెర్రిపట్టుకుంది వీళ్ళకి. సమానత్వంట! ఎలా వస్తుంది సమానత్వం? ప్రకృతిలోనే లేదు సమానత్వం కాబట్టి కమ్యూనిజం తప్పు - మరో ప్రపంచంట? ఏమిటో అది?
వీపుకి సబ్బుపట్టించి తోముతున్నాడు. కపిలవాయి గాత్రం. రంగూన్ లో పాడితే సిలోన్ లో వినిపించేది. రేడియో లేని రోజుల్లో వీపు అందుకురాకుండా ఉంది. రెండో చేతితో రాశాడు.
'మీరాజాలగలడా సత్యావతి
వీపు గోకగలడా.....'
parody కి నవ్వొచ్చింది. అన్నీ ఇదివరకటివే కొత్త కవిత్వం. కొత్త ప్రపంచం కొత్త సంవత్సరం అంటారు. అంతా భ్రమ. ఇదివరకు లేని విప్పుడేమున్నాయి? ఆ సూర్యుడే ఆ చంద్రుడే, ఇదివరకు లాగే పెళ్ళాడుతున్నాం, పిల్లల్ని కంటున్నాం, పెంచుతున్నాం, చస్తున్నాం, పుడుతున్నాం మళ్ళీ చస్తున్నాం.
చస్తున్నాను ఈ చలితో.
ఒసే వంటయిందా?
* * *
'శివ దీ......క్షా......పరురాలనురా.....'
ఎక్కడెక్కడకో పోతాడు. ఏవేవో ఖర్చులు నేను మాత్రం దమ్మిడీలతో సహా పద్దులు రాయాలి. నే నీ సంసారం చెయ్యలేను. నాకు స్వాతంత్ర్యం కావాలి. సమానత్వం కావాలి. వీణ్ని నేను ప్రేమించలేదు. ఎవన్నీ లేదా? ఏమో ఏమో శర్మని? ఏమో.
-మీరు నీళ్ళు పోసుకునేసరికి నా వంట ఐపోతుంది.
* * *
అయినా పాపం ఒక్కత్తే ఇంటి చాకిరీ అంతా చేసుకోవాలి. ఒక్కొక్క మారు చూస్తే జాలివేస్తుంది. కడుపుతో వుంది కూడాను.
కడుపు తోముకుంటున్నాడు. చిన్నప్పుడు మా అమ్మ ఒళ్ళంతా తోమి కడుపు మాత్రం తోమేది కాదు. ప్రేమ ఉండదట. కడుపు ప్రేమ కడుపువల్ల ప్రేమ, ప్రేమవల్ల కడుపు. To make love అంటాం. కడుపు చెయ్యడం అంటాం. ప్రేమ చెయ్యడం అనం. To make belly అనం. ఒక్కొక్క భాష ఒక్కొక్క తీరు. ఇంగ్లీషువాడు ఎంత కొట్టుకున్నా తెలుగుని క్షుణ్ణంగా అర్ధం చేసుకోగలడూ? గెలట్టీ డిక్షనరీలో తప్పులు చూపిస్తూ భారతి కొక వ్యాసం రాస్తాను. అలాంటివి వేస్తారో, వెయ్యరో? అసలు నా మొగం నేను రాసేదేమిటి ఆఫీసునుండి వచ్చేసరికి నవనాళ్ళూ తోడుకుపోతాయి. వెధవ ఉద్యోగం మానేస్తే! బతకలేకపోతానూ? సంసారం ఒకటి కద! రెండు ఎందుకు కూడదూ? నేను మళ్ళీ పెళ్ళిచేసుకుంటాను. మరి ఇదో? చీరకి నిప్పంటుకుని ఇది చావకూడదూ?
విషాదవార్త : నేటి ఉదయం.....పేటలో శ్రీమతి.....(20 ఏళ్ళు) వంట
చేయుచుండగా చీరకు నిప్పంటుకొనబడెను. ఆసుపత్రిలో చేర్చబడెను.
అచ్చటనే ఆమె మరణించబడెను.
వెధవ ఊహలు, పాపిష్టి మనస్సు, మనలో ఇంత కుళ్ళు పెట్టుకుని లోకాన్ని తిదతాము.
కుళ్ళు వదలినట్టేనా? కడుపు తోముకోవడం అయింది. దిగేడు. నురగ పీచు పరుపులో బూరుగు దూది దిగేడు. Attain-shun లకిడీకే మాఫిక్ తోముకుంటున్నాడు. Glass with care.
ఏమిటో నానా చెత్త రాసేస్తున్నారు. ఇది రాయొచ్చు. ఇది రాయకూడదు అనే వివక్షత పోయింది. ఏమైనా అంటే ఫ్రాయిడ్ అంటారు. టైఫాయిడ్ అంటాను నేను. ఇమాజినేషన్ కు జబ్బు చేస్తేనే ఇలాంటి పేలాపనలు నేను కన్సర్వేటివ్ ని. ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలంటాను. మార్పు నా కిష్టంలేదు. మర్యాదగా బతకాలంటాను. తప్పుపనులు చెయ్యకూడదు. నిజమే కాని తప్పుపనులు చేసి బయటపడి పోవడం మరీ తప్పు.
* * *
ప్రేమమయ మీ జీవితము, త్యాగమయ మీ శర్మ నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నవారిని నేను ప్రేమిస్తున్నాను. శర్మతో మాత్రం బదులు ఇంతకంటే సుఖంగా వెలుగుతుందా? నాకు పెళ్ళి అక్కర్లేదు. ఏ ఉద్యోగం చేసినా బతికిపోగలను. తిరగబడా లనుకుంటాను. ధైర్యం చాలదు. ఈ లోకంలో ఆడదై పుట్టడమంత హీనం ఇంకోటి లేదు.
* * *
'ఆడబతుకే మధురం ఆహా'
నిజం. ఆడదానికి ఇల్లే కోట. ఆడదాన్ని గుమ్మం కదలనివ్వకూడదు. ఎన్ని అగచాట్లుపడి అయినా ఆడదాన్ని మొగాడే రక్షిస్తాడు. మొగాడు చెడిపోయినా ఫరవాలేదు. ఆడది చెడిపోతే ప్రపంచమే ధ్వంసమయిపోతుంది. క్షేత్రం బీజం అన్నారు.
తోముకోవడం అయిపోయింది. మళ్ళీ నాలుగైదు చెంబులు దిమ్మరించుకున్నాడు.
__ ఒసే వంటయిపోతే వడ్డించు.
__ మీ స్నానం అయిందా?
__ అయినట్టే.
__ నా వంటకూడా అయినట్టే.
పెడసరపు జవాబులు స్కూలు ఫైనలుదాకా చదివానని దీని గర్వం ఆడవాళ్ళకి చదువు అవసరమే కాదు. హానికరం. అయిదోక్లాసుదాకా చదివిస్తే చాలు.
* * *
అప్పుడే వంటింటిలోంచి వినబడింది 'తుమమేరా' అని స్నానాల గదిలో సబ్బు నురగల్లోనూ, వంట యింట్లో తాలింపు వాసనలలోనూ కలిపి మగగొంతుకా ఆడగొంతుకా ఆలాపన సాగించాయి.
ఆఫీసుకి టైమయిపోతుంది. ఆడదానికి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు.
శర్మని నేను ప్రేమిస్తున్నాను పుట్టబోయే బిడ్డ అతనిదే అనుకుంటాను.
'తుమ మేరా'
'తుమ మేరీ'
* * *
స్నానం ముగించాడు. మొగాడు అథార్టీ చేస్తూ ఉంటూనే ఆడది అణగిమణగి ఉంటుంది. లేకపోతే ఈ ఆడవాళ్ళకి పట్ట పగ్గాలుంటాయా?
ఆమె శర్మను గురించి ఆలోచిస్తోంది. అతడు తన హక్కును స్థాపించుకుంటూన్న గొంతుకతో అరిచాడు.
___ ఒసే! తువ్వాలు అందుకో!'
---౦౦౦---