హేమంతం
పరధ్యానంగా పడుకున్నాను. ఆంద్రజ్యోతి ఉగాదిసంచిక
నా గుండెలమీద నిద్రపోతోంది నాకు మాత్రం సగం
మెలకువ.
పరధ్యానంగా ఉంది. కళ్ళు మూసుకునే ఉన్నాయి. ప.పా.
గీసిన రతీ మన్మథుల చిత్రం గుండెల్లో గుచ్చుకుంటోంది.
ఒక చిలక విరిగిపోయిన గ్రామొఫోను ప్లేటులాగ చేసిన
ప్రకటననే మళ్ళీమళ్ళీ చేస్తోంది. నేటి సాహిత్య
రాజకీయాలకీ, రాజకీయ సాహిత్యాలకీ, ఈ చిలక చేస్తున్న
పునఃపునః ప్రకటనకీ ఏదో సంబంధం ఉందని మాత్రం
గుర్తించేపాటిది నా మెలకువ.
పరధ్యానంగా కళ్ళు మూసుకున్నాను. హఠాత్తుగా మా "భిక్షువర్షీయసి" ప్రత్యక్షమయింది. పాఠకుల సౌకర్యం కోసం నా ఈ దిగువ పాదాలు జ్ఞాపకం చెయ్యవలసి ఉంది.
దారిపక్క చెట్టుకింద
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసిల్ధొకతె
మూలుగుతూ ముసురుతూన్న
ఈగలతో వేగలేక
ముగ్గు బుట్టవంటి తలా,
ముడుతలు తేరిన దేహం,
కాంతిలేని గాజుకళ్ళు.
తనకన్నా శవం నయం!
"అవ్వా! విశాఖపట్టణంనుంచి ఎప్పుడు వచ్చావ్?" అన్నాను.
ముసిల్ది మాట్లాడలేదు.
పడిపోయెను జబ్బుచేసి,
అడుక్కునే శక్తిలేదు,
రానున్నది చలికాలం,
దిక్కులేని దీనురాలు!
మాట్లాడలేని ముసిల్ది ఏడుపులాంటి నవ్వు నవ్వింది. ఆంద్రజ్యోతి ఉగాది సంచికను లాక్కొని భయంకరంగా అరుస్తూ ఒక్కొక్క కాగితాన్నే చింపడం మొదలుపెట్టింది.
"అది వంటబ్రాహ్మడి చొరగచీమ. భానుమతి కోప్పడుతుం"దన్నాను.
అవ్వ ఆగలేదు. శ్రీనివాస శిరోమణినీ, కుటుంబరావునీ చింపేసింది.
"కొత్త చిగుళ్ళ" దగ్గరికి రాగానే అవ్వ కోపానికి మాట లొచ్చాయి.
"చూశావా! చెలం వాలకం!" అంది అవ్వ.
"చలం కలం విశృంఖలం." అన్నాను నేను నా సహజ మృదు మధుర ధోరణిలో.
"ఖలం Be damned," అంటూ అవ్వ చెలం కాగితాలు ఉగాది సంచిక లోంచి నేర్పుగా వేరుచేసింది. ముసలిదాని బహుబాషా పరిచయం నా కాశ్చర్యం కలిగించింది. అయితే ఒక విధంగా నేను అవ్వకి మనుమన్నే కానీ ఇంకోవిధమగా అవ్వ నా కూతురు, కాబట్టి అవ్వ శైలికి కారణాలు నేనర్ధం చేసుకోగలిగాను. ఇంతకీ చెలం కథలో కార్మిక కాంత చెడిపోయిన బాపనపిల్ల యాసలో మాట్లాడగా లేనిది మన ముసల్ది ఇంగ్లీషు తెలుగు కలగలుపుతో మాట్లాడితే తప్పే మొచ్చింది?
"చెలం టెక్నిక్ ను మే మందరమూ మెచ్చుకోవడం మానలేకపోతున్నాం" అన్నాను.
అవ్వ చెలం కథను గుప్పిటనిండా పట్టుకుని క్షణకాలం గ్రాంధిక భాషలోకి ఘనీభవిస్తూ, "ధిక్కారమున్ సైతునే" అని దీర్ఘ నిశ్వాసం తీసింది.
"అవ్వా నాకు నిద్దరొస్తోంది. చెలంమీద నీ ఫిర్యాదు నిడివిమీద ఆలోచిద్దాం. ఇప్పటిమట్టుకు నువ్వు ఏ మూర్ మార్కెట్ లోనో పడుక్కో నీకు వసతి చూపించడానికి నాకే ఒక యిల్లూ వాకిలీ లేవు మాంసం కూరలు వండిపెట్టే వంటమనిషి అంతకన్నా నాస్తి. ఎలాగో ఇవాళమట్టుకి ఏ చెట్టునో ఆశ్రయించు. రేపు మనిద్దరం కలిసి విశాఖపట్టణం పోదాం" అన్నాను.
అవ్వ మళ్ళీ కొన్ని మణుగుల మౌనాన్ని నామీద దిమ్మరించింది. "సరే నీ కాంత కష్టమైతే పోతనులే" అన్న భావాన్ని ఆమె కళ్ళల్లో చదువుకున్నాను. ఇక లాభంలేదనుకొని అవ్వకు వేదామనుకున్న వాయిదా నా నిద్రకే వేసి అవ్వని ఎలా ఓదార్చితే బాగుంటుందా అనే ఆలోచనలో పడ్డాను.
"అవ్వా! మీ అక్కగారి సంగతి నాకు బాగా తెలియదు. నల్లమందు వేస్తుందని అసలే తెలియదు" అన్నాను - ఏదో అందామని.
"వేస్తే వేస్తుంది నేటి పత్రికలన్ని సరఫరా చేస్తున్న నల్లమందులో ఆవిడ వేసుకునేది ఎన్నోవంతు? మీ రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాలలో ఎంత నల్లమందు లేదు? అసలు చెలం కథలోనే ఉందే మా అక్క యావజ్జీవితానికీ సరిపోయే నల్లమందు!" అంది అవ్వ.
అవ్వ చేతిలోంచి చలం కథ తీసుకుని అటూ ఇటూ తిరగేస్తూ అన్నాను - "అవ్వా! చలం మీ అక్కనీ, మీ వర్గాన్నీ చాలా వేళాకోళంతో అవమానించిన మాట నిజం. అతని సౌందర్య పిపాసకి మీరంతా అపస్వరాలు."
"సెక్సు పిపాసకి మాత్రం కాదు పాపం ఇంతకీ మేమూ, మా దారిద్ర్యమూ మా వార్ధక్యమూ, మా అనారోగ్యమూ అపస్వరాలయితే వాటిని తొలగించడానికెందుకు ప్రయత్నించ కూడదు? చలం తన కథలోని దృక్పథంవల్ల ఈనాటి ఎందరి అభిప్రాయాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో నీకు తెలుసునా? నేటి సాంఘిక రోగ నిదానానికి చెలం కథ చాలా పనికొస్తుంది."
"Oh! The image of the rose in my heart" అనుకుని, విమర్శ మరీ ప్రమాద ప్రదేశాలలోకి ప్రవహిస్తున్న కారణంవల్ల ఒక హస్తచాలనంతో ఆమెను వారించాను.
అవ్వ వినలేదు. ధోరణిని మార్చకుండా గొంతుక మాత్రం కొంచం మార్చి మళ్ళీ అందుకుంది. "సౌందర్యం! ఓ మీరందరూ సౌందర్యాన్ని సందర్శించినవాళ్ళే ఎక్కడుందయ్యా. మీ సౌందర్యం? కాఫీక్లబ్బు గోడలమీద రాజకీయ నాయకుల పటాల్లోనా? ఆ పటాల ముందు నాట్యంచేసే సినిమాతారల భంగిమల్లోనా? ఆ భంగిమల పోస్టర్లను చూపించే నాలుగు రోడ్లు కలిసే చోట్లలోనా? మీ ఇళ్ళలో పోగుచేసుకొనే సామాన్లలోనా? మీ వక్రమైన అభిరుచిలోనా? మీ శిధిలమైన జీవితాలలోనా? రూపాయి అణా పైసలకు దాటలేని మీ ఆలోచనల్లోనా? ఎక్కడుంది సౌందర్యం? అసలు మీరు సౌందర్యాన్ని కనిపెట్టగలుగుతున్నారా? కనిపెడితే గౌరవిస్తారా? ఇటు చూడు నన్ను "ముగ్గుబుట్టవంటి తలా! ముడుతలు దేరిన దేహం. కాంతిలేని గాజుకళ్ళు" అవి నాకు ఇటీవల వచ్చినవే. పుట్టుకతోనే పుట్టినవికావు. నన్నూ ఒక అమ్మకంది. నా బాల్యంలో నేనూ నవ్వినదాన్నే ఆడినదాన్నే పాడినదాన్నే నా యౌవనపు రోజులు ఊహించగలవా? అప్పుడు నేనెలా వుండేదాన్నో ఒక్కసారి స్మరిస్తావా? చిన్న కథ చెబుతా విను. నా జీవితంలో జరిగిన కధ అప్పుడు నాది ముగ్గుబుట్టవంటి తలకాదు. ఎటువంటి శిరోజాలకోసం మీ పత్రికలన్నీ తల నూనె ప్రకటనలు చేస్తాయో అవి సహజంగా నా శిరస్సును అలంకరించాయి. నాది ముడుతలుదేరిన దేహం కాదు. ఎటువంటి చర్మం ఇస్తామని మీ వాసన సబ్బులన్నీ వాగ్దానం చేస్తాయో ఆ నునుపైన సొగసైన చర్మం ఆనాటి నా కళ్ళు కాంతిలేని గాజుకళ్ళు కావు. కొత్తగా నాకు పెళ్ళి అయి, అప్పుడే నా మొగాడి ప్రేమ వైపుగా వికసిస్తూన్న కళ్ళు ప్రపంచకావ్యాలలోని లాలిత్యాలన్నీ వెదికినా ఆనాటి నా కళ్ళను ఉపమించ దగ్గ వస్తువొక్కటీ నీకు దొరకదని హామీ యిస్తున్నాను. అలాంటి నేనూ, నన్ను పెళ్ళిచేసుకున్నవాడూ కలిసి ఆ రోజుల్లో ఒకనాడు సంతకు వెళ్ళాము. కిక్కిరిసిన జనంలో మేము ఎక్కడో విడిపోయాము. ఒకళ్ళ నొకళ్ళం వెదుక్కుంటూ తిరుగుతున్నాము. ఒక్కతెనీ స్వతంత్రంగా తిరగడం అదే నాకు మొదటిసారి. అప్పుడు నన్నెవడో అందమైన కుర్రాడు పలకరించాడు. మీ వర్గానికి చెందినవాడే ఒంటరిగా సంతలో దొరికిన ఆడదానికి మొగాడు చేసే ప్రతిపాదన చేశాడు. నేను ఒప్పుకోలేదు. నాకో అమ్మా, చెల్లెలూ అందరికన్నా ఆత్మీయంగా చూసుకొనే ఒక భర్త ఉన్నాడన్నాను. క్షణకాలం అబ్బాయీ, నీతో ఆశపడ్డ తర్వాత జీవితకాలమంతా నా మొగుణ్ణి నేను నిష్కలంకమైన కళ్ళతో చూడలేనన్నాను. నా దగ్గర వాళ్ళంతా నాకు దూరమైపోతారన్నాను. నమ్ముతావో లేదో ఆ కుర్రాడి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. రెండు చేతులూ జోడించి నాకు నమస్కరించాడు. నాకేదో డబ్బు ఇవ్వబోయాడు. తీఉస్కో నువ్వు నా చెల్లెలివన్నాడు. వద్దన్నాను. వెళ్ళిపోయాడు."
"అవ్వా! మొపాసానీ చీవాట్లు పెట్టిన టాల్ స్టాయిలాగున్నావు." అన్నాను.
ముసిల్ది గుగ్గిలంపడ్డ అగ్గిలా లేచింది.
"వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితి" అని మళ్ళీ ఆరంభించింది.
అవ్వ జుత్తువేపే చూస్తున్నాను - కథని చేత్తో నలుపుతూ.
"ఇవి దుస్పసేను వ్రేళ్ళందవిలి సగము త్రెస్సిపోయి తక్కిన యవి" అనే పద్యం జ్ఞాపకం వచ్చింది.
"విను. ఇంకా విను పోనీ కథ చెప్పనులే. ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. నువ్వు నన్ను విశాఖపట్టణంలో నీళ్ళెండిపోయిన కటకంవారి కోనేటి పక్క ఆకులు రాలిపోయిన మోడు చెట్టుకింద చూశావో భావించావో అప్పటికే నాకు డెబ్బయేళ్ళు దాటాయి. పల్లెటూళ్ళో చిన్నతనం లగాయతు పట్నవాసంలో ముసలితనందాకా నా జీవిత యాత్రంతా నువ్వు స్మరించుకుని ఉండాలి. మోడుచెట్టుకింద బండరాతిప్రక్క చిట్టచివరికి చేరుకున్నానంటే ఎన్నెన్ని దశలు గడిచానో ఈలోపున నన్నా స్థితికి తెచ్చిన బహిఃప్రపంచంలో ఎన్నెన్ని మార్పులొచ్చి ఉంటాయో నువ్వూహించుకుని ఉంటావు. డెబ్బయి అశ్వాసాల నా మహాకావ్యాన్ని ఒక చిన్నగీతంలోకి ఆవిరిపట్టి నా కోక శాశ్వతత్వం ప్రసాదించావు. సంఘదురన్యాయానికి యజ్ఞపశువునైన నన్ను పరిపీడితుల, పరాజితుల సమూహాని కొక చిహ్నంగా నిలబెట్టావు, జరామరణ దుఃఖాలను స్మరించేవాళ్ళందరికీ నన్నే జ్ఞాపకం తెస్తున్నావు. నా వార్ధక్యాలను, మా నైచ్యాలను కూడా మా దారిద్ర్యాన్ని నేటి సంఘ పరిస్థితులమీద సవాల్ గా వాదులుతున్నాం. నీకు తెలుసునోలేదో నేనూ ఒకరకం రమణ మహర్షినే" అంది అవ్వ.
"ఆఁ! అలాగా?" అన్నాను.
"ఔను ఎడంచేతి వేపునుంచి రమణమహర్షిని" అంటూ అవ్వ అంతర్ధానమయింది.
---౦౦౦---